Others

జీవితాన్ని పూజించే ‘రెబెల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రెబెల్’.. నేనంటే నేనే
మూలం: ఓషో
అనువాదం: భరత్
మూల్యం: రూ.250
పుటలు: 208
ప్రతులకు: ధ్యానజ్యోతి పబ్లికేషన్స్
పోస్ట్ బాక్స్ నెం.1, జెజె నగర్ కాలనీ పోస్ట్ఫాస్
యాప్రాల్,
సికిందరాబాద్-500 087
9440716716

*

జీవితాన్ని పూజించగలవాడు రెబెల్.
కట్టుకథల్ని అటక ఎక్కించగలవాడు రెబెల్.
చైతన్యాన్ని, పదార్థాన్ని సంయోగించగలవాడు రెబెల్.
దేహాన్ని, ఆత్మను ఏకం చేయగలవాడు రెబెల్.
భౌతికత్వాన్ని, ఆధ్యాత్మికత్వాన్ని అభిన్నంగా చూడగలవాడు రెబెల్.
వాస్తవ, అవాస్తవ సరిహద్దుల్ని చెరిపేయగలవాడు రెబెల్.
అవును, ఈనాటి మనం గత గాయాల మానని గాయాలం. గత కట్టుకథల పురిటినొప్పుల వారసులం. ఇంతటి మనోవైకల్య వాతావరణాన్ని పుక్కిటపట్టి, గాయాల బాధల్ని దిగమింగుకుంటూ మనల్ని మనమే వంచించుకుంటూ, కుదించుకుపోతూ, ఎదిగిపోతున్నామని ప్రకటించుకుంటూ విర్రవీగుతున్నాం. కానీ, వర్తమాన వ్యవస్థకు కావలసింది ఈ విర్రవీగే జనావళి కాదు. ఈ వాసనలేవీ తాకని నవీన మానవాళికి ‘రెబెల్’ తొలి వ్యక్తి కావాలని ఆశిస్తాడు ఓషో ‘రెబెల్’.
అన్నట్టు, ఎన్ని వందల పుస్తకాలను ఔపోసన పట్టినా ఓషో ఎక్కడా చిక్కడు, దొరకడు, వదలడు. పైగా ‘నేనంటే నేనే’గా సశేషమనిపిస్తుంటాడు. ఏ రుషీ, ఏ తత్త్వవేత్తా చెప్పని విధంగా మనలోని భౌతిక, అధిభౌతిక జగత్తులను తడిమినవాడు ఓషో. మన ఉనికిలోని పదార్థాన్ని, చైతన్యాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేందుకు శతధా కలం, గళం పట్టినవాడు, విప్పిన వాడు ఓషో. అతడు చేసిందల్లా మన అస్తిత్వ కారకాలైన ఇరు పార్శ్వాలకు సమాన అవకాశమివ్వటమే. ఆ రెండింటిని నిర్వహించటంలోనే భవిష్య మానవుడైన ‘రెబెల్’ ఉనికి ఉందంటాడు.
అందుకే, ఎటువంటి మొహమాటం లేకుండా, మొహం చాటెయ్యకుండా ‘అత్యున్నతమైన భౌతిక ప్రపంచంతోపాటు చైతన్యం ఎదగనంతవరకు శరీరం భారంగా, ఆత్మ బలహీనంగా తయారవుతాయి’ (పుట.50) అని కుండబద్దలు కొడ్తాడు. అంతేకాదు, జీవన విలువలు లేని జీవితాన్ని సృష్టించిన పాశ్చాత్య మేధావి వర్గంపై రెబెలవుతాడు ఓషో.
ఓషో లెక్క ప్రకారం ‘పాత ఋషి ఏ మాత్రం సృజనాత్మకుడు కాదు’ (పు.45) కానీ తన రెబెల్ మాత్రం సృజనాత్మకుడే! పైగా ఓషో రెబెల్ ‘తాను మరణించిన తరువాత కాకుండా, జీవించి ఉన్నపుడే, ఇప్పుడే, ఇక్కడే, ఈ భూమిపై ప్రకాశవంతమైన చక్కని జీవితాన్ని సృష్టిస్తాడు’. ఈ లెక్కల మాటు నుండి ‘్ధర్యమున్నవారు బందిఖానా నుంచి బయటపడి దేవుడి మరణాన్ని ధృవీకరిస్తూ, నవీన మానవుని జననాన్ని ప్రకటించాలి’ అంటూ పిలుపునిస్తాడు నవీన మానవుడైన రెబెల్ ఓషో. ఈ ఓషో మాటల నడుమ నీషే తలపుకొస్తుంటాడు.
ఓషో ‘రెబెల్’ చేసే పని-
మనల్ని కాల్పనిక దేవుళ్ల మత్తులో పడెయ్యటం కాదు.. మనలోని భారాన్ని తొలగించి, ఒక స్పష్టతనిచ్చి, మన చైతన్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చటమే. ఓషో దృష్టిలో ‘పాత ఋషికి సిద్ధంగా ఉన్న సంప్రదాయ దేవుడు ఉన్నాడు. కొత్త రెబెల్ గొప్ప సృజనాత్మకుడు. మీరే దేవుణ్ణి మీలో సృష్టించుకోవాలి. మీరే ఒక దేవుడిగా ఉండాలి’ అనే సవాల్‌ని మన ముందుంచుతాడు.
ఓషో రెబెల్ ఎటువంటి అపరాధ భావనను అంగీకరించడు. పైగా నిజమైన ఋషి. జ్ఞానం ఒక ఉపోత్పత్తిలా దానంతటదే తనలో కలిగేలా సంపూర్ణ సామరస్యంతో, చాల చక్కగా, సందర్భోచితంగా జీవించటం తెలిసినవాడు. ఆ జ్ఞానోదయం ఏ దేవతా వరప్రసాదమో కాదు. అది స్వయంగా శ్రమించి సాధించుకున్నది. అది తనలో దాగి ఉన్న నిధే.
మొత్తానికి ఓషో ‘రెబెల్’ను చదివిన తర్వాత మనం ‘నేనంటే నేనే’ అని తనను తానే నిర్వచించుకునే రెబెల్‌ను ఇలా అక్షరీకరించుకుంటాం - చాల అమాయకుడిగాను, ప్రపంచాన్ని కాక గతాన్ని పరిత్యజించినవాడిగాను, నూతన ఉషోదయ వార్తాహరుడిగాను, తనకు తానే మార్గదర్శకుడిగాను, తన మార్గమే - తన తత్వమే - తన భవిష్యత్తే తనదిగాను.
ఇంతటి అవగాహన సాధ్యం కావాలంటే మూలంలోకి వెళ్లాలి. దాని మార్గం ధ్యానం. ఈ ధ్యానాన్ని గురించి ఓషో ఇలా అంటాడు - ‘్ధ్యనం దిశగా వెళ్లేందుకు హృదయ నిశ్శబ్దాలను మరింత గాఢతరం చేస్తూ, మనసు నుంచి మాటల నుంచి, భాష నుంచి దూరంగా వెళ్లాలి.’
ఇంతకీ వ్యవస్థీకృత మతాలను మరణాలని, చర్చిలు, దేవాలయాలు, మసీదులు గతానికి చెందిన స్మశానవాటికలని నుడివిన ఓషో నిజానికి రెబెలేగా?! ఈ రెబెల్ అంటున్న ఈ మాటల్ని వినండి - మనం ఏ రకంగా ఆచరణ పథం చేరాలన్నది అర్థం అవుతుంది.
‘మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం కేవలం సగం తిరుగుబాటు మాత్రమే. మిగిలిన సగం తిరుగుబాటు కూడా చేయాలి. అంటే సత్యం కోసం, స్వేచ్ఛ కోసం, ప్రేమ కోసం, నవీన మానవులతో కూడిన నూతన మానవాళి కోసం నూతన చైతన్యంతో కూడిన నూతన సమాజం కోసం రెబెల్ తిరుగుబాటు చేయాలి.
చివరగా ఒక మాట - ఓషోను తెనుగింటికి తెస్తున్న భరత్ రెబెల్ చదివితే కనువిప్పు కలుగుతుంది.. రెప్పలు విప్పారితే ఈ నవ జీవన ఆచరణ మార్గం కనిపిస్తుంది.
* * *
‘ఓషోని అర్థం చేసుకోవటం చాల సులభం’ - చాలా సందర్భాల్లో చాలా మంది నోట విన్న అభిప్రాయం ఇది.
‘అవునా! ఇంతకీ అర్థమయ్యేది ఓషోనా? ఓషో పుస్తకాలా?’ అన్ని సందర్భాల్లోను నేను ప్రశ్నించే తీరిది.
నా ప్రశ్నకు జవాబు రాదు.. సమాధానం పలకదు.. కొంత తడవు వౌనం రాజ్యమేలుతుంది. అభిప్రాయాన్ని వెదజల్లిన వారి ముఖాల్లో రంగులు మారుతుంటాయి. ఒక ప్రశ్నార్థకం తొంగిచూస్తుంటుంది.
అవును, నా ఉద్దేశంలో ఓషో పుస్తకాలు అర్థమవుతాయి అందరికీ... ఓషో అర్థమయ్యేది ఏ కొందరికో మాత్రమే.
‘పెద్దలకు మాత్రమే’ అన్నట్టుగా కొద్దిమందికి మాత్రమే ఓషో అందుతాడు. ‘నేనంటే నేనే’గా మిగులుతాడు. రెబెల్‌గా నవ జీవన మార్గదర్శి అవుతాడు.
మొత్తానికి చదవవలసిన, చదివించవలసిన అక్షర పొత్తం భరత్ తెలుగు ‘రెబెల్’.

-వాసిలి వసంతకుమార్