Others

మద్యరహిత మహోదయం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్త వ్యసనాలలో అత్యంత వినాశకారి అయిన ‘మద్యపానం’ సరదాగా ఆరంభమై, ఆరోగ్య జీవన సౌభాగ్యాన్ని కబళించడమే కాక కుటుంబాలలో అశాంతి, ఆవేదనలను మిగులుస్తుంది. మరోవైపు సమాజాన్ని అధోగతి పాల్జేస్తుంది. దేవతల ‘సురాపానం’ మాట అటుంచితే, ప్రస్తుత నాగరిక సమాజం మత్తు వ్యామోహానికి బానిసలైన మందుబాబుల మానసిక మదోన్మత్తతతో అతలాకుతలమవుతోంది. బ్రిటిష్ దొరల వారసత్వంగా సంక్రమించిన ఈ దుష్ట సంస్కృతిని ఆదాయం పేరిట ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. తాగుబోతులకు అందుబాటులో మద్యం వుండేటట్టు చేసి, ఇల్లు, ఒళ్లు గుల్లచేసే ఈ వ్యసన పిశాచిని రాజకీయ అధికార పాలనా ధర్మంగా, సిగ్గెగ్గులు లేని బాధ్యత నిర్వర్తిస్తున్నాయి. జాతీయోద్యమ కాలం నుంచి మహాత్మా గాంధీ మద్యపాన నిషేధాన్ని ప్రబోధిస్తున్నా, నాడూ నేడూ ప్రభుత్వాలు నిషేధం అమలు చేయటం సాధ్యం కాదంటూ అపరిమితంగా వచ్చే ఆదాయం కోసం అర్రులు చాస్తున్నాయి. కుటుంబాలలో మహిళలు, వృద్ధులు, పిల్లల జీవితాలతో వ్యసనపరులు చెలగాటమాడుతున్నారు. నగరాలలో పేవ్‌మెంట్‌ల మీద జంతువులకంటే అత్యంత హీనంగా తాగిపడి వుండే వ్యసన మదోన్మత్తుల సజీవ కళేబరాలు నేటి సమాజం తీరుతెన్నులకు ప్రత్యక్ష సాక్ష్యం. మత్తు రుచి చూపించి విద్యార్థులు, యువతకు గాలం వేసి బానిసలుగా మార్చే దుష్ట మద్య వ్యాపారం వెల్లివిరుస్తోంది.
మద్యపాన వ్యసనం సృష్టించే అనైతిక, అరాచక, అసాంఘిక నేర ప్రవృత్తికి, సాధ్యమైనంతగా ఎక్కువ తాగవలసినదిగా (వ్యాపార ఆదాయం దృష్ట్యా) ప్రోత్సాహం అందించే ప్రభుత్వానిదే అసలు బాధ్యత. ‘డ్రగ్ కల్చర్’ మహానగరాలలో అతివేగంగా విస్తరిస్తూ యువతను ఊబిలో దించి దారుణ నేరాలకు, హింసా ప్రవృత్తికి, ఆత్మహత్యలకు కారణం అవుతున్నట్టే, మద్య వ్యసనం కోరలు చాచి విలయ తాండవం చేస్తోంది. అనె్నం పునె్నం ఎరుగని యువత స్నేహాల పేరిట మత్తుకు బానిసలై జీవితంలో ఏదీ సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు యువకులు మత్తులో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు లోనవుతున్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. బీడీ కట్టల మీద పుర్రె బొమ్మల ‘హెచ్చరిక’ సంకేతం ఇవ్వలేని ప్ర భుత్వాలు- జన సామాన్యానికి తాగునీటిని స్వచ్ఛంగా అందించలేకపోయినా, ప్రతి పల్లెలో మద్యం ఏరులై పారేటట్టు అన్ని అవకాశాలూ కల్పిస్తున్నాయి. ఓట్లు దండుకోవటం, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే మత్తులో కూరుకుపోయిన ప్రభుత్వాధినేతలు జనజీవన సంక్షేమాన్ని పట్టించుకొనే లక్ష్యాలకు నీళ్ళు వదిలి, జన సామాన్యానికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తున్నారు. సుర అంటే సారా, కల్లు. సురలోకం అంటే స్వర్గం. ప్రస్తుత అత్యాధునిక సమాజంలోని దినదినాభివృద్ధిగా పెరుగుతున్న వ్యసనపరులు స్వర్గం అంచులు చూస్తూ, కుటుంబాలలోని తల్లులకు, భార్యలకు, పిల్లలకు నరకం చూపిస్తున్నారు. సర్కారీ మద్య ప్రవాహ సరఫరాలు, ఇంటి ఇల్లాళ్ల పసుపు తాళ్ళు తెంచేస్తుంటే, ప్రభుత్వాలు పెన్షన్లు అందించలేక సతమత మవుతున్నాయి.
దేశంలో లిక్కర్ వినిమయం క్రమంగా తగ్గిపోయి, అంతిమంగా నిషేధం విధించే పరిస్థితి ప్రాప్తింప చేయటం ప్రభుత్వాల విధిగా రాజ్యాంగం 47వ అధికరణ నిర్దేశిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే ఎక్సైజ్ చట్టం వుండాలని శతాబ్ది క్రితం బ్రిటిష్ పాలకులు తెచ్చిన బిల్లు, స్థానిక పరిస్థితులను అనుసరించి కచ్చితంగా పరిమిత సంఖ్యలోనే లిక్కర్ విక్రయ కేంద్రాలు ఉండాలని సూచించింది. మద్యం రాబడి ‘కిక్కు’ తలకెక్కిన ప్రభుత్వాలు ఉదార హృదయాలతో లిక్కర్ మాఫియాను ఆదరించి పోషిస్తూ పచ్చని కుటుంబాలలో చిచ్చు రగిలిస్తున్నాయి. దీంతో మద్యం వినియోగం 60 శాతంగా, ప్రపంచంలో మన దేశం మూడవ అగ్ర స్థానానికి చేరింది. ఏరులై పారుతున్న మద్యం కౌమార ప్రాయంలోని యువతను ముంచేస్తోందన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంలో దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం- ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకొనేది’ అంటూ కొరడా ఝుళిపించినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. గుజరాత్, బిహార్, నాగాలాండ్, లక్షద్వీప్, మణిపూర్, కేరళ తరహాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించినప్పుడే రాజ్యాంగం ప్రవచించిన సంక్షేమ రాజ్యం సాధించగలం. కాని ఆ పరిస్థితి నెలకొనే అవకాశాలు కన్పించడం లేదు.
ఉభయ తెలుగు రాష్ట్రాలు మద్యం వినియోగంలో అగ్రస్థానంలో వున్నాయి. ‘మద్యరహిత మహోదయం’ కనుచూపు మేరలో లేదు. లోగడ చెలరేగిన ప్రజాందోళనలు, మహిళల ఉద్యమాలు చప్పగా చల్లారిపోయాయి. నిశ్శబ్ద వినాశనం చాపకింద నీరులా పాకుతోంది. వేలకోట్ల రాబడి లక్ష్యంగా, రాష్ట్ధ్రానేతల కనుసన్నలలో ఎక్సైజ్ అధికార యంత్రాంగం లక్ష్యాలను సాధిస్తోంది. మద్యం మాఫియా వేళ్ళూని ప్రభుత్వాలను నిలదీసి స్థాయికి చేరింది. ఎక్సైజ్ రాబడులే రాష్ట్ర ప్రగతికి సోపానాలని ప్రజలను భ్రమింపజేసేలా ప్రభుత్వం ఆత్మవంచనకు పాల్పడుతోంది. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో రాజాజీ నిషేధం ప్రవేశపెట్టారు. 1949 నాటికి సంపూర్ణ నిషేధం వచ్చింది. 1971లో కరుణానిధి నిషేధం ఎత్తివేసాడు. ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.ఆర్. సంపూర్ణ నిషేధం సాధ్యం కాని పరిస్థితులలో ఆదాయం కోసం కాకుండా ఎన్నో విధాలుగా మల్లగుల్లాలు పడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు 1997లో మద్యం విక్రయాలకు గేట్లు బార్లా తెరిచారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు 20 నుంచి 25 వేల కోట్ల మేరకు ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా సాధిస్తున్నాయి.
2016లో బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం చరిత్రాత్మకమైంది. 2017 జనవరిలో 38 జిల్లాల్లో సుమారు 3 కోట్ల మందితో 11,400 కిలోమీటర్ల పొడవున మద్య నిషేధానికి మద్దతుగా నిర్వహించిన ‘మానవ హారం’ జాతిని కదిలించింది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే మద్య నిషేధంలో దేశానికి ఆదర్శంగా ఉంది. ఎక్సైజ్ సుంకం విపరీతంగా పెంచి మద్యం కొనటమే భారంగా చేసింది. మద్యం ఆదాయం లేని రాష్ట్రంగా గుజరాత్‌ను తీర్చిదిద్దిన భారతీయ జనతాపార్టీ, ఇపుడు భారత జాతిని నడిపించే శక్తి సామర్థ్యాలు కలిగివుంది. దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవలసి ఉంది. తెలుగు రాష్ట్రాలు కూడా గుజరాత్, బిహార్‌లను ఆదర్శంగా తీసుకొని జన సంక్షేమ, ఆరోగ్య సౌభాగ్యానికి కట్టుబడి వుండాలి. మద్య రహిత మహోదయం లక్ష్యంగా జాతి యావత్తూ ముందుకు అడుగులు పడాలి.

-జయసూర్య 94406 64610