Others

సినీమాకి కలం పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సినీ
గేయ వైభవం
-డా.కందికొండ
తెలుగు సాహిత్య అకాడెమీ ప్రచురణ
కళాభవన్, రవీంద్రభారతి
హైదరాబాద్-4
వెల: రూ.125
*
‘స్ట్రిక్ట్‌లీ స్పీకింగ్ సినిమాకి పాట అనవసరం. కానీ పాటల్లేని సినిమాలు చాలా తక్కువ. ఒక్కోసారి పదిహేను ఇరవై పాటలున్న సినిమాలు కూడా వచ్చాయి. పాట సినిమాకు మూలాధార నాడి అయిపోయింది. ఓ పాట కోసమే సినిమాని పలుమార్లు చూసిన వాళ్లూ ఉన్నారు’ అని శ్రీశ్రీగారు 1982 దుందుభి ఉగాదికి ఆకాశవాణి వివిధభారతి జనరంజనికి ఇంటర్వ్యూ చేసినప్పుడు స్వయంగా ఈ సమీక్షకునితో అనడం గుర్తొస్తోంది. సినిమాల విజయానికి పాటలు బాటలు వేసిన రోజులెప్పుడూ వున్నాయి. నిజానికి జన సామాన్యం దృష్టిలో కవులంటే అధికంగా సినీ గేయ రచయితలే! సినీ కవులు కావడం వల్లే - గ్లామర్ సంపాదించుకున్న కవులున్నారు. ఏ పత్రికలోనో రాస్తూనో, ఓ కవితా సంకలనం వేసాకనో కాక, నేరుగా సినీ రంగాన కాలిడి కవులుగా గుర్తింపు పొందినవారూ ఉన్నారు.
సినిమాలకు గీత పరీమళాలందించిన కవుల గురించీ, అందునా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతపు సినీ గేయ రచయితల గురించీ, ‘తెలంగాణ సినీ గేయ వైభవం’ పేర - ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సినీ సన్నివేశ గీతాల మీద పరిశోధన చేసిన డా.కందికొండ, గత ఏడాది ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాసిన గ్రంథాన్ని, తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించింది.
తొలి తెలుగు సినీ టాకీ ‘్భక్త ప్రహ్లాద’లో - ‘పరితాప భారంబు భరియింప తరమా’ అనే పాట రాసింది తెలంగాణ ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించిన చందాల కేశవదాస్. అలా తొలి తెలుగు సినీ గేయ రచయితగా వెండితెరపై వెలిగింది ఆయనే. భక్తప్రహ్లాద చిత్రంలో పోతన పద్యాలతోబాటు, ధర్మవరం రామకృష్ణమాచార్యుల గారివీ పద్యాలున్నాయి. కానీ తొలి తెలుగు సినిమా పాటకు బాట వేసింది చందాల కేశవదాస్‌గారే. దాశరథి, సినారె వంటి లబ్ధ ప్రతిష్ఠుల నుండి, నేటి వడ్డెపల్లి కృష్ణ, సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, గోరటి వెంకన్న, గద్దర్, అందెశ్రీ వంటి 24 మంది తెలంగాణ సినీ గేయ కవుల కృషిని ఈ గ్రంథం పరిచయం చేస్తోంది. ఆ కవుల జీవన రేఖలను, పాటల సొబగును వివరిస్తోంది.
2010లో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రంలో నేటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారు చక్రి సంగీత దర్శకత్వంలో తెలంగాణ ఉద్యమ గీతం - ‘గారడి చేస్తుండ్రు.. గడబిడ చేస్తుండ్రు’ అంటూ - ఉద్యమ నేతగానే కాక, కవిగా తనకున్న అభినివేశాన్ని చాటుకోవడం కూడా కందికొండ నమోదు చేయడం ఆనందం! అలాగే ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’ చిత్రంలో అన్ని పాటలూ రాసి, తొలి తెలంగాణ సినీ గేయ కవయిత్రిగా ‘పెళ్లిచూపులు’ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాల్లో తన కలంతో కలకలం సృష్టించిన కరీంనగర్ జిల్లా మంచిర్యాల కవయిత్రి ‘శ్రేష్ఠ’నూ యశ్‌పాల్, మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్ వంటి వారిని ‘తెలంగాణ సినీ గేయ వైభవం’లో పరిచయం చేశారు. అయితే సినీ గీత పరిశోధనలే చేసిన డా.కందికొండ - తెలుగు సినిమాకు తన కలం వెలుగులందించిన కీ.శే.అచ్చి వేణుగోపాలాచార్యులు గారినీ, నేటి వౌనశ్రీ మల్లిక్‌గారినీ వారు తెలంగాణ ప్రాంతీయులే అయినా, విస్మరించడం విస్మయం కలిగించింది.
‘పట్నంలో శాలిబండ - పేరైనా గోల్కొండ’ అనే ‘అమాయకుడు’ చిత్రంలోని పాట ఎంత ప్రసిద్ధమో! కె.బి.తిలక్ దర్శకత్వంలోని ‘ముద్దుబిడ్డ’ చిత్రంలో ‘చుక్కల చీర కట్టుకుని పట్టుగుడ్డ రైక తొడుక్కుని’ అనే జానపద గీతం, ‘పి.పుల్లయ్యగారి ‘వేంకటేశ్వర మహాత్మ్యం’లో (1960) ‘పదవే పోదాము గౌరి పరమాత్ముని చూడ’ ‘తిరుపమ్మ కథ’ చిత్రంలోని ‘శ్రీ వేంకటేశా దయాసాగరా’ భక్తిగీతం, ఇవన్నీ రాసింది ఎ.వేణుగోపాల్ అనే అచ్చి వేణుగోపాలాచార్యులుగారే! 1930 జూన్ 12న కుత్బుల్లాపూర్‌లో జన్మించారాయన. పూర్వీకులు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల దగ్గర్లోని అవునూతుకు చెందిన వారు. పురానాపూల్ ప్రైమరీ స్కూల్‌లో చదివి, ఉర్దూలో హెచ్.ఎస్.సి. చేసి, టీచర్ ట్రైనింగ్ పొంది, 1952లో హైద్రాబాద్‌లో టీచర్‌గా పనిచేశారు. ఉస్మానియా నుండి ఎం.ఏ. తెలుగు చేశారు.
మద్రాస్‌లో ఆత్రేయ, కొసరాజు వంటి వారు సృష్టించిన అడ్డంకులు ఎదుర్కొంటూ - తెలంగాణ సినీ కవి ఎ.వేణుగోపాల్ మమకారం, భాగ్యవంతులు, పచ్చని సంసారం, దేవుడున్నాడు, అమాయకుడు, దక్షయజ్ఞం, పునాదిరాళ్లు, ఉషా పరిణయం, ఆరాధన వంటి ఇరవైకి పైగా చిత్రాలకు పాటలు రాశారు. కష్టసుఖాలు, రాజాధిరాజు, పచ్చని సంసారం, భాగ్యవంతులు తదితర చిత్రాలను తమిళం నుంచి తెలుగులోకి అనువదించారు. కొన్ని చిత్రాలకు కో డైరెక్టర్‌గా కూడా పని చేశారు. తిరుపతమ్మ కథ (1963) మాటలు, పాటలూ రెండూ ఆయనవే! అలాగే ఘంటసాల గళంలో ప్రసిద్ధి చెందిన ‘ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా’ ‘నీకొండకు నీవే రప్పించుకో’ వంటి భక్తిపాటలు వేణుగోపాల్ రాసినవే. హైదరాబాద్ = గోషామహల్, లాలాపేట్, షాద్‌నగర్ పాఠశాలల్లో పనిచేసి, హెడ్మాస్టర్‌గా రిటైరయ్యారు. 85 ఏండ్ల వయసులో గుండెకు, వెనె్నముకకు ఆపరేషన్లు జరిగాయి. చాలాకాలం పౌరోహిత్యం కూడా చేశారు. ఆ మధ్యే కాలధర్మం చెందారు.
అటువంటి తెలంగాణ సుప్రసిద్ధ కవిని ఈ పుస్తకంలో చేర్చకపోవడం పెద్ద లోటు. అలాగే వరంగల్ జిల్లా వర్థన్నపేటకు చెందిన వౌనశ్రీ మల్లిక్ 1976 మార్చి 4న జన్మించారు. తప్తస్పృహ, దిగంబర, గరళమ్ వంటి కవితా సంకలనాలు వెలయించి, అటు టీవీ సీరియల్స్‌కూ, తెలుగు చిత్రాలకు నేడు ఎన్నో పాటలు అందిస్తున్న వౌనశ్రీ మల్లిక్ గురించి కూడా ఈ గ్రంథం విస్మరించడం సబబు కాదు. నాలో తొలిసారిగ, మండే టు సండే, చేతిలో చెయ్యేసి, థ్రిల్లింగ్, గుడ్‌మార్నింగ్ వంటి చిత్రాల ద్వారా వౌనశ్రీ మల్లిక్ సినీ గేయ రచయితగా ఎదిగారు.
ఏమయినా ‘తెలంగాణ సినీ గేయ వైభవం’ గ్రంథం సంతరించిన డాక్టర్ కందికొండ కూడా స్వయంగా ప్రముఖ సినీ గేయ రచయితగా పేరొందినవారే! శ్రావణి సుబ్రహ్మణ్యం, పోకిరి, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సత్యం, ఇడియట్, టెంపర్, మున్నా, శివమణి వంటి విజయవంతమైన చిత్రాలలో జనరంజకమైన పాటలెన్నో రచించారు. ఇకనయినా మలి ముద్రణలో విస్మృత తెలంగాణ సినీ కవులను కూడా చేర్చి, ఈ గ్రంథాన్ని సమగ్రంగా తీర్చిదిద్ది తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురించగలదని ఆకాంక్షిద్దాం.

-సుధామ