Others

స్పష్టమైన వస్తు స్పృహ.. కథనంలో నవ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పిలి పద్మ కథలు
ప్రతులకు: అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో
*
సాహిత్యంలో తమదైన స్థానాన్ని కల్పించుకుంటున్న ఈనాటి రచయిత్రుల్లో - కుప్పిలి పద్మది ఒక ప్రత్యేక స్థానం. ఆమె కథానికల్లో కవిత్వాన్ని, సంగీతాన్నీ కూడా వింటాం. ఆ కథనశైలికి తలపంకించి ‘ఎంత బాగుంది’ అనుకుంటాం. కథలో వస్తువుకు ఎంత ఆవశ్యకమో అంతవరకే - లలితంగా, సున్నితంగా ఇతివృత్త రేఖనీ, పరిధినీ గీసుకోగలగటం ఆమె విలక్షణత. ఈ గుణ విశేషం వలన ఆ కథలకి చదివించే గుణం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆమె కథాసంపుటిలోని కథలన్నీ దీనికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
‘చింతచెట్టు నీడలో వెచ్చని పరిమళపు పాట’ కథ - ఈనాడు తరచుగా మనం కథల్లో చదువుతూ, సినిమాల్లో చూస్తున్న వస్తువు. బీదాబిక్కీ ఆక్రమించుకొని ఉంటున్న స్థలం మీద పెద్దల చూపూ, దళారుల దందా, ఈ మధ్యలో పుట్టుకొచ్చిన అపార్ట్‌మెంట్ వాసుల మధ్యతరగతి ఈసడింపూ! అయితే - పద్మ ఈ ఇతివృత్తాన్ని రేల పాటతో అనుసంధానించి, సామాన్య సాధారణ సామాజిక సమస్యకి - కళాత్మక రూపాన్ని సమకూర్చారు. ఇదీ వైయక్తిక ప్రతిభ! అలాగే, ‘గాల్లో తేలినట్లుందే..’ అనే కథ. వచ్చీరాని వయస్సులో, పీర్ గ్రూప్ ప్రభావంతో, చాపల్యంతో, అవివేకపు లౌల్యం వలన డ్రగ్స్ పట్ల, తాగుడు పట్ల, స్మోకింగ్ పట్ల ఆకర్షితురాలైన కూతుర్ని సరిదారిలో పెట్టటానికి తల్లి కూతుర్ని తీసుకుని గ్రామానికి వెళుతుంది. అక్కడ తన గురువుగారికి ఈ సమస్యిని చెప్పి సలహా అడుగుతుంది, దుఃఖిస్తూ. ఆయన అంటాడు. ‘ఈ జనరేషన్ చాలా అందమైనది, తెలివైనది. ఎనె్నన్నో విషయాల్ని సునాయాసంగా కనిపెడుతుంది.. అన్ని జనరేషన్స్‌లో రూల్స్‌ని బ్రేక్ చేయటం ఉంది.. సుస్మికి ఈ ప్రపంచంలో మట్టి, వెనె్నల, చలిమంటలు, పువ్వులు, పాటలు, మనుషులు వుంటారని ఇప్పుడిప్పుడేగాక పరిచయం చేస్తున్నావ్. చూద్దాం. నీ ఈ ప్రయత్నం కూడా నీ మనసుకి వో వెలుగునిస్తుందేమో అని! పరిణత మనస్కుడైన పాత్ర ద్వారా - రచయిత్రి చెప్పిన దానికన్నా చెప్పనిదాన్ని ఎక్కువగా అర్థ స్ఫూర్తితో వదిలి, కథని గొప్ప కథని చేశారు.
‘మదర్‌హుడ్ ఎట్ రియల్టీ చెక్’ అనేది సరొగేట్ మదర్స్ గురించిన కథ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన వైనం చాలా పారదర్శకంగా కథలకెక్కింది. అందులో మళ్లీ కొత్త ఆర్థిక సంబంధాలూ, కొత్త ‘ఎవెన్యూస్’ని కనుక్కోవటం చూస్తుంటే దారుణమనిపిస్తుంది. ‘ఇదింకా అన్‌టచ్డ్ యేరియా.. ఇండియా సరొగసీ హబ్ కాబోతోంది. చాలా దేశాలు దీన్ని బేస్ చేశాయి. ఏపీ ఎలానూ మెడికల్ హబ్ కదా. చాలా స్కోప్ ఉంది. ఫండ్స్ కూడా వస్తాయి...’ అంటూ కొత్త ఎన్జీవోని ప్రారంభించటానికి ఉత్సాహంగా ఉద్యుక్తురాలౌతోంది - ఇందులో నిశాంతి! అటు సత్యవతేమో మరోసారి బిడ్డని మోయటానికి కొత్త ఆస్పత్రిని వెతుక్కోవాలనుకుంటోంది - బంగారంతో మిలమిలా మెరవబోయే మెడని తడుముకుంటూ! మనుషుల స్వభావ వైరుధ్యాలే కాకుండా సామాజిక సమస్యల విభిన్న పార్శ్వాల్నీ విశే్లషిస్తూ - ప్రక్రియా పరిధిలో ఈ మంచి కథానికల్ని రాశారు రచయిత్రి.
స్ర్తి పురుష సంబంధాల్లో - అందునా ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాల్లో - మనుషుల చిత్తవృత్తిలోని వొంపువాటాలూ, ప్రవర్తనలోని ఎత్తుపల్లాలూ - ఏ తర్కానికీ లొంగవు. అందుకని సంభవాల కార్యకారణ విచికిత్సకి అవకాశం లేదు. ‘ది లాస్ ఆఫ్ యిన్నోసెన్స్’ కథలో - దర్శన విహాన్ మధ్యన పెనవేసుకున్న ప్రేమ భావనలకీ, దర్శన భావుకతకీ, వాంఛితాలకీ వాస్తవంలో ఆమెకు ఎదురయ్యే ‘మగ’ ప్రవర్తనకీ అఖాతమంత దూరం. అతనికి వేరే హనీ వుంది. ప్రొఫెషనల్ ప్రాధాన్యతలున్నై. చెప్పీ చెప్పకుండా - నీ అవసరం నాకు నీ శరీరం వరకే అని సూచించగల నైజం అతనిది. వీటిని ఆమె అవగాహన చేసుకొనేసరికీ, తన అస్తిత్వం గురించి చాలా జవాబులేని ప్రశ్నలు ఎదురౌతాయి. చివరికి ‘ప్రొఫెషనల్ కంపల్షన్స్’ ఆమెని కూడా ‘కేట్ రేస్‌లో అందరమూ భాగస్థులమే’ అని సమాధానపరచుకునేటట్లు చేశాయి! ‘యెడారి చూపులు’లో చాలా ఏళ్లకి తిరిగి కలుసుకున్న పాత ప్రేమికులు - సుపర్ణా అరవింద్‌లూ, ‘క్యూట్‌గర్ల్’లోని మైత్రీ - శ్యామ్‌లూ కూడా ‘యూస్‌లెస్ పాషన్స్’కి చిక్కి, ప్రేమ రాహిత్యం వలన శూన్యంలోకి కూరుకుపోయి, ఆపై తెలిసిన మనుగడకి లొంగి సర్దుకు పోయినవారే!
‘మమత’ ఒక్కటీ ఒక ప్రత్యేకమైన గొప్ప కథ. ఇల్లాల్ని పూర్తిగా వంటమనిషిగా మార్చి, అది తప్పు కాదని వాదించి, అంతకంటే నీకింకేమీ అక్కర్లేదని నిర్దేశించిన ‘మగ’ దౌష్ట్యం మీద, అహంకారం మీద, అణచివేత మీద, ఆధిపత్యం మీద, మమత - నిరసన, తిరస్కారం ఇతివృత్తంగా సాగిన కథ. చివరికి తాను గర్భవతినని తెలిసినా, తండ్రీ, అన్నా సర్దుకుపొమ్మని సలహాలిచ్చినా, వీల్లేదని అబార్షన్‌కి సిద్ధపడి, భర్త నుండి విడివడి, నిలిచి గెలిచిన మహిళగా తనను తాను వ్యక్తీకరించుకుంది మమత!
ఇలా కుప్పిలి పద్మ కథలు స్ర్తి కేంద్రకంగా వెలువడినై. వాటి నేపథ్యం మనకు ఈనాటి సమాజంలోని మానవ సంబంధాల సంకీర్ణతనీ, సమస్యల సంక్లిష్టతనీ వెల్లడి చేస్తుంది. భావుకతతో ఆహ్లాదకర వర్ణనలతో సాగిన కథాకథనం ‘చదువు - ఆగు - నిలు - ఆలోచించు’ అన్న సూచననిస్తుంది. అందుకనే ఆ కథల్లోని పాత్రల మెరుపులూ, మరకలూ కూడా పాఠకుల్ని అలరిస్తాయి.

-విహారి