AADIVAVRAM - Others

సర్ప రక్షకుడు ధనుష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాము పేరు చెబితే భయంతో పది గజాల దూరం పరుగెత్తడం సగటు వ్యక్తి లక్షణం. జనావాసాల్లోకి వచ్చే పాములను చంపి పారవేయడం స్వర్వసాధారణం. సర్పజాతి అంతరించిపోతే మానవ మనుగడ ప్రమాదంలో పడుతుందని గుర్తించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మంది యువకులు పాములను పరిరక్షించేందుకు ప్రెండ్స్ ఆఫ్ స్నేక్ గ్రూప్‌గా జతకట్టారు.
ఈ గ్రూప్‌లో పటాన్‌చెరుకు చెందిన ధనుష్ కూడా సభ్యుడు. విషం చిమ్మే నాగు పామైనా, మనిషిని మింగే కొండ చిలువైనా సరే ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా వాటికి ఎదురెళ్లి పట్టుకుని అటవీ శాఖ అధికారుల సహకారంతో సురక్షితంగా వదిలిపెడుతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవల సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ ఆవరణలోకి సుమారు పది పీట్ల పొడవున్న జెర్రీపోతు పామును అక్కడి సిబ్బంది గుర్తించారు. వెంటనే ధనుష్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లినా సాయంత్రం కావడం, వర్షం కురియడంతో పామును పట్టుకోవడం సాధ్యపడలేదు. ఆ పాము ఏ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని మార్క్ చేసిన ధనుష్ అక్కడి సిబ్బందిని అప్రమత్తంగా ఉండి సమాచారం అందించాలని సూచించాడు. అతను సూచించిన ప్రదేశానికి పాము రావడాన్ని గమనించిన సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి ఆ పామును పట్టుకుని తీసుకువెళ్లాడు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ పామును చంపకూడదన్నారు. పామును చంపడం వల్ల ఇతర పాములు మరిన్ని వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక పామును చంపడం వల్ల ఇతర పాములు పగబట్టి వస్తాయనేది సరైంది కాదన్నారు. పామును చంపినప్పుడు సదరు పాము పెరామోన్స్ మస్క్ అనే కెమికల్‌ను విడుదల చేస్తుందని, ఆ కెమికల్ వాసనను గుర్తించి ఇతర పాములు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఇందుకుగాను కనిపించిన పామును చంపకుండా తమకు సమాచారం అందిస్తే పట్టుకెళ్లి అడవిలో వదిలివేస్తామంటున్నాడు. తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న సమయంలో సైన్స్‌లో పాముల గురించి తెలుసుకున్నట్లు తెలిపాడు. పామును ఏ విధంగా పట్టుకోవాలనే విషయంలో తాను ఎలాంటి శిక్షణ పొందలేదని, స్వతహాగానే అలవాటుపడినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5 వేల వరకు పాములను పట్టుకుని అటవీ శాఖ అధికారుల అనుమతి మేరకు శ్రీశైలం, వికారాబాద్ అటవి ప్రాంతాల్లో వదిలివచ్చినట్లు వివరించాడు. భారతదేశంలో అత్యధికంగా పాముకాటు మరణాలు రక్త పింజరి, కట్లపాము, నాగుపాము, చిన్న పింజర ద్వారా సంభవిస్తునట్లు పేర్కొన్నాడు. ప్రధానంగా పామును గుర్తించాలని, భయపడి చంపకూడదని సూచిస్తున్నాడు. పాము కాటుకు గురైనప్పుడు వేపాకు తినిపించడం, కట్లుకట్టి మంత్రాలు వేయడం లాంటివి చేస్తే ప్రాణాపాయం ఉంటుందని, పాము కరచిన చోట నీళ్లతో శుభ్రంగా కడగాలని, గంతులు వేస్తూ పరుగెత్తకుండా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాముకాటుకు విరుగుడు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. పామును పట్టుకునే సమయంలో తాను నాలుగు పర్యాయాలు కాటుకు గురైనట్లు స్పష్టం చేసాడు. మూడు సార్లు మాత్రం డ్రై బైట్ (కరచినా విషం విడుదల కాలేదు), ఒకసారి మాత్రం విషాన్ని విడుదల చేసిందని, ఆ సమయంలో శుభ్రంగా కడిగి పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లి చికిత్స చేయించుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. పాము కాటు విషానికన్నా మనిషి అధిక భయంతోనే మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసాడు. పంటలను నాశనం చేసే ఎలుకలు, ఇతర వాటిని పాములు పట్టుకుని తింటాయని, ఫలితంగా పంటల పరిరక్షణ అవుతుందన్నారు. జెర్రిపోతు పాము ఎలుకలను ఎక్కువగా తింటుందని, ఈ పాము అత్యంత పిరికిదని, మనిషిని చూస్తే పరుగు లంకించుకుంటుందన్నారు. నివాస ప్రాంతాలకు పాము ఎందుకొస్తుందనే విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. ప్రధానంగా ఎలుకలు, పందికొక్కులు, కప్పలు తిరిగే ప్రదేశాలకు పాములు వస్తాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఉంటే పాము రాదంటున్నాడు ధనుష్. పామును పట్టుకోవడానికి వెళితే సాధారణంగా 500 రూపాయలు తీసుకుంటామని, ఇది కూడా కేవలం రవాణా ఖర్చులకని, స్వచ్చందంగానే సర్పజాతిని రక్షించాలన్నది తమ లక్ష్యమన్నారు. ఎవరిని కూడా డిమాండ్ చేసి డబ్బులు తీసుకోబోమన్నారు. తాను పటాన్‌చెరు నుండి జహీరాబాద్ వరకు వెళుతుంటానన్నారు. మూడేళ్ల క్రితం గచ్చిబౌలి నల్లగండ్ల ప్రాంతంలో కొండచిలువను పట్టుకున్నట్లు తెలిపారు. చందానగర్ పాపిరెడ్డి కాలనీ సమీపంలో ప్రమాదకరమైన నాగుపామును పట్టుకున్నట్లు చెప్పాడు. ప్రతి ఆదివారం హైదరాబాద్ జూపార్కులో సమావేశమై పాములను పట్టుకునే విధానంపై చర్చాగోష్టి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజు వారిగా పట్టుకున్న పాముల వివరాలను గ్రూప్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ద్వారా తెలియజేస్తామని, గ్రూప్ నిర్ణయం మేరకు ఎక్కడ సూచిస్తే అక్కడ వదిలిపెడతామన్నారు. ఎక్కడ పాము కనిపించినా 9550886323 తన సెల్ నంబర్‌కు ఫోన్ చేస్తే వచ్చి పట్టుకుంటానని తెలిపాడు. కర్కషంగా పాములను చంపకుండా వాటి ప్రాణాలను పరిరక్షించడానికి ప్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ గ్రూప్ పని చేస్తుండటం అభినందనీయం.

-టి.మురళీధర్