Others

అగ్గిబరాటా (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: బివి ఆచార్య
రచన: జి కృష్ణమూర్తి
కెమెరా: వరదరాజన్
కూర్పు: గోవిందస్వామి
నృత్యం: చిన్ని, సంపత్
కళ: నాగరాజన్
స్టంట్స్:
సంగీతం: విజయా కృష్ణమూర్తి.
నిర్మాత, దర్శకుడు: బి విఠలాచార్య

కర్నాటక రాష్ట్రం ఉడిపిలో జన్మించిన బి విఠలాచార్య బాల్యం నుంచీ హరికథలు, తోలుబొమ్మల ఆటలవంటి పలు కళారూపాలను అభిమానించేవారు. పలు జానపద కథల పట్ల మక్కువ చూపేవారు. 1949లో నాగ కన్నిక అనే కన్నడ చిత్రంతో ప్రస్థానం మొదలుపెట్టి, దాదాపు 60 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1955లో విఠల్ ప్రొడక్షన్స్‌పై తెలుగులో ‘కన్యాదానం’, ‘వద్దంటే పెళ్లి’, ‘పెళ్లిమీద పెళ్లి’, ‘అన్నాచెల్లెలు’ లాంటి సాంఘిక చిత్రాలు రూపొందించారు. తరువాత ‘జయ విజయ’తో మొదలుపెట్టి పలు విజయవంతమైన జానపద చిత్రాలు నిర్మించి విజయం సాధించారు. విఠల్ ప్రొడక్షన్స్ అండ్ కో పతాకంపై 1966లో వీరు రూపొందించిన చిత్రం ‘అగ్గిబరాటా’. 1966 జూన్ 2న ఈ చిత్రం విడుదలైంది.

చిత్రం ప్రారంభంలో సేనాని గజపతి (రామదాసు) తన సైన్యంతో అడవిలో బందిపోటు దొంగ రంగరాజును బంధిస్తాడు. అయితే, తనతో చేతులు కలిపి మహారాజును అంతంచేసి యువరాణిని, రాజ్యాన్ని వశం చేసుకొమ్మని బందిపోటు రంగరాజు సలహాయిస్తాడు. సేనాని గజపతి మాత్రం తన నమ్మినబంటు సలహాతో రంగరాజును అంతం చేస్తాడు. అతని పేరుతో మారువేషంలో తానే దోపిడీలు సాగిస్తాడు. మహారాజు అమరసింహుడు (మిక్కిలినేని) అడవిలో కార్చిచ్చులో మరణించాడని యువరాణి వాసవి (రాజశ్రీ)ని నమ్మిస్తాడు. ఆ రాజ్యంలో రామాపురం గ్రామానికి చెందిన రాజా (ఎన్టీఆర్), ఆ ఏడాది జరిగే ఉత్సవాల్లో వీరుల పోటీలో గజపతిని ఓడించి వీరఖడ్గం చేజిక్కించుకుంటాడు. యువరాణి రాజాకు బహుమానం ఇస్తూ తొలి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి పూలబంతి విసురుతుంది. పక్క గవాక్షం నుంచి గజపతి, రాజాపైకి కత్తిని విసురుతాడు. అది రాకుమారే విసిరిందని భ్రమపడిన రాజా, ఆ రాత్రి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమెను కత్తులతో బంధిస్తాడు. ఆపైన ఆమెనుంచి ఆమె తండ్రి గురించి, సేనాపతి గురించి తెలుసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. వీరుని గురించి, వారి ప్రణయం గురించి తెలుసుకున్న గజపతి, యువరాణితో బలవంతంగా పెళ్ళికి సిద్ధపడతాడు. రాజా తన స్నేహితులతో కలిసి మారువేషంలో వచ్చి యువరాణిని తీసుకెళ్తాడు. గజపతి, ఆమెను తిరిగి బంధించి రాజాను గాయపరుస్తాడు. గాయపడిన రాజా అడవిలో ఓ గుహలో మహారాజును, అతని విప్లవ సైన్యాన్ని కలుసుకుంటాడు. మహారాజుకు, యువరాణికి అండగా ఉంటానని మాట ఇచ్చి తిరిగి వెళతాడు. దారిలో రంగరాజు పేరుతో దోపిడీలు చేస్తున్నది గజపతేనని రాజా గ్రహిస్తాడు. కొండబూచాడు (ముక్కామల) సాయంతో రాజా కోటలోకి రాకుండా గజపతి కట్టడిచేయగా, గాలిపటం సాయంతో కోటలోకి ఎగిరి వెళ్ళి గజపతిని అంతం చేస్తాడు. మహారాజు అమరసింహుడు, రాజా యువరాణి వాసలిల వివాహం జరిపించి రాజ్యభారం అప్పగించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రాజా స్నేహితుడిగా బాలకృష్ణ, అతని జంటగా వాణిశ్రీ, మాంత్రికుడు బసవయ్యగా రమణారెడ్డి, ఇతర పాత్రల్లో మోతుకూరి సత్యం, కోళ్ళ సత్యం, విద్యశ్రీ మొదలైనవారు నటించారు. శౌర్యప్రతాపాలు కలిగిన అందమైన యువ వీరునిగా, రాజభక్తునిగా ఎన్టీ రామారావు అద్భుతంగా నటించారు. అందమైన యువరాణిగా, తండ్రికి దూరంకావటం, సేనాపతి కుయుక్తులకు లొంగిపోవలసి వచ్చిన నిస్సహాయత, వీరుడైన రాజాతో పరిచయం, ప్రణయం, స్వాంతన కలిగిన వాసవిగా రాజశ్రీ ఆకట్టుకునేలా నటించింది. మిగిలిన పాత్రధారులు పాత్రోచితంగా నటించారు.
తమిళ నటుడు రామదాసు ఈ చిత్రంలో విలన్ గజపతిగా పాత్రోచిత విలనీని ప్రదర్శించారు. హీరోతో పోరాటాల్లో, సాహసం చూపారు. ఈ చిత్రంలో యువరాణిని అంతఃపుర బందీగా ఉంచిన సేనాపతి, రాజా రావటంతో అతని భుజంపై చేయివేసి యువరాణి వద్దకు తీసుకెళ్లటం, వారిరువురూ తోటలోకి వెళ్ళాక గజపతిని రాజా బంధించటం, ఉద్యానవనంలో చక్కని వాటర్ ఫౌంటెన్స్, శిల్పాల సెట్టింగ్స్ మధ్య యుగళగీతం (రాజా, వాసవిలపై), మధ్యలో నోట్లో గుడ్డలు కుక్కి, కట్లతో పడివున్న గజపతి విడిపించుకో ప్రయత్నం చూపటం, మహారాజు అమరసింహుడున్న గుహలోకి ముసుగువీరులు ప్రవేశించి ఎన్టీఆర్‌పై తొలుత బల్లాలు విసరటం, మరోసారి మండుతున్న కాగడాలతో యుద్ధం, ఇండోసారి వాడికత్తులతో దాడి చేయటం.. ఈ మూడింటినీ రాజా ఎదుర్కొనటంలాంటి సన్నివేశాలు దర్శకుడు విఠలాచార్య సృజనాత్మకతకు అద్దం పడతాయి.
వివాహం తప్పించటానికి తమాషా గుర్రం తేవటం, ఇంగ్లీషు దొర వేషంలో రాజా, దొరసానిగా బాలకృష్ణ, మోడ్రన్ డ్రెస్‌లో వాణిశ్రీ గుర్రంతోపాటు చేసే డ్యాన్స్‌ను హాస్యం పుట్టించేందుకు తమాషాగా చిత్రీకరించారు.
రాజాను అడవిలో బంధించిన గజపతి అతన్ని కొరడాతో, కర్రతో ఎముకలు విరిగేలా కొట్టి మంటల్లో పడవేయమన్నపుడు ముసుగువీరులు రాజాను కాపాడి గుహకు చేర్చటం, గుహలో చికిత్సపొందిన రాజా అతికష్టంగా తేరుకుని చివరకి కత్తిదూసి గిరగిరా త్రిప్పటాన్ని అర్ధవంతంగా చూపిస్తూ సన్నివేశాన్ని రక్తికట్టించారు. ఎన్టీఆర్ కొండలమీద, లోయల్లో, గుర్రంపై వేగంగా స్వారీ చేస్తూ... ఒక్కసారిగా కళ్ళాలు వదిలేసి చివరిలో గాలిపటంతో కోటలోకి ఎగరటం అప్పటి సాహసోపేత సన్నివేశానికి పరాకాష్టగా చెప్పుకోవాలి.
ఇక విఠలాచార్య మార్కు మాంత్రికుడు, కొండబూచాడు ముక్కామల గుహ బయటకువచ్చి బసవయ్య రమణారెడ్డిని కొండతో, రమణారెడ్డి గోడతో ఢీకొనటం లాంటి పలు ట్రిక్స్, చివర రాజభవనంలో అద్దంలో చూసుకుంటూ ముక్కామల తానే మరణించటం లాంటి సన్నివేశాల్లో -శక్తికన్నా యుక్తి గొప్పదన్న సందేశం ప్రేక్షకులకు అందించడంలో విఠలాచార్య కృతకృత్యులయ్యారు. ఇలా పలు జనరంజకమైన సన్నివేశాలతో అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకులు విఠలాచార్య.
యువరాణి రాజశ్రీ వీరుడు రాజాను మనసులో తలచుకుంటూ అంతఃపురంలో చిలుకతో పాడే గీతం -పలుకవే నా రామ చిలకా/ పలకవే నాలోన పన్నీరు చిలుక (పి సుశీల- సినారె). ఉద్యానవనంలో ఎన్టీఆర్, రాజశ్రీలపై చిత్రీకరించిన యుగళగీతం (గజపతి మధ్యలో కనిపిస్తుంటాడు) -ఎందుకు కలిగెను ఎందుకుకలిగెను ఈ వింత (పి సుశీల, ఘంటసాల- సినారె). బాలకృష్ణ, వాణిశ్రీలపై అడవిలో చిత్రీకరించిన గీతం -చురుకు, చురుకు, చురుకు చూపునీది (ఎల్‌ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది -సినారె). ఎన్టీఆర్, రాజశ్రీ, బాలకృష్ణ, రామదాసు, వాణిశ్రీ తదితరులపై పెళ్ళి మంటపం ముందు గుర్రంపై డ్యాన్స్‌తో చిత్రీకరించిన చిత్రమైన గీతం (గుర్రం వేగంగా డ్యాన్స్ చేయటం, ఇంగ్లీష్ డాన్స్ స్టెప్పులను ఎన్టీఆర్, రాజశ్రీ వేయటం) -్ఛమ్ ఛమ్ గుర్రం చలాకి గుర్రం (గానం: ఎల్‌ఆర్ ఈశ్వరి, పిఠాపురం, బసవేశ్వర్, కెవిఆర్ ఆచార్య, రాఘవులు -రచన: కొసరాజు) లాంటి గీతాలు ఆకట్టుకుంటాయ. -నెలరాజు సైగచేసే, వలరాజు తొంగిచూసే, సిగపూల లోన, నగుమోము లోన వగలే వో చిందులేసే.. నారాయణరెడ్డి కలం వేసిన చిందులు, మైమరిపించేలా విజయా కృష్ణమూర్తి అందించిన స్వరాలు జమిలిగా ఈ గీతం మనోల్లాసాన్ని కలిగిస్తుంది. విఠలాచార్య సమర్పణలో సన్నివేశాలు, పాట, ఫైట్లు అర్ధవంతంగా, ఒకదాని వెనుక ఒకటి సంబంధం ఉండేలా రూపొందించటంతో అగ్గిబరాటా చిత్రం ఆకట్టుకుంది. జానపద చిత్రాభిమానులకు ఇది కనువిందు, వీనుల విందు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి