Others

అక్షరాలా ‘ఆంధ్రకేసరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగ్రహ దీక్షలతో మహాత్మా గాంధీ స్వాతంత్య్ర సమరంలో జాతిజనులను సంఘటితం చేయగా, అదేస్థాయిలో పోరాట పటిమను చూపి- ‘గుండుకెదురుగా గుండె నిలిపిన’ ధైర్యశాలిగా ప్రకాశం పంతులు చిరస్థాయి కీర్తి గడించారు. ప్రకాశం చూపిన తెగువ ఆనాడు దక్షిణాదిలో సంచలనాలు రేకెత్తించి, ప్రజల్లో స్వరాజ్య కాంక్షను పెంచాయి. గాంధీ చేపట్టిన ‘ఉప్పు సత్యాగ్రహం’ స్వాతంత్య్ర సమరానికి గట్టి పునాది వేయగా, దక్షిణ భారతంలో ఆ ఉద్యమాన్ని కొత్తపుంతలు తొక్కించిన జాతీయవాదిగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలిచారు.
బ్రిటిష్ పాలకులు ఉప్పుపై సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1930 మార్చి 12న గుజరాత్‌లోని ‘దండి’ వద్ద సత్యాగ్రహ దీక్ష ప్రారంభించారు. ఈ ఉద్యమమే చరిత్రలో ‘దండి యాత్ర’గా వాసికెక్కింది. ‘దండి యాత్ర’ గురించి తెలిశాక ప్రకాశం పంతులు ‘తెల్లదొరల’పై కదం తొక్కారు. ఏ నాయకుడూ సాహసించని రీతిలో ఉప్పుపై పన్నును నిరసిస్తూ అసెంబ్లీలో గళం విప్పారు. కేవలం ప్రసంగానికే ఆయన పరిమితం కాలేదు, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఢిల్లీ నుంచి బయలుదేరి గుంటూరులోని సత్యాగ్రహ శిబిరానికి చేరుకున్నారు.
1930 మార్చి 18న అసెంబ్లీలో ప్రకాశం ప్రమాణ స్వీకారం చేశాక, మరుసటి రోజే ‘దండి యాత్ర’ను సమర్థిస్తూ ఆత్మప్రభోదంతో రాజీనామా చేశారు. ‘ఉప్పుపై పన్ను అపవిత్రమైనది.. పేద ప్రజలు భరించలేనిది.. ఇన్నాళ్లూ మీరు తీసుకున్న పన్నులు చాలవా? ఇక్కడి నుంచి నేను నేరుగా సత్యాగ్రహ శిబిరానికి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు.. ఇప్పుడు మాట్లాడింది నేను కాదు.. నా ఆత్మ.. నిజంగా ఇదంతా నా ఆత్మప్రభోదమే అని నా విశ్వాసం..’ అని ప్రకాశం ప్రసంగించారు. తన మాటలను సాకారం చేసుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టమని ఆయన అభివర్ణించారు. ఢిల్లీ నుంచి మద్రాసు వెళుతూ మార్గమధ్యంలో కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య తదితర ప్రముఖులు పాల్గొన్న ఆ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశారు. ఉప్పుపై సుంకాన్ని వ్యతిరేకిస్తూ 1930 ఏప్రిల్ 6నుంచి 13వ తేదీ వరకూ ‘జాతీయ వారం’ (నేషనల్ వీక్) పాటించాలని నిర్ణయించారు. గుంటూరు, మైపాడు, బందరు, మెట్టుపాలెం, కాకినాడ వంటి ప్రాంతాల్లో జరిగే సత్యాగ్రహ దీక్షల్లో పాల్గొనాలని ప్రకాశం నేతృత్వంలో నేతలు తీర్మానించారు. ఆ సమయంలో మద్రాసులో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. సి.రాజగోపాలచారి తంజావూరు ప్రాంతంలో ఉద్యమం నడిపేందుకు వెళ్లగా, శ్రీనివాస అయ్యంగార్, సత్యమూర్తి వంటి నేతలకు మద్రాసులో ఉద్యమంలో పాల్గొనేందుకు ధైర్యం లేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రకాశంపైనే భారమంతా పడింది.
1908 నుంచి పంతులుగారు మద్రాసు వాసులకు చిరపరిచితులే. ఉద్యమ కార్యకలాపాల కోసం మద్రాసులో ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని దానికి ‘ఉదయ వనం’ అని నామకరణం చేశారు. అక్కడే ఆయన తన కార్యాచరణ ప్రారంభించారు. దుర్గాబాయి వంటి మహిళా కార్యకర్తలను ప్రోత్సహించి ‘ఉదయ వనం’లో ఉప్పు ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. ఉద్యమంలో మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని ఆయన భావించారు. మద్రాసులో ఉంటూ తెలుగుసీమలోని గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉద్యమం సాగుతున్న తీరుతెన్నులను ఆయన తెలుసుకునేవారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి సత్యాగ్రహుల్లో ధైర్యం నింపేవారు. దేవరంపాడులో సముద్ర తీరాన ఉన్న తన సొంత భవనం వద్ద ఉప్పు పండించమని, కనపర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉప్పు గిడ్డంగిపై దాడి చేయాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదేశాలిచ్చేవారు. దేవరంపాడులో ఉప్పు ఉత్పత్తిని చూసి పోలీసులు సైతం విస్మయం చెందేవారు. వావిలాల గోపాలకృష్ణయ్య, సాగి విజయరామరాజు (ఉప్పురాజు) వంటి నాయకుల సహకారంతో ప్రకాశం తన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఉప్పు సత్యాగ్రహానికి తన భవనాన్ని అంకితం చేశారు. త్యాగం, దేశభక్తి, లక్ష్యసాధనకు సజీవ తార్కాణమైన ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తిని పొందేవారు. ఒకానొక సమావేశంలో ప్రకాశం పంతులు మాట్లాడేందుకు సిద్ధపడుతుండగా, మశూచితో బాధపడుతున్న ఆయన రెండవ కుమారుడు మరణించాడని ఎవరో నిర్థారణ కాని వార్త చెప్పారు. అది విని- ‘వాడు చనిపోయి ఉంటే ఈ సమరంలో ముందుగా ప్రాణాలు కోల్పోయిన వాడవుతాడు..’- అని సభను సంపూర్ణం చేశారు. ఇంతటి దీక్ష, దేశభక్తిని చూసి అక్కడివారంతా విస్మయం చెందారు. ఇంటికి వెళ్లాక తన కుమారుడు వైద్య సాయం పొందుతున్నట్లు ఆయన తెలుసుకున్నారు. అలాగే, మరో సమావేశంలో ప్రజలను బెదరగొట్టేందుకు పోలీసులు గుర్రాలతో బీభత్సం సృష్టించారు. దీంతో ప్రకాశం పోలీసులపై విరుచుకుపడి- ‘సభను చెదరగొట్టాలని మీరు భావిస్తే నాలాంటి వారిపై నుంచి గుర్రాలను పోనీయండి.. అమాయకులపై ప్రతాపం వద్దు..’ అని ఆవేశంగా అన్నారు. దీంతో గుర్రాలను తీసుకుని పోలీసులు అక్కడి నుంచి జారుకున్నారు.
1930 ఏప్రిల్ 13న మద్రాసులో ప్రకాశం తన అనుచరులతో భారీ ఊరేగింపు జరిపి ట్రిప్లికేన్ బీచ్ వద్ద ఉప్పు తయారు చేయడానికి ఉపక్రమించారు. పోలీసులు ప్రకాశంతో పాటు కాశీనాథుని నాగేశ్వరరావు తదితరులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా ప్రజలు పెద్దసంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. దారిపొడవునా జనం ప్రకాశం పంతులుకు పాదాభివందనాలు చేసి, ‘్భరత్‌మాతాకీ జై, ప్రకాశం జై’ అని నినదించారు. సాయంత్రం వేళ పోలీసులు విడుదల చేశాక ఆయన బీచ్‌కు చేరుకుని బహిరంగ సభలో మట్లాడారు. ఆ రోజు పండించిన ఉప్పును వేలం వేయగా 800 రూపాయలు వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘించినందుకు ప్రకాశం తదితర నేతలకు పోలీసులు జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని చెల్లించక పోవడంతో ఏప్రిల్ 24న ప్రకాశంను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఏడాది జైలుశిక్ష, 400 రూపాయల జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ప్రకాశం అరెస్టు నేపథ్యంలో మద్రాసులో పోలీసు కాల్పులు, హింసాకాండ చోటుచేసుకున్నాయి. జైలులో ఉండగా ప్రకాశం ఎన్నో పుస్తకాలు రాశారు. రాజకీయ అలజడి, అనారోగ్యం, సంపద హరించుకుపోవడం వంటి పరిస్థితుల్లో మానసిక క్షోభకు గురికాకుండా స్థితప్రజ్ఞతతో ఆయన జైలు జీవితం గడిపారు. బాధ, అసంతృప్తి లేకుండా మానసిక ప్రశాంతతతో సమయాన్ని సద్వినియోగం చేసుకుని విలువైన సాహిత్యాన్ని భావితరాలకు అందించారు.

- టంగుటూరి శ్రీరామ్ సెల్: 99514 17344