Others

కవిత్వంలో ప్రతిఫలించిన పలకరింతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాగిపొద్దు’
-ఉదారి నారాయణ
కవిత్వం
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
గతంలో రెండు కవితా సంపుటాలను వెలువరించి కవిగా నిలదొక్కుకున్న ఉదారి నారాయణ, ఇప్పుడు ‘మాగిపొద్దు’ అనే మూడవ సంకలనంతో మన ముందుకు వచ్చారు. వీరి కవిత్వాన్ని తెలంగాణ వాదం, స్ర్తివాదం, దళితవాదం, విద్య, ప్రకృతి తదితరాలుగా విభజించుకోవచ్చు.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ‘నడుస్తున్న చరిత్రకు/ కొత్త ముఖ చిత్రం గీయాల్సిందే’ అని నిర్ధారిస్తారు. తెలంగాణపై ‘ద్వేషాన్ని వ్యతిరేకతను మోసుకెళ్తూ ‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ ‘కబ్జాదారుల్ని నిర్లజ్జాపరుల్ని వీపున మోస్తూ/ నిట్టూర్పు సెగలు చిమ్ముతూ ఉంటుంది’ అని వర్ణిస్తారు. ‘నినాదం నిద్రపోదు/ లేపుతుంది? నిజాయితీని ఎగరేసుకుంటూ/ గర్జిస్తుంది/ మోసపు ముసుగుల్ని తన్ని/ పోగులు పెడుతుంది’ అని కానిస్టేబుల్ శ్రీనివాస గౌడ్‌ను జ్ఞాపకం చేసుకుంటాడు. ‘తెలంగాణ ధూంధాంలపై ‘మనమంతా అక్కడ/ మహా సమావేశమవ్వాలి’ అంటూనే ‘ఒక్క పిలుపునకు/ పగిలిన పుట్టలోంచి పాకిన/ చీమల దండులై/ నగరమంతా నిండిపోవాలి/ మాటలన్నీ పాటల దారులై/ వాళ్ల గుండెలో దడ పుట్టించాలని’ ఆఖరు పిలుపునిస్తారు. ‘తంగేడు పూవంటే మా నిశాని/ తెలంగాణ యుద్ధ వీరుని చుక్కల షేర్వాని’ అని సగర్వంగా ప్రకటిస్తూ ‘హక్కుల తాతను యాజ్జేసుకుంటే/ గుండెలు ఉద్యమ జ్వాలతో ఎగిసిపడతాయి’ అని వివరిస్తారు. ‘ఇప్పుడు/ నా జెండా నిండా/ ఆత్మగౌరవ నినాదాలే’ అందుకే ‘బావిలోంచి బయటపడ్డ పిట్టలా/ నేను గజగజమంటే/ పార్లమెంటే పశ్చాత్తాపం ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ‘1969 చరిత్రకు/ పట్ట్భాషేకం జరుగుతోంది/ 2014 చరిత్రకు స్వర్ణ్భాషేకం జరుగుతుంది’ అని హర్షం వెలిబుచ్చుతారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నుండి చేస్తున్న పెనుగులాట ఫలించి ఇప్పుడు కదా తెలంగాణ స్వప్నం సాకారమయింది. ‘అరవై ఏండ్లకు/ నా ఇంటిని చూశాను’ అంటాడు. తెలంగాణ అంటే సొంతిల్లు. ‘ఒకప్పుడు ఇదే ఇంట్లో/ ఎవడో పూసిన వేషంతో/ ఎవరో రుద్దిన ఎంగిలి పలుకుల్తో/ పెద్దల కుర్చీ కింద కార్పెట్‌నయ్యా’ననడం నిన్నటి సంగతి. ‘ఇప్పుడు ఒక్క నా ఇల్లే కాదూ/ లోకమంతా నా వాకిలే/ ఇక బాసర నుంచి భద్రాచలం దాకా/ హాయిగా రాతాడుతాను’ అని పరవశించడం బాగానే ఉంది. మరి తక్షణ కర్తవ్యం ఏమిటి? తెలంగాణ అమరవీరులను తలచుకుని ‘మీ త్యాగాలను మోసిన భుజాలపైనే/ కొత్త నిర్మాణపు రాళ్లు తరలిస్తాం’ అని వాగ్దానం చేస్తాడు.
‘పైట తగలెయ్యాలి’ అని పిలుపునిచ్చిన స్ర్తివాదులున్నారు. ఆ పైట అనబడే ‘కొంగు’ గ్రామీణ స్ర్తిలకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. చివరకు ‘కొంగు నడుముకు చుట్టవే చెల్లెలా’ అంటూ పోరుబాట పట్టించిందంటారు. పొద్దున లేచినప్పటి నుండి పడుకునేదాకా గృహిణి చేసే చాకిరికి వెలకట్టలేము. అలాగని ‘ఆమె శ్రమ సౌందర్యానికి/ కీర్తి కిరీటాలు తొడగనక్కరలేదు’ ఆమె మీద పెత్తనం కాకుండా, పనుల్లో సహాయకారిగా ఉంటే ఆమె సంతోషిస్తుంది. ఆమెను హింసించే శాడిస్టు భర్తలను ఉద్దేశించి ‘పొరలుగప్పిన అహంతో/ కాకులు సిగ్గుపడే అరుపులతో/ రాముడు విచిత్రపోయే/ అనుమానంతో నువ్వుంటే/ ఆమె నీ నీడను తాకడం/ మహా దోషమవుతుంది’ అని నిర్ధారిస్తారు. కవికి మహిళల పట్ల వున్న ఆత్మీయతను, సానుభూతిని ఈ కవితలు తెలియజేస్తాయి.
దేశంలో పెచ్చరిల్లిపోతున్న మతతత్త్వ ధోరణుల గురించి వివరిస్తూ, దళితులపై కొనసాగే హింసాత్మక సంఘటనలను నిరసిస్తూ రాసిన కవితలు కూడా ఇందులో వున్నాయి. ‘హస్తినాపురం నుండి మలబారు తీరం దాకా/ పంజా విసురుతూ పులి సంచరిస్తున్నది/ తాతలనాటి రుచికి/ ఊటలూరిన పులి/ దళిత నెత్తురు జుర్రడానికి/ కలియతిర్గుతున్నది’ అని హెచ్చరిస్తారు. ‘అర్ధరాత్రి చౌరస్తాలో/ ఆత్మగౌరవం కాళ్లూ చేతులు విరగ్గొట్టి/ క్షీరాభిషేకానికి పాలడబ్బాలు సప్లయ్ చేయడం/ దళిత గోవిందం పేరుతో/ లలిత భజనలు మారుమోగడం’ ఇవన్నీ ‘మహా నాటకం’లో భాగాలే అని తేల్చివేస్తారు. ‘రంగురంగుల ఎత్తులు/ కొత్తకొత్త వేషాలు/ యుగాల నుంచీ/ వెలివాడల్ని కాల్చేస్తునే వున్నాయి’ అని నిర్ధారిస్తారు. యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి నుద్దేశించి ‘ఈ మనుధర్మశాలలో/ నీ జ్ఞానజ్యోతి వెలుగులు చిమ్మడం/ నీ మేధస్సు తమస్సును తరిమెయ్యడం నేరమే మరి’ అని నిజాన్ని గుర్తిస్తారు.
మొత్తానికి ‘దళిత జన నిర్మూలనకు/ పటిష్టంగా ప్రణాళిక/ అమలవుతూనే ఉన్నది’ అని తెలియజేస్తారు.
గిరిజన విద్యార్థుల పునాది కార్యక్రమం ఉద్దేశాలు - ఆశయాలు గురించి వివరిస్తూ ‘నువ్వు మారాలంటున్నారు/ నువ్వు మాలో కలసిపోవాలంటున్నారు’ అని చెబుతూ ‘నీ అక్షరాలు ఈ దేశపు పునాది కావాలి’ అని ఆశాభావం వెలిబుచ్చుతారు. పదవ తరగతి పరీక్షలో అగ్రశ్రేణిలో పాసయిన బీద విద్యార్థుల నుద్దేశించి ‘రేపటి తొలిపొద్దుకు ప్రతిభా కిరణాలివి’ అంటూ ‘వీళ్లే ఈ సమాజాన్ని బతికిచ్చే కలల వారసులు’గా పేర్కొంటారు. ‘మంచిగుండు నానీ/ పోయస్త/ అన్న మాటల్ని తడిపేస్తూ రాలిన/ రెండు కన్నీటి వీడ్కోలు/ కాళ్ల ముందరి నేలని/ దుఃఖ భూమిని చేశాయి/ గుండెను ఎవరో పీక్కుపోయిన బాధ/ మనసులో ఏదో ఖాళీ అయిన దిగులు’ అంటూ కార్పొరేట్ చదువుల కోసం పిల్లల్ని దూర ప్రాంతాలకు పంపక తప్పని పరిస్థితులలో ఆ ఎడబాటును, పిల్లల పరిస్థితిని హృద్యంగా చిత్రీకరించిన తీరు మనసును ఆర్ద్రంగా చేస్తుంది.
‘ఆత్మహత్యలే/ అసెంబ్లీకి దారులైనపుడు/ పోరాటాలే పార్లమెంటుకు/ పట్టు తివాచీలైనపుడు/ నీ చావు ఎవరిగ్గావాలి’ అంటూ రైతు ఆత్మహత్యలను ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎలా ఏర్పడిందో వివరిస్తారు. ఇవేకాకుండా సంచార జీవుల గురించి, కుల్ఫీ బండి, ఎండ, వాకర్ గురించి కూడా మంచి కవితలను రాయగలిగారు. ఇలాంటి అరుదైన అంశాలను కవిత్వీకరించడంలోనే కవి ప్రత్యేకత దాగి ఉన్నది. కవి సమకాలీనంగా ఉన్న అన్ని వాదాలతో మమేకమై, ఆ వాదాల కనుగుణమైన కవిత్వాన్ని రాశారు. తనకు నచ్చిన లేదా తాము స్పందించిన ఇతరేతర అంశాలు, సంఘటనలకు కూడా స్పందించి కవిత్వాన్ని రాయగలిగారు. వైవిధ్యమైన అంశాలతో, విస్తృతమైన అవగాహనతో కవిత్వం రాసిన ఈ కవిని ఏదో ఒక ముద్ర కిందికి తీసుకురావాల్సిన పని లేదు. అన్ని వాదాలు ఆయనవే. అన్ని ధోరణులు ఆయనవే. కవి పలకరింతలు, పారవశ్యం ఎంతమేరకు కవిత్వంలో ప్రతిఫలించిందో తెలుసుకోవాలంటే ఈ కవిత్వం చదవాల్సిందే.

-కె.పి.అశోక్‌కుమార్