Others

అతి రహస్య రూపాంతర అక్షర ‘స్వేచ్ఛ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ
-ఓషో. అనువాదం: భరత్
పుటలు: 172. వెల: రూ.225
ప్రతులకు: గాంధీ బుక్‌హౌస్
94900 04261
*
‘స్వేచ్ఛ’ - ఒకరిస్తే పుచ్చుకునేది కాదు.
ఒకరు ప్రకటించినంత మాత్రాన స్వంతమయ్యేదీ కాదు..
ఏ వ్యక్తీ, ఏ వ్యవస్థా మరొకరికి ధారాదత్తం చేసేదీ కాదు.
‘స్వేచ్ఛ’ - ‘నాతనం’లోంచి పుట్టుకొచ్చేది..
‘నా స్వభావం’లోంచి పరిక్రమించేది..
‘నా వ్యక్తిత్వాని’కి కేంద్రమైంది.
స్వేచ్ఛకు కావలసింది ‘స్వ-తంత్రమే’ తప్ప స్వాతంత్య్రం కాదు. స్వేచ్ఛకు మరో కొసన ఉండేది బాధ్యతే తప్ప విచ్చలవిడితనం కాదు. అంటే స్వేచ్ఛా బాధ్యతల బొమ్మాబొరుసులు. అప్పుడే మన జీవిత నాణెం నాణ్యం అవుతుంది. అప్పుడే మనం ఎగిరే పక్షులం అవుతాం.. అప్పుడే మన జీవనయానం విహంగయానం అవుతుంది.
స్వేచ్ఛకు రెక్కలు విచ్చుకుంటున్నప్పుడు బాధ్యత కాస్త బాధాకరమే అనిపిస్తుంది. ఆ బాధ్యత స్వేచ్ఛకు కలిగే ప్రసవ వేదనే తప్ప, ప్రసూతి వైరాగ్యమే తప్ప, జీవితాంతం కొనసాగేది కాదు.
అందుకే, భరత్ ‘ఓషో’ ఫ్రీడమ్ పుస్తకాన్ని తెనుగిస్తూ ‘స్వేచ్ఛ’ అని నామకరణం చేసినా ఆ స్వేచ్ఛ ‘మీరనుకుంటున్నది కాదు’ అంటే అట్టమీదే నిర్వ్ద్వంద్వంగా చెప్తూ మన ఛాందస స్వేచ్ఛా భావాలను అటక ఎక్కిస్తాడు. పైగా, ఎగురుతున్న పక్షులతో ముఖపత్రాన్ని నింపేసినా ఆ పక్షుల ప్రయాణంలో స్వతంత్రమైన స్వేచ్ఛను చూశాడే తప్ప ఎవరో అందించిన స్వేచ్ఛను చూడలేదు. కాబట్టే, ఓషో చెప్పిన ‘స్వేచ్ఛ’ మీరనుకుంటున్నది కాదు’ అని తేల్చేసి పుస్తకంలోకి చూపు నిగిడించమంటాడు. పుటల్ని విప్పుతూ మన మానసిక బంధాల నుండి స్వతంత్ర మవమంటుంటాడు. చూస్తున్న అక్షరాలలో, చదువుతున్న పద బంధాలలో, స్వేచ్ఛ రెక్కల చప్పుడును వినమంటాడు. నిశ్శబ్దంగా ఎగురుతున్న పక్షిలా స్వేచ్ఛగా మనల్నీ ఎదగమంటాడు.
‘గతానికి దారితీసే వంతెనలను విచ్ఛిన్నం చేసిన ఆధ్యాత్మిక స్వేచ్ఛగల వ్యక్తులు మాత్రమే సుదూర తారల తీరాలపై దృష్టి పెట్టగలరు. అలాంటి వ్యక్తులతో ఈ ప్రపంచం నిండిపోవాలి. అప్పుడే అందరికి అసలైన స్వేచ్ఛ లభించినట్లు’ అంటూ వర్తమాన జీవిత లెక్క తేల్చేస్తాడు.
‘స్వేచ్ఛ కోసం ఆరాటపడితే అది కూడా మీకు ఒక బంధమే అవుతుంది. ఎందుకంటే మీ కోరికలన్నీ మిమ్మల్ని బంధించేవే. ఈ విషయంలో స్వేచ్ఛకు ఎటువంటి మినహాయింపు లేదు’ అంటూ సశేషం లేని స్వేచ్ఛను మన కళ్ల ముందుంచుతాడు.
నిజానికి ఓషో మన కాల ప్రవాహంలోకి ‘సందర్శకుడి’లా వచ్చినవాడే తప్ప ‘అతిథి’లా వచ్చినవాడు కాదు. కాబట్టి, సందర్శకుల, స్థానికుల స్వేచ్చ ఎటువంటిదో బాగా తెలిసినవాడు. సందర్శనా వేళలు స్థానికులకైనా, సందర్శకులకైనా ఒక్కటే అన్న అవగాహన ఉన్నవాడు కాబట్టి ఈ విశాల ప్రపంచంలో, ఈ విశ్వ ప్రాంగణంలో సందర్శకులయినా, స్థానికులయినా ఒకే కాలరేఖపైన ఉండవలసినవారే!
ఇతరుల దృష్టిలో మన స్వేచ్ఛకు విజిటింగ్ అవర్స్ ఉంటాయేమో కానీ మనకు మన జీవితంలో విజిటింగ్ అవర్స్ అంటూ ఉండవు. మన స్వేచ్ఛకు ఎవరి నిబంధనలో కొలమానం కాదు. మన నుంచి మనకు స్వేచ్ఛ అనుకోవటం కూడా పొరపాటే! మనమే స్వేచ్ఛ కావాలి తప్ప దేని నుండో, స్వేచ్ఛ పొందటం కాదు. అలా పొందింది ఎప్పటికీ పూర్తి స్వేచ్ఛ కాదు. పైగా ఆ ‘నుంచి’ అనేది మనల్ని గతంలో ఇరుక్కుపోయేలా చేసి భూతంలా భయపెడ్తుంటుంది.
అన్నట్లు, ‘విప్లవం’తో స్వేచ్ఛ సంప్రాప్తమవుతుందా? కానే కాదు. కారణం దాని రంగు స్వార్థ రాజకీయం కాబట్టి. అందుకే స్వేచ్ఛకు ఎప్పుడూ తిరుగుబాటే భూమిక. కారణం ఆ తిరుగుబాటు అనేది ఆధ్యాత్మికం కాబట్టి. తిరుగుబాటుతనం వల్ల మనలోని వీరత్వం ప్రకాశితమవుతుంటుంది. ఓషో ఈ మాటల్ని వింటుంటే దాని ఇనె్టన్సిటీ మనకే అర్థమవుతుంటుంది.
‘స్వేచ్ఛ’ అంటే ‘స్వీయ క్రమశిక్షణ’! స్వేచ్ఛ అనేది మన ‘ఎరుక’. ‘స్వేచ్ఛ’ అధికారం ద్వారా నియంత్రించబడేది కాదు. అంతేకదా, నియంత్రించబడుతున్నంత కాలం మనం విచ్చలవిడితనాన్ని కోరుకుంటూ, అదే స్వేచ్ఛ అని భ్రమిస్తుంటాం. ఒక విధంగా, విచ్చలవిడితనం అనేది మనలో రగులుతున్న మనస్తత్వానికి వర్తమాన వర్తనా రూపమే తప్ప స్వేచ్ఛకు మరో రూపం కాదు. పైగా నియంత్రణలు, నిబద్దీకరణలు మన సమయస్ఫూర్తికి గొడ్డలి పెట్టులు.
* బాంధవ్యాలన్నీ అతి సూక్ష్మమైన మానసిక బానిసత్వానికి సంబంధించినవే. మీకు మీరు బానిస కానంత వరకు ఎప్పటికీ మీరు మరొకరికి బానిస కాలేరు.
‘నేను మీకు విప్లవాత్మక భావాలను బోధించను. ఎందుకంటే, గతంలోని విప్లవాలన్నీ ఓడిపోయినవే! కాబట్టి, మీరు చాలా నిశ్శబ్దంగా, దాదాపు అతి రహస్యంగా రూపాంతరం చెందటమే ఇప్పుడు నాకు కావాలి’ అన్న ఓషో తాత్విక పుటలకు ఖరీదు కట్టే షరాబులం, రీడర్‌లం మనంకాము కాక కాము. వాటిని అక్షర లక్షలుగా మన జీవితాలలోకి అనువదించుకోవలసిందే! అందుకే, భరత్ ‘స్వేచ్ఛా’నువాదాన్ని పుస్తకం పుటలు తిప్పుతూ, తిరగబడుతూ, తిరగతోడుతూ చదివి తీరవలసిందే!

-డా.వాసిలి వసంతకుమార్ 9393933946ఒ