Others

విలువైన పుస్తకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందరో మహానుభావులు
(90 మంది ప్రఖ్యాతుల గురించి విశేష సంగతులు)
-డా.వింజమూరి
అనసూయాదేవి
ప్రచురణ: సీతారత్నాకర్, చెన్నై
09840172995
పుటలు: 240
2011లో ప్రచురితం
*
చదవాల్సిన పుస్తకాలు వరసలుగా వచ్చి చేరుతుంటాయి; చదవడం లేదని కొన్ని పుస్తకాలు గుర్తు చేస్తుంటాయ్; చదివేది ఎప్పుడని మరికొన్ని గదమాయిస్తుంటాయి కూడా! అయినా కొన్ని పుస్తకాలు ఇటు రాగానే, చేతిముందున్న పనులు పక్కనబెట్టి చదివే సందర్భాలున్నాయి. అందిన మరుసటిరోజునే చదివించిన పుస్తకం వింజమూరి అనసూయాదేవి గారి ‘ఎందరో మహానుభావులు’. ఇది ఇటీవలి పుస్తకమేమీ కాదు. 2011లో వెలువడింది. మా దూరదర్శన్ ఆత్మబంధువు సీతారత్నాకర్ ‘వేణుగోపాల్ చదవాలి కదా’ అని పంపిన 4 పుస్తకాల్లో ఇది ఒకటి. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటి? 90 మంది విశేష ప్రఖ్యాతుల గురించి రాయబడిందనా? లేదా జానపద, లలిత సంగీతాలకు ఆకాశవాణి ద్వారా విశేష సేవలందించిన వింజమూరి అనసూయ రాశారనా? కానేకాదూ!
అందరికీ తెలిసిన సంగతులు కాకుండా, తనకు మాత్రమే తెలిసిన విశేషాలు చెప్పడం ఈ పుస్తక రచయిత్రి ప్రత్యేకత. తన తొంబయ్యవ యేట తను బాగా తెలిసిన 90 మందితో తనకు గల అనుబంధాన్నీ, తాను చూసిన అనుభూతి కోణం నుంచి రాయడం ఈ పుస్తక విజయం. అట్లని ఇంత నిడివి రాయాలని నిర్ణయించుకోక పోవడం ప్రధాన ఆకర్షణ. శ్రీరంగం నారాయణబాబు గురించి కేవలం నాలుగు చిన్న వాక్యాలలో ముగించడం రచయిత్రి వ్యూహాన్ని వివరిస్తుంది. ప్రతి వ్యాసానికీ ఆ ప్రముఖుడితో తీసుకున్న ఆటోగ్రాఫ్, ఫొటోగ్రాఫ్ జతపరచడం అంశం మీద ఉండే అథారిటీని తెలుపుతుంది. వారి అమ్మ, నాన్న, మామయ్య దేవులపల్లి కృష్ణశాస్ర్తీతో మొదలుపెట్టి గాంధీ, ఠాగూర్, సుభాష్‌చంద్రబోస్, ఇందిరాగాంధీ, దయాల్‌బాగ్ రాధా స్వామీజీ, సి.ఆర్.రెడ్డి, రుక్మిణి అరండేల్, బళ్ళారి రాఘవ, బి.ఎన్.రెడ్డి, ఆదిభట్ల నారాయణదాసు, డి.కె.పట్టమ్మాళ్, కె.ఎల్.సైగల్, శ్రీరంగం గోపాలరత్నం, టంగుటూరి సూర్యకుమారి, కాంచనమాల, అడవి బాపిరాజు, శ్రీశ్రీ, నాజర్, విశ్వనాథ, భానుమతి.. ఇలా పెద్ద తారాతోరణమే!
బళ్ళారి రాఘవ గారి కళ్ల గురించి అనసూయాదేవి రాసిన విషయాలు గమనించండి. (పే.57) ‘... కృష్ణుడి కళ్లలాంటి చిలిపి కళ్లు; చాణక్యుని రిప్లమేటిక్ కళ్లు; శక్తివంతమైన శివాజీ సూటి కళ్లు; షైలాక్ సమయస్ఫూర్తి కళ్లు; ఒథెల్లో అగ్నిపర్వతాల్లాంటి కళ్లు...’ ఇలా గొప్పగా రాశారు.
అలాగే ఘంటసాల గురించి (పే.117) ‘ఘంటానాదం లాంటిది ఘంటసాలగారి కంఠస్వరం’ అందులో ఘనత్వం, లాలిత్యం ఉంది. మాధుర్యం ఉంది. స్పష్టత ఉంది. ఉచ్ఛారణ బాగుండేది, పలుకు బాగుంది, డిక్షన్ బాగుండం వల్ల వారు పాడుతుంటే ప్రతీ అక్షరం మనకు వినపడుతుంది.’
అనసూయాదేవిలోని గడుసుదనం చూడండి: (పు.20) ‘నా చిన్నతనంలో చిత్రమైన కోరికలుండేవి. అందులో ఒకటి రవీంద్రనాథ్ టాగూర్, గాంధీగారు, కె.ఎల్.సైగల్ ఈ ముగ్గురినీ చూడాలని. పురాణ కథల్లోని సతీ అనసూయ శక్తులు నాకుంటే, నేను కూడా వీళ్లని చిన్నపిల్లల్ని చేసి నా దగ్గరికి రప్పించుకునేదాన్ని.’
మనకు స్వీయ చరిత్రలున్నాయి. జీవిత చరిత్రలున్నాయి. పరిచయ వ్యాసాలున్నాయి. అయినా అవి ఇవ్వలేని కొన్ని విలువైన విషయాలు ఇలాంటి వ్యాసాలిస్తాయి. ఏడెనిమిది దశాబ్దాల స్నేహం, పరిచయం, పరిశీలన ఫలితంగా ఇటువంటి వ్యాసాలు వస్తాయి. కనుకనే ఇవి విలువయినవి. అందుకే అందరికీ బాగా తెలిసిన విషయాలు పరిహరించారు. అదే సమయంలో అనసూయాదేవి ఆలోచనా ధోరణి, జీవన వ్యూహాలు కూడా ఈ వ్యాసాల్లో కనబడతాయి. అదే సమయంలో ఆనాటి సాంస్కృతిక రంగం, పత్రికా రంగం, రేడియో, సినిమా వంటివి ఎలా సాగేవో కూడా బోధపడుతుంది. ఈ పుస్తకం కచ్చితంగా విలువైనది.

-నాగసూరి వేణుగోపాల్ 94407 32392