Others

ఒకటికి ఒకటి కలిస్తే ఒకటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటికి ఒకటి కలిపితే ఎంత అంటే, చిన్నపిల్లాడైనా రెండు అని టక్కున చెబుతాడు. అది గణితం. ఒకటికి ఒకటి కలిపితే ఒకటే అని అంటే విచిత్రంగా ఉంటుంది. వెర్రిగా ఉంటుంది. కానీ అది సత్యం. అదే ఆధ్యాత్మికం!
జీవాత్మ పరమాత్మలో కలిస్తే పరమాత్మే కదా! అదే 1+1=1. ఇదే ఆధ్యాత్మికంలోని అసలు విషయం.
ఆధ్యాత్మికం అంతా తెలిసినట్టే ఉంటుంది. ఏమిటి తెలిసింది అని ప్రశ్నించుకుంటే ఏమీ తెలీనట్టు ఉంటుంది. తెలుసుకుంటున్నకొద్దీ ఇంకా తెలియవలసింది ఎంతో వుంటుంది. ఎంతో ఉందనిపిస్తుంది. ఓ పట్టాన అంతు చిక్కదు. ఎంతకీ అంతుపట్టదు.
ఆధ్యాత్మికం అంటే నిరంతరం అనే్వషణ. అవిచ్ఛన్నంగా, అవిశ్రాంతంగా చేయవలసిన సాధన. ఆవలి గట్టుని చేరుకునేందుకు చేయవలసిన ఆలోచన!
‘‘ఆధ్యాత్మికాన్ని అర్థం చేసుకోవడంలోనే వుంది ఆధ్యాత్మిక రహస్యమంతా’’ అన్నారు మహనీయులు.
ఒక మహనీయుని దగ్గరికి ఆయనే భగవంతుడు అని నమ్ముతున్న ఓ నలభై మంది కుర్రాళ్ళు వెళ్ళేరు. వారితో ప్రత్యేకంగా మాట్లాడుదామని వాళ్లని కలిసేందుకు, మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేరా మహనీయుడు. అందరూ వచ్చి కూచున్నారు.
‘‘ఆధ్యాత్మికం అంటే ఏమిటి సెలవిస్తారా గురువర్యా!’’ అని అడిగేడో కుర్రాడు. మహనీయుడు మాట మారుస్తూ ‘‘మీరెంతమంది వచ్చారు?’’ అని అడిగేడు. ‘‘మేం నలభైమందిమి వచ్చేం’’ అని టక్కున సమాధానమిచ్చేడు ఆ కుర్రాడు. ‘‘మీరు నలభైమంది వచ్చేరా? ఓసారి పపరిశీలించి చెప్పు’’ అన్నాడు ఆ మహనీయుడు. ఒక్కసారి అందర్నీ లెక్క చూసుకుని ‘‘మేం నలభైమందిమే’’ అని ధీమాగా చెప్పేడు కుర్రాడు. ‘‘నలభైమందిమి అంటున్నావ్? నేను మీతో లేనా? మీ వాడ్నికానా?’’ మళ్లీ ప్రశ్నించేడు ఆ మహనీయుడు.
తన తప్పు ఏమిటో అర్థమయింది కుర్రాడికి. ఆ మాత్రం తనకి తట్టనందుకు తన తెలివి తక్కువకి సిగ్గుపడ్డాడు. తప్పైపోయింది గురువర్యా! మేం నలభై ఒక్కరమే అని ఒప్పుకున్నాడు కుర్రాడు.
మూడు నెలల తర్వాత అదే బృందం ఆ మహనీయుని దగ్గరకు వచ్చింది. ‘‘ఇపుడు మీరెంతమంది వచ్చేరు?’’ అడిగేరు ఆ మహనీయుడు. ‘‘నలభై ఒక్క మందిమి గురువయ్యా!’’ ధైర్యంగా స్థిరంగా, నమ్మకంగా సమాధానమిచ్చేడు కుర్రాడు.
‘‘నలభై ఒక్కరేనా? గ్యారంటీయేనా?’’ రెట్టించి ప్రశ్నించారా మహనీయుడు. క్రితంసారి పరోక్షంగా ఆ మహనీయుడు చెప్పిందే కాబట్టి ఎంతో ధైర్యంగా ‘‘సందేహం లేదు. కచ్చితంగా నలభై ఒక్కరమే’’ ధీమగా జవాబిచ్చాడా కుర్రాడు. ‘‘ఆహా అలాగా!.. అయితే నీ జవాబు శుద్ధ తప్పు.. ఎందుకో తెలుసా? నేను మీ ఒకొక్కరిలో ఒకరుగా లేనా? అంటే నలభై ఇంటూ రెండు ఎనభై అవుతున్నారుగా. పైగా శరీరంలో ఒకరుగా ఉన్నాను కదా! మొత్తం ఎనభై ప్లస్ ఒకటి, ఎనభై ఒకటి అవలేదా?’’ అన్నారా మహనీయుడు.
చెంపమీద చెళ్ళున కొట్టినట్టయింది ఆ కుర్రాడికి. మరో మూడు నెలల తరువాత అదే బృందం ఆ మహనీయుని దగ్గరకొచ్చింది. ‘‘ఈ ట్రిప్పు మీరు ఎంత మంది?’’ పాత ప్రశ్ననే మళ్లీ అడిగేరా మహనీయుడు. ఎనభై ఒక్కమందిమి గురువర్యా! ఈసారి తన లెక్కతప్పదన్న నమ్మకం ఆ కుర్రాడి గొంతులో ప్రతిధ్వనించింది.
అపుడు బదులుగా ఆ మహనీయుడిలా అన్నారు గత మూడు సార్లుగా మీరెంతమంది అని అడిగిందే మళ్లీ మళ్లీ నేను అడుగుతున్నాను. నువ్వేమో నలభైమందిమి, ఎనభై మందిమి, ఇంత మందిమి అని అంకెల్ని వల్లె వేస్తున్నావ్. నేను ఇన్ని సంవత్సరాలనుంచి అందరూ ఒక్కటే, అంతా ఒక్కటే అని ఎంతగా చెబుతున్నాను. మీ అందరికీ బోధిస్తున్నాను. మీకేం అర్థమైందయ్యా? అందరం ఒక్కటై ఒక్కటిగా వచ్చేం. ఒక్కరమై వచ్చాం అని చెప్పలేకపోయారయ్యా మీరు. గత మూడుసార్లు అదే ప్రశ్న ప్రతిసారీ అడగటంలో దాగున్న రహస్యాన్ని వివరించారా మహనీయుడు. తమ అందరికీ పూర్తిగా అర్థమైంది. మహనీయుడు చెప్పటం కొనసాగించేరు. ‘‘చూడండయ్యా! మీరంతా మొదటి పర్యాయం నా దగ్గరికి వచ్చినపుడు ‘ఆధ్యాత్మికం’ అంటే ఏమిటో చెప్పమని ఈ కుర్రాడు అడిగేడు, గుర్తుందా? ఆధ్యాత్మికం అంటే ఇదేనయ్యా!’’ అని చెప్పేరు ఆ మహనీయుడు.
వివరణ కొనసాగిస్తూ... ‘నేను’ నుంచి ‘మేము’కి ప్రయాణం చేయటమే ఆధ్యాత్మికం. ‘‘వ్యక్తి స్థాయి నుంచి ‘సమిష్టి’కి సాగే మన సాధనే ఆధ్యాత్మికం’’ అందరికీ అర్థమయ్యేలా వివరించి ముగించేరు మహనీయుడు.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669