Others

మానవ కల్యాణమే మహాస్వామి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహస్ర చంద్రదర్శనం’ అంటే ఈ కాలంలో పూర్ణాయువే. పూర్ణాయువులో చివరిక్షణం వరకు ప్రయోజనాత్మకంగా జీవించి బ్రతుకుని సార్థకం చేసుకోవటం కొద్దిమంది ధన్యులకి మాత్రమే వీలవుతుంది. అటువంటి ధన్యులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి కైవల్యం పొందితే జయేంద్ర సరస్వతి 69వ శంకరాచార్యగా కంచిమఠ పీఠాధిపత్యం స్వీకరించారు. అప్పటి నుండి పీఠాభివృద్ధి, సనాతన ధర్మ పరిరక్షణ, పోషణ వారి ఊపిరిగా మారాయి.
ఏ పీఠాధిపతుల జీవితంలోనూ జరగనటువంటి కొన్ని విచిత్ర సన్నివేశాలు జయేంద్ర సరస్వతిస్వామి వారి జీవితంలో జరిగాయి. అందరు మనుషుల జీవితాలు ఒకటిగా ఉండవు. సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులందరి జీవితాలు కూడా ఒకే రకంగా ఉండవు. అందరి లక్ష్యం ఒకటే అయినా గమనంలో స్వల్పమైన భేదాలు ఉంటాయి. కారణం దైవానికే తెలియాలి. ‘నడిచే దైవం’గా పరిగణించబడే పెద్దస్వామి చంద్రశేఖర సరస్వతీ మహాస్వామి ఉప ఉత్తరాధికారిగా విజయేంద్ర సరస్వతీ స్వామిని నియమించటం వాటిలో మొదటిది. ఇటువంటిది పీఠ చరిత్రలో ఇంతకు ముందెప్పుడు జరిగినట్లు లేదు.
రెండవది మహాస్వామివారు ఉండగానే జయేంద్ర సరస్వతీ స్వామి 1987 ఆగస్టు 24వ తేదీన ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. 3 రోజుల తరువాత ఆయన తలకావేరిలో ఉన్నట్టు తెలిసింది. పిలిచినా రాలేదు. కొంతకాలం ఏకాంతంగా సాధన చేసిన తరువాత పీఠానికి తిరిగి వచ్చారు. తను చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలకు కావలసిన శక్తిని కూడగట్టుకోవటానికి ఏకాంతసాధన అవసరం అయి ఉండవచ్చు. కనుకనే సర్వజ్ఞులైన మహాస్వామి కూడా వారిని ఏమీ అనలేదు. అటుపై వారి కార్యనిర్వహణ తీరు మారింది.
దేహధారి అయిన తరువాత శారీరకమైన ఇబ్బందులు కలగటం ఎంత సహజమో, కలియుగంలో ధర్మాన్ని గట్టిగా పట్టుకుని అనుష్ఠించి, ప్రబోధించే వారికి సమస్యలు, నీలాపనిందలు అంతే సహజం. అయినా చెక్కుచెదరక పోవటమే స్థితప్రజ్ఞుల లక్షణం. జయేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కూడా అటువంటి ఘట్టం 2002లో జరిగింది. అది కూడా తెలుగు రాష్ట్రంలో జరగటం తెలుగు వారికి బాధాకరమైన విషయం. అయితే, అన్నింటినీ సమానంగా భావించే మహానుభావులకి అటువంటివి పట్టవు. పీఠాధిపత్యమైనా ఒకటే, చెరసాల అయినా వారికి ఒకటే. ఏదైనా పరమాత్ముడి ప్రసాదంగానే భావిస్తారు. జయేంద్ర దానినే నిరూపించారు. ఆయన పనె్నత్తి ఒక పరుషవాక్యం కూడా పలకకుండానే- జరగవలసినది జరిగింది, నిర్మలుడై విడుదల కావటం జరిగింది. ఇది సాధనలో గొప్ప పరీక్ష.
కంచి కామకోటి పీఠానికి తెలుగు నేలతో సన్నిహిత సంబంధం ఉంది. తిరుమల క్షేత్రదర్శనం వారికి అత్యంత ప్రీతిపాత్రం. ధర్మప్రచారంలో భాగంగా ఉత్తర భారతంలో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల వారు సన్మానించిన తీరు అసదృశం. టిబెట్, నేపాల్ వంటి దేశాల వారు ఘనంగా సన్మానించారు. ఢాకాలో అమ్మవారి ఆలయాన్ని దర్శించినప్పుడు స్వామి వారి గౌరవార్థం ఆలయ ద్వారానికి ‘శంకర గేట్’ అని నామకరణం చేశారు. శ్రీజయేంద్ర సరస్వతీ స్వామి- ‘దైవాన్ని కనపడే జీవుల్లో చూడమ’ని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. దాని కోసం అందరూ చేయదగిన సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు అన్నం తినబోయే ముందు నాలుగు మెతుకులను సహచర ప్రాణుల కోసం అర్పించమన్నారు. మనుషులే కాదు పశు పక్ష్యాదులు కూడా జీవులే కదా! వాటిలో ఉన్నది కూడా దైవమే కదా! జనజాగరణ, జనకల్యాణ కార్యక్రమాలు చేపట్టారు.
విశ్వకల్యాణం కాంక్షించి కుల మత వర్గ వర్ణ విచక్షణ చూపకుండా సర్వమానవాళి పట్ల వాత్సల్యాన్ని వర్షించారు. ఒక ప్రక్క తమ ప్రవచనాలు, స్ఫూర్తిదాయకమైన సందేశాల ద్వారా జనులలో చైతన్యాన్ని కలిగిస్తూ, సమాజ సంస్కరణకి, అరాచక వ్యవస్థ నిర్మూలనకి అవిశ్రాంత కృషి చేస్తూ తమ తపస్సుని ధార పోశారు. చంద్రశేఖరేంద్ర మహాస్వామి ప్రారంభించిన కార్యక్రమాలని పటిష్ఠం చేసి క్రొత్త వాటిని కూడా చేపట్టారు. జీర్ణాలయాల ఉద్ధరణతోపాటు, వేద స్మార్త ఆగమ పాఠశాలలు, ఆధునిక విద్యాలయాలు, వైద్యాలయాలు, వైద్య శిబిరాలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు నిర్వహించారు. శంకర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, శంకర నేత్రాలయాలే కాక హిందూ మిషన్ ఆస్పత్రి నిర్వహణ కూడా చేపట్టారు. అన్నిటిని మించి 30 సంవత్సరాల క్రితం ‘జయజయ శంకర హరహర శంకర’ అనే దివ్యమంత్రాన్ని మానవాళికి ఇచ్చారు. ఇప్పటికీ అది నిరంతరం మారుమ్రోగుతూనే ఉంది. ప్రేమతో జయించమని సందేశం ఇచ్చారు. విజయవాడ పర్యటనలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. కోలుకున్నాక మఠానికి పరిమితమయ్యారు. ఈ సంవత్సరం జనవరి నుండి ఆరోగ్యం క్షీణించసాగింది. ఈనెల 27న శ్వాస సంబంధమైన ఇబ్బందితో ఆస్పత్రిలో చేర్చారు. మరుసటి రోజునే మహాసమాధి పొందారు. భౌతిక కాయం లేకపోయినా జయేంద్ర మహాస్వామి వారు చేపట్టిన కార్యక్రమాలు అవిశ్రాంతంగా కొనసాగుతాయి. దానికి వారు ధారపోసిన తపశ్శక్తే ఆధారం.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భాగవత్పాద శంకరం లోక శంకరం!

- ఆచార్య అనంతలక్ష్మి