Others

ఆధునిక స్మృతికావ్యం ‘చందనశాఖి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందనశాఖి (స్మృతికావ్యం)
-ప్రొ.ముదిగొండ శివప్రసాద్
వెల: రూ.100
ప్రాప్తిస్థానం: రచయిత
2-2-647/132 బి
సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ
హైదరాబాద్- 500 013
040-27425668
*
మహాకవి భవభూతి ‘ఏకోరతః కరుణ ఏవ’ అని నేటికి రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ప్రతిపాదించాడు. మానిషాద శ్లోకంతో ఆదికావ్యం ప్రారంభమయిన సంగతి అందరికీ తెలిసిందే. దీని అంతరార్థమేమిటంటే పాంచభౌతికమైన ప్రపంచంలో చివరకు మిగిలేది ‘కరుణ రసమే’.
ప్రొ.ముదిగొండ శివప్రసాద్‌గారి సతీమణి శ్రీమతి డా.ఎం.ఉమాదేవి ఇటీవల ఆకస్మితంగా అస్తమించడం శివప్రసాద్ గారిని క్రుంగదీసింది. తత్ఫలితంగా వారి హృదయంలో ఉప్పొంగిన భావావేశమే ఒక ‘సతీస్మృతి కావ్యం’గా ఆవిష్కరింపబడింది. దీని పేరు ‘చందనశాఖి’.
చందన వృక్షం అరిగినా, కరిగినా సుగంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. త్యాగమూర్తుల జీవితం కూడా అంతే. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్ర్తి ఉంటుంది అని ఒక నానుడి. చారిత్రక నవలా చక్రవర్తి నూటొక్క గ్రంథాలు రచించారంటే అందుకు ఆయనకు ప్రేరణగా, ఆదర్శ గృహిణిగా శ్రీమతి ఉమాదేవి యిచ్చిన సహకారం మనం ఊహించుకొనవచ్చును. కార్యేషు దాసి - కరణేషు మంత్రి అన్నట్లు కర్త - కర్మ - క్రియ అన్నీ తానుగా మారి ఆయన జీవితాన్ని పునీతం చేయడం వల్ల భావనర్భరతతో శివప్రసాద్ ఆలపించిన ‘కవితా నీరాజనమే’ ఈ ‘చందనశాఖి’.
ఇందులో దాదాపు నూట ఏబది కవితలున్నాయి. ఇందులో కొన్ని వృత్తములు, మరి కొన్ని స్వచ్చందములు. ఇవి రుూ ఛందస్సులోనే వ్రాయవలననే నియమం ఏమీ లేదు. భావతీవ్రతతో యే విధముగా ఆవిష్కరింపబడితే అలా కవితలు అవతరించాయి.
స్పాంటేనియస్ ఓవర్‌ఫ్లో ఆఫ్ పొయిట్రీ అనే ఆంగ్ల నిర్వచనం ఇక్కడ వర్తిస్తుంది. నిజానికి కవిత్వం వచనంలాగా వ్రాసేది కాదు. భావావేశంలో హృదయాంతర గోళాల నుండి ఆవిర్భవించేదే గదా?!
‘తనువు చందన శాఖి/ మనసు నందనవాటి/ కలము పనిషద్ గంగ/ గళము హిమనగ శృంగ’
ఇందులో శ్రీమతి ఉమాదేవి యొక్క భౌతికమైన, మానసికమైన, సాత్వికమైన, లక్షణాలను కవి వర్ణించడం జరిగింది.
పుట్టినవారు గిట్టక మానరు. పోయిన వారు మళ్లీ రారు అనేది ఒక శాశ్విత సత్యం. జాతస్య మరణం ధృవం అనే ఆర్యోక్తి అందరికీ తెలిసిందే గదా. మరి దీనికి పరిష్కారం ఏమిటి?
‘పోనీ ఓ పని చేద్దాం/ ఆమె పొరుగూరు వెళ్లిందని భ్రమిద్దాం
గుమ్మం దగ్గరే యెదురుచూస్తూ కూర్చుందాం/ ఓ జీవిత కాలం.
ఈ కవితలో కవి తనను తాను భ్రాంతికి గురిచేసుకుంటూ వాస్తవంలోని విషాదాన్ని మరిచిపోవడానికి ప్రయత్నించడం ఒక కవితాంశం.
ఆమె డిసెంబర్ 18 పుష్య శుద్ధ పాడ్యమి నాడు కైలాస యాత్ర చేసింది.
అందుకు కవి ఒక తేటగీతిలో ఇలా వ్రాశారు.
‘పౌష్యలక్ష్మిని పాడ్యమీ పుణ్యతిథిని
ఎడద ముంగిట ముగ్గుల నిడిన పిదప
ఎచటికేగితివమ్మ? నన్నిట్లు చేసి
బ్రతుకు బండిని లాగుట భారమింక’ (పద్యం 2 పుట.3)
కాంతి వర్షం (లైట్ ఇయర్) భూమికి చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మనం అందుకు వ్యతిరిక్తమైన వేగంతో ప్రయాణం చేయగలిగితే గతాన్ని చూడవచ్చునని ఆధునిక శాస్తవ్రేత్తలు ఐన్‌స్టీన్ వంటి వారు ప్రతిపాదించారు.
కాంతి వేగాన్ని దాటి ప్రయాణించే స్పేస్‌షిప్ వుంటే మళ్లీ నేటి నుంచి నిన్నటికి ప్రయాణం చేసి తన గృహిణిని చూడవచ్చు గదా అని కవి మరొక ఖండికలో అభిప్రాయపడ్డారు.
సీ॥ దైవపూజలు చేయ తాతయ్య పోయెను
అర్చన చేయగా అమ్మ పోయె
దానంబు జేయగా తమ్ముడు పోయెను
ధర్మంబు జేయగా తండ్రి చచ్చె
పారాయణము చేయ భార్యయు పోయెను
మహిత దీక్ష వహింప మామ పోయె
గుడిసేవ చేయగ గురుడును పోయెను
నైవేద్యమిచ్చి అనాధనైతి
తే॥ తిండి దొంగలు దేవతల్ తెలిసెనిపుడు
మృత్యువిజయ మసాధ్యంబు మర్త్యులకును
దుష్టులును నాస్తికులు నిహిలిష్టు నిలను
సుఖముగా బ్రతుకుచుండిరి చోద్యమేమి? (పద్యం 3 పు.4)
ఇందులో నిందాస్తుతి కనపడుతుంది. పుణ్యకార్యములు ఆచరించేవారు యిడుములపాలు కావడం ఏమిటి? దుర్మార్గులకు భౌతిక సుఖానుభవాలు యెలా లభిస్తున్నాయి? అని కవి సూటిగా భగవంతుని ప్రశ్నిస్తున్నాడు.
శ్రీమతి ఉమాదేవి దేవీ ఉపాసనామూర్తి. ఆమె కలం నుండి వేదోపనిషత్తుల సారం స్రవించింది.
నిష్ఠాగరిష్టులైన శివభక్తి పారాయణుల యింట జన్మించిన అనర్ఘరత్నం. బహు భాషలలో నేర్పరి.
సంస్కృత భాషపై పట్టు బిగించింది. ఉభయ భాషా ప్రవీణురాలైంది.
పాల్కురికి సోమనాథుని సంస్కృతి సాహిత్యుని నిశితంగా పరిశీలన చేసింది.
అమ్మ నామాలకు (లలితాదేవి) భాష్యం చెప్పింది. అసంఖ్యాక వ్యాసాలను పత్రికల వారికి అందించింది.
సదా భూనభోంతరాళాలలో ప్రతిధ్వనించే ‘శివసహస్ర నామాలకు’ భాష్యం రచించింది. భర్త రుణం తీర్చుకుంది.
వేద వ్యాస మహర్షి మహాభారతంలోని ఉపాఖ్యానాలను సంకలనం చేస్తూండగా కలం ఆగింది.
పైన చెప్పిన అన్నిటిని శివప్రసాద్‌గారు తన స్మృతి కావ్యంలో గీతాలుగా నినదించారు.
ఈశ్వరుడు సృష్టికి కర్త అయినపుడు ఈశ్వర లక్షణాలు సృష్టిలో ఎందుకు లేకుండా పోయినాయి. పుట్టినవాడు గిట్టుట సహజం అని ప్రతివాడు గతానుగతికంగా సంతృప్తి చెంది ఊరుకుంటున్నాడు. అలాంటి భౌమిక సృష్టి ఎందుకుండాలి? దీనికి సమాధానం ఎవరు చెబుతారు. ఐన్‌స్టీన్‌గారా? ఆదిశంకరాచార్యుల వారా?

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము 9491878082