Others

అసాధ్యుడు (ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పహిల్వాన్, నటుడు అయిన నెల్లూరు కాంతారావు నిర్మాతగా టైగర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలుత ‘సర్వర్ సుందరం’ తమిళ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. ఆ తరువాత ఈ బ్యానర్‌పై కృష్ణ హీరోగా వీరు రూపొందించిన చిత్రాలు అసాధ్యుడు (1968), అఖండుడు.
అసాధ్యుడు చిత్రానికి దర్శకులు వి.రామచంద్రరావు. ఓరుగంటి రామచంద్రరావు తూర్పు గోదావరి జిల్లా లక్ష్మీపోలవరంలో జన్మించారు. కాకినాడలో విద్యాభ్యాసం చేశారు. దర్శకులు తాపీ చాణుక్య పిలుపుతో సినీ రంగానికి పరిచయమై ‘రోజులు మారాయి’ చిత్రానికి సహాయ దర్శకత్వం వహించారు. ఆ తరువాత వి.మధుసూదనరావు, డూండీల చిత్రాలకు పనిచేశారు. వీరి ప్రతిభ గమనించిన డూండీ వీరిని ‘మరపురాని కథ’ చిత్రానికి దర్శకునిగా ఎన్నుకున్నారు. వాణిశ్రీ నట జీవితాన్ని ఒక మలుపు తిప్పిన ఈ చిత్రంలో హీరోగా నటించిన కృష్ణ రామచంద్రరావుగారి స్పార్క్‌ను మెచ్చి, తాను నటించబోయే ‘అసాధ్యుడు’ చిత్రానికి రామచంద్రరావుని రికమెండ్ చేశారు. ఆ తరువాత వీరు కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామారాజు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తం 17 చిత్రాలకు వీరు దర్శకత్వం నెరపగా, వాటిలో 11 వరకూ కృష్ణ హీరోగా నటించడం విశేషం. ఇతరుల చిత్రాల్లో చెప్పుకోదగ్గది ‘పాపం పసివాడు’. అల్లూరి సీతారామరాజు చిత్రం మధ్యలో రామచంద్రరావుగారు పరమపదించగా దాన్ని కె.ఎస్.ఆర్.దాస్ వారి బాణీలో పూర్తిచేశారు.
12-1-1968న విడుదలైన అసాధ్యుడు చిత్రానికి రచన- ఆరుద్ర, సినీ ఎఫెక్ట్స్- ఆర్.జయరామిరెడ్డి, కూర్పు- ఎన్.ఎస్.ప్రకాశం, సంగీతం- టి.చలపతిరావు, నృత్యం - హీరాలాల్, పసుమర్తి, చిన్ని, సంపత్, అల్లూరి సీతారామరాజు నాటికకు నృత్యం - వేణుగోపాల్, వ్యాఖ్యానం - వల్ల నరసింహారావు, ఫొటోగ్రఫీ - వి.ఎస్.ఆర్.స్వామి, ఆర్ట్- రాజేంద్రకుమార్, నిర్మాత - నెల్లూరి కాంతారావు, ఎస్.హెచ్.హుస్సేన్, దర్శకత్వం: వి.రామచంద్రరావు.
నీతి నిజాయితీగల సాహస యువకుడు రాజు (కృష్ణ), అతని చెల్లెలు నిర్మల (సంధ్యారాణి), మేనత్త కొడుకు ఇన్స్‌పెక్టర్ సత్యం (రామకృష్ణ) సాహస పనులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దని రాజును తల్లి హెచ్చరిస్తుంటుంది. శ్రీపురం దివాణానికి చెందిన నౌకరు కొండయ్య (పెరుమాళ్ళు) గాయపడి, ఆ వూరు హాస్పిటల్‌లో చేరతాడు. స్పృహ వచ్చాక నర్సు సీతమ్మ (రమాప్రభ)కు ఆ దివాణం యువరాజు కుమార్‌రాజా (చంద్రమోహన్)కు ప్రాణగండం వుందని, హంతకునికి 4 వేళ్ళు వుంటాయని, ఆనవాలుగా ఓ ఉంగరం ఇచ్చి మరణిస్తాడు. ఆ రహస్యం సీతమ్మ రాజుకు తెలియజేస్తుంది. హంతకునికి చెందిన దుండగుల చేతిలో సీతమ్మ మరణిస్తుంది. రహస్యం తెలిసిన రాజును అంతం చేయాలని ప్రయత్నించటం, ఇంతలో రాజు ఆ దివాణానికి చెందిన రాధ (కె.ఆర్.విజయ)తో ప్రేమలో పడటం. ఆమె ద్వారా దివాన్ (ముక్కామల)ను కలుసుకోవటం, ఆ క్రమంలో దివానే హంతకుడు అని రాజు గ్రహిస్తాడు. వారి కుట్ర నుంచి యువరాజు చెల్లెలు బేబి (బేబీ రోజారమణి)ని యువరాజు, వారి మేనత్త టి.జి.కమలాదేవిని కాపాడి, యువరాజుకుఆస్తి అప్పగిస్తాడు. ఆ దాడిలో టైంబాంబ్ వున్న కారు పేలిపోయి దివాన్ మరణిస్తాడు. రాజు, రాధ, సత్యం, నిర్మల ఒకటికావడంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఇంకా వాణిశ్రీ, చలం, బాలకృష్ణ, అతిథి నటులు రావికొండలరావు, ఆరుద్ర, టి.చలపతిరావు, ప్రభాకర్‌రెడ్డి నటించారు. రౌడీలుగా నెల్లూరు కాంతారావు, పెమ్మసారి రామకృష్ణ, భీమరాజు, నౌకరుగా బంగళాలో సీతారాం, తిలకం నటించారు.
పెద్దపులి బొమ్మపై టైగర్ ప్రొడక్షన్స్, ఆ తరువాత మధ్యలో హీరో కృష్ణ అతని చుట్టూ నలుచదరాల ఫ్లోరల్ డిజైన్స్ తిరుగుతుంగా వాటిపై టైటిల్స్ చూపడం ఆకట్టుకుంటుంది. దర్శకులు చిత్ర ప్రారంభంలోనే కృష్ణ రమాప్రభను రౌడీలనుంచి రక్షించటం, బ్యాంక్ దోపిడీ దొంగలను పట్టుకొని బహఉమతి పొందం ద్వారా అతని సాహస ప్రవృత్తి పరిచయం చేయటం, చిన్న చిన్న అర్థవంతమైన సన్నివేశాల ద్వారా కథను నడిపించటం, వేట బంగళా చేరటంలో కృష్ణ, కె.ఆర్.విజయ వెళ్ళేటప్పుడు, తిరిగి టి.జి.కమలాదేవితో సహా నీళ్ళలో రావటం, వస్తాదులు తరమటం, పాములు చెట్లపై పాకటం ఎంతో విపులంగా, రిస్క్‌తో కూడిన షాట్స్‌ను వైవిధ్యంగా రూపొందించటం, నాటక సమాజం ద్వారా ‘రోడ్ సైడ్ రోమియో’ సందేశాత్మకంగా, హాస్యభరితంగా ‘నినే్న చూసి నవ్విందా’ (పిఠాపురం, ఎస్.జానకి, మాధవపెద్ది- రచన కొసరాజు), చలం, వాణిశ్రీ, బాలకృష్ణలపై చిత్రీకరించటం, హీరో కృష్ణకు ఎంతో మక్కువగల సీతారామరాజు వేషాన్ని అల్లూరి సీతారామరాజు నాటకంలో ప్రదర్శింపజేయటం, దానిలో పోలీసుల నుండి ఆయుధాలు స్వాధీనం, కోయపిల్లను సైనికులు బలవంతం చేయటం, సీతారామరాజును అంతం చేయటం వంటి అంశాలను జోడించి ఎంతో రసవత్తరంగా చిత్రీకరించటం జరిగింది. ఆ తరువాత వీరి దర్శకత్వంలోనే రూపొందిన కృష్ణ నిర్మించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి నాందిగా, ట్రయిల్‌గా ఈ అంశం నిలవటం విశేషం (శ్రీశ్రీ రచన, గానం మాధవపెద్ది, బి.గోపాలం, వసంత బృందం- వల్ల నరసింహారావు వ్యాఖ్యానం).
ఈ చిత్రంలో హీరో కృష్ణ సన్నివేశాలను ఎంతో ఈజ్‌తో నటించి మెప్పించటం, సీతారామరాజు వేషాన్ని ఎంతో భావయుక్తంగా, గంభీరగా ఆ పాత్ర ఔన్నత్యనికి తగ్గట్టు పోషించటం ప్రశంసనీయం. రాధగా కె.ఆర్.విజయ పాత్రోచితమైన హావభావాలను, సంకెళ్ళతో హీరోతో కలిసి ఫైట్‌లో, యుగళగీతం ‘ఇలా ఇలా వుంటుందని’ వర్షంలో, తోటలో చిత్రీకరణ (రచన సినారె, గానం పి.బి.శ్రీనివాస్, పి.సుశీల), ప్రియుని తలచిపాడే సోలో గీతం ‘కలలే కన్నానురా’ (ఎస్.జానకి - దాశరథి) ( చిత్రంలో హిట్ సాంగ్‌గా నిలిచిన పాట ఇది) హీరో, రాధను టీజ్ చేసే గీతాలు ‘చిట్టెమ్మా చిన్నమ్మా’ ((సినారె గానం, పి. బి.శ్రీనివాస్) ‘వెళ్ళగలితే వెళ్ళు వెళ్ళు’ (ఘంటసాల - ఆరుద్ర) ఎంతో హుషారుగా, కోపంగా, చిలిపిగా వైవిధ్యభరితంగా నటించి అలరించారు. చిత్రం చివర చంద్రమోహన్‌ను కాపాడే సన్నివేశంలో నాటక బృందం వారి నృత్యగీతం ‘సైరా నారాజా హుషార్’ (ఎల్.ఆర్.ఈశ్వరీ, మాధవపెద్ది బృందం- ఆరుద్ర) హుషారుగా, యువరాజుపై హత్యా ప్రయత్నం ఆపే దిశగా డప్పులతో వాయిద్యాలతో కృష్ణతో సహా పాల్గొని అలరించేలా సాగుతుంది.
‘అసాధ్యుడు’ చిత్రం ఆ సంవత్సరం కృష్ణ నటించిన తొలి సంక్రాంతి చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పటం, ఈ చిత్రం విజయవంతం కావటం, ఆ ఏడాది నుంచి ప్రతి సంక్రాంతికి కృష్ణ నటించిన చిత్రం విడుదలైన సక్సెస్ సాధించటం ఓ ఆనవాయితీగా మారింది.
గూఢచారి 116లో మెప్పించిన హీరో కృష్ణ ఈ చిత్రంలోనూ జేమ్స్‌బాండ్ తరహా వేషంతో, ఫైట్స్‌తో మెప్పించి, ఆ తరువాత వచ్చిన అదే టైపు చిత్రాలకు ఓ బ్రాండ్‌గా నిలిచారు. అందాల నటి కె.ఆర్.విజయ తన నటనతో, పాటల్లో ప్రత్యేక అభినయంతో ఆకట్టుకొని ఆసాధ్యుడికి అన్నిటా ధీటుగా నిలవటం విశేషంగా పేర్కొనాలి. హీరో కృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజుకిది నాంది కావటం అభినందించదగ్గ విషయం.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి