Others

సోషలిస్టు వెనిజులాలో ఆకలి కేకలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనిజులా మరోసారి వార్తల్లోకెక్కింది. సోషలిస్టు దేశంగా చెప్పుకునే వెనిజులాలో ప్రజలిప్పుడు చంకకు జోలె వేసుకుని వలసలు పోతున్నారు. కేవలం సంవత్సర కాలంలోనే ఐదు లక్షల మంది పొరుగున వున్న ఈక్విడార్‌కు వెళ్ళారు. కారణం తమ దేశంలో ఆహారం దొరక్కపోవడమే, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడమే! పొరుగు దేశాలైన కొలంబియా, బ్రెజిల్‌కు సైతం వలసలు పెరిగినా, ఈక్విడార్‌కు తాకిడి ఎక్కువగా ఉంది. దాంతో అక్కడ వలసల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇది ఇంకా విషమిస్తోందని ఐక్యరాజ్యసమితి శరణార్ధి సంస్థ చెబుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు ఐదున్నర లక్షలమంది వెనిజులా ప్రజలు ఈక్విడార్ చేరుకున్నారని ఆ సంస్థ ప్రకటించింది.
ఈ శరణార్థులు పిల్లాపాపలతో, కొద్దోగొప్పో వెంట తెచ్చుకున్న సామాగ్రితో, కాలే కడుపులతో రోజుల తరబడి నడుస్తూనే ఉన్నారు. అలా నడిచి నడిచి ఎక్కడికో చేరుకుంటున్న వీరు పార్కుల్లో, ఖాళీ ప్రదేశాల్లో, వీధుల్లో కనిపిస్తున్నారు. అభిమానం వీడి చేయి చాచి, జోలెచాచి ‘్భక్షాందేహి..’ అంటూ తిరుగుతున్నారు. ఈ భీతావహ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈక్విడార్ ‘అంతర్జాతీయ సాయం’ కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడప్పుడే అలాంటిదేమీ దొరికే అవకాశాలు కనిపించనందున ‘వలసల అత్యవసర పరిస్థితి’ని ఆ దేశం ప్రకటించింది. ఈ భయానక పరిస్థితికి కారణం వెనిజులాలో సోషలిస్టు ఆలోచనలేనని ఆ దేశపు ప్రతిపక్షం, ఇతర రాజకీయ నాయకులు, విశే్లషకులు చెబుతున్నారు. ఊరేగింపులు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలతో ఆ దేశ రాజధాని కార్‌కస్ అనుదినం కంపించి పోతోంది.
వెనిజులా పూర్వ అధ్యక్షుడు ఛావెజ్ వీరావేశ సోషలిస్టు నినాదాల కారణంగా ఈ విపరిణామాలు అనివార్యమయ్యాయి. మార్క్స్-లెనిన్‌ల పట్ల వల్లమాలిన అభిమానంతో- లాటిన్ అమెరికాలో విఫలమైన సోషలిజాన్ని తన దేశంలో సవ్యంగా నడిపిస్తానన్న అతి విశ్వాసంతో ఛావెజ్ వేసిన తప్పటడుగుల పర్యవసానమే ప్రస్తుత దుర్భర పరిస్థితి. బంగారుగుడ్లు పెట్టే బాతును సోషలిస్టు ఆలోచనకు బలి ఇచ్చారని ఛావెజ్ వ్యతిరేకుల అభిమతం. తగిన ప్రణాళికతో, పరిస్థితులను అధ్యయనం చేయకుండా తీసుకున్న నిర్ణయాలు చివరికి సంక్షోభానికి దారితీశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తమవద్ద నిల్వలు అపారంగా కనిపించడంతో కన్నూమిన్నూ కానక సోషలిస్టు హామీలు గుప్పించాడు, ఉచితాలను ప్రకటించాడు. వ్యాపారాన్ని అసలు పట్టించుకోలేదు. ఇరుగు, పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు అంతంత మాత్రమే. దాంతో విదేశీ మారకం నిండుకుంది. చమురు ధరలు మునపటి కన్నా తగ్గాయి. మరో ఆదాయం లేదు. పరిశ్రమలు పెద్దగాలేవు. సోషలిస్టు ‘పూనకం’తో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించలేదు. దాంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ద్రవ్యోల్బణం పెరిగింది. ధరలు ఆకాశాన్ని తాకాయి. ఆహార పదార్థాలు, మందులు, నిత్యావసర సరకులు అన్నీ బ్లాక్‌మార్కెట్‌కు చేరాయి. సూపర్ మార్కెట్లు బోసిపోయాయి. ఎక్కడైనా కొన్ని సరుకులు కనిపిస్తే ప్రజలు దాడిచేసి దోచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు, కాల్పులు జరుపుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఈ దమనకాండలో ఎందరో మరణించారు. ఆకలితో అనేకమంది కన్నుమూశారు. రాజధాని కారకస్‌లో పూర్తిగా అరాచకం ప్రబలింది. తుపాకితో బెదిరించి దోచుకునే గ్యాంగులు తమతమ ‘శక్తి’ని ప్రదర్శిస్తున్నాయి. అసాంఘిక శక్తులకు అడ్డుఅదుపులేకుండా పోయింది. రాజధానిలోనే కాదు ఇతర నగరాల్లోనూ ఇదే కల్లోల పరిస్థితి కనిపిస్తోంది. ఈ భయానక దృశ్యం వెనుక ‘నీడ’లా వచ్చే అనేక సమస్యలు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇదీ సోషలిస్టు వెనిజులా దేశపు ముఖ చిత్రం!
ఒకరిపై ఒకరు ఆధారపడి, ఇచ్చిపుచ్చుకునే భావనతో, పరస్పర వాణిజ్య ప్రయోజనాలతో ప్రపంచం కొనసాగుతుండగా దానికి వ్యతిరేకంగా, సంక్షేమం మాటున సోషలిజం పేరున ఉచిత విద్యుత్, ఉచిత సౌకర్యాలు ప్రజలకు అందిస్తూపోతే, వనరుల సంగతి పట్టించుకోకుండా కేవలం ‘ప్రతిష్ట’కోసం పాకులాడితే ప్రజలు బిచ్చగాళ్లుగా మారారు. అదీ పరాయి దేశాల్లో.. ఇంతకన్నా అవమానం, అన్యాయం మరొకటి ఉంటుందా?
ఇంత జరిగినా, ఇంకా జరుగుతున్నా నోట్ల సంచులతో బజారుకెళ్ళి పిడికెడు గింజలు కొందామని చూస్తే అక్కడ ఖాళీ షెల్ఫ్‌లు వెక్కిరిస్తూ ఉంటే.. ఛావేజ్ ప్రియమిత్రుడు, ప్రస్తుత అధ్యక్షుడు నికలస్ మడూరోకు చీమకుట్టినట్టు కూడా లేదు. తన రాజకీయ గురువు చూపిన బాటలో నడుస్తున్నాడే తప్ప సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకునే ఆలోచనలు చేయడం లేదు.
పొరుగున ఉన్న పెరు, చిలీ లాంటి చిన్నచిన్న దేశాల్లో సైతం వామపక్ష తీవ్రవాదం, వామపక్ష భావజాలానికి ప్రజలు మద్దతునివ్వడం లేదు. పెరులోని షైనింగ్ పాత్ ‘మెరుపు’ ఎప్పుడో మాయమైంది. ఆ సంస్థ గెరిల్లాలు చెట్లు, పుట్టలకే పరిమితమయ్యారు. సుదీర్ఘ పోరాటం, వారు కంటున్న ‘కల’ నిజం కాబోవన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కొలంబియాలో ఫార్క్ గెరిల్లాలు ప్రభుత్వానికి లొంగిపోయి, ప్రధాన జనజీవన స్రవంతిని అనుసరిస్తున్నారు. వర్తమానంలో ఆయుధం అవసరం లేదంటున్నారు. ప్రజల సంక్షేమమే కీలకమని, వారిలో కలిసిపోయి పనిచేయడమే ముఖ్యమని తలచి ఆ మార్గంలోనే పయనిస్తున్నారు.
జగద్వితమైన ఈ పరిణామాలను పట్టించుకోకుండా, సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు- అవి ప్రజలపై చూపుతున్న ప్రభావాన్ని తిలకించకుండా- కాలం చెల్లిన భావాలకే, సోషలిస్టు ఆలోచనలకే పెద్దపీట వేయడంతో చివరికి ఏం జరిగింది? జాతి మొత్తం సంక్షోభంలో పడింది. లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా..’ అంటూ వలసబాట పడితే అది ఎవరికి ప్రయోజనకరం?
వీటినేవీ నికలస్ యడూరో పట్టించుకోక ‘రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న’ట్టు- దేశ ప్రజలు వలసలు పోతూంటే సోషలిస్టు పాఠాలు చదువుతూ కూర్చున్నాడు, ప్రజాప్రతినిధి, ప్రజానాయకుడికిది వనె్నతెచ్చే అంశమవుతుందా? నీరో చక్రవర్తికి, నికలస్ యడూరోకు ఏమిటి తేడా?...
పోనీ విప్లవ భావాలుగల పొరుగుదేశాలు, విప్లవకారులు, కుటీర పరిశ్రమల్లా విప్లవ సంస్థలను పెంచిపోషిస్తున్న వారు, మాదక ద్రవ్యాల సరఫరాతో, గంజాయి సాగుతో కోట్ల డాలర్లను వెనకేసుకుంటున్న ముఠాలు, గ్రూపులు ఈ అన్నార్తులను ఆదుకుంటున్నాయా?... లేదుగాక లేదు. విప్లవ సంఘీభావం అంజనమేసినా కనిపించని పరిస్థితి. తమతమ శిబిరాలను కాపాడుకునే పనిలో కాలం గడుపుతున్నారే తప్ప ద్రవ్యోల్బణంతో తల్లడిల్లుతున్న వెనిజులా ప్రజలను ఏ లాటిన్ అమెరికా విప్లవ సంస్థ, పార్టీ, సానుభూతిపరుడు ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటికీ తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని, సోషలిజం, కమ్యూనిజం దాని ద్వారానే నెలకొల్పుకోగలమని కలవరించే వారికి సోషలిస్టు వెనిజులా పెద్ద గుణపాఠంగా మిగులుతోంది. పరాయి ప్రాంతంలో బిచ్చమెత్తుకోవడం వెనిజులా ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నదా? ఆ జాతి ఔన్నత్యాన్ని నిలిపినట్టవుతున్నదా? లేదు...లేదు...లేదు! అయినా ఆ ఉటోపియన్ సోషలిజం కల ముందు, కమ్యూనిజం కానె్సప్ట్ ముందు మోకరిల్లడం మతి ఉండి చేసే పనేనా?... మతిలేని వాళ్ళుచేసే పనా?...
వనరులను సవ్యంగా వినియోగించుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఎకానమీ పొద్దుపొడిచిన సంగతిని గుర్తించకుండా, కృత్రిమ మేధ మార్క్స్ ఆలోచనలను వెక్కిరిస్తున్న సందర్భంలో, అసలు మార్క్స్ గతితర్క భౌతికవాదం తప్పుల తడకని చరిత్ర నిండా సాక్ష్యాలు కనిపిస్తున్నా ఈ తిరోగమనం ఏమిటి?
మానవ స్వభావానికి, ఆకాంక్షలకు, నూతన ఆవిష్కరణలకు- మార్క్స్ మూలసూత్రాలకు ఎక్కడా లంకె కుదరని తనం ప్రతి నిత్యం కళ్ళకు కనిపిస్తున్నా సిద్ధాంతం మత్తులో- చైతన్యం వైపు చూసేందుకు ఇష్టపడక పోవడంతో వెనిజులాలో జరిగింది, జరుగుతున్నదేమిటో ప్రపంచ ప్రజలు తిలకిస్తున్నారు. కూడు, గూడు, గుడ్డకు కొదవలేని స్వర్గమని భ్రమసిన ‘సోషలిజం’ సమాజంలో అరాచకం ఏ స్థాయికి చేరిందో మీడియా, ఐక్యరాజ్యసమితి చాటిచెబుతున్నాయి.
ప్రజలు కాదు, మార్క్స్, ఆయన చెప్పిన సిద్ధాంతాలు ముఖ్యమని తలిచేవారి మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం కావలసిందే! ప్రజలుంటేనే మార్క్స్-మావోగాని మరొకరుగాని కనిపిస్తారు, వారి పేర్లు వినిపిస్తాయి. ప్రజల ఉనికికే ఆ సిద్ధాంతాలు ‘ఎసరు’తెస్తే ఎలా?... ప్రజలు సృష్టించే సంపద, వారివైన వనరులకన్నా మార్క్స్- మావో మాటలు ప్రాసంగికమైనవా? అవి నేతి బీరకాయలోని నెయ్యి లాంటివని అటు రష్యా, ఇటు చైనా, తూర్పు యూరప్ దేశాలు రుజువుచేశాక, లాటిన్ అమెరికాలోని నాయకులకు ఆ ‘సోయి’ లేకపోతే ఎలా? అశేష ప్రజలను తమ ముతక భావనలకు ‘బలి’ ఇస్తామనడం సమంజసమా? సోషలిస్టు ఆలోచనల దీనగాథకు నేడు వెనిజులా అద్దం పడుతోంది. ఇది ఇలాగే పునరావృతం అవుతూ ఉండాలా? ప్రజలు తమ సేద్యంతో సృష్టించుకున్న సంపదను, సాంకేతిక జ్ఞానాన్ని వనరులను అనుభవించాలా? ఈ ప్రపంచంలో హక్కు ప్రజలదే తప్ప మార్క్స్, లెనిన్, మావోలను విశ్వసించే వారిది ఏమాత్రం కాదు. ఓ రకంగా వారు పరాన్న భుక్కులు. వెనిజులా పాలకులకు, వారి మద్దతుదారులకు ఈ కనువిప్పు కలిగేదెప్పుడు?

-వుప్పల నరసింహం 99857 81799