AADIVAVRAM - Others

వజ్రాల చేప( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవస్థ రాజ్యాన్ని చంద్రసేన మహారాజు పాలించేవాడు. పేరుకు తగ్గట్టుగానే చంద్రసేన మహారాజు సౌమ్యుడు. ప్రజల సమస్యలు వింటూ ఎప్పటికప్పుడు వారికి తగిన విధంగా సహాయం చేసేవాడు. చంద్రసేనుడి మంత్రి విరుద్ధుడు. రాజుకి పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. అందరూ మహారాజు మంచితనాన్ని ఆసరాగా తీసుకుని అవసరం వున్నా లేకున్నా సహాయం పొందుతున్నారని అతని ఆలోచన. దాంతో ఎవరు సహాయానికి వచ్చినా వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేసి ఏ సహాయం చెయ్యకుండా వెనక్కి పంపేవాడు. రాజు చంద్రసేనుడికి ఇది నచ్చకున్నా తగిన సమయం వచ్చినపుడు మంత్రికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.
ఒకరోజు రాజు కొలువుతీరి ఉండగా.. ఒక జాలరి వచ్చి మహారాజుకి నమస్కరించి ‘రాజా.. ఈ రోజు చేపల వేటకు వెళ్లాను. ఎప్పుడూ నాకు వొడ్డునే చేపలు దొరికేవి. కానీ ఈ రోజు చాలా దూరం వరకు నా వేట సాగింది. చివరకు నా వలలో ఒకే ఒక చేప దొరికింది. సామాన్యంగా వున్న ఆ చేపను ఇంటికి తీసుకుపోయి మా ఇంటిదాన్ని కూర వండమన్నాను. అది ఆ చేపను మధ్యకు కోసింది గదా చేప కడుపులో ఈ వజ్రం ఉంది..’ అంటూ చేపను, వజ్రాన్ని మహారాజు ముందు ఉంచాడు. రాజు సంతోషించగా.. మంత్రి మండిపడ్డాడు. ‘చాలించు నీ కట్టుకథలు. మన రాజ్యంలో చాలామంది వజ్రాల వ్యాపారులు తమ వజ్రాలను ఎవరో దొంగిలిస్తున్నారని ఫిర్యాదు చేశారు’ అన్నాడు.
సభలో వున్న వజ్రాల వ్యాపారులు కొంతమంది ‘అవునవును.. మా వజ్రాలను దొంగిలించారు’ అంటూ వంత పాడారు. రాజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో మంత్రి చేపని వంటసాలకి, వజ్రాన్ని కోశాగారానికి పంపుతూ జాలరిని కారాగారంలో పడేసి నిజం తెలుసుకోమని ఆదేశించాడు.
మహారాజు చంద్రసేనుడికి చేపల కూర చాలా ఇష్టం. ఆ రోజు వడ్డించిన కూర మరింత రుచిగా ఉండటంతో వంటవాడిని పిలిచి ‘ప్రతిసారీ కూర ఇలా ఎందుకు చెయ్యడంలేదు’ అని అడిగాడు.
‘మహారాజా! ఇది ఈ రోజు మీరు సభ నుండి పంపిన చేప. అది మామూలు చేప కాదు. అది వండుతున్నప్పుడే కమ్మటి వాసన వచ్చింది. అంతేగాని నా వంట మహాత్యం కాదు. చేపలో ఏదో ప్రత్యేకత ఉంది. అందువలనే ఆ రుచి’ అన్నాడు వినయంగా.
పక్షం రోజుల తరువాత మరలా మహారాజు రాణితో ‘ఈ రోజు చేపల కూర తినాలని ఉంది’ అన్నాడు.
వెంటనే రాణి సైనికులని పంపి మంచి జాలరిని తీసుకుని పోయి చేపలు తీసుకురమ్మని పంపింది. తానే స్వయంగా వంట చెయ్యాలని అనుకుంది. ఆ రోజు కూడా సైనికులు జాలరిని సముద్రం మీదకు వేటకు పంపారు. జాలరి రెండు చేపలతో తిరిగి వచ్చాడు. అవి తెచ్చి మహారాణికి ఇవ్వగా ఆమె స్వయంగా వంట వాడితో వాటిని కోయించింది. ఆశ్చర్యం! వాటి పొట్టలో కూడా వజ్రాలు వున్నాయి.
వెంటనే మహారాజుకు తెలియపరిచారు. రాజు అక్కడికి వచ్చి మంత్రిని పిలిపించి.. ‘మహామంత్రీ! చూశారా. మహారాణికి కూడా వజ్రాల దొంగతనంతో సంబంధం ఉంది అంటారా?’ అన్నాడు.
వౌనం వహించిన మంత్రితో ‘ఇంతకాలం మీ ప్రవర్తన సహించాను. మీ తీరు మార్చుకోకపోతే మీ స్థానంలో మరొకరు మంత్రిగా వస్తారు’ అని హెచ్చరించి కారాగారంలో ఉన్న జాలరిని విడుదల చెయ్యడమే కాకుండా కానుకలు కూడా ఇచ్చి పంపాడు. ఆ సంఘటన తరువాత ఎప్పుడూ మంత్రి ఇతరులని ఇబ్బంది పెట్టకుండా మహారాజు ఆదేశాలు అమలుపరుస్తూ మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు.

-కూచిమంచి నాగేంద్ర