Others

యువత భవితకు భరోసా ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాణానికి రెండు వైపులు ఉన్నట్టే మంచీచెడూ అనేవి అన్ని వయసుల వ్యక్తులలోనూ ఉండటం సహజం. కానీ, ఆ చెడుల సంఖ్య పెరిగి సమాజమంతా వ్యాపిస్తున్నప్పుడే అది ఆందోళన కలిగిస్తుంది. అందులోనూ దేశ భవిష్యత్ భవనానికి మూలస్తంభాలుగా నిలవాల్సిన యువతరంలో చెడు అలవాట్లు, చెడు ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యం కలిగిన వారి శాతం ఎక్కువైతే అది మరింత ఆందోళన కలిగించక తప్పదు. పెద్దవాళ్ళకు కంటిమీద కునుకు పట్టనివ్వని సమస్యగా తయారవుతుంది. రోజూ పొద్దునే్న లేవగానే దినపత్రిక చేతిలో పట్టుకున్నా, టీవీ ఆన్ చేసినా కనిపిస్తున్న వార్తలు, దృశ్యాలు ఈ విషయానే్న చాటిచెబుతున్నాయి.
అవి ఎలాంటివంటే- ‘డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ యువతీ యువకులు..’, ‘తప్పతాగి కారు ర్యాష్‌గా డ్రైవ్‌చేస్తూ యాక్సిడెంట్ చేసిన టీనేజీ కుర్రాళ్ళు’... ‘ర్యాగింగ్ చేస్తూ ఓ విద్యార్థి మరణానికి కారణమైన సీనియర్లు...’, ‘నడిరోడ్డుమీద ఓ బాలికను వివస్తన్రు చేసి సామూహిక అత్యాచారం చేసిన మైనర్ యువకులు’!.. ఇలాంటివే ఇంకా చాలా చాలా.. ఇవి మచ్చుకు కొనే్న. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎవరికైనా మన యువత ఎందుకిలా చేస్తోంది? ఎటువెళ్తోంది ఈనాటి తరం?! వీళ్ళు ఇలా చెయ్యటం వల్ల వారి భవిష్యత్తుతోపాటు దేశ భవిష్యత్తుకూడా ప్రమాదంలో పడబోతోంది కదా?’అన్న ప్రశ్నలు మనల్ని భయపెట్టక మానవు. అందరూ అని కాదు గానీ.. చాలామంది యువతీ యువకులు నేడు పెడదారి పట్టి సమాజానికి సమస్యాత్మకంగా తయారవుతున్నారు. ఇది అంగీకరించక తప్పని కఠోర సత్యం. దానికి కారణాలు తల్లిదండ్రుల నిర్లక్ష్యపు పెంపకమా? నాసిరకం చదువులా? వ్యవస్థలోని లోపాలా? అని ఆలోచిస్తే- ‘అన్నీ’ అని మనకుమనం సమాధానం చెప్పుకోక తప్పదు. తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు, అసంతృప్తులు, విభేదాలు, ఏమీపట్టనితనం.. వీటివల్ల పిల్లలు చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణకు, ప్రవర్తనా నియమావళికి, ఉన్నత విలువలకు అలవాటు పడలేకపోతున్నారు. ఉదయానే్న ఆరుగంటలకు ముందే సుప్రభాత సమయంలో పక్కమీదనుంచి నిద్రలేచి ప్రకృతిని ఆస్వాదించాలని, శారీరక వ్యాయామం చేయాలని, ప్రశాంతంగా ఉండే ఆ సమయంలో చదువుకోవాలనీ చాలామంది తల్లిదండ్రులు ఈరోజుల్లో పిల్లలకు చెప్పటం లేదు. క్లాసు పుస్తకాలతోపాటు జీవిత చరిత్రలు, పురాణ గ్రంథాలూ చదవాలనీ.. చదువుతోపాటు సంస్కారాన్నీ అలవరుచుకోవాలని విద్యార్థులకు ఏ ఉపాధ్యాయుడూ బోధచేయడం లేదు. మనసు పెట్టకపోయినా చచ్చేంత కష్టపడి చదివి పరీక్షలో ర్యాంకులు తెచ్చిపెట్టి ‘కాలేజీ చదువు’అనే వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని టీవీ ఛానళ్ళకెక్కి కాకుల్లా అరిచిమరీ చెబుతున్నారు. ఒకపక్క చక్కగా చదువుకుంటూనే మరోపక్క ఈ సమాజ స్థితిగతుల పట్ల, దేశ పరిస్థితుల పట్ల అవగాహన పెంచుకోమని రాజకీయాల మీదా ఓ కనే్నసి ఉంచమని మేధావులు, సామాజిక కార్యకర్తలు ఎవ్వరూ యువతకు చెప్పడం లేదు. ఎంతసేపూ ‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌వి కావాలి.. విదేశాలకెళ్ళి డాలర్లు బాగా సంపాదించాలి-’ ఇదే హితబోధ!
బారెడు పొద్దెక్కేదాకా పక్క దిగకుండా పడుకుని.. లేస్తూనే సెల్‌ఫోను టాక్‌లు, ముఖం కడుక్కోకుండానే ఫేస్‌బుక్‌లు తెరవటాలు, సోషల్ మీడియాలో పనికిమాలిన రాతలు రాయడాలు.. కాలేజీకెళ్ళి ర్యాగింగులు, వీధుల్లోకెళ్ళి బస్సులు, రైళ్ళు ఎక్కి సెల్ఫీలు దిగటాలు.. ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో సారం లేని వేస్ట్ఫుడ్ ఆరగింపులు, చీకటి పడగానే పబ్బులకు, క్లబ్బులకు వెళ్ళి మందుకొట్టడం... మాదకద్రవ్యాలు తీసుకోవడం... తెగవాగుతూ అర్ధరాత్రి వేళ రోడ్లమీద పడి ఫాస్ట్ డ్రైవింగ్‌లతో అమయాకుల ప్రాణాలు తీయడం.. ఇదే నేటి యువత దినచర్య కావటం పిల్లలతోపాటు పెద్దలూ తలలు వంచుకోవాల్సిన దుస్థితిని తెచ్చిపెడుతోంది.
ఇలా అయితే ఎలా...? మన యువశక్తి ఇలా నిర్వీర్యమైపోవలసిందేనా...? వేడి రక్తం ఇలా నిషాలో జోగితే... దురలవాట్లు, విచ్చలవిడితనంలోనే ఆనందం ఉందని అనుకుంటే రేపు దేశానికి దిక్కెవరు? ‘జీవితం అంటే ‘ఇంత’మాత్రమే కాదు... ఇంకా చాలాఉంది- నీకు తెలిసింది తక్కువ... తెలుసుకోవలసింది ఎంతో మిగిలి ఉంది’ అని ఏ గురువులు వాళ్ళకు తత్వాన్ని, ధర్మాన్ని ప్రబోధించగలుగుతారు.
యువతను ఈ దేశంలో ఎవ్వరూ పట్టించుకోరు.. అదే బాధాకరమైన విషయం. నడివయసు వచ్చినా తల్లిదండ్రులకు వాళ్ళ సుఖాలు సంతోషాలే కావాలి. పిల్లల పెంపకం కోసం ఎంతోకొంత త్యాగం చేయాలన్న ఆలోచన ఉండదు. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్ళకు ఎంతసేపూ జీతాల మీద, ప్రయివేట్ల సంపాదన మీదే ధ్యాస. అదనంగా ఇప్పుడు కొంతమంది అమాయకులైన విద్యార్థినుల మీద కనే్నసి చాటుమాటున భయపెట్టి లొంగదీసుకునే పనిలోకూడా ఉన్నారు. ఇక మేలైన విద్యావిధానాన్ని, పౌష్ఠిక ఆహారాన్ని, ఆరోగ్యవంతమైన హాస్టల్ జీవితాన్ని విద్యార్థులకు అందించాల్సిన బాధ్యతగల ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాలలో బిజీగా ఉండి యువతను నిర్లక్ష్యం చేస్తున్నారు. మెరికల్లాంటి రాజకీయ వారసులను తయారుచేయాల్సిందిపోయి కుటుంబ రాజకీయాలతో తమ పబ్బం గడుపుకుంటున్నారు. విద్యాభ్యాసం ముగించుకుని వచ్చిన నైపుణ్యం గలిగిన యువతీ యువకులకు ఉద్యోగాలు ఇవ్వవలసిందిపోయి తమ కొడుకులకు, కూతుళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారు. దాంతో- ఇన్నాళ్ళూ కష్టపడి చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాక.. జీవన భృతి లేక నిరాశానిస్పృహలకు లోనైన యువత పెడదారి పట్టడమో, ఆత్మహత్యలు చేసుకోవటమో చేస్తున్నారు.
ఇలా మొత్తానికి ఎలాగైతేనేం.. తలా ఒక చెయ్యివేసి యువతను యథాశక్తిన భ్రష్టుపట్టిస్తున్నారు. ఆ విధంగా ఈ సమాజానికి, ఈ దేశానికి పరోక్షంగా బోలెడు అన్యాయం జరిగిపోతోంది. ఈ విషయాన్ని ఇటు పెద్దలు, మేధావులుగానీ అటు ప్రభుత్వాలుగానీ పట్టించుకోవడం లేదు. పొద్దున లేచింది మొదలూ పిల్లల్ని, యువతను తిట్టిపోయడం.. ‘సమాజం పాడైపోతోందని’ విమర్శించటం తప్ప అందులో ‘తిలాపాపం తలాపిడికెడు’ అన్నట్లు తమ వాటా ఎంతో ఎవరికివారు బేరీజు వేసుకుని లెక్కలు చూసుకోవడం లేదు. ఎప్పటికయినా తమ తప్పుల లెక్క తేలాక అయినా పశ్చాత్తాప పడి చేసిన తప్పులు సవరించుకోవాలన్న బుద్ధిపుడుతుందేమో వేచి చూడాలి!
యువతలో కొంతమంది అమాయకత్వం వల్లో, అజ్ఞానం వల్లో కొన్ని తప్పులుచేసినా, కొన్ని ఆకర్షణలకు, వ్యసనాలకు లోనైనా... బాగా ఊహ తెలిసి.. కొంత తెలివిన పడ్డాక అయినా చేసిన తప్పులకు చెంపలేసుకుని జీవితాన్ని సరిదిద్దుకునేలా వారిని మంచి మార్గంలో నడిపించగలగాలి. తమ తప్పులకు కారణమైన వాళ్ళను.. తనకు మేలైన విద్యను, అవసరమైన కనీస వసతులను అందించని ప్రభుత్వాలను యువత ప్రశ్నించగలగాలి.. నిలదీయగలగాలి. దానివల్ల ముందుతరాలకైనా మంచి జరుగుతుందని ప్రభుత్వాలు గ్రహించగలగాలి. ఇలాంటి స్పృహ ప్రతి యువకుడిలో ఉంటే యువత భవిష్యత్తు బంగారంలా మారిపోవటమే కాదు, బంగరు దేశాన్ని మనం అందరం ప్రత్యక్షంగా చూడగలుగుతాం.

-డా. కొఠారి వాణీ చలపతిరావు 98492 12448