Others

భారతీయ రాజనీతిజ్ఞత చాటిన చారిత్రక నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిజేత సముద్రగుప్త
రచన: పాలంకి సత్య
వెల: రూ.100, పేజీలు: 151
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పుర, హైదరాబాద్-27
040-27563236
*
భారత మాతను సేవించడం, భగవంతుని ఆరాధించడం జీవన దృక్పథం మరియు ఆశయాలుగా మలచుకొన్న రచయిత్రి పాలంకి సత్య. జాతికి, దేశానికి, మన ధర్మానికి ఉపయోగపడే రచనల పట్ల దృష్టి సారించడం అభినందనీయం. సామాజిక బాధ్యతతో వివిధ పత్రికల్లో ఆమె రాసిన వ్యాసాలు, రచనలు అందరినీ ఆకట్టుకుని.. ఓ రచయిత్రిగా సాహితీ లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరచుకున్నారు.. ఆమె లోగడ ప్రకటించిన ‘ఆలోచనలు ఆలోకనలు’ గ్రంథం ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ‘విశ్వవిజేత సముద్రగుప్త’ పేరుతో ఆమె ఓ చారిత్రక నవలను వెలువరించి.. తమ సృజనాత్మక, పరిశోధనాత్మక ప్రతిభను ప్రదర్శించుకోవడం ప్రశంసనీయం! విశ్వవిజేతగా భాసిల్లిన సముద్రగుప్తుని జీవిత విశేషాలను, ఆయన బహుముఖీన ప్రజ్ఞలను ప్రతిబింబిస్తూ రాసిన ఈ నవలలో... రచయిత్రి పాలంకి సత్య భారతీయ జీవన విధానాన్ని, రాజనీతిజ్ఞతను అద్భుతంగా ఆవిష్కరించారు. ఆమె ఎంపిక చేసుకున్న ఇతివృత్తం చాలా విస్తృతమైనప్పటికీ.. కథను నడిపించడంలో రచయిత్రిగా చక్కని ప్రతిభను చూపారు. ఏకబిగిన చదివించే ఉత్తమ గుణమున్న ఈ నవల ద్వారా.. అలెగ్జాండర్ దండయాత్రలోని సత్యాన్ని తేల్చి చెప్పారు.. గ్రీకులు వాడిన ‘సాంద్రకోటస్’ అన్న పదం వౌర్యచంద్రగుప్తుని గురించి కాదన్న విషయాన్ని పాఠకులతో పంచుకునేందుకు.. ఈ నవలకు జీవం పోసినట్లు తెలిపిన పాలంకి సత్య... సముద్రగుప్తుని ఓ ఉత్తమ పాలకునిగా మన ముందు నిలిపారు. సందర్భోచితంగా రచయిత్రి సృష్టించిన సన్నివేశాలు.. ఈ నవలకు నిండుదనాన్ని ఇచ్చాయి!
యుద్ధవిద్యలో.. రాజనీతిలో ప్రావీణ్యం సంపాదిస్తే సరిపోదని.. అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా.. చతుష్షష్టి కళలను అభ్యసించిన సముద్రగుప్తుని ఈ నవలలో ఉన్నతంగా చిత్రించారు. ఆనాడు నేపాల వంశీయులు వీర పరీక్షలు, పాండిత్య ప్రదర్శనలు ఎలా జరిపేవారో ఈ గ్రంథం ద్వారా తెలుసుకోగలం.. ‘ఆలంబన లేనిదే లత నిలువలేదు. లలనలైనా అంతే’ అన్న విషయాన్ని తెలిపేందుకు.. రాకుమారి కుమారదేవి మాధవీలతకూ.. పున్నాగ వృక్షానికీ పరిణయోత్సవాన్ని జరిపిన ఘట్టాన్ని ప్రస్తావించిన తీరు బాగుంది. ఘటోత్కచగుప్తుని కుమారుడు చంద్రగుప్తుడు నీకు తగిన వరుడని కుమారదేవితో తండ్రి చెప్పిన మాటలను ఎంతో ఆసక్తితో.. అణకువతో.. గౌరవంగా విన్న కుమారదేవిని రచయిత్రి చక్కగా ఆవిష్కరించారు. పితృపాదుల ఆజ్ఞను శిరసావహించే ఉత్తమ పుత్రికగా మనం చూడగలం. మగధ రాజ్యాధినేతగా చక్రవర్తిగా ఉండే లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న చంద్రగుప్తుని బహుముఖీన ప్రజ్ఞాశాలిగా నవలలో చక్కగా చిత్రించారు.. కుమారదేవి చంద్రగుప్తుల వివాహానంతరం... శయన మందిరంలోని దృశ్యాలను అందంగా చిత్రించారు. తన ప్రియురాలు రత్నావళికి సంబంధించిన జ్ఞాపకాలు చంద్రగుప్తుని కవ్విస్తుంటే.. వివాహమైన భార్య ఎదుట ఇలా వ్యవహరించడం.. ఆలోచించడం తనను తానే తమాయించుకోవడం.. చంద్రగుప్తుని సంస్కారాన్ని తెలిపేలా సన్నివేశాన్ని సృష్టించడంలో రచయిత్రి సత్య సఫలీకృతమైనారు.
పతి హితాన్నీ, ప్రియాన్నీ కోరడం పతివ్రతా లక్షణం తప్ప పతిని కొంగుకు ముడివేసుకోవాలనుకోవడం కాదన్న సంగతిని గ్రహించిన కుమారదేవి తన భర్త చంద్రగుప్తుని కోరికను మన్నించి.. ఆయన రత్నావళిని చేసుకోవడానికి అంగీకరించడం.. ఆనాటి మహిళల ఔన్నత్యాన్ని చాటుతోంది. చంద్రగుప్తుడు.. రత్నావళికి జన్మించిన పుత్రునికి కచగుప్తుడని నామకరణం చేయడం.. ఆ తర్వాత మూడు నెలలకే కుమారదేవికీ పుత్రుడు కలగడం.. సముద్రగుప్తుడని పేరు పెట్టే ఘట్టాలు కథలో వేగంగా.. చకచకా ముగించడంలో.. పాలంకి సత్య చూపిన ప్రతిభ ప్రశంసనీయం! ఇక తర్వాతి కథను చాలా అద్భుతంగా నడిపించారు.. చిన్ననాటి నుంచే సోదరులు కచగుప్తుడు, సముద్రగుప్తుడు అన్ని విద్యలను అభ్యసించడంలో ఆసక్తి కనబరచడాన్ని చూస్తాం. ఆనాడు తక్షశిల విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దడంలో.. కావలసిన అన్ని హంగులు కల్పించడంలో.. చక్రవర్తి అందించిన సహకారం, సహాయం లభ్యం కావడం చూస్తే పాలకులకు విద్యాలయాలపై ఉన్న గౌరవాన్ని, శ్రద్ధను చూడగలం! అంభి కుమారునికీ, పురుషోత్తమునికి కల వైరం వల్ల.. అనార్యులతో అంభి కుమారులు చేతులు కలపడం.. అలెగ్జాండర్ దండెత్తి రావడం వంటి అంశాలను నవలలో చక్కగా ప్రస్తావించారు. చిన్ననాటే అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్పు ‘నీ వీరత్వానికీ, వివేకానికీ మాసిడోనియా వంటి చిన్న రాజ్యం సరిపోదనీ.. భూమండలానికి నీవు అధినేతవు కావాలనీ.. విశ్వవిజేతవు కావాలని కాంక్షించడం అలెగ్జాండర్‌లో నూతనోత్తేజానికి అంకురార్పణ జరిగిందని చెప్పవచ్చు. తన మందిరానికి వచ్చిన భర్తను రత్నాకర వీచికలా రత్నావళి ఎదుర్కొని కాళ్లు కడిగి, తన ఉత్తరీయంతో తుడిచి లోపలికి తీసుకెళ్లే సన్నివేశం బాగుంది.
పతి ధర్మాలు వేరు.. రాజధర్మాలు వేరు అంటూ.. ఆహార పానీయాలలో, వస్త్భ్రారణాలలో, శయన విషయంలో పతులందరికీ సమన్యాయం చేస్తున్నట్లు సంజాయిషీ ఇవ్వడం- ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టింది. విశ్వమంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న దురాలోచనతో అలెగ్జాండర్ దండయాత్ర చేస్తున్నట్లు తెలియగానే.. సముద్రగుప్తుని యుద్ధానికి పంపుతూ చంద్రగుప్తుడు పలికిన మాటలు ఆనాటి యుద్ధనీతి, రాజనీతి మరియు ధర్మబద్ధతతను తెలిపేలా ఉన్నాయి. ‘నీవు బయలుదేరింది కదనరంగానికి.. నీపై శత్రువుల బాణములు కాక పూల బాణాలు కూడా తగిలే అవకాశముంది. కనుక అప్రమత్తంగా ఉండుమని ప్రబోధించడం బాగుంది. భరతభూమిపై దండు వెళ్లబోయే క్రమంలో తానూ వస్తానని రుక్సానా అలెగ్జాండర్‌తో అభ్యర్థించే సన్నివేశం, గాంధార రాజు అంభి కుమారుడు సమర్పించిన కానుకలను గ్రహించి.. పురుషోత్తముడు మీదికి దండయాత్రకు బయలుదేరడం వంటి అంశాలను రచయిత్రి చక్కగా ప్రస్తావించారు.
వితస్తా నదిలో స్నానమాడి, జపాన్ని పూర్తి చేసుకుని.. వస్త్రాలను ధరించి వస్తున్న వేళ... హెలీనా చూసి ముగ్ధురాలైన దృశ్యం అక్షరాల్లో చక్కగా బంధించబడింది. సముద్రగుప్తుని కన్నార్పకుండా చూసిన హెలీనాను చూసిన సముద్రగుప్తుడు ఒకరి అందాలను మరొకరు లోలోన అనుకున్న సన్నివేశాన్ని రచయిత్రి పాలంకి సత్య రమణీయంగా దృశ్యమానం చేవారు. అయితే వెంటనే సముద్రగుప్తుడు కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుని తనను తాను నిగ్రహించుకోవడం.. శ్రీరాముని స్మరించుకుని కార్యోన్ముఖులవ్వడం గమనిస్తాం.
సముద్రగుప్తు, పురుషోత్తములు సేనా సమేతులై శత్రువులను చీల్చి చెండాటం, ధర్మయుద్ధమే అలవాటుగా కల భరతభూమి వాసులు రణం నిలుపుతున్నామని సూచిస్తూ శంఖధ్వని వినిపించడం వంటి అంశాలను రచయిత్రి ప్రతిభావంతంగా నవలలో పొందుపరిచారు. పురుషోత్తముడు ఎక్కుపెట్టిన విల్లుకు అలెగ్జాండర్ పంచభూతాలలో కలిసిపోయేవాడే కానీ.. రుక్సానాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలతో వదలడం వంటి అంశాలు.. ఆనాడు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి ఉండేవారో తెలుస్తోంది. లొంగిపోయిన శత్రువులను ఎంత ఆదరణతో చూసేవారో... పురుషోత్తముడు అలెగ్జాండర్‌కు సకల సదుపాయాలను కల్పించడాన్నిబట్టి తెలుసుకోవచ్చు. చంపదగిన శత్రువు చేతికి చిక్కినా చంపకపోవడం భారతీయ రాజనీతిజ్ఞతను చాటుతోంది. తాను వచ్చిన దారిన కాకుండా సింధు నది పొడవునా దక్షిణంగా అలెగ్జాండర్ పయనించాలన్న సముద్రగుప్తుని యుద్ధనీతి గ్రీకు సేనలను కష్టాలపాలు చేయడం వంటి విషయాలు.. సముద్రగుప్తుని ప్రతిభను తెలిపేలా ఉన్నాయి. సముద్రగుప్తుని మదిలో హెలీనా రూపం కదలాడుతున్నప్పటికీ.. వాకాటక రాజపుత్రి దత్తదేవిని పెద్దల నిర్ణయంతో పెళ్లాడటం.. వంటి అంశాలను రచయిత్రి కథ సీక్వెన్స్ దెబ్బతినకుండా చక్కగా ఆవిష్కరించారు. దత్తదేవిని సముద్రగుప్తుడు వివాహమాడటంతో.. సోదరుడు కచగుప్తుని మనసు కలుషితమవడం.. చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు కచగుప్తుని మనసు మార్చే క్రమంలో జరిగే ఘటనలు ఈ నవలలో పొందుపరిచిన తీరు అభినందనీయం.
రచయిత్రి పాలంకి సత్య ఎంపిక చేసుకున్న నవల ఇతివృత్తం విస్తృతమైనందువల్లే.. కథాగమనంలో వేగం పాటించడం అనివార్యమైందని గ్రహిస్తాం. భారతీయతను చాటే ఓ మంచి నవల చదివామన్న తృప్తి పాఠకులకు కలుగుతుంది.

- దాస్యం సేనాధిపతి, 9440525544