Others

లేలేత గుండెల్లోకి అమెరికన్ తూటాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్య, ఉపాధి రంగాల్లో దేశదేశాల యువతను ఆకర్షిస్తున్న అగ్రరాజ్యం అమెరికా నేడు.. ఉన్మాదుల, జాత్యంహకారుల దాడులతో భీతిల్లుతోంది. అభం శుభం తెలియని పసిపిల్లలను కాల్చి చంపే విద్వేష సంస్కృతి, విపత్కర తూటాల దుర్ఘటనలను ఆ సంపన్న దేశం ఎదుర్కొంటోంది. చైనా, భారత్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, వియత్నాం, జపాన్, తైవాన్, ఇరాన్, నేపాల్ వంటి అనేక దేశాల నుంచి లక్షలాదిగా విద్యార్థులు తరలి వెళ్తున్న అమెరికాలో ‘గన్ కల్చర్’ వికృత రూపం దాల్చింది. పాఠశాలల్లో బాలబాలికలను కాల్చి చంపే విష సంస్కృతి జడలు విప్పి ఎంతోమంది అమాయకులను బలికొంటోంది. పార్క్‌లాండ్‌లోని ఫ్లోరిడా డగ్లస్ హైస్కూలులో 17 మందిని కాల్చి చంపడం అమెరికా సమాజపు వికృత జీవన ప్రవృత్తిని స్పష్టం చేస్తోంది.
గత ఏడేళ్లలో 273 పాఠశాలల్లో తుపాకీ మోతలు విన్పించాయి. కెంటకీ, న్యూ మెక్సికో, వాషింగ్టన్, కాలిఫోర్నియా, సౌత్ కరోలినా, కొనె్నక్టికట్, వర్జీనియా బ్లాక్స్‌బర్గ్, కొలరాడో వంటి పలు ప్రాంతాల్లో స్కూలు పిల్లలు తరగతి గదుల్లో, పాఠశాల ప్రాంగణాల్లో ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచ వ్యాప్తంగా హత్యలు, ఆత్మహత్యలు అనునిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కానీ, అమెరికా పౌర సమాజం మాత్రం ఇప్పటికీ ‘తుపాకులతోనే ప్రాణరక్షణ’ అన్న ప్రగాఢ విశ్వాసంతో జీవిస్తోంది. ఆయుధాలకు దాసోహం అంటోంది. తుపాకులు కలిగి వుండటం తమ జన్మహక్కుగా విశ్వసిస్తోంది. ఒక సర్వే ప్రకారం అమెరికా జనాభా 30 కోట్లు పైబడి వుండగా, పౌరుల దగ్గర 31 కోట్ల తుపాకులు ఉన్నాయట! ప్రతి పౌరుడూ తుపాకీ మాత్రమే తనను రక్షించగల అత్యవసర ప్రాణాయుధంగా భావించడంతో తుపాకుల ఉత్పత్తి, అమ్మకాలు, కొనుగోళ్లు బడా పరిశ్రమగా విస్తరిల్లి రాజకీయ అధిపత్యం చెలాయిస్తోంది.
ప్రపంచంలో మతోన్మాదం, ఉగ్రవాదం జనం ప్రాణాలను తీస్తున్నందున ఆత్మరక్షణకు ఆయుధాలు అనివార్యమవుతున్నాయి. 1791లో అమెరికా రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ‘ఆయుధ హక్కు’ పుణ్యమాని తుపాకుల పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ఎన్ని తుపాకులుంటే సమాజానికి అంత రక్షణ. దేశానికి ఆయుధ బలం. ఆ ప్రగాఢ పౌరవాంఛకు రాజకీయ ప్రోత్సాహం కారణంగా ‘తుపాకీ లాబీ’ అమెరికాను శాసిస్తోంది.
‘ట్రిగ్గర్ హేపీ..!
2012 డిసెంబరులో న్యూటౌన్ కొనె్నక్టికట్‌లో సాండహుక్ ఎలిమెంటరీ స్కూలులో 20 మంది పిల్లలను, 6గురు పెద్దలను ఒక ఉన్మాది నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన సంఘటన తరువాత, తాజాగా ఫ్లోరిడా స్కూలులో 17 మందిని పాశవికంగా చంపటం, అంతకు ముందు అరగాన్ స్టేట్‌లోని గ్రామీణ రోజ్‌బర్గ్ ఉంప్‌క్వా కళాశాలలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి పలువురు నిస్సహాయులైన విద్యార్థులను పొట్టన పెట్టుకొన్న రాక్షస చర్యలు కొత్తేమే కాదు. ఏటా 35,000 మంది తుపాకీ కాల్పులలో మరణిస్తున్నా, పిల్లలు సైతం గన్‌లతో పాఠశాలల్లో ప్రవేశిస్తూ ప్రాణాలు తీస్తున్న ఘటనలు అనేకం. టెనె్నసి స్టేట్‌లో 8 ఏళ్ల చిన్నారి మెక్యాలా తన పప్పీతో ఇంటి బయట ఆడుకొంటుండగా, 10 ఏళ్ల పొరుగింటి బాలుడు ఒకసారి చూడడానికి ఇమ్మని అడిగాడు. ఆ పాప ‘నో’ అంటూ నిరాకరించటంతో ఆ బాలుడు తన తండ్రి వాడే 12-గాజ్ షాట్‌గన్ తెచ్చి గురిపెట్టి కాల్చాడు. ఇప్పటి వరకు 273 బడుల్లో జరిగిన తుపాకీ కాల్పుల్లో 121 మంది లేత గుండెల్లోకి తూటాలు దూసుకువెళ్లి తరగతి గదుల్లో బాలల రక్తం ప్రవహించింది. ఇంత జరుగుతున్నా అమెరికన్ పౌరులు తుపాకులపే ఆంక్షలు, నియంత్రణలు అంగీకరించటం లేదు.
ప్రస్తుతం అమెరికా పౌరుల వద్ద సుమారు 300 మిలియన్లకు పైగా తుపాకులు ఉన్నందున అక్కడ ‘ట్రిగ్గర్ హేపీ’ సంస్కృతి విషమించింది. ఈ ధోరణి ఇతర దేశాలకూ విస్తరింపచేస్తోంది. సాధారణ విదేశీయులను సునాయాసంగా కాల్చి చంపటం అమెరికాలో చాలా తేలిక. కారణాలు అతిస్వల్పమైనా తుపాకులున్న వారిలో అహంకార ఆధిపత్యం సులువైన విద్య. ఏటా సుమారు 14 బిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించే ‘గన్ ఇండస్ట్రీ’ గురించి అమెరికన్లు గర్వపడుతుంటారు. రైఫిళ్లు, హాండ్‌గన్లు ఇంటింటా కనిపిస్తాయి. తల్లిదండ్రుల ఆయుధాలు పిల్లలకు ఆట వస్తువులు. నిరంతరం ప్రమాదం పొంచివుండే మారణకాండ అక్కడ పొంచి వుంది. ‘గన్ ఓనర్‌షిప్’ కారణంగా స్కూల్, హాస్పిటల్, చర్చి, థియేటర్ ఎక్కడైనా సామూహికంగా యథేచ్ఛగా ఉన్మాదులు కాల్పులు జరిపే అవకాశం వుంది. జాతి విద్వేషం, ప్రవాసులపై కిరాతక కాల్పులు వంటి విషాద ఘటనలకు అంతేలేదు. గన్స్ వినియోగంపై నియంత్రణ లేదు. సంస్కరణలు, కొత్త చట్టాలను అమెరికన్లు అంగీకరించరు.
మతోన్మాదం ఉగ్రవాదంగా పడగవిప్పి మారణాయుధాల ఆధిపత్యంతో అగ్రరాజ్యాల్లోనూ రక్తపాతం సృష్టిస్తోంది. పగ, ప్రతీకారం మానవాళి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా వంటి దేశాలలో నియంత్రణలేని ఆయుధ స్వేచ్ఛ మరింత వెర్రితలలు వేస్తోంది. ఎవరి చేతి తుపాకీ ఎటువైపు తూటాలు కురిపించి ఎవరికి మృత్యుపాశం అవుతుందో తెలియని ఘాతుకాలు చోటుచేసుకొంటున్నాయి. సాంకేతిక సమాజంలో మానసిక ఒత్తిడి, ఉద్వేగం, అసహనం, అనారోగ్యం వంటివి ఉన్మత్తత సృష్టిస్తోంది. ఇటువంటి స్థితిగతులలో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రిపబ్లికన్‌ల ఆధిపత్యంలో ఉన్న పాలనాధికారం- తుపాకుల స్వైర విహారాన్ని నియంత్రించే విధానాలను వ్యతిరేకిస్తోంది. తుపాకుల లాబీ అమెరికన్ పార్లమెంటును శాసిస్తోంది. గతంలో ఒబామా ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసింది. తుపాకులే తమను రక్షించగలవనే ప్రగాఢ విశ్వాసం నానాటికీ బలపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేవలం 2015 డిసెంబర్‌లో విపరీత సంఖ్యలో అమెరికన్లు 3,314,594 తుపాకులు కొన్నారు. ఒక్క ఏడాదిలో మారణాయుధాలు 30 కోట్లకు అదనంగా 2.3 కోట్లు చేరాయి. అయినా అమెరికన్ పౌర సమాజం భయభ్రాంతులతో తపిస్తోంది.
ప్రస్తుత ఫ్లోరిడా దుర్ఘటన ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా అధ్యకుడు ట్రంప్ ఈ ఘోరకలికి కారణం మానసిక అనారోగ్యం అంటున్నారు. ‘గన్ ఫ్రెండ్లీ’ దేశం కావటంతో 19 ఏళ్ల నికొలస్ చట్టబద్ధంగా ఎఆర్-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను స్వేచ్ఛగా కొనగలిగాడు. ఫెడరల్ గన్ చట్టాలను సంస్కరించటానికి, నియంత్రించటానికి అంగీకరించని ట్రంప్ ప్రభుత్వం తుపాకుల స్వైరవిహారానికి అడ్డుకట్ట వేయకపోవడంతో అక్కడి తల్లిదండ్రులు తీవ్రమైన వేదనను, పిల్లలు మృత్యు భయాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికాపై యువతలో వ్యామోహం ఉన్నందున- మన దేశాధినేతలు కూడా ఆ విషసంస్కృతి ఇక్కడ చాపకింద నీరులా పాకకుండా అప్రమత్తతతో వ్యవసరించవలసిందే.

- జయసూర్య 94406 64610