Others

మార్క్స్ కన్నా మొనగాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎం.ఎన్. రాయ్ జయంతి
*
పేరులోనే మానవతావాదం కలిగి ఉన్న గొప్ప మేధావి మానవేంద్రనాథ్ రాయ్. ఆయన మార్చి 21న 1887లో బెంగాల్ గడ్డపై జన్మించారు. తల్లిదండ్రులు నరేంద్రనాథ్ అని నామకరణం చేసినా, ఆయన ఎంఎన్ రాయ్‌గానే ప్రపంచానికి పరిచయం. 19వ శతాబ్దపు మహిమ ఏమిటో గాని గొప్ప నాయకులు, వ్యక్తులు ఆ కాలంలోనే జన్మించారు. విప్లవ, ఆధునిక, అభ్యుదయ భావాలకు ఆనాడు బెంగాల్ కేంద్ర బిందువుగా విరాజిల్లింది. దేశ స్వాతంత్య్రం కోసం ఆలోచనల విస్ఫోటం అక్కడే జరిగింది. రాయ్‌కు పూర్వం వివేకానందుడు, బంకిం చంద్ర ఛటర్జీ రచనలు, భావాలు అగ్నివర్షం కురిపించాయి, జనంలో ఆలోచనలు రేకెత్తించాయి. వాటి ప్రభావంతో అనేకమంది విద్యార్థులు, యువకులు విప్లవకారులుగా మారి, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
1857 నాటి సిపాయిల తిరుగుబాటు, స్వామి దయానంద సరస్వతి ప్రవచనాలు, సంస్కరణలు.. సహనం నశించిన సన్యాసుల (ఆనంద్‌మఠ్) ఆక్రందన.. బెంగాల్ విభజన.. ఇలా అనేక పరిణామాలు ఆనాటికి పరిణత రూపం దాల్చాయి. అప్పటికే విప్లవ కార్యక్రమాలు నడుపుతున్న జతిన్ ముఖర్జీ, సంస్కరణవాది సురేంద్రనాథ్ బెనర్జీ తదితరులు సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
తిరుగుబాటు తత్వం, కొంత ఆధ్యాత్మిక చింతనగల ఆనాటి ‘అనుశీలన సమితి’లో ఎం.ఎన్.రాయ్ చేరారు. వీరోచిత కార్యక్రమాల ద్వారా బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టాలన్న సంకల్పంతో ఆయన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. దాంతో ఆయన జీవనం అనేక మలుపులు తిరిగింది. జాతీయ, ప్రపంచ స్థాయి నాయకులతో సహచర్యం చేశారు. ప్రపంచాన్ని మలుపుతిప్పిన సంఘటనల్తో మమేకమయ్యారు. ఈ అరుదైన అవకాశం భారత్‌లో ఎం.ఎన్.రాయ్‌కు మాత్రమే దక్కడం గర్వించదగ్గ అంశం. ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు, గౌరవం ఆయనకు అతి పిన్నవయసులోనే దక్కాయి. రష్యాలో లెనిన్, స్టాలిన్, ట్రాట్‌స్కీ లాంటి హేమాహేమీలతో ఆయన సహచర్యం చేశారు. తన మేధతో వారిని ఆకర్షించారు. వారు ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఇంతటి కీర్తి, ఖ్యాతి అంతకుముందు, ఆ తర్వాత ఎవరికీ దక్కలేదు. 1920లో తాష్కంట్‌లో ‘్భరత కమ్యూనిస్టు పార్టీ’ని ఎంఎన్ రాయ్ ప్రారంభించారు. భారత్‌కు కమ్యూనిజాన్ని ఆయనే తొలిసారిగా పరిచయం చేశారు. రష్యా వెలుపల తొలిసారి 1919లో మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసిన ఘనత సైతం రాయ్‌కే దక్కుతుంది. చైనా విప్లవ పంథాను రష్యా పంథాలోగాక మరో పద్ధతి (వ్యవసాయకంగా)లో కొనసాగించాలని ఆ దేశ అగ్రనేతలకు బోధ చేసింది కూడా రాయ్ కావడం విశేషం. ఆయన అమెరికాకు చెందిన ఎవలిన్ ట్రెంట్‌ను పెళ్లిచేసుకున్నాక, అక్కడా పార్టీని బలోపేతం చేశారు.
ఇలా ప్రపంచమంతటా (యూ రప్ సహా) కమ్యూనిస్టు భావజాలాన్ని శక్తిమంతంగా, వేగంగా విస్తరింపజేసి సోవియట్ యూనియన్‌కు అండగా నిలిచేందుకు విశేష కృషిచేశారు. ‘కమ్యూనిస్టు ఇంటర్నేషనల్’లో సభ్యుడిగా విలువైన సేవలు అందించారు. ఇదంతా ‘హ్యూమనిజం’ వెలుగులోనే చేశారు. అనేక చేదు అనుభవాలు, ఊహించని సంఘటనలు మలుపుల అనంతరం ఆయన కమ్యూనిజాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించిన వారిలో ఆయనే ప్రథముడు.
కాలం గడచిన కొద్దీ కమ్యూనిజంలో ఆయన అమానవీయతను దర్శించారు. స్టాలిన్ జరిపిన ఘోర కృత్యాలు ఆయన మనసు మార్చుకునేలా చేశాయని అంటారు. పార్టీపేర మానవ హననాన్ని రాయ్ సహించలేకపోయారు. మానవత్వాన్ని, హ్యూమనిజాన్ని కాపాడేందుకు గాక, పార్టీ మనుగడ కోసం కమ్యూనిజాన్ని కొందరు ఆసరా చేసుకోవడం రాయ్ సహించలేక పోయారు. తన మనసులోని భావాలను నేతల ముందు పరిచారు. వారు పట్టించుకోకపోవడంతో తానే వారిని పట్టించుకోరాదని భావించారు. రాడికల్ హ్యూమనిస్టు (నవ మానవ వాదం) భావాలను ప్రోదిచేయడానికి కంకణబద్ధులైనారు. ఏ మేధతో, సూక్ష్మదృష్టితో, విశాల దృక్పథంతో మానవాభ్యుదయ ఆకాంక్షతో అంతర్జాతీయ క్షేత్రంలో పనిచేశారో అదే మేధో విలక్షణత, చతురత, గంభీరమైన వాదనతో భారతదేశ రాజకీయాల్లోకి ఆయన అడుగిడారు. మనిషి-స్వేచ్ఛ- స్వాతంత్య్రం- సాధికారత అన్న అంశాల చుట్టూనే ఆయన ఆలోచనలు తిరిగాయి. ఆనాడు ఆయన చేసిన రచనలు, వ్యాసాలు ఎందరినో ఆకర్షించాయి.
1930 ప్రాంతంలో భారత్‌కు తిరిగి రాకముందు ప్రపంచ దృక్పథంతో భారత్ రాజకీయాలపై చేసిన విశే్లషణ ఎందరినో అబ్బుర పరిచింది. ‘ఇండియా ఇన్‌ట్రాన్సిషన్’ (మారుతున్న భారత్) అన్న రచన ఎందరినో ప్రభావితం చేసింది. ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. భారత్‌కు వచ్చాక ఆయన కాన్పూర్ కుట్ర కేసులో కఠిన కారాగార శిక్షను అనుభవించారు. ఆ కేసులో తన వాదనను ఆనాటి బ్రిటీషు అధికారులు, కోర్టు వినిపించుకోకపోయినా ఆ వాదన ‘మై డిఫెన్స్’పేర ప్రచురితమై సంచలనం సృష్టించింది. తిరుగుబాటుదారుల బలమైన వాదనను ప్రతిబింబించే ఆ వైఖరిని అనంతరం ఎందరో విప్లవకారులు అనుసరించారు. పాలకులను ఎండగట్టే వైఖరికి ఆయనే శ్రీకారం చుట్టారు.
రచయితగా, పత్రికా రచయితగా రాయ్ ప్రసిద్ధిచెందారు. స్వాతంత్య్ర సమరానికి తనవంతు పాత్రను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు. జైలులోఉన్నా ఎన్నో లేఖలు, పత్రాల ద్వారా జైలు బయటి నాయకులకు అభిమానులకు మార్గదర్శనం చేశారు. అనేక పత్రికల్లో స్ఫూర్తిదాయకమైన వ్యాసాలు రాశారు. ఇదే కాలంలో ఆయన జైలులో ఉండి మూడువేల పేజీల గ్రంథాన్ని రచించారు. ‘ఆధునిక సైన్స్‌కు తాత్విక భూమిక’- అన్న ఆ రచన అత్యంత విలువైనది. ఆయన మేధాశక్తికి అది నిదర్శనంగా నిలుస్తోంది. ఆ సందర్భమే ఇప్పుడు పునరావృత్తం కావడం విశేషం. 1936 ఆఖరులో జైలునుంచి విడుదలయ్యాక ఆయనకు నెహ్రూ స్వాగతం పలికారు. 1937లో ఆయన ‘ఇండిపెండెంట్ ఇండియా’ అనే తన వారపత్రికలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నెహ్రూ సూచించగా పలు వ్యాసాలు రాశారు. వాటిని నెహ్రూ, బోస్ లాంటివారు స్వాగతించగా, కమ్యూనిస్టులు తీవ్రంగా విభేధించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదుల వైఖరి, కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్ ఎన్నికతో గందరగోళం వంటి పరిణామాలతో విరక్తిచెంది 1938లో రాయ్ ‘లీగ్ ఆఫ్ రాడికల్ కాంగ్రెస్ మెన్’ను ఏర్పాటుచేశారు. దీని పర్యవసానమే ప్రత్యామ్నాయ సిద్ధాంతంగా రాడికల్ హ్యూమనిజాన్ని ఆయన అభివృద్ధి పరిచారు. తన చివరిరోజుల్లో ఆయన దీనికే అంకితమయ్యారు.
రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతంతో పార్టీలకన్నా ప్రజల స్వేచ్ఛ, అభివృద్ధి, సాధికారత ముఖ్యమని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వర్తమాన కాలానికి సైతం ఎంతో ప్రాసంగికత గలది కావడం విశేషం. నూతన సోషల్ ఆర్డర్‌ను కూడా ఆయన పరిచయం చేశారు. మానవీయతకు పెద్దపీట వేశారు. అరుదైన విషయ పరిజ్ఞానంతో, వింగడింపుతో భారతీయ భావధారతో ‘న్యూ హ్యూమనిజం’ప్రణాళిక (మేనిఫెస్టో)ను ప్రకటించారు. ఈ మేనిఫెస్టో అంతకు వంద సంవత్సరాల క్రితం కారల్ మార్క్స్ ప్రకటించిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’తో సరితూగ గలదని, ఆ స్థాయిగల రచన అని, తన కాలానికి అదే నిజమైన ప్రజాభ్యుదయ ప్రణాళిక అని ఎందరో ప్రముఖులు కొనియాడారు. ఆ మానవాభ్యుదయ వాది, రాడికల్ హ్యూమనిస్టు 1954 జనవరి 25న కన్నుమూశారు.

చిత్రం..ఎం.ఎన్. రాయ్

-వుప్పల నరసింహం 99857 81799