AADIVAVRAM - Others

హాకింగ్ కలలు ఇలా సాకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన మాట్లాడలేరు. చేతులను కదపలేరు. కనీసం కదలలేరు. అయినా ప్రపంచం అబ్బురపడే పుస్తకాన్ని రాశారు. ఇదెలా సాధ్యం?.. సాంకేతిక పరిజ్ఞానం ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆధునిక టెక్నాలజీ గొప్పదనమిది. మానవమేధ, కృత్రిమ మేధ సమ్మేళనం సృష్టించిన సంచలనమిది.
ఇటీవల కన్నుమూసిన స్టీఫెన్ విలియమ్స్ హాకింగ్ ఆ చరిత్రను సృష్టించారు. ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అన్న ఆ అపురూప గ్రంథం తెలుగుతోసహా 40 భాషల్లో అనువాదమైంది. లక్షలాది ప్రతులు అమ్ముడయ్యాయి.
ఓ అరుదైన నరాల వ్యాధి కారణంగా కండరాల కదలిక లేక, శరీరంలో ఏ భాగం పనిచేయక చక్రాల కుర్చీకే పరిమితమైన భౌతికశాస్తవ్రేత్త హాకింగ్ అపురూప మేధ ప్రపంచానికి కంప్యూటర్ పరిజ్ఞానం వల్ల తేటతెల్లమయింది. అతని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేసి కేవలం దవడ దగ్గర గల ఒక కదలిక ఆధారంగా స్టీఫెన్ హాకింగ్ అనుకుంటున్న అక్షరాలు, కంప్యూటర్ తెరపై ప్రోది అయి పదాలుగా మారి క్రమంగా అది పుస్తక రూపం దాల్చింది. స్పెల్లింగ్ కార్డ్ సాంకేతిక పరిజ్ఞానం, వర్డ్ ప్లస్ సాఫ్ట్‌వేర్ ఆయన భావాలకు మాధ్యమంగా నిలిచింది. ఈక్వలైజర్ సైతం ఆయన ఆలోచనలను కంప్యూటర్ తెరపైకి తీసుకొచ్చింది.
మూడు దశాబ్దాలపాటు ఈ అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన ప్రపంచానికి జ్ఞానాన్ని పంచారు. అనేక ఉపన్యాసాలు (మాట రాకపోయినా) చేశారు. కొత్తతరం భౌతిక శాస్తవ్రేత్తలను ఉత్తేజపరిచారు. అల్బర్ట్ ఐన్‌స్టీన్ అంతటి భౌతిక శాస్తవ్రేత్తగా గుర్తింపు పొందారు.
ఈ అపురూప శాస్తవ్రేత్త ఆలోచనల్ని, అభిప్రాయాల్ని ప్రపంచానికి తెలియజేసేందుకు అతను పనిచేసిన విశ్వవిద్యాలయ విద్యార్థులు కంటికిరెప్పలా ఆయనను కాపాడుకున్నారు. నర్సులు, వ్యక్తిగత సిబ్బంది ఆయనకు అన్నీ సమకూర్చారు.
ఇంటెల్ అనే ప్రముఖ కంప్యూటర్ సంస్థ ఆయనకు వాయిస్ సింథసైజర్‌ను సమకూర్చింది. ఇది సూపర్ కంప్యూటర్‌కు అనుసంధానించబడిందంటారు. ఆయన దౌడ భాగంలో చిన్న కదలిక ఆధారంగా కంప్యూటర్ హాకింగ్ భావాల్ని రాస్తుంది. అంతేగాక వాటిని పైకి చదివే ఏర్పాటు చేశారు. ఆ ధ్వని స్టీఫెన్ ఆరోగ్యం ఉన్నప్పటి గొంతుకు సరిపోయేలా తీర్చిదిద్దడం ఓ విశేషం. కృత్రిమ మేధ, కంప్యూటర్ రంగం ఎంతగా అభివృద్ధి చెంది విశ్వ రహస్యాలను తెలుసుకోవడంలో ఉపకరించిందో దీనివల్ల బోధపడుతోంది.
21 ఏళ్లకే హాకింగ్ తన ప్రతిభను కనబరచి ఎందరినో ఆశ్చర్యచకితుల్ని చేశారు. అదే సమయంలో ఆయన మోటార్ న్యూరాన్ అనే అరుదైన నరాల వ్యాధి బారిన పడ్డారు. అనంతరం 50 సంవత్సరాలపాటు ఆయన కేవలం సంకల్ప బలంతో బతికారు. తాను చేయవలసిన పని ఎంతో మిగిలి ఉందని భావించి చేపట్టారు. అందుకు సాంకేతిక పరిజ్ఞానం సంపూర్ణ సహకారం తీసుకున్నారు. ఒకవేళ ఆ టెక్నాలజీ అందుబాటులో లేకపోతే ఆయనకు చెందిన అతి విలువైన సిద్ధాంతాలు, విషయాలు బయటి ప్రపంచానికి తెలిసేవి కాదు. బిగ్‌బ్యాంగ్ థియరీపై మరింత వెలుతురు ప్రసరణ జరిగేది కాదు. సైన్స్, ఫిజిక్స్, అంతరిక్ష రంగాలలో ఇంత లోతైన అవగాహన కొత్త తరానికి ఏర్పడేది కాదు.
ప్రముఖ ఖగోళ శాస్తవ్రేత్త గెలీలియో మరణించిన సరిగ్గా 300 సంవత్సరాలకు అదే రోజు స్టీఫెన్ ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. అంటే 8 జనవరి, 1942న కన్ను తెరిచారు. ఆయన ఐక్యూ అసాధారణం కావటంతో 20 ఏళ్లకే బిగ్‌బ్యాంగ్‌పై పిహెచ్.డి కోసం తన పేరును నమోదు చేసుకున్నారు. 21 ఏళ్ల వయసులోనే వ్యాధి సోకింది. అనంతరం కొన్నాళ్లకు శరీరం పూర్తిగా సహకరించక చచ్చుబడి పోవడంతో దవడ భాగంలో పని చేస్తున్న కండరం దగ్గర ఒక సెన్సర్ ఏర్పాటు చేయగా దాన్ని కంప్యూటర్‌లోని కర్సర్‌కు అనుసంధానించడంతో ఒక్కో అక్షరాన్ని ఆయన కంప్యూటర్ చూసి తనకు అవసరమైన అక్షరం దగ్గర కర్సర్ ఉన్నప్పుడు దవడను మెల్లగా కదలించడంతో కర్సర్ ఆ అక్షరాన్ని సెలెక్ట్ చేసేది. అలా సెలెక్ట్ అయిన అక్షరాలు పదాలుగా మారేవి. ఆ పదాలే అనంతరం వాయిస్ రూపంలోకి తర్జుమా అయ్యేవి. ఈ ప్రక్రియ ఆధారంగా ఆయన దశాబ్దాలపాటు శ్రమించి వ్యాసాలు, పుస్తకాలు రాశారు. ఉపన్యాసాలు ఇచ్చారు. తెలిసిన వారితో ముచ్చటించారు.
ఇది కదా కావలసింది. ఈ సంకల్పం, పట్టుదల, మేలిమి ఆలోచనలు, శాస్ర్తియ అవగాహన, ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుని అద్భుతాలను సృష్టించే తెగువ, నైపుణ్యం ఈనాటికీ అవసరం. హాకింగ్ ప్రతిపాదించిన సిద్ధాంతాలు, పేర్కొన్న అంశాలతోపాటు ఆయన కొనసాగించిన జీవన పోరాటం ప్రేరణగా తీసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. సృజన వైపు, పాజిటివ్ అంశాల వైపు దృష్టి సారించవలసి ఉంది. అప్పుడే యువతకు సార్థకత. ఊహకు రెక్కలు తొడిగి కొత్త ప్రపంచం ఆవిష్కరణకు ఆస్కారం ఏర్పడుతుంది.

వుప్పల నరసింహం 99853 81799