Others

చదువుల లక్ష్యం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువు ధ్యేయం ఏమిటన్నది మన పూర్వులు అనేక సందర్భాలలో చెప్పినవన్నీ అక్షర సత్యాలు. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. చదువుఎలా వుండాలో, గురువుఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో ‘్భగవతం’ చెప్పింది. అలాంటి పద్యాలను ఇపుడు పిల్లల చేత చదివిస్తే ‘కాషారుూకరణ’ అని, ‘సెక్యులర్ విధానం మంటకలసిపోతోంది’ అని కొందరు ప్రచారం చేస్తారు. ఇలాంటి విపరీత ప్రచారానికి మీడియా సైతం శ్రుతి కలుపుతుంది. రసజ్ఞత లేని చదువు నిరర్థకం అన్నాడు భాస్కర శతక కర్త. ‘విద్య యొసగును వినయము’ అని కూడా అన్నాడు. సదసద్వివేక చతురత కలుగజేసేది చదువుఅని పెద్దలు చెప్పారు. పరోపకారం, సహనం నేర్పేది విద్య అన్నారు. కానీ, ఇప్పుడు ఈ మాటలు ఎవరికీ పట్టవు.
నేటితరం పిల్లలు నేర్చుకునే విద్య పోటీ పరీక్షలలో విజయం పొందడానికి మార్గం చూపిస్తుంది. ఇందుకు ప్రాథమిక దశలోనే ప్రైవేటు బడుల్లో పునాది వేస్తున్నారు. ఈ విధానం ప్రభుత్వ పాఠశాలల్లో ఉండదు. తల్లిదండ్రులు ఆసక్తి చూపడంతో ప్రైవేటు పాఠశాలల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పిల్లలకు ప్రారంభం నుండి ఇంగ్లీషు మీడియం పనికిరాదని దానిని ఒక భాషగా నేర్పాలని బ్రిటిష్ వారు నిర్ణయించి ఆ విధానం అమలుచేశారు. ఆనాడు ఇంగ్లీషు బోధన నాల్గవ తరగతి నుండి ప్రారంభమయ్యేది. అప్పుడు ఉన్నత పాఠశాలల్లో కూడా నాలుగైదు తరగతులుండేవి. స్వాతంత్య్రం సిద్ధించిన కొంతకాలం వరకు అదే విధానం కొనసాగింది. తరువాత అది రద్దయిపోయి, ఇంగ్లీషు మీడియం ప్రవేశించింది. ఇంగ్లీషు మీడియమ్ లేని చదువు వ్యర్థమనే అభిప్రాయం ప్రబలిపోయింది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న మన పిల్లలు ఇంగ్లీషువారి వలె మాట్లాడలేరు. మనం మాట్లాడే ఇంగ్లీషు వింటే ఆంగ్లేయులు నవ్వుతారు. ఈ విషయం స్వానుభవంతో చెబుతున్నాను. నేను బెంగళూరులోని ఇంగ్లీషు బోధనా సంస్థలో కొంతకాలం శిక్షణ పొం దాను. అక్కడ ఉపాధ్యాయులంతా ఆంగ్లేయులే. ఇది 1970వ దశకం నాటి సంగతి. ఆంగ్లేయుల వలె మాట్లాడగల శక్తి కొద్దిమందికే పట్టుబడుతుంది. శిక్షణ వల్ల ఇలాంటి ప్రతిభ లభించడం సాధ్యం కాదు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేవారు ఇప్పుడు ఆర్థిక స్థోమత లేనివారే. ప్రతి పల్లెకు ఉదయం ఏడుగంటల నుండి నాలుగైదు ప్రైవేటు పాఠశాలల బస్సులు వచ్చి పిల్లలను సమీపంలోని పట్టణాలకు తీసుకువెళ్లి సాయంత్రానికి తిరిగి ఇళ్లకు చేరుస్తున్నాయి. తెల్లవారు జాము నుంచి పిల్లలకు తల్లిదండ్రులు డ్రస్సులు వేసి, బరువైన పుస్తకాల సంచులు వగైరాలు అందజేయడంలో నిమగ్నమైపోవాలి. ఈ విధంగా పిల్లలు పగలంతా పాఠశాలలోనే గడపాలి. ఇదివరకు ఇన్ని పుస్తకాలు లేవు. సంచులతో పుస్తకాలు తీసుకువెళ్లే పనిలేదు. ఆనాడు వారికి చదువురాలేదా? ఇంతకంటే బాగావచ్చింది.
ఎన్ని ఎక్కువ పుస్తకాలుంటే అంత చదువు వస్తుందనే భ్రమ నుండి తల్లిదండ్రులు బయటపడాలి. పుస్తకాల బరువు తగ్గించడానికి ఏవో ప్రయత్నాలు జరిగాయి కాని అవి తగ్గలేదు. సరికదా ఇంకా ఎక్కువయినాయి. చదువు అనేది జ్ఞానార్జన కోసమే కాని ఉద్యోగాలకి, డబ్బు సంపాదనకి కాదు. ఇంగ్లీషు బాగా మాట్లాడగలగడానికి విజ్ఞానశాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణితం వంటివి ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇలాటి విపత్కర స్థితిలో ప్రభుత్వం విద్యాశాఖను నిర్వీర్యం చేసి సంపూర్ణ అక్షరాస్యత పేరుతో నిష్ప్రయోజనమైన లెక్కలేనన్ని పథకాలను సృష్టించింది. వీటిని రద్దుచేసి ఇంగ్లీషు భాషను నాల్గవ తరగతి నుండి నేర్పాలి. కామన్ విద్యావిధానం అమలులోకి రావాలి. తెలుగు వాచక పుస్తకాలలో వ్యావహారిక భాషను తొలగించి భాషాభివృద్ధి కోసం శిష్టవ్యావహారికం ప్రవేశపెట్టాలి. తెలుగు భాష సౌందర్యము, నుడికారము పిల్లలు తెలుసుకోవాలి. సంప్రదాయ పద్యగద్యాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటవ తరగతి అని వ్రాస్తే గ్రాంథికమని, ఒకటో తరగతి అని వ్రాస్తే వ్యావహారికమనే భావనను తొలగించి ‘ఒకటవ తరగతి’ అని అలవాటు చేయాలి. వ్యావహారికం ముదిరిపోయి వెర్రితలలు వేస్తోంది. రెండురోజులు అని వ్రాయడానికి రెండ్రోజులు అని వ్రాస్తున్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలపైన ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. ఇందుకు సమర్థులైన అధికారులను సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికచేసి విద్యాశాఖకు పూర్వవైభవం తేవాలి. వివిధ సంస్థలు నిర్వహించే టాలెంట్ పరీక్షలు రద్దుచేయాలి. ఎల్‌కెజి, యుకెజిల పేరుతో పసిపిల్లలను ఇళ్లకు దూరం చేయకూడదు. అయిదు సంవత్సరములు వయసు నిండిన తర్వాతనే పిల్లలను పాఠశాలల్లో చేర్చాలి.

- వేదుల సత్యనారాయణ సెల్: 96183 96071