Others

సుప్త క్షణాల్లో నిశ్శబ్ద గీతికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్త క్షణాలు
రచయత్రి: స్వాతి శ్రీపాద
పేజీలు: 159, వెల: రూ.200
ప్రతులకు:
301, యమున అపార్ట్‌మెంట్స్
విశాల్‌మార్ట్ పక్కన, రామంతాపూర్
హైదరాబాద్- 500 013
మొబైల్ : 829 72 48 988
*
నిశ్శబ్దం జవాబైనపుడు మనసు కరిగి కాళ్లపై ఒలికి ప్రవహిస్తుందని.. చూపులు శూన్యం రాటకు బిగుసుకుపోయి.. ఊహలు చీకట్లో దారి తప్పిన పిట్ట పిల్లల్లా నలుదిక్కులా గొంతు చించుకుంటూ రెక్కల రెపరెపలతో పరుగులు తీస్తాయని’ అందమైన భావాలను ఆవిష్కరించిన కవయిత్రి స్వాతి శ్రీపాద ‘సుప్త క్షణాలు’ పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. వెచ్చని తలపులు కప్పుకున్న శిశిరపు శీల పవనం.. నిలువెల్లా మునివేళ్లతో తడిమి ఊసుల మధుర గానాలు వినిపించే వేళ.. కవయిత్రి స్వాతి శ్రీపాద సుప్త క్షణాల్లో నిశ్శబ్ద గీతికలకు చోటు కల్పించి తమ భావుకతను చాటుకున్నారు.. ఈ కవితా సంకలనంలోని అరువది నాలుగు కవితలు ఆమె సృజనాత్మకతకు అద్దం పట్టే విధంగా కొలువుతీరాయి. ఇందలి కవితలు.. పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. స్వాతి శ్రీపాదగారి కవితా పంక్తులు.. ఎవరూ దోచుకోలేని తలపు పొడుపైన.. నిక్షిప్తమైన వసంతం నీడలా ఎప్పుడూ సతత హరితమై కనువిందు చేస్తాయి.
ఒక్క క్షణం ఆగి ఆమె కవిత్వాన్ని పరిశీలిస్తే.. వెనె్నల్లో నానిన అక్షరాల తడి.. లోలోపలి పొరల్లో కొత్త గమకాలై రెపరెపలాడే సవ్వడిని వినిపిస్తాయి. ఒక్కో అక్షరం ఊహల పొరల మధ్య ఊపిరి పోసుకుని లోలోపలి ఆర్తిని అందుకుంటూ.. పాఠకులను అలరింపజేస్తాయి!
నిశ్శబ్దంలోనూ వౌన గీతికలను ఆలపిస్తాయి! స్వాతి శ్రీపాద కవిత్వం మసక వెలుగుల్లోనే ఉదయపు గాలి.. తూర్పారబట్టే పున్నాగ పూల వానలో.. రాలుతున్న సుగంధాల మధ్య తూనీగలా పరిగెత్తిన బాల్యపు రోజులు గుర్తుచేస్తుంది! అంతేగాక వసంతం వనె్నలు నెమరేసుకుంటూ వెనె్నల గీతాలు వినిపిస్తూ, కాస్సేపు గతం ఓ చిరునవ్వై తొంగిచూసి.. మరోసారి వెన్ను తట్టి ధైర్యమై భవిష్యత్తుకు పచ్చికవుతుంది. ఆమె కవితా పంక్తులు.. వెయ్యి కలలు వెయ్యి ప్రభలను గుర్తుచేస్తూ.. గూళ్ల గుహల నుండి గబ్బిలపు ఆవాసాల నుండి రెక్కలు కత్తిరించుకుని, మనసులో నాటుకుని, నులివెచ్చని వలపులు పాడుకుంటూ.. లోలోనికి పాకుతున్న ఒక తీయని మరపు మధ్య మరోసారి పునర్జన్మించినట్టు అనుభూతిని కలుగజేస్తాయి! మనిషిని మరో మనిషి జాజితీగలా అల్లుకు పోవడం ఒక రోజులోనే ఆలోచన్లతోనో జరుగదు కదా అని గుర్తు చేస్తాయి!
‘ఎలా చెప్పను?’ కవితలో కవయిత్రి ప్రకటించిన భావాలు ఆమె కవితా శక్తిని ప్రదర్శించేలా వున్నాయి. తూనీగల రెక్కల సౌకుమార్యం తూకం వేసే ఆలోచన... పెదవి చివర కదిలే విరహపు కెరటంలా వెచ్చని ఒక పలకరింపు ఒంటి మీద పాకిన ఘడియ కళ్ల వెనుక నిండు మేఘమై కదల్లేక మెదల్లేక ఆపసోపాలు పడే అవస్థ ఉబికొచ్చే నీటి ఊట ఎప్పుడైనా కొత్త కుండలా మాటల మధ్య చెమర్చక పోయాక ఎలా చెప్పను ఒక మనసంటూ వున్న నా ఉనికిని.. అంటూ.. రాసిన పంక్తులు ఆమె కవితాత్మకతను ప్రతిబింబించేలా ఉన్నాయి.
‘కలల సైన్యం’ కవితలో.. వెచ్చని గాలి ఊపిరి.. కనురెప్పల తలపులు ఓర వాకిలిగా చేరవేసిన మరు నిమిషం.. దాగుడుమూతల ఆటతో ఎక్కడెక్కడో మూలమూలల నుండి దాగిన కలలు పరుగెత్తుకు వస్తాయని చెప్పడం బాగుంది.. ‘నాకోసం.. ఒక పలకరింపు’ కవితలో.. మనసంతా బెంగపడి బెరుకు బెరుకుగా ఒక మసక వెలుతురు పరదాగా మారితే.. ఓ చల్లని పలకరింపు నిలువెల్లా ప్రవహించి నీ కోసం ఇదుగో నేనంటూ.. చక్కని ముగింపునిచ్చారు. ‘వెనక్కు తిరిగి చూస్తే..’ శీర్షికతో రాసిన కవితలో.. పెదవులపై అతికించుకున్న నాగరికత వెనక అది పట్టిన విహ్వలత అచ్చం అద్దం వెనకాల పూసిన కళాయిలాగే ఎర్రని చూపులు గుప్పుతుందని తేల్చి చెప్పారు. ఒక్కో అక్షరం.. ఊహల పొరల మధ్య ఊపిరి పోసుకొని లోలోపలి ఆర్తిని అందుకుంటూ ఇలా సావకాశంగా పలకరించినపుడు.. అణువణువుగా ఇంకి.. ఆత్మలోయల్లో జీవ నదియై పారుతుందని కవయిత్రి ప్రకటించడంలో ఔచిత్యం ఉంది.
‘అంతే కదా!’ కవితలోని పంక్తులు.. ఆశావహ దృక్పథాన్ని చాటేలా ఉన్నాయి! ఈ కవిత ఎత్తుగడ.. కొనసాగింపు - ముగింపు కవయిత్రి కవితాత్మక నేర్పరితనాన్ని చాటేలా ఉండటం విశేషం. మళ్లీ మళ్లీ వసంతాలు నాటుకుంటాను.. నా వెనక నీ చిరునామా చాటుకుంటాను అన్న పంక్తులు ఆశావాదానికి సంకేతంలా చెప్పడానికి యోగ్యంగా ఉన్నాయి!
‘ఉన్నచోటే...’ కవితలో గెలుపునకూ ఓటమికి మధ్య.. మిథ్యా రేఖలు ఎక్కడని గీసుకుంటాం? అని ప్రశ్నించిన తీరు బాగుంది. ‘పెద్ద శ్రమేమీ కాదు’ కవితలో.. నీకూ నాకూ మధ్య ఒక సన్నని జలతారు పరదాలా ప్రపంచం ఎన్ని అడ్డుగోడలు కట్టాలనుకున్నా.. కాలికింద తడినేలా నడినెత్తిన అండగా నీలికొండలా నిలిచినా.. ఆకాశం నవ్వూ నేనే అయినపుడు.. దారి పొడవునా ఊసుల విత్తనాలు నాటుకుంటూ పయనం చేయడం పెద్ద శ్రమేమీ కాదని చెప్పడం బాగుంది! ‘అమ్మ’ కవిత ఆలోచనాత్మకంగా మలచబడింది. ఎపుడూ ఆమె మాటల్లో వసంతమే పలవరిస్తుందేమో. మరి వేసవి వేడికి అమ్మ వెనె్నల శీతలమయ్యేది... శిశిరపు చలిగాలులకు అమ్మ ఒడి.. వేడిని దాచుకున్న, గొంగడి అయేది.. కాని కాలానికేం తెలుసు అమ్మంటే ఏమిటో దానికి అమ్మనేది ఉంటేగా అన్న పంక్తులు కవయిత్రి కలం బలాన్ని సూచించేలా ఉన్నాయి.
కవయిత్రి స్వాతి శ్రీపాద అడుగడుగునా తన కవిత్వంలో.. ఎండిపోయిన ఎడారి క్షేత్రంలో ఎప్పటికప్పుడు.. ఆశల తొలకరి జల్లులను కురిపించారు. చీకట్లూ వెలుగులూ ఏదైతేనేం.. ఒళ్లంతా కళ్లైన మనకు రంగులన్నీ కలబోసుకున్న చూపుల గుసగుసలతో ఆమె కవితలు సాంత్వననిస్తాయి!
కుత్సితాలు మటుమాయం చేస్తూ.. నా నేల తల్లి నలు చెరగులా మానవత్వం నాటుతావా.. రాబోయే ఉగాదికి పునాదివై.. పచ్చదనం అద్దుతావా..? అంటూ ఉగాది కవితను తీర్చిదిద్దారు. వసంతం ముగ్గులు వేసి.. సప్త వర్ణాల తోరణాల మధ్య, షడ్రుచుల నివేదనల మధ్య కొత్త ఉగాదికి స్వాగతం పలికారు. కాలానికి పరదాలు వేసి సరదాలు జీవితం చేసుకున్న ఆధునికత గురించి ‘కాలం’ కవితలో చక్కగా ప్రస్తావించారు.
‘అనాది నుండీ..’ కవితలో అమ్మతనం యొక్క గొప్పతనాన్ని ఉన్నతంగా చిత్రించారు. ఇలా ఎన్నో కవితలు ఈ గ్రంథంలో ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. సుప్త క్షణాల్లో నిశ్శబ్ద గీతికలుగా రూపుదిద్దుకున్న ఈ కవితలు కవయిత్రి ఆలోచనల చెలిమెల నుండి చక్కని భావుకతతో జాలువారాయి. అనుభూతులు, అనుభవాలు.. ఆకాంక్షలతో ముప్పేటా అల్లుకు పోయిన స్వాతి శ్రీపాద కవిత్వం పాఠకులను అలరిస్తుంది. ఆమె గుండెలో గుట్టుగా గుట్టగా సవ్వడి చేసే ఆలోచనలకు తడి ఆరని అక్షరాలుగా కవిత్వమల్లడంలో ఆమె ప్రతిన కానవస్తోంది. ఆమె కవిత్వంలో ఒక అనుభవం ఉంది. ఒక జీవితం ఉంది. జీవం ఉంది. జీవితంలోని సౌందర్యమూ ఉంది. అయితే అక్కడక్కడ పంటికింది రాయిలా.. అక్షర దోషాలు అడ్డు తగిలినప్పటికీ.. కవయిత్రి కవిత్వాన్ని ఆస్వాదించే క్రమంలో పాఠకులు పెద్దగా వాటిని పట్టించుకోరన్న విశ్వాసముంది. కవయిత్రి పేర్కొన్నట్లు.. నిశ్శబ్దం ఒక కాల బిలంలా అగుపించదు కాని.. కొంచెం శ్రమపడి శోధించగలిగితే చాలు మూగ పదాల్లో మోసుకొచ్చిన తేనె వాకలు అలౌకిక స్వప్న సీమల్లోకి అలవోకగా నదిపై తేలే పూరెక్కల పయనాన్ని తలపిస్తాయి. అలాగే ఆమె కవిత్వమూ అంతేనన్న భావన పాఠకుల్లో కలుగుతుంది. నర్మగర్భంగా ఆమె పండించిన భావాలను కొంచెం లోతుల్లోకి వెళ్లి చదువగలిగితే.. పాఠకులు కావలసిన అనుభూతిని పొందగలుగుతారు.

- దాస్యం సేనాధిపతి, 9440525544