Others

భావావేశం.. భావోద్విగ్నత కలగలసిన అక్షర కుసుమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పరిమళ భరిత
కాంతిదీపం
- పెరుగు రామకృష్ణ
*
సీనియర్ కవి పెరుగు రామకృష్ణ ఇటీవల ఆవిష్కరించిన ‘ఒక పరిమళభరిత కాంతి దీపం’ గురించి కాసిన్ని మాటలు చెప్పుకుందాం. కవిత్వం రామకృష్ణకి జీవన మార్గం అని తనెప్పుడో చెప్పుకున్నాడు. అర్థమైన భావోద్విగ్నత, భావావేశం కలిగినప్పుడల్లా అక్షరాలు పెన్నానదిలా ప్రవహిస్తుండటం ఇతని జీవన చర్య. తమ జీవన నౌకలకు చుక్కానిగా సాగి ఇటీవలే పరమపదించిన అమ్మకు ఈ అక్షర కుసుమాన్ని అంకితం చేశాడు. కవి జీవన అనుభూతులను, అనుభవాలను రంగరించి అక్షరమై ఒలికిపోయే వేళ జనించే అక్షర కాసారాలే ఈ కవితలు. 53 కవితలతో అందమైన ముఖచిత్రంతో వెలువడిన ఈ కవితాక్షర మాలిక కచ్చితంగా కవిగారి జోలెలో మరో కలికితురాయి. అమ్మ గురించిన కవితతోనే మొదలుపెడదాం. 84 ఏళ్ల వయసులో అలసి వౌనించిన అమ్మను గూర్చి కవి ఇలా బాష్ప కుసుమాలను నివేదిస్తాడు.
‘ఇప్పుడు నేను/ నా ప్రపంచాన్ని బహిష్కరించి/ ఆమెనే చూస్తున్నా/ అమ్మ దగ్గరే వుండిపోతున్నా../ ప్రేమ భాషను ఆమె నుండే నేర్చుకున్నా కదా/ మాతృ పరిమళం మరింతగా గుండెకెత్తుకున్నా కనుక/ అన్నీ విడిచి ధైర్యంగా ఆమె ప్రపంచంలోకి వెళ్తున్నా/ నాకిప్పుడు మరేదీ ముఖ్యం కాదు/ జ్ఞాపకాల నెమరువేతలో ఉన్న/ అమ్మ తప్ప...!!’ తల్లికి రాసుకున్న ఈ అక్షర నివాళిలో అతను అన్న ‘మాతృ పరిమళం’ మాట ఎన్నదగినది. చంటిబిడ్డలు వద్ద వచ్చే ఒక పరిమళం గురించి రాస్తాంగానీ తల్లి పరిమళం గురించిన ఈ మాట నిజంగా గుర్తుంచుకోదగిన మాట.
భావుకతతోనే కాదు సామాజిక పరిశీలన కూడా కలిగిన కవి రామకృష్ణ. అందుకే సమాజ పరిశీలకుడిగా ఒక ప్రపంచ పౌరుడిగా స్పందిస్తూ ‘యుద్ధం ఆగదు/ ఆగదని రక్త సంధ్య మీద/ కటిక నిజాన్ని చెక్కుతాను../ కవులంతా కన్నీరు కార్చి కరగాల్సిందే/ సత్యాన్ని చెప్పే ప్రయత్నమే ఇది/ ఇదే సత్యం../ ఎప్పటికీ.. మెరప్పటికీ/ ఇదే సత్యం.. యుద్దం ఆగదు/ మనిషి ఆగనంతకాలం.. ఇదెట్లా ఉంటుందంటే/ గుండె బాదుకుని కవిత్వం చెప్పడంలా/ ఈలోగా/ భూమి భళ్లున పగిలి/ కవిత్వం మొలుస్తుంది../ అప్పుడు ఒకర్నొకరు అన్వయించుకుని/ రక్త సంధ్యని కవిత్వంలో కడిగి/ మనల్ని మనం పవిత్రపరచుకుంటాం.. అంతే...’ (రక్తసంధ్య కవిత) జీవితాన్ని అన్ని కోణాల నుండి చూసిన కవి, సమాజాన్ని తన జీవన పరిధిలో పరిశీలించిన కవి చెప్పే అనుభవైక సత్యాలు ఈ మాటలు.
కవి హృదయంలో సామాన్య మానవుని కష్టాలూ, ప్రభుత్వ విధానాలతో అల్లకల్లోలవౌతున్న మానవ జీవితంలో అన్నీ ఉన్నాయి. అవి అక్షరాలుగా ఇలా మారుతున్నాయి: ‘చిల్లర దొరకడంలేదు/ బ్రతుకు వనంలో పూచిన/ డబ్బు పూలు వాడిపోయి/ మనిషి దాహాన్ని తీర్చలేమంటూ/ రాలిపోయాయి/... ఇలా సాగిన కవితలో పెద్దనోట్ల రద్దును గూర్చి ఆర్ద్రంగా అంటాడిలా ‘ప్రపంచం ఎటు పోతుందో తెలీని సందిగ్ధం/ పాలు, పండ్లు, మందులు, మధ్యతరగతి నించి/ దోబూచులాడుకుంటూ/ తప్పిపోయి/ కొత్త రంగుల నోట్ల లోయల్లోకి నెట్టివేస్తున్నాయి’ బాలు గానానికి యాభై, మండేలా అస్తమయం లాంటి సంఘటనలు కవి కలాన్ని కాలాన్ని కదిలించాయి. కవి అయికాంతికుడు కాదు కారాదు సమాజంతోనూ, సమభావంతోనూ, కలలూ కాళ్లూ కలిపి నడిచినప్పుడే మంచి కవిత్వానికి రూపశిల్పి అవుతాడు. అలాంటి కవిత్వ దృష్టి రామకృష్ణలో మెండుగా ఉంది అనడంలో సందేహమే లేదు. అమ్మే తన మొదటి పుస్తకం అని పేర్కొన్న ఈ కవి పుస్తకం గురించి అనే మంచి మాటలు చూడండి: ‘ఆకలి తీరడానికి పుస్తకం కారణం కాకపోవచ్చు కానీ/ ఒక విశ్వాసాన్ని మన ముందు ఉంచి/ దాన్ని అభిషేకించి/ మంత్రించిన నాగలిని భుజాన పెట్టగలదనే నమ్మకం నాది’ ఇక్కడ కవి ఒక కవితా తపస్వి. సాహిత్యం మనుషుల్ని ఎలా మారుస్తుంది అనడానికి నిదర్శనమీ మాటలు. పవిత్ర గ్రంథాలన్నీ పుస్తకాలే కదా అలా పుస్తకాన్ని కూడా జీవితమంత గొప్పదిగానే భావిస్తాను అంటాడు. భావోద్విగ్నతతోబాటు సామాజిక బాధ్యత కూడా కలిగిన కవి రామకృష్ణ. అందుకే కవిత్వంలోనే అభినందిస్తాడు, ఆనందిస్తాడు, స్పందిస్తాడు, నినదిస్తాడు. మరో మణిమయ కాంతి కవిత్వం ఈ కవిది. కవి స్పందించని సామాజిక సందర్భం లేదు. అది ఈ కవికి కొత్త కాదు. ఇది ఇతని తత్వం. తెలుగు కవిత్వాకాశంలో మరో పరిమళ భరిత కాంతిదీపం ఈ కవితా సంపుటి.

-జగద్ధాత్రి