Others

యాజ్ఞసేని-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎవరితోనూ ఎవరూ మాట్లాడుకొనుటలేదు.
అట్లా వున్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ వృష్ణివంశజుడూ, ధర్మపక్షపాతి అయిన శ్రీకృష్ణవాసుదేవుడు అన్న బలరాముతో కలిసి పాండవులను చూడటానికై పాండవులున్న కుమ్మరి ఇంటిలోనికి ప్రవేశించాడు.
అజాతశత్రువు, రాజ సమూహం చేత సేవింపదగినవాడూ, ఉన్నత గుణాలతో ప్రకాశించేవాడూ, తనకు మేనత్త కొడుకూ, బాల సూర్యునితో సమానమైన తేజస్సు గలవాడూ, నలుగురి తమ్ముల మధ్య ఆశీనుడై ఉన్నవాడూ, కుంతీదేవి పెద్దకుమారుడూ అయిన ‘్ధర్మరాజును’ చూచాడు.
శ్రీకృష్ణవాసుదేవుని చూచిన ద్రౌపది ఒక్కసారి ఉలిక్కిపడింది. తనకు స్వప్నదర్శనమిచ్చి నిజ రూపాన్ని చూపినవాడు, తనతో ప్రీతితో మాట్లాడినవాడూ యిక్కడెలా వచ్చాడు అని ఆశ్చర్యచకితురాలైంది. నేను ఆనాడు చూచింది స్వప్నంలో కాదు కదా అని అనిపిస్తున్నది. ఆనాడు నా పైన మాయను ఆవహింపజేశాడా? నా మందిరానికెలా వచ్చాడు. నిజంగానే దర్శనమిచ్చాడా? అంతా అగమ్యగోచరంగా ఉన్నది అని తలపోసింది.
ధర్మరాజును చూచిన శ్రీకృష్ణుడు అతడి పాదాలను పట్టుకొని ‘నేను శ్రీకృష్ణుడను’ అని తనకు తాను పరిచయం చేసుకొన్నాడు. బలరాముడు కూడా తన పేరును చెప్పుకొని ధర్మరాజును అభినందించాడు. ధర్మరాజుకన్నా తాను పెద్దవాడైనందున నమస్కరించలేదు.
తన మేనత్త అయిన కుంతీదేవిని చేరి శ్రీకృష్ణబలరాములు ఆమెకు పాదాభివందనం చేశారు.
భీమార్జున నకుల సహదేవులను ప్రేమతో కౌగిలించుకొని పరమానంద భరితులైనారు. భీమార్జున నకుల సహదేవులు శ్రీకృష్ణబలరాములకు పాదాభివందనం చేశారు.
పాండవులందరూ సంతోషించారు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి-
కృష్ణా! వాసుదేవా! మాకు ప్రీతిపాత్రులైన దేవకీ వసుదేవులు క్షేమమే గదా! నేడు మాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. మేము ఈ రీతిగా మిమ్ములను చూడగలగటం మా అదృష్టం. సదా మా హితవరులైన మీరు స్వయంవరానికివచ్చి మాకు అండగా నిలిచినందులకు కృతజ్ఞులము’’ అని ఆనందం వెల్లివిరియగా అన్నాడు.
ఈ హఠాత్పరిణామానికి ద్రౌపది ఆశ్చర్యచకితురాలైంది. వారి సంభాషణలను విన్న ఆమెకు ఇది నిజమా? లేక కలయా అనే సందేహం కలిగింది. కొంత తడవుకు మనస్సును కుదుటపరచుకొన్నది. వీరైదుగురు పాండవులు అని తెలిసికొన్నది. మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు ఎవరో కాదు అతడే అర్జునుడు. మనసు పులకరించింది. సంతోషించింది.
మరలా ధర్మరాజు అన్నాడు, ‘‘శ్రీకృష్ణవాసుదేవా! విరోధంతో మేము కౌరవులకు దూరమై, బ్రాహ్మణ వేషాలు ధరించి, మమ్ములను ఎవ్వరూ గుర్తించకుండా ఈ విధంగా యున్న మమ్ములను మీరు ఎలా తెలిసికొన్నారు’’ అని అడిగాడు.
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ‘‘బావా! ధర్మరాజా! సూర్యుని మేఘసమూహం కప్పివేసినా, అగ్ని గూఢంగాయున్నా మీ తేజస్సును లోకంలో జనులకు కనిపించకుండా చేయడం సాధ్యమా? అట్లాగే మీరు రహస్యంగా మారువేషంలో ఉన్నా అడ్డగించ సాధ్యంగాని మీ తేజస్సును అడ్డగించగలిగినవారెవరు?’’ అని అన్నాడు.
ఎన్నో కష్టాలను అనుభవించి చివరకు ద్రౌపదిని గెల్చుకొని మహదానందంతో ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు మొదటిసారిగా వారిని కలిసి వారితో మాట్లాడటం వారి ఆనందాన్ని ఇనుమడింపజేసింది.
వారి మాటలను వింటున్న ద్రౌపదికి మీరు ఎవరో గాదు పాండవులేనన్న దృఢ నిశ్చయం కలిగింది. వారు మరణించలేదనీ తమ రాజపురోహితుడు తండ్రి అన్న మాటలు వాస్తవ రూపం దాల్చిందని లోలోన అమదానంద భరితురాలైంది. ఇంత ఆనందంలోనూ ఏదో ఒక విషయం మనస్సును మరలా తొలుస్తున్నది.
శ్రీకృష్ణుడు మరలా అన్నాడు- ‘‘అంతమంది రాజుల ముందు మానవులకు అసాధ్యమైన ఇటువంటి అద్భుత కార్యం చేయటం అర్జునుని వంటివానికిగాక మరి ఇతరులకు సాధ్యమా? అది గ్రహించాము. మీ పరాక్రమమే మిమ్ములను మాకు తెలియపరిచింది. అధర్మవర్తనులైన ధృతరాష్ట్ర దుర్యోధనాదులు తలబెట్టిన లాక్షాగృహదహనం నుండి తప్పించుకొన్నారు. ఇక మీకు మేలు కలుగుతుంది’’ అని.
ధర్మరాజు అనుమతిని పొంది శ్రీకృష్ణ బరాములు వారి శిబిరాలకు వెళ్ళారు.
***

- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము