Others

ఆకట్టుకొనే అమెరికా తెలుగు కథానికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా తెలుగు కథానికలు-13
సంపాదకులు: వంగూరి చిట్టెన్‌రాజు
శాయి రాచకొండ,
ఎస్.నారాయణస్వామి
వెల: రూ.200.. పేజీలు: 386
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
బడీచౌడీ, హైదరాబాద్.
*
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా -పేరుతో భాసిల్లుతున్న అమెరికా తెలుగు సాహిత్య వేదిక వారు తమ సంస్థ అరవై ఎనిమిదో ప్రచురణగా ‘అమెరికా తెలుగు కథానిక-13’ను వెలువరించారు.
శ్రీయుతులు వంగూరి చిట్టెన్‌రాజు, శాయి రాచకొండ, ఎస్.నారాయణ స్వామి సంయుక్త సంపాదకత్వంలో ప్రకటింపబడిన ఈ కథాసంకలనంలో ముప్పది ఏడు కథలు కొలువుదీరాయి! ఈ కథలు చాలావరకు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి పలువురి మన్ననలు అందుకున్నాయి. మరికొన్ని కథలు ఉగాది కథల పోటీల్లో విజేతలుగా నిలిచాయి. ఇందలి కథల్లో జీవం ఉంది.. జీవితం ఉంది.. జీవితానుభవాలను రంగరించి రాసిన కథలున్న ఈ గ్రంథంలోని రచయితలు చాలా మంది కొత్తవారైనప్పటికీ.. అందరినీ ఆకట్టుకొనేలా తమ రచనా ప్రతిభను ప్రదర్శించుకోవడం ప్రశంసనీయం.
కథా వస్తువుల ఎంపికలో వైవిధ్యం ఉంది.. కొన్ని కథల్లో కథాగమనంలో కొత్తదనం కొంతమేరకే ఉన్నా.. ఏకబిగిన చదివించే కొన్ని కథలూ ఈ గ్రంథంలో చోటు చేసుకున్నాయి. కొన్ని కథల్లోని ఆయా పాత్రల చిత్రణలో ఇంకా శ్రద్ధ చూపితే బాగుండేదని అనిపించినప్పటికీ.. పాఠకులు ఆసక్తిగా చదివేలా భాషకు చోటు కల్పించడం విశేషం! అస్తమానం ఆంగ్ల భాషతో దోస్తీ కడుతూ.. దినచర్యను కొనసాగించే ప్రవాసాంధ్రులు తెలుగులో చక్కని పటిమను ప్రదర్శించారు.. సందర్భోచితంగా సన్నివేశాల చిత్రణలో పాత్రల మధ్య సంభాషణలు జొప్పించారు. చాలా కథలు అన్ని హంగులతో ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి! వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు.. తెలుగు సాహిత్యం పట్ల.. తెలుగు భాష పట్ల చూపుతున్న మక్కువకు అద్దం పట్టేలా ఉన్న ఈ గ్రంథం.. పాఠకులను కథల ప్రపంచంలోకి లాక్కొని వెళ్లి.. చక్కని అనుభూతులను పంచుతాయి. ఇందలి కథకులు చాలామంది వర్థమానులు, ప్రవర్థమానులు ఉండటం వల్ల ఓ విధంగా సమతూకం పాటించినట్లయింది.
ఇందులోని చాలా కథలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అమెరికాలోని తొలి తరం తెలుగు రచయితలు ఎవరూ స్వతహాగా సాహిత్యకారులు కాకపోయినప్పటికీ.. పుట్టిన గడ్డను గుర్తుచేసుకునే క్రమంలో.. దేశం కాని దేశంలో.. తమ అనుభవాలను తమకు తోచిన రీతిలో కథకులు ఈ గ్రంథంలోని కథలను తీర్చిదిద్దారు. కొన్ని కథల్లో వైజ్ఞానికపరమైన అంశాలను.. మరికొన్ని కథల్లో తాత్వికత, ఆధ్యాత్మికత సమ్మిళితమైన ఘట్టాలను చూస్తాం.. ఇందలి చాలా కథల్లో అమెరికా జీవన చిత్రణ ఉంది.. భారతీయతను ప్రతిబింబించే కథలూ ఇందులో ఉన్నాయి! ‘నాన్న’ కథలో.. రావుగారి పాత్ర ఉన్నతంగా చిత్రించబడింది.. అనారోగ్యంతో బాధపడే తండ్రిని చూసి.. ‘శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ’ అని సీత అన్నమాచార్య కృతిని పాడటం బాగుంది. కథకురాలు ఉమా పోచంపల్లి భారతీయతను, ఆధ్యాత్మికతను అలవోకగా తమ కథలో ప్రస్తావించారు. కుటుంబ బాంధవ్యాలను ఆర్ద్రంగా ఆవిష్కరించారు.. ‘మనిషి - దేవుడు’ శీర్షికతో డొక్కా ఫణి రాసిన కథ తాత్వికంగా మలచబడింది. కథ ముగింపులో కథకులు ప్రయోగించిన పద బంధాలు అందంగా కొలువుతీరాయి!
శ్రీదేవి జోశ్యుల రాసిన ‘తానొకటి తలిస్తే’ కథలో సంభాషణలకు పెద్దపీట వే పాఠకులను మెప్పించ యత్నించడం ప్రశంసనీయం! పాత్రల చిత్రణ.. కథాగమనం బాగుంది.
కొల్లూరు లావణ్య రాసిన ‘ప్రేమ చిత్రం’ కథలో ప్రతి తెల్లకాగితం ఓ చిత్రకారునికి వరం అని తేల్చి చెప్పారు. స్పందించే హృదయం ఉండాలేగానీ.. ప్రేమమయమైన చిత్రం.. ఆనందసాగరం ఓలలాడిస్తుందనీ.. చిత్రమైన ప్రేమను పంచగలదని ఈ కథలో చక్కగా ప్రస్తావించారు.
తనకి రాబోయే జీవిత భాగస్వామి, సహచరుడిగా తనని తానుగా ఇష్టపడాలనీ.. తన వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ప్రేమించాలి.. అంతేగానీ తన అవిటితనాన్ని చూసి జాలిపడేవారు తనకొద్దని భావించే ‘సుధీర’ పాత్రను ‘ఆత్మబలం’ కథలో రాధిక నోరి చక్కగా తీర్చిదిద్దారు. కోసూరి ఉమాభారతి రాసిన ‘పుత్తడి వెలుగులు’ కథలో.. రామ్‌కుమార్ విశిష్ట వ్యక్తిత్వాన్ని చూస్తాము. సమాజంలోని విభిన్న సంస్కృతులు, వారసత్వాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా రామ్‌కుమార్‌ను కథకురాలు మన ముందు నిలిపిన తీరు బాగుంది.
‘అపార్ట్‌మెంట్ నెంబర్’ కథలో.. రచయిత కృష్ణచైతన్య అల్లం అక్కడక్కడ తెలంగాణ భాషను ప్రయోగించడం బాగుంది. ఈ కథలోని మాధురి పాత్రని చూస్తే జాలేస్తుంది. ప్రసాద్ కొమ్మరాజు తాను రాసిన ‘ప్రయాణంలో పదనిసలు’ కథలో వెంకట్రావు పాత్ర ద్వారా పండించిన హాస్యం కథకు బలాన్ని చేకూర్చింది. వెంకట్రావును చాటర్ బాక్స్ అని వెక్కిరించినవారే చివరకు.. ఆయన ద్వారానే పరువు కాపాడుకోవడం ఈ కథకు కొసమెరుపుగా కథకులు తీర్చిదిద్దారు. మమత కొడిదెల రాసిన ‘రాళ్లు మాట్లాడగలిగితే..’ కథ వైవిధ్యంగా మలచబడింది. ‘అంతరంగాల అంతరం’ పేరుతో డా.నీరజ అమరవాది రాసిన కథలో అల్జీమర్స్‌తో కోల్పోయే జ్ఞాపకశక్తిని ఒక్కోసారి వైద్యం, వైద్యులు చేయలేనిది మనసుకు దగ్గరైన వారి సాంగత్యం వల్ల సాధ్యమవుతుందన్న సందేశం నర్మగర్భంగా ఆవిష్కరించారు. శ్యామలాదేవి దశిక ‘రిటైర్మెంట్’ కథలో వృద్ధాప్యంలో అనుసరించాల్సిన అంశాలను ఆవిష్కరించారు. ఆధునిక కాలంలో నడుస్తున్న చరిత్రను ప్రస్తావిస్తూ.. ప్రజ్ఞ వడ్లమాని ‘హైటెక్ అత్తగారు’ కథ రాశారు.
ఇలా ఎన్నో కథలు ఈ గ్రంథంలో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి.. అమెరికాలో వుంటూనే తెలుగు భాషను తెలుగువారిని ప్రోత్సహిస్తున్న వంగూరి ఫౌండేషన్ వారిని అభినందిద్దాం.. మున్ముందు మరిన్ని మంచి రచనలు సంస్థ ద్వారా వెలువరిస్తారని విశ్వసిద్దాం.. ఈసారే కొత్తగా కథలు రాసిన వారు తమ కలాలకు పదును పెట్టుకొని.. కథలు రాయడంలో ఇంకా మెలకువలు తెలుసుకుని రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలని కోరుకుందాం.

-దాస్యం సేనాధిపతి