Others

చిరస్మరణీయుడు పొట్లపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలితరం తెలంగాణ సాహితీవేత్తలలో పొట్లపల్లి రామారావుగారు విలక్షణమైన కవి, రచయిత, నాటక కర్త, కథకుడు. సాహితీ రంగంలో అన్ని ప్రక్రియలలో విశిష్టమైన కృషి సలిపి తమదైన ముద్రవేశారు. అధ్యయనం, ఆచరణ, ఉద్యమమే ఊపిరిగా బతికి తన జీవితాన్ని అక్షరబద్ధం చేసిన నిరుపమానమైన భూమి పుత్రుడు. తన మస్తిష్కాన్ని మధించి, అక్షరాలకు రూపమిచ్చి, జ్ఞానజ్యోతి సమారాధనలో, సృజించిన అమూల్యమైన సాహితీ సంపదను తెలుగువారికి అందించారు. వారి రచనలు ఎక్కువ శాతం అముద్రితలే. నిక్షిప్తమైన పెన్నిధి వంటిది వారి సృజన. వారి వౌనము, మాట్లాడిన మాటల మూటలు, మరుగున పడిన మరకతాలే. 1937నుండి 1997 వరకు వారు చేసిన సాహితీ సృష్టి కొద్దిగా మాత్రమే ముద్రితం. మిగతావి కొన్ని అముద్రితాలు. మరికొన్నింటి ఆచూకీయే లేదు. ఊరిని అత్యంత గాఢంగా ప్రేమించి ఆ ప్రకృతిలో తను భాగంగా బ్రతికారు. రామారావుగారు విలక్షణమైన వ్యక్తి. ఆజానుబాహువు, సాము గరిడీలలో నిష్ణాతుడు, పరాక్రమవంతుడు. వరంగల్‌లోని తొలి సత్యాగ్రహ జట్టులోని వారు. ఆ తదుపరి జైలుకు వెళ్ళటం కూడా జరిగింది.
గ్రంథాలయ ఉద్యమంలో పల్లగుట్ల పొట్లపల్లి రామ్‌గోపాల్‌రావు, పొట్లపల్లి రాఘవరావుగార్లలో ఘణపురం మిత్రమండలి వారితో కలిసి పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ సభయొక్క ప్రాంతీయ సభ సమావేశాల్ని పల్లగుట్టలో పొట్లపల్లి రామ్‌గోపాల్‌రావు, రాఘవరావుగారి ఇంట్లో నిర్వహించారు. సభకు మిగతా ముఖ్య నాయకులతోపాటు సర్దార్ జమలాపురం కేశవరావుగారు, పి.వి.నరసింహారావుగారు వంటి పెద్దలు పాల్గొన్నారు. పొట్లపల్లి రామారావుగారిది దృఢ శరీరము, చిత్తము. వారి ఉద్యమస్ఫూర్తి, రచనావిశిష్టత గొప్పది. ఎలాంటి ఆడంబరం, పటాటోపాలు లేని నిస్వార్థ జీవితాన్ని ప్రకృతి ఒడిలో గడిపిన రుషితుల్యుడు. జీవిత మలిదశలో అంతర్ముఖుడిగా ఉండి తన తాత్వికతను, మార్మికతను రచనల ద్వారా వ్యక్తపరిచారు. నైజామును, బ్రిటిష్‌వారిని, అప్పుడున్న భూస్వామ్య వ్యవస్థను, ప్రభుత్వ అధికారులను ఎండగట్టిన రామారావుగారు తరువాత కాలంలో తాత్వికుడిగా మారిపోయారు. ఏకాంతంగా ఉంటూ, ప్రకృతితో ప్రగాఢమైన ఆత్మీయ బంధాన్ని పెనవేసుకుని కాలం గడిపారు. ఆ దశలో జీవిత విశే్లషణతో కూడిన అనుభవపరమైన సత్యాలను ఆవిష్కరించారు. కోయ, గోండు జాతి వాళ్ళతో సన్నిహితంగా ఉండేవారు. పొట్లపల్లి వారి రచనలో ‘ప్రకృతి’ మూడో నేత్రంగా దాగి ఉంటుంది. తమ ఊరి చుట్టూప్రవహించే వాగు, చెట్లుచేమలు, పశుపక్షి కీటకాదులను ప్రేమించాడు. వాటితోనే సావాసం. మనుషులకన్నా మహత్తరంగా వాటిని ఇష్టపడ్డాడు. ప్రకృతి ఆరాధన ఆయన రక్తం, స్వభావంలో కలిసిపోయింది.
ప్రకృతి సహకారం రైతుకి ఉంది. ఆ రైతుని పీడించే రాజుకి బుద్ధిచెప్పాలంటే ప్రకృతికూడా తిరగబడాలని ఆయన రచనలు చెబుతాయ. భూమి, నాగలి, వాన, విత్తనం, నదులు అన్నింటినీ రాజుకి వ్యతిరేకం కావాలని కోరాడు. తాను ప్రకృతి ప్రేమికుడు కాబట్టి, ఆ ప్రకృతిని తన స్నేహ ధర్మంతో శాసిస్తున్నాడు. ప్రకృతిలో భాగమైన వ్యవసాయాన్ని, రైతుని దోపిడీచేసే ప్రభువులకి బుద్ధిచెప్పడానికి ప్రకృతి, పర్యావరణాన్ని ఆయుధాలుగా చేసుకున్న పొట్లపల్లికి ప్రకృతి విలువ తెలుసు. అతడొక అనంత ప్రకృతి ఆరాధకుడు. ఐతే ఆ ప్రకృతిని కాపాడడం కోసం ఉద్యమం చేయలేదు. కాని జీవితంలో దానిని కాపాడడం కోసం కృషిచేశాడు. దాని ప్రాధాన్యతని తన రచనలలో ఉటంకించాడు.
ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య విధ్వంసమే. మనిషిలో దాగిఉన్న ఈ లక్షణం రోజురోజుకి మరింత బయటపడుతున్నది. సామ్రాజ్యవాద పెత్తనాలలో ప్రాకృతిక సంపద హస్తగతం చేసుకోవాలనే ఆలోచన ఇమిడి ఉన్నది. దీనిని రామారావుగారు ఏనాడో గుర్తించారు. అందుకే ఆ ప్రకృతిని గౌరవిస్తూ తననితాను దానికి అంకితం చేసుకున్నారు. ఇది ఆయన ముందుచూపు. దూరంగా, ప్రశాంతంగా కనుపించే ఆయన అక్షరాల అంతరంగంలో కనబడని లావా కదలిక ఉందని చెప్పవచ్చు. ఆనాడు ‘నేనే తెలంగాణా’ అన్నంతగా ధిక్కరించిన స్వరమే రామారావుగారి కలానిది. ప్రకృతి వినాశాన్ని ముందే పసిగట్టి, విలువల పతనం గ్రహించినవారు కూడా ఆయనే. సాహిత్య విలువలను ప్రాకృతిక సంపద ప్రాధాన్యతను గుర్తించి సాహిత్యంలో తగిన స్థానం ఇచ్చినవారుకూడా ఆయనే. అందుకే వారు చిరస్మరణీయులు.

- పొట్లపల్లి వరప్రసాదరావు