Others

ఆ ‘రజనీ’ స్వర మోహన గానము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1976లో, కోఠీలోని గాంధీ జ్ఞాన్‌మందిర్‌లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయిత సంఘం రాష్ట్ర మహాసభ జరిగింది. రజనీ (బాలాంత్రపు రజనీకాంతరావు) ఆ సభల్లో పాల్గొని ‘పాట’ గురించి మాట్లాడారు. నేను ఆయన్ని చూడ్డం అదే మొదలు. నాకప్పుడు 17-18 ఏళ్లు. లలిత గీతం పుట్టుపూర్వోత్తరాలను రజనీ ఆ ఉపన్యాసంలో గొప్పగా రికార్డ్ చేశారు. బెంగాలీ ప్రభావం ఆయనకి వంశపారంపర్యంగా సంక్రమించిన భాగ్యం. కర్ణాటక శాస్ర్తియ సంగీతాన్ని ఆయన కష్టపడి సాధన చేశారు. అరుదయిన ఆ నేపథ్యం నుంచే ‘రొబీంద్ షొంగీత్’- కర్ణాటక సంగీతాల మేలి కలయికగా తెలుగు లలిత సంగీతం ఎలా పుట్టిపెరిగిందో ఆరోజు రజనీ సోదాహరణంగా వివరించారు. అయితే రజనీ మాకు కొత్త కాదు. ఆయన రాసిన, స్వరపరిచిన, పాడిన పాటలు వింటూ- పాడుతూ పెరిగినవాళ్లం మేం. మా అమ్మమ్మ బొమ్మకంటి దుర్గమ్మ- బతికుంటే ఇప్పుడావిడకి 106 ఏళ్ల వయసుండేది! - దాదాపు ప్రతిరోజూ సూర్యాష్టకం (దండకం) పాడుతుండేది. రేడియోలో అదే అష్టకం- రజనీ, శ్రీరంగం గోపాలరత్నం, (ఎన్.సీ.వీ?) జగన్నాథాచార్యులు, రమణమూర్తి, వింజమూరి లక్ష్మిగార్లు పాడింది- తరచు వినబడుతుండేది. ఈ అష్టకంలో రజనీగారు భక్త్యావేదనలు పలికించే గద్గద స్వరంతో వచనం లాంటిది పాడేవారు. అదే దానికి హైలైట్ కూడా. ఇదంతా 1960 దశకం చివరినాటి మాట! నాకప్పుడు పదేళ్లుంటాయేమో. అయితే, హైదరాబాద్ అ.ర.సం. సభల్లో చూసిన- విన్న రజనీ వేరు. అప్పుడు ఆయన కళాకారుడు కాడు, సంగీత చరిత్రకారుడు! అటుతర్వాత రజనీగారి బహుముఖీనమయిన ప్రతిభ తాలూకు అనేక ఉజ్వల కోణాలను చూశాం. అది వేరే విషయం.
‘స్వర్గసీమ’ సినిమాకోసం భానుమతి చేత రజనీ పాడించిన ‘ఓ ఓ హో హో పావురమా!’ పాట దాని తాజాదనాన్ని ఏడు దశాబ్దాలపాటు నిలబెట్టుకోవడం చూస్తే ఆయన జీనియస్ ఎంతటిదో అర్థమవుతుంది. బెర్నార్డ్‌షా నాటకం ‘పిగ్మాలియన్’ ఆధారంగా తయారుచేసిన కథ ఇది. అత్యద్భుత సౌందర్య రాశిగా వీనస్ విగ్రహాన్ని చెక్కిన శిల్పి పిగ్మాలియన్. తన సృష్టిని తానే మోహించి, పిచ్చిపట్టిపోతాడు. అదే తీరులో ఓ సంపాదక మహాశయుడు తాను ఉద్ధరించిన ఓ నాటు కళాకారిణిని మోహించి కొంప గుండం చేసుకున్న కథ ఇది. ఈ ఆత్మముగ్ధుడి జీవితంలో చోటుచేసుకునే పెనుమార్పులకు తెరతీసే సందర్భం ‘పావురమా’ పాట. ఆ పాట బాణీలోనే మోహింపచేసే ధాతువును నిక్షిప్తంచేశారు రజనీ. అదీ ఆయన జీనియస్! జార్జ్ ఇలియట్ నవల ‘సిలాస్ మారినర్’ కథ ఆధారంగా తయారుచేసిన ‘బంగారు పాప’ సినిమాకోసం రజనీ రాసిన పాటల్లోకూడా ఇదే జీనియస్ తొణికిసలాడుతుంది. ‘శతపత్ర సుందరి’ పాటలు చదువుకుంటూ పోతుంటే, చెవిలో రజనీ గొంతు వినిపిస్తూపోతుంది. ఆలిండియా రేడియోలో ‘ఈ మాసపు పాట’ శీర్షికలో ఆయన పాటలు చాలానే వచ్చాయి. తను పాడినవే కాకుండా, మల్లిక్ లాంటి వాళ్లచేత పాడించిన పాటలూ ఉండేవి. నాకు బాగా గుర్తున్న అలాంటి ఓ పాట శ్రీశ్రీ మహాప్రస్థానంలోది- ‘చూడు చూడు నీడలు’. ఇక, అరవయ్యేళ్ల నవయువకుడిగా రజనీ రాసి- పాడిన ఉజ్వల ప్రేమగీతం, ‘ఆశా నా ప్రాణ సఖీ’ కూడా ‘ఈ మాసపు పాట’ శీర్షికలో వచ్చిందేనని గుర్తు.
1985 వేసవిలో - విశాఖపట్నంలో- రజనీకాంతరావుగారి అబ్బాయి వెంకోబ్‌తో దోస్తీ మొదలయింది. మేం ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో పనిచేసేవాళ్లం. వెంకోబ్ అప్పటికే డక్కన్ క్రానికల్‌లో చేరారు. టైమ్ దొరికినప్పుడల్లా వెంకోబ్‌ని పీడించి ‘రజనీ హిట్స్’ పాడించుకునేవాళ్లం. మేం అందరం ఆ రోజుల్లో హైదరాబాద్ మీద బెంగతో బాధపడుతుండేవాళ్లం. అంచేత, దాదాపు ప్రతి మెహ్‌ఫిల్‌లోనూ వెంకోబ్ చేత ‘దక్కన్ దివ్యభూమి’ పాడించుకుని యత్కించిత్ ‘తసల్లీ’ పొందుతుండేవాళ్లం. సంగీతం నుంచి సామాన్యుడికి దక్కే ఊరట తాలూకు మాధుర్యం తెలియనిదెవరికి? 2005 ప్రాంతంలో, నేను సంగీత్ థియేటర్ దగ్గిర్లో ఆఫీస్ తెరిచాను. ఆ దార్నే తన ఆఫీస్‌కి పోతున్న వెంకోబ్ అనుకోకుండా కనిపించారు ఓ రోజున. దాదాపు రెండేళ్లపాటు ప్రతి మంగళవారం వెంకోబ్ కలుస్తుండేవారు. మమ్మల్ని ‘ఆ రజనీకర మోహన గానము’లో ఓలలాడింప చేసేవారు. ఇలాంటి మరపురాని జ్ఞాపకాలు ఎన్నో వున్నాయి రజనీగార్ని ఆశ్రయించుకుని. మరోసారి మరికొన్ని...

- మందలపర్తి కిషోర్, 81796 91822