Others

రైల్వేజోన్ ఇవ్వకపోవడం వంచనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ ప్రయోజనాల కోసం అర్ధంతరంగా రాష్ట్ర విభజన చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం నడిసముద్రంలో పడవేసింది. ఆ తరువాత ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సైతం మాట నిలుపుకోలేదు. కనీసం విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చడంలో శ్రద్ధ చూపకపోవడం దారుణం. రెండు దశాబ్దాలకు పైగా కోటిమంది జనాభా గల ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్న విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోవడం ప్రజలను వంచించటమే. మోదీ ప్రభుత్వం కాలపరిమితి పూర్తికావస్తున్నది. వచ్చే ఎన్నికలకోసం మోదీ బృందం సమాయత్తమవుతోంది. ఇప్పటికైనా ఏపీకి ఇచ్చిన హామీలపై శ్రద్ధ చూపకపోతే ఇంకెప్పుడు చేస్తారు.
గత ఏడాది రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు సురేశ్‌ప్రభు ఏపీ నుండి రాజ్యసభకు ఎన్నికవడంతో సత్వరమే విశాఖ రైల్వేజోన్ ఏర్పడుతుందని మురిసిపోయాం. కానీ ఆ మురిపెం మూన్నాళ్ల ముచ్చటే. ఆయన స్థానంలో రైల్వేశాఖను పీయూష్ గోయల్ చేపట్టినా ఒక్కడుగుముందుకు పడలేదు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుకు సమర్పించే బడ్జెట్‌లో రైల్వే అంశాలు కూడా ఉంటాయి. ఈ ప్రభుత్వానికి ఇదే పూర్తిస్థాయి చివరి బడ్జెట్. ఈ బడ్జెట్‌లో రైల్వేజోన్ ప్రకటించకపోతే మోదీ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేసినట్లే భావించాలి. అందుకనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆధ్వర్యంలో రైల్ దీక్ష చేపట్టాం. ఇదంతా విశాఖకు రైల్వేజోన్ సాధించే ప్రయత్నం.
అదేరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. కేంద్రమంత్రులు, ఎంపీలను కలిసి ఉత్తరాంధ్ర గోడును వినిపిస్తాం. వాస్తవానికి రెండున్నర దశాబ్దాల క్రితమే పీవీ ప్రభుత్వంలో రైల్వేమంత్రిగా ఉన్న జాఫర్ షరీఫ్ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. ఈలోగా ప్రభుత్వ పదవీకాలం పూర్తవడం, ఆ తరువాతి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంలో రైల్వేజోన్ కోరిక తీరనేలేదు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్ - 2014లో కొత్తగా ఏర్పడే అవశేష ఆంధ్రప్రదేశ్ కోసం ఆరునెలల్లో కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీంచి తగు నిర్ణయం తసుకోవాలని చట్టంలో చేర్చారు. పైగా ఈమేరకు బీజేపీ ఎన్నికల ప్రణాళికలో హామీకూడా ఇచ్చింది. ఎన్‌డీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 44 నెలలైనా అడుగుముందుకు పడలేదు. ఈ విషయంలో సాంకేతిక సమస్యలున్నాయంటూ వార్తలు వ్యాప్తి చేస్తూ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
అందువల్ల ఇప్పటివరకు రైల్వేజోన్ కోసం విశాఖపట్నానికే పరిమితమైన ఈ ప్రాంత ఆందోళన మొదటిసారిగా రైల్‌దీక్ష ద్వారా ఢిల్లీకి, కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెడుతున్నాం. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక రైల్వేజోన్ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉంది. అయితే ఏపీలో మూడు రైల్వే డివిజన్‌లు ఉన్నా రైల్వే జోన్ లేదు. ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ ప్రాంతానికి వెళ్లిపోయింది. కొత్తగా ఏర్పడిన చిన్నచిన్న రాష్ట్రాలైన చత్తీస్‌గఢ్ వంటి వాటికి కూడా రైల్వేజోన్ ఏర్పాటు చేశారు. తూర్పు కోస్తా తీరంలో చెన్నై-కలకత్తా మహానగరాల మధ్య గల అతిపెద్ద నగరం విశాఖ మాత్రమే. దేశంలో ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రం కూడా. వ్యూహాత్మకంగా కీలకమైన నావికాదళం స్థావరం విశాఖ. ఏపీ, చత్తీస్‌గఢ్, ఒడిశాలకు కూడలి.
రైల్వేజోన్ ఏర్పాటుకు విశాఖకు గల అర్హతలు, అవకాశాలు ప్రస్తుతం రైల్వేజోన్‌లు ఉన్న అనేక రాష్ట్రాలకు లేవు. ఒక రాష్ట్రంలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రంలో కనీసం 600 కి.మి. రైల్వే లైన్లు ఉండాలని ప్రమాణం. కానీ వాజపేయి హయాంలో 292 కి.మీ. రైల్వే లైన్లు ఉన్న చత్తీస్‌గఢ్‌లో, 411 కి.మీ. రైల్వేలైన్లు ఉన్న ఝార్ఖండ్‌లో రైల్వేజోన్లు ఏర్పాటు చేశారు. ఏపీలో కేవలం విశాఖ డివిజన్‌లోనే 1052 కి.మీ రైల్వే లైన్లు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన డివిజన్లలో నాలుగోది. ప్రస్తుతం ఈ డివిజన్‌లో భాగంగా ఉన్న ఈస్ట్‌కోస్ట్ రైల్వేస్ జోన్ వార్షిక ఆదాయంలో సుమారు 60 శాతం ఇక్కడి నుంచే వస్తోంది.
ప్రస్తుత ప్రమాణాల ప్రకారం రైల్వేజోన్‌కు అవసరమైన వసతుల కల్పనకు 200 ఎకరాల భూమి అవసరం. విశాఖలో రైల్వేల వద్ద 782 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. వసతి, ఆస్పత్రి ఇప్పటికే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద డీజిల్ లోకోషెడ్ ఇక్కడే ఉంది. వ్యాగన్ వర్క్‌షాప్, కోచ్‌డిపో వంటి పలు కీలక రైల్వే వౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక రైల్వేజోన్ ఏర్పాటుకు అవసరమైన పరిస్థితులు విశాఖలో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటులో ఏపీలో పూర్తి ఏకాభిప్రాయం ఉంది. రాష్ట్ర శాసనసభ ఇప్పటికే మూడు తీర్మానాలు చేసింది. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సమయంలో రైల్వేజోన్ వస్తే అటు రైల్వేకు, ఇటు రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో ఎన్నో ఆశలు రేపిన మోదీ మాట నిలుపుకోకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశకు గురవుతారు. అశాంతి పెల్లుబుకుతుంది. కేవలం రాజకీయంగా నిర్ణయం తీసుకోకపోవడమే సమస్య అన్నది ప్రజల భావన. లోక్‌సభలో 2016 మార్చి 16న రైల్వే సహాయ మంత్రి ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘ఈ విషయమై కమిటీ నివేదిక సమర్పించింది. అయితే చివరి నిర్ణయం తీసుకునే ముందు ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధించిన వర్గాలను సంప్రదించమని ఆ కమిటీని రైల్వేమంత్రి అడిగారు’ అని చెప్పారు. ఈ మాట చెప్పి రెండేళ్లు కావస్తోంది. ఇంకెంతకాలం సంప్రదింపులు జరపవలసి ఉంది? ఇవన్నీ కాలయాపన కోసం చెబుతున్న కుంటిసాకులు.
విభజన చట్టంలో హామీల అమలులో కేంద్రవైఫల్యం నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయవలసి వచ్చింది. తగు సమాధానం చెప్పాలని కేంద్రానికి నోటీసు జారీ అయింది కూడా. పొరుగున ఉన్న ఒడిశాలో రాజకీయంగా ప్రాపకం సంపాదించాలన్న ఎత్తుగడలు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా విశాఖలో రైల్వేజోన్ విషయంలో ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నదని, వారి ఆకాంక్షలను వమ్ము చేస్తున్నదని అనిపిస్తున్నది. ఇది విద్రోహం. తెలుగు ప్రజలు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారని బీజేపీ అధినాయకత్వం గ్రహించుకోవాలి.
పార్లమెంటులో చేసిన చట్టాన్ని అమలు చేయకుండా అవహేళన చేస్తూంటే ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రుల్లో ఒకరు ఉత్తరాంధ్రకు చెందినవారే. బీజేపీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. అయినా రైల్వేజోన్ విషయంలో కేంద్రానికి వినతిపత్రం ఇవ్వడం మినహా మరేమీ చేయడం లేదు. ఇప్పటికైనా అన్నివర్గాల వారు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప రైల్వేజోన్ సాధించలేమని గ్రహించాలి.

-కొణతాల రామకృష్ణ