AADIVAVRAM - Others

బామ్మ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అద్భుతం మన కళ్ళ ముందు ఆవిష్కృతమైనప్పుడు మనకు తెలీకుండానే నోటి నుండి వావ్.. వామ్మో.. వంటి శబ్దాలు వస్తాయి. కానీ ఈ అద్భుతాన్ని చూసినవాళ్ళు మాత్రం ‘బామ్మో!’ అంటున్నారు. ఆమెను చూసినవారు ఎవరైనా ఇలాగే అంటారు మరి! ఎందుకంటే ఆమె వయస్సు తొంభై సంవత్సరాలు. ‘కాటికి కాలుచాచిన వయస్సులో ఏమిటీ పొయ్యే కాలం!’ అని చాలామంది అనుకుంటున్నా- ఈ బామ్మ లెక్కచేయదు. పైగా అలాంటివారిని చూసి జాలిపడి.. ‘మీరూ నాలా ఏదో వ్యాపకం పెట్టుకోండి. అప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు’...అని చెబుతుంది. అసలు ఈ బామ్మ గురించిన వివరాల్లోకి వెళితే...

ఈమె పేరు కిమికో నిషిమొటో. జపాన్‌లోని టోక్యోలో ఆమె నివాసం. జీవితంలో ఏదో ఒకటి చేయాలనే తపనతో, 72 సంవత్సరాల వయస్సులో ఆమె ఫొటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకుందట. అనుకున్నదే తడవుగా కొడుకు సహాయంతో ఫొటోగ్రఫీ బిగినర్స్ కోర్సులో చేరిందట.. తరువాత ఆమె నెమ్మదిగా సెల్ఫీల మోజులో పడిపోయింది. సెల్ఫీలు తీసుకోవడంలో రికార్డులు బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుందేమో!.. అన్నట్లుగా సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టింది ఈ బామ్మ. సాదాసీదా సెల్ఫీలు దిగుతుంటే ఈ బామ్మ గురించి మాట్లాడుకునేదేముంది?
సెల్ఫీలు తీసుకోవడానికి ఈమె రకరకాల విన్యాసాలు చేస్తుందిట! ఈ విన్యాసాలు చూస్తే ఎవరికీ కోపం కానీ, జుగుప్స కానీ కలగదు. కారణం ఆమె కేవలం హాస్యంతో కూడిన ఫొటోషూట్స్ మాత్రమే చేస్తుంటుంది.
పది సంవత్సరాలు ఇలాంటి ఫొటోషూట్స్ చేసిన తరువాత ఆమె 82 సంవత్సరాల వయస్సులో లోకల్ మ్యూజియంలో మొదటి ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఫలితంగా ఫొటోగ్రఫీలో ఈ బామ్మ పెద్ద స్టార్ అయిపోయింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం వల్ల ఓవర్‌నైట్ ఇంటర్‌నెట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ బామ్మ తన ఫొటోలను తీసుకునేందుకు ‘టి పోడ్ టైమర్’ అనే సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. ఫొటోలను ఎడిట్ చేయడం, ప్రదర్శనలో తనకు కావలసిన విధంగా అలంకరించుకోవడం వంటి పనులన్నీ కూడా ఈ బామ్మే సొంతంగా చేసుకోవడం విశేషం. తను తీసిన ఫొటోలను ‘అసోబొకానే’ పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేసింది. అసోబొకానే అంటే- లెట్స్ ప్లే అని అర్థం. ఈ ప దర్శన బామ్మకు ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది.
‘ఈ వయస్సులో ఇన్ని విన్యాసాలను ఎలా చేయగలుగుతున్నావు బామ్మా?’ అని ఎవరైనా అడిగితే... ‘జీవితంలో ఏదైనా సాధించాలంటే వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదు. చేసే పని ఇష్టంగా, సాధించాలన్న పట్టుదలతో చేస్తే చాలు. ఎవరైనా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఇంకా ఏమీ ఆలస్యం కాలేదు.. అనుకుంటూ కృషి చేస్తే చాలు’ అని చెబుతుంది ఈ బామ్మ. ఇంకో విషయం ఏమిటంటే ఇన్‌స్టాగ్రా మ్‌లో ఈ బామ్మకు నలభై ఐదు వేలమంది ఫాలోయర్స్ ఉన్నారు. మరి ఈమెను అద్భుతం అనుకోవాలో.. లేదో.. మీరే చెప్పండి!
*