Others

సున్నితం, సునిశితం సుబ్బరామయ్య చూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనభయ్యేళ్ల జీవితంలో అరవయ్యేళ్లు కథానికకే ధారపోసిన కృషీవలుడు పెద్ద్భిట్ల సుబ్బరామయ్య. జీవితం ఎంత దరిద్రంగా వున్నప్పటికీ దానే్న మనసారా ప్రేమించిన కొద్దిమంది గొప్ప కథకుల్లో ఆయన ఒకరు. కథానికలను ఎంత గొప్ప శిల్ప సంవిధానంతో రాసినప్పటికీ, ‘జీవఫలం చేదువిషం’ అనే వాస్తవాన్ని ఎన్నడూ దాచిపెట్టని మహోన్నత మూర్తిమత్వం సుబ్బరామయ్య గారిది. కర్కశమూ, కర్కోటమూ అయిన వాస్తవ జీవితాన్ని చిత్రించే క్రమంలోనే జీవిత వాస్తవాన్ని కళాత్మకంగా పొదగడం ఆయన ఎవరిదగ్గరా నేర్చుకున్నట్లు కనిపించదు. నిలువులోతున కప్పడిపోయిన నిజాన్ని సయితం స్పష్టంగా చూడగల నైశిత్యం, ఆ వాస్తవాన్ని ఉన్నదున్నట్లు చూపించగల నైపుణ్యం, కథకి స్పందించగల సున్నితత్వం- సుబ్బరామయ్య సొంతం! రెండు మూడు వందల కథలూ, అరడజను నవలలూ (నవలికలు?), వేలకొద్దీ ప్రహేళికలూ రాసినప్పటికీ తనను తాను కథానిక రచయితగానే లెక్కగట్టుకున్నారాయన.
బెజవాడలోని సత్యనారాయణపురం, మారుతీనగర్ వీధుల్లో తిరిగిన వాళ్లకి ‘దగ్ధగీతం’, ‘పూర్ణాహుతి’, ‘దుర్దినం’, ‘ఏస్ రన్నర్’, ‘కోరిక’, ‘కళ్లజోడు’, ‘శనిదేవత పదధ్వనులు’ లాంటి కథల్లోని చిన్నా పెద్దా పాత్రలు సుపరిచితాలే. వాళ్లలో అత్యధికులు దిగువ మధ్యతరగతి వర్గానికి చెందిన పట్టణవాసులే అయి ఉండడం యాదృచ్ఛికం కాదు- అది చారిత్రికం! కాలక్రమంలో ఈ ‘వర్గం’ ఉత్పత్తయిన క్రమాన్ని- కొడవటిగంటి కుటుంబరావుగారిలాగా- సుబ్బరామయ్య వివరించారు. అందుకే, ఆయన కథానికలు ‘ప్రొజాయిక్’గా వుండవు. అదే వర్గానికి చెందివుండకపోయినా, ఆయన కలిసి బతికింది మాత్రం వాళ్లతోనే. చుట్టాలింట్లో పెళ్లికి- కూతురుతో సహా వచ్చి చెప్పులు దొంగిలించి- దొరికిపోయే దౌర్భాగ్యుడి కథను చిత్రించడానికి ‘స్పందించే మనసు’ ఒక్కటీ వుంటే చాలదు. అలాంటివాళ్లని ఓ వెయ్యిమందినయినా చూసిన అనుభవం కూడా ఉండాలి. వాళ్లతో కలిసి టీ తాగి, సిగరెట్ కాల్చుకుని, ఎండలెలా మండిపోతున్నాయో చర్చించి వుండని రచయితకి ఇలాంటి కథానిక రాయడం సాధ్యం కాదనిపిస్తుంది.
‘నీళ్లు’ లాంటి కథలు తెలుగునాట విభిన్న ప్రాంతాలు అనుభవించే భిన్న సమస్యలని అద్భుతంగా చిత్రిస్తాయి. ఈ కథ ఏకకాలంలో ‘అంతర్-బహిర్ యుద్ధారావం’ లాంటిది. సామాజిక- మానసిక ప్రపంచాల మధ్య సరిహద్దుల్ని చెరిపేసే ఇలాంటి కథలు మనకి చాలా తక్కువ. పెద్ద్భిట్లగారు రాసిన ‘నీడ’ ఓ చిత్రమయిన కథ. మనిషిని పోలిన మనుషులు ఉండడం ఇతివృత్తంగా చాలా కథలు వచ్చాయి. సత్యజిత్ రాయ్ ఇదే ఇతివృత్తంతో రాసిన కథలు సుప్రసిద్ధం. సుబ్బరామయ్యగారు కూడా ఈ ఇతివృత్తంతో చాలా కథలు రాశారు. వాటిలో సరదా కథలూ ఉన్నాయి. తన వ్యక్తిగత అనుభవాల గురించి వివరిస్తూ, ఆ కథలన్నింటికీ ఆ వాస్తవ సంఘటనలే స్ఫూర్తి అనేవారు సుబ్బరామయ్యగారు. ఇతివృత్తంతో సంబంధం లేని ఓ సామాన్య గుణం సుబ్బరామయ్యగారి కథల్లో కనిపిస్తుంది. అది మనుషులమీద అభిమానం. ఓ వేశ్యకి, విచిత్రమయిన పరిస్థితుల్లో రజని అనే ఓ వితంతువు పరిచయమవుతుంది. ఆమెకి ఓ బిడ్డ. వేశ్య సావిత్రి ఓ రాత్రి వృత్తిమీద బయటికి బయల్దేరుతూ, రజని బిడ్డని భుజాన వేసుకుని వెళ్తుంది. ఆమెని పోలీసులు పట్టుకుని సెల్లో వేస్తారు. అర్ధరాత్రి వేళ బిడ్డ ఆకలికి ఏడుపు మొదలెడుతుంది. బిడ్డకి పాలు పట్టమని పోలీసులతో సహా అంతా సలహా ఇస్తారు. కానీ, సావిత్రి అలా చెయ్యదు. ‘వేశ్యకి బిడ్డ అడ్డం’ అనే సామెత నుంచి ఈ కథ పుట్టిందని నాకనిపించి ఆయన్ని అడిగాను. ఆయన చిన్నగా నవ్వి ‘‘కథలు అంత చిన్న కారణాలతోనూ, ప్రేరణలతోనూ పుట్టుకురావు’’ అన్నారు.
పెద్ద్భిట్ల సుబ్బరామయ్య మొదటి కథానిక రాసిన సంవత్సరమే- నేను పుట్టాను. నాకు పదిహేనేళ్లపుడు సుబ్బరామయ్యగారు మా ఊరొచ్చి అ.ర.సం. సభలో మాట్లాడారు. ఆయన మంచి వక్త. తక్కువ సమయంలోనే, చెప్పదల్చుకున్న విషయాలన్నీ స్పష్టంగా చెప్పగల ప్రజ్ఞ ఆయన సొంతం. సుబ్బరామయ్యగార్ని రెండు మూడుసార్లు ఇంటర్వ్యూ చేసే అవకాశం కూడా నాకు దక్కింది. మాకు ముందరి తరం వాళ్లూ, మా తరం పాఠకులూ, మా తర్వాతి తరం వాళ్లూ సుబ్బరామయ్యగారు రాసిన కథలు చదువుకుని పెరిగినవాళ్లం. నా చిన్నపుడు సుబ్బరామయ్యగారు రాసిన నవలిక (పంజరం?) ‘ప్రగతి’లోనో, ‘ప్రతిభ’లోనో చదివిన జ్ఞాపకం ఉంది. కార్మికవాడలో జరిగినట్లు రాసిన ఆ కథ చదివితే, అక్కడి మనుషులంటే పెద్ద్భిట్లగారికి ఎంత ప్రేమో అర్థమవుతుంది. తను పాత్రలుగా మలిచిన మనుషులమీది ప్రేమే ఆయన విశిష్టత.
‘బడుగు జీవుల బతుకు బాధల్ని విన్నంత కన్నంత అక్షరీకరించిన రచయిత’గా ఒకరు ఆయన్ని అభివర్ణించారు. ‘దళిత బ్రాహ్మణుల చరిత్రకారుడి’గా ప్రముఖ కవి ఒకరు ఆయన్ని గుర్తించారు. ‘బాల్యం పారేసుకున్న భవభూతి భ్రాత’గా మరో రచయిత పెద్ద్భిట్లని చిత్రించారు. మునిపల్లె రాజుగారన్నట్లు ఇవన్నీ వాస్తవాలే కావచ్చు కానీ, అన్నీ అండర్ స్టేట్‌మెంట్లే. పెద్ద్భిట్ల సుబ్బరామయ్యగారి విస్తృతి ఎంతటిదంటే, ఆయన రచనా ధోరణిని సామాన్యీకరించడం దాదాపు అసాధ్యం. అలాంటి రచయితకి సవినయంగా నివాళి అర్పించుకోవడం తప్ప మనబోటివాళ్లు చెయ్యగలిగేదేముంది?

- మందలపర్తి కిషోర్ 81796 91822