AADIVAVRAM - Others

హరిహర క్షేత్రం... వేములవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణ భారతదేశంలోని పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రశస్తి గాంచిన అతిప్రాచీన క్షేత్రం వేములవాడ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 150 కిలోమీటర్లు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువై, తెలంగాణకు తలమానికమై భాసిల్లుతున్నది. తెలంగాణీయులు ఏముడాల రాజన్నగా కొలుస్తూ నిత్యం కోడెలు కడుతుంటారు. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేములవాడకు పౌరాణిక మహత్మ్యంతోపాటు చారిత్రక విశిష్టత ఉన్నది. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా అశేష భక్తజనులు రాజన్న దర్శనార్థం వేములవాడకు వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో అనేక అనుబంధ దేవాలయాలతో పాటుగా పురాతన కోనేరుతో, ఎప్పుడూ భక్తులతో కళకళలాడే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తెలుగు రాష్ట్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత ఆదాయంలో రెండవ స్థానంలో ఉంది.
పౌరాణిక విశేషాలు - స్థలపురాణం
వేదవ్యాస ప్రణీతమైన భవిష్యోత్తర పురాణానంతర్గత రాజేశ్వర ఖండమున ఈ క్షేత్ర ప్రాశస్య్తం లిఖించబడినది. భక్తులకు కొండండ అండగా, కోరిన కోర్కెలు తీర్చుతూ, కొలిచేవారికి కొంగుబంగారమై త్రిలింగదేశంలో వెలగొందే శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రమైన వేములవాడలో కాశీ విశే్వశ్వరుడు, అన్నపూర్ణ భవాని, కాలభైరవుడు, వీర భద్రుడు, ద్వాదశ శివలింగాలు, శివ పంచాయతనములు, గోదావరి, మాండవి, మూల నది పుణ్యనదులు వేంచేసి ఉండటంతో ఇది దక్షిణ కాశీగా పిలువబడుతున్నది. ‘లేంబాళ వాటిక’గా అలనాడు ఖ్యాతి గాంచి, నాటి చాళుక్య రాజుల ధార్మిక దృష్టికి ప్రతీకగా నేడు వేములవాడ వాసికెక్కింది. స్వర్గ, సుఖ, భోగభాగ్యాలకు నిలయమైన సుక్షేత్రమును వెదుకుతూ పరమ శివుడు భూలోకంలో తన నిత్య నివాసానికై ఎన్నుకున్న ఈ దివ్య క్షేత్రమే ‘లేంబాళ వాటిక’ క్షేత్రమని పురాణాల్లో పేర్కొనబడింది. భవిష్యోత్తర పురాణంలోని రాజరాజేశ్వర యుగం నుండి వర్ణింపబడుతున్నది. కృత యుగంలో వృత్తాసురుడనే బ్రహ్మరాక్షసుడిని సంహరించిన పిదప తన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికై ఈ క్షేత్రేశ్వరుని దర్శించి పవిత్రుడైనట్లుగా చెప్పబడింది. అందువల్లనే ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రమని అంటారు. దక్షుడు ఇక్కడే యజ్ఞం చేసి శివధిక్కార నేరానికి గాను వీరభద్రునిచే శిక్షింపబడి జ్ఞానాన్ని పొందడం వల్ల ఈ క్షేత్రాన్ని ‘దక్షవాటిక’ అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి ధర్మగుండానికి ఒక ప్రత్యేకత ఉంది.. ద్వాదశ జ్యోతర్లింగాలు అన్నీ నదీపరివాహక ప్రాంతాల్లో ఉండగా ఇక్కడి శైవక్షేత్రంలో ఎక్కడాలేనివిధంగా అదికూడా ఎడమ వైపున ధర్మగుండం ఉండటం విశేషం.. ఆదిశక్తి, మహిషాసుర మర్థిని ఇక్కడే ప్రాదుర్భవించగా సమస్త దేవతలు ఆమెను అభిషేకించగా ఆ పవిత్ర జలం ఇక్కడ పుష్కరిణిలో ప్రవేశించడం వల్ల ఈ పుష్కరణి సకల నదీ జలాల సంగమమై ‘్ధర్మగుండ’మని ‘రాజేశ్వర తరంగ’మని ప్రఖ్యాతి పొందింది.
కోడెమొక్కు విశిష్టత...
దేశంలోని శైవక్షేత్రాలలో ఎక్కడాలేని ఆచారం ఒకటి వేములవాడ క్షేత్రంలో ఉంది.. కొడుకు పుడితె నీకు కోడె కట్టుతాం.. అంటూ పాటలు పాడుకుంటూ వచ్చే భక్తులను నేటికీ రాజన్న ఆలయంలో చూస్తు ఉంటాం. తన ఇలవేల్పుగా చెప్పుకుంటునే రాజన్న కృపవల్లే ఈ స్థాయికి ఎదిగానని సగర్వంగా చెప్పుకుంటునే, తన ధర్మకర్త హయాంలో పలుమార్లు కోడెమొక్కును సమర్పించుకున్న మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్.టి రామారావు మొదలుకుని నేటి సుప్రసిద్ద సినీ నటులు, కేంద్రమాజీ మంత్రి చిరంజీవి, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ మొక్కుబడి విశిష్టత, ప్రాశస్త్యాన్ని తెలియచేస్తుంది. శ్రీ కృష్ణ్భగవానుడు తన అష్ట్భార్యల్లో జాంబవతి దేవి యందు సాంబుడనే కుమారుడిని శ్రీరాజరాజేశ్వర స్వామి వరప్రసాదంగా పొందాడని, అందుకే యాదవ కులశ్రేష్టుడైన శ్రీ కృష్ణుడు స్వామివారికి కోడెను కట్టి మొక్కు చెల్లించుకున్నాడని పురాణ కథనం. అందుకే ఇప్పటికీ స్వామి వారి వాహనమైన కోడెను భక్తులు పవిత్రంగా సమర్పించుకుని తరిస్తున్నారు. ధర్మదేవత ఎన్నో ఏళ్ల తపస్సును అచరించి ‘వాహనంతే భవిష్యామి’- ఓం పరమ శివా నేను నీకు వాహనమయ్యదనని కోరుకోగా శివుడు అందుకు అంగీకరించి వృషభ రూపంలో ధర్మదేవతను వాహనంగా స్వీకరించెనట. దీనిని బట్టి స్వామివారికి కోడెను కట్టుట వాహన సమర్పణమేనని నిరూపితమవుతున్నది. ఆలయానికి అధికభాగం ఆదాయం ఈ కోడెమొక్కు టికెట్ల విక్రయాలతోనే వస్తుంది.
చారిత్రక ఆధారాలు
నేడు దక్షిణ కాశీగా ప్రాశ్యస్తి చెందిన, తీర్థయాత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఒకప్పుడు రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యపాత్రను వహించింది. వేములవాడకు సంబంధించినంత వరకు చాళుక్యుల కాలం నుండి మాత్రమే చారిత్రక ఆధారాలు లభించాయి. అయితే 25 ఏళ్ళ క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగిన త్రవ్వకాలలో శాతవాహనుల కట్టడాలు బయటపడినందున, వారి పరిపాలన కొనసాగి ఉండవచ్చునని పురావస్తు శాస్తజ్ఞ్రుల భావన. తర్వాత కీ.శ 6వ శతాబ్దం వరకు ఇక్ష్వాకుల రాచరికం వేములవాడ ప్రాంతంపై ఉండవచ్చునని చారాత్రక పరిశీలకుల అభిప్రాయం. ఆ తరువాత వేములవాడలో చాళుక్యుల పాలన సాగింది. కీ.శ 1110లో రెండవ పోలరాజు స్వతంత్ర రాజు అయ్యాడు. ఈ కాలమంతా వేములవాడ వారి ఆధీనంలో ఉన్నది. కాకతీయుల సంధి యుగం తరువాత ఢిల్లీ సుల్తానుల పాలన, సుబేదారుల వల్ల సాగినట్టు తెలుస్తున్నది. వేములవాడ 1512లో గోల్కొండ నవాబుగా స్వతంత్రుడైన కులీ కుత్‌బ్‌షా పాలన క్రింది పాలన క్రిందికి వచ్చింది. 1688లో గోల్కొండ పతనమైన తరువాత ఔరంగజేబు పాలన సుబేదారులతో కొనసాగింది. 1724లో అసఫ్‌జా నిజాం ఉల్‌ముల్క్ పేరున స్వతంత్ర దక్కను రాజ్యాన్ని స్థాపించాడు. అప్పటినుండి హైదరాబాద్‌పై పోలీసు చర్య జరిగేవరకు వేములవాడ నిజాం నవాబుల పాలనలో ఉన్నది. 1813 తర్వాత వేములవాడలో పిండారీల పీడ ఎక్కువైంది. వీరిలో మరాఠీలు, మొగల్ రాజ్య సేనా భ్రష్ఠులైన ముసల్మానులూ ఉన్నారు. ఈ పిండారీల దోపిడీ నుండి ఆత్మరక్షణ చేసుకోవడం కోసం వేములవాడ పట్టణంలో నాలుగు బురుజులు కట్టి పెద్ద ప్రాకారాలు నిర్మించారు. పట్టపగలే వచ్చే పిండారీల జాడను బురుజులు ఎక్కి కనిపెట్టి దూరాన దుమ్ములేవడం కనిపించగానే నగారాలు మ్రోగించి ప్రజలను హెచ్చరించేవారు. ఆ బురుజులు నేటి సజీవంగా సాక్ష్యాలుగా నిలిచిపోయి నాటి సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ పిండారీలను అణగ ద్రొక్కేవరకు వారి దోపిడీ కొనసాగింది. 1882 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబ్ మహబూబ్ అలీఖాన్ వేములవాడ క్షేత్రాన్ని స్థానిక బ్రాహ్మణులందరికీ ఉమ్మడి ఆగ్రహారంగా దానం ఇచ్చాడు. ఈ అగ్రహారంపై పన్నులన్నీ మాఫీ చేస్తున్నట్టు అధికార శాసనం చేయించాడు. నిజాం నవాబు పాలనలో 1911 సంవత్సరంలో వేములవాడ అగ్రహారం అయిదుగురు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పరిపాలన సాగించేందుకు ఆదేశాలు జారీ చేశాడు. నిజాం పభుత్వంలోని కుల్దాబాద్ దర్గా మాదిరి ఇక్కడి దేవాలయం ఆదాయంలో దేవునికి పూజా విధులు జరిపించగా మిగిలిన సొమ్మును అగ్రహారంలోని అందరు బ్రాహ్మణులూ సమభాగంగా పంచుకున్నారు. 1918వ సంవత్సరంలో జారీ చేసిన మరో ఫర్మానాలో ఇది వరకు ఇచ్చిన హక్కులకు భంగం కలుగకుండా పాలన జరిగేలా తిరిగి శాసించారు. 1926వ సంవత్సరంలో అయిదుగురు బ్రాహ్మణులను అధికారులుగా నియమిస్తూ స్థానిక 125 మంది బ్రాహ్మణుల కుటుంబాల పేర అగ్రహారాన్ని విరాసత్ చేశారు. 1939 డిసెంబర్ 6వ తేదీన గ్రీక్సన్ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో వేములవాడ అగ్రహారం ‘అత్యోషాహి’ అంటే రాజబంధనం నుండి విముక్తికి నోచుకున్నట్లు తెలుస్తుంది. తర్వాత కొన్నాళ్ల పాటుగా అగ్రహారం పర్యవేక్షణ హక్కు జాగీరుల నుండి తీసివేసి జిల్లా అధికారికి అప్పగించారు. 1951వ సంవత్సరంలో ప్రభుత్వం శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ నిర్వహణకు అప్పగించింది.
మత సామరస్యానికి ప్రతీక
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న మహ్మదీయ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నది. పూర్వం ముస్లిం రాజులు హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న కార్యక్రమంలో భాగంగా ‘ఖాజాబకస్’ అనే ముస్లిం సేనాని ఈ దేవాలయాన్ని కూల్చివేయడానికి యత్నిస్తుండగా రక్తం కక్కుకుని మరణించాడని పురాణాల్లో ఒక కథ ఉన్నది. ఈ సేనాని మరణించిన అనంతరం శ్రీరాజరాజేశ్వర స్వామి అర్చకులకు కలలో కనిపించి మరణించిన సేనాని తన భక్తుడేనని తెలిపి అతని పేరిట దర్గాను కట్టించమని ఆదేశించినట్లు పేర్కొనబడింది. అప్పటి నుండి నిర్మించిన దర్గాకు హిందువులు, ముస్లింలు కూడా రావడం ఆనవాయితీగా వస్తున్నది.
విశేషంగా ఆకర్షిస్తున్న శ్రీ భీమేశ్వరాలయం
ప్రాచీన కట్టడాలు, జైన బౌద్ధమత ఆచారాలు, సాంప్రదాయలు ఉట్టిపడే విధంగా భక్తులను విశేషంగా ఆకర్షించే ఇక్కడి శ్రీ భీమేశ్వరాలయానికి ఒక విశిష్టత ఉంది. క్రీ.శ 859 నుండి 895 వరకు పాలించిన రెండవ యుద్ధ మల్లుని కుమారుడైన బద్దిగ భూపతిచే ఆలయ నిర్మాణం చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం విశేష శిల్పసంపదకు ఆలవాలమై పురవస్తు శాఖ వారిచే పురాతన కట్టడంగా గుర్తించబడింది.
అద్భుత క్షేత్రంగా అభివృద్ధి
అధ్యాత్మికతకు నిలయమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రాన్ని అద్భుత క్షేత్రంగా అభివృద్ధి చేయాడినికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే రమేశ్‌బాబు ప్రత్యేక దృష్టిసారించారు. యాదాద్రి ఆలయం తరహాలో రాజన్న ఆలయం ప్రగతిబాట పట్టనున్నది. ఆలయాన్ని విస్తరించి అద్భుతంగా రెండోప్రాకారం, నిత్యాకళ్యాణ మండపం, కళ్యాణకట్ట, కళ్యాణ మండపం,్ధర్మగుండం ఆధునీకరణ, ట్యాంక్‌బండ్ నిర్మాణం,సంస్కృత,నాట్య,వేదపాఠశాలలు, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ,లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి వంటి పగతి పనులు జరుగనున్నాయి.
శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు
వేములవాడలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు దేవాలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున కన్నుల పండువగా జరిగే మహాలింగార్చన, లింగోద్భవం పూజలకు రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి దేవస్థానం తరఫున శ్రీ రాజరాజేశ్వర స్వామికి శేషవస్త్రాలు సమర్పించడం సాంప్రదాయంగా వస్తున్నది. దాదాపు రూ. కోటి వ్యయంతో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నామని ఆలయ ఇ.వో రాజేశ్వర్ తెలిపారు.
రాజన్న సన్నిధిలో ఉత్సవాలు
మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ అతిపెద్ద ఉత్సవం మూడురోజుల పాటు లక్షలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి విచ్చేస్తుంటారు. ఇదే తరహాలో శ్రీరామనవమి రోజున లక్షకు పైగా శివపార్వతులు విచ్చేసి శ్రీస్వామివారిని కళ్యాణం చేసుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. గణపతి, దేవీ నవరాత్రులు, శ్రావణ కార్తీకమాసంలో వచ్చే పండుగలు గీతాజయంతి, శ్రీ శంకర జయంతి, ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు కూడా ఇక్కడ కన్నుల పండువగా జరుగుతాయి. భక్తజనులకు తగిన సౌకర్యాలను కల్పించేలా ఆయా ఉత్సవాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

అంచెలంచెలుగా అభివృద్ది చెందిన ఆలయం
అలనాడు అతి ప్రాచీన కట్టడాలు, జైన, బౌద్ధ సంస్కృతి విలసిల్లిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం క్యూలైన్ కాంప్లెక్స్‌లు, నూతన కట్టడాలతో అలరారుతోంది. చాళుక్యుల రాజధానిగా, శాతవాహనుల పాలనలోనూ ప్రసిద్ధి పొందిన వేములవాడ 1962 నుండి అభివృద్దిపథంలో అంచెలంచెలుగా దూసుకుపోయింది. 1960లో రాజన్న కోవెల జీర్ణోద్ధరణ గావించబడింది. 1962లో ఆలయాన్ని అనుకుని ఉన్న చెరువు పక్కన అయిదు ధర్మశాలలను నిర్మించారు. 1967లో రాజేశ్వరపురం వసతిగృహాలు, 1970లో ధర్మగుండ ప్రాకారాల నిర్మాణాలు, 1978లో గర్భాలయ ప్రాకారం, కార్యాలయం నిర్మాణాలు జరగ్గా వీటిని జగద్గురు శృంగేరీ పీఠాధిపతి శంకరాచార్యులచే మహాకుంభాభిషేకం నిర్వహించి ప్రారంభోత్సవాలు గావించారు. 1992లో పాకశాల, 1993లో కళాభవన్, 1994లో గుడిచెరువుపై ఓపెన్‌స్లాబ్ నిర్మాణాలు జరిగాయి. 2000 సంవత్సరంలో రాజన్న కోవెలలో కోట్లాది రూపాయల నిర్మాణాలు చేపట్టబడ్డాయి. నందీశ్వర, లక్ష్మీగణపతి కాంప్లెక్స్‌లు, ఆలయంలో క్యూలైన్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నానాటికి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రస్తుతం ధర్మగుండం మరొపక్కన ఓపెన్‌స్లాబ్‌ను, ఆలయం ముందుభాగంలో ప్రత్యేకంగా కోడెల సమర్పణకు స్థలం, సర్వదర్శనం, ప్రత్యేకదర్శనం భక్తులకు క్యూలైన్‌లును నిర్మించారు. కళ్యాణకట్టను సైతం ఆలయం ముందుభాగంలోని సెల్లార్‌లో నిర్మించారు. దీనిపైభాగంలో ప్రత్యేకంగా సర్వదర్శనం క్యూలైన్‌లను ఏర్పాటుచేశారు.

-శ్రీనివాస్