AADIVAVRAM - Others

నేత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కళ్ళు.. దప్పిక తీర్చే అమృతధారల పరవళ్ళు.. మరీ యువ హృదయాల ఆ కళ్ళు తీర్చే తిరునాళ్ళు.. ఆ చూపు సూదంటురాయి.. సూటిగా పూలశరమై నా గుండె దూసుకెళ్ళింది తొలిచూపులోనే.. బహుశా అదే అనుభూతి పొందినట్లు అదేపనిగా చూస్తూండిపోయింది తను కూడా నా కళ్ళల్లోకి..
గల్లుగల్లునా గుండె జల్లనా.. పిల్ల ఈడు తుళ్ళి పడ్డది.. మనసు తీరగా మాటలాడక వౌనం ఎందుకన్న ధోరణిలో ప్రశ్నిస్తోంది ఆ చూపు నన్ను. చూపు చూపు కలిసిన తొలి కలయికలో.. కొన్ని క్షణాలు యిద్దరం ఏకాంతవాసం చేసి వచ్చాం. తనని వాళ్ళింట్లోంచి ఎవరో పిలిచినట్లై, ఆ వెంటనే లోపలికి పరుగందుకుంది తను ఒక్క ఉదుటున.
మాదో గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లా.. మా ఇద్దరివి ఎదురుబొదురు విల్లాస్.. మా యిద్దరి చూపుల కలయికకి అదే వేదిక. వీలు కుదిరినప్పుడల్లా ఆ కళ్ళు నా కళ్ళను, నా కళ్ళు ఆ కళ్ళను వెతుకుతూ ఉండేవి.. చాటుగా.. కిటికీల మాటుగా సాగిస్తున్న ప్రేమాయణానికి ఊరేగింపు.. ముగింపు.. కామన్ ఏరియాస్ అయిన చిన్నపిల్లల పార్కు, స్విమ్మింగ్ పూల్ మరియు వాకింగ్ పాత్‌లు.. ఇలా పగలు గడిచేది.. ఇక రాత్రి , పగలు జరిగిన సంఘటనల్ని నెమరువేసుకుంటూ ఏ అర్ధరాత్రికో నిద్ర పట్టేది. ఇలా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేవాళ్ళమే కానీ యిద్దరిలో ఏ ఒక్కరమూ మాట కలపటానికి సాహసించలేదు. కారణం నా మటుకు నాకు ఆర్థికంగా స్థిరపడకపోవడం.. తనూ అంతే మరి తల్లి చాటు బిడ్డ..
అందుకే ఆ ఆలోచనల్ని మా మనసుల్లోకి రానీయకుండా ఎంచక్కా ప్రేమగా ఆరాధించుకుండేవాళ్ళం. ఆ కళ్ళని, ఆ రూపాన్ని, పెదవులపై విరిసి మురిసే చిరుహాసాన్ని, నా కోసం తపించే తొందరలని రేకులు విచ్చుకున్న గులాబీ పూలవంటి నేత్ర ద్వయాన్ని.. కురులారబోసుకుని ననే్న చూస్తున్నట్టు.. హసిస్తున్నట్లు.. ఊహించుకుంటే.. జాలువారేవి సెల్‌ఫోన్‌లో నుంచి ప్రేమగీతాలు..
ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి పాడినవి వలపుల సరిగమలు..
ఒకరకంగా చెప్పాలంటే ఆ ఏడాది నా చదువు కాస్త అటకెక్కేసింది. సామర్థ్యం సంతకెళ్ళిందనే చెప్పాలి. ఎంత చూసినా తనివి తీరేది కాదు తనని.. ఎంత తలచినా తనని.. ఇక చాలనిపించేది కాదు. అందుకేనేమో లైలామజ్నూలు, సలీం అనార్కలీలు ప్రేమజంటలుగా చరిత్రకెక్కారు. ఏది ఏమైనా తన ఉనికి ఊపిరి, తనువు తలపు, ఆ భావనలకు పూల పరిమళాలు ఇనుమడించినట్లు.. మేమిరువురము కలుసుకున్న మధుర క్షణాలు.. మేము ఆస్వాదించే గాలికి సుగంధం తోడైనట్లు.. మా ఇద్దరి కలయికలో సృష్టి యావత్తు ఆనంద లహరిలో ఓలలాడినట్లు.. సురుచిర సుమధుర స్వరాలతో రాగరంజితం చేస్తున్నట్లుగా అయి.. ఇరు హృదయాలు ఒకటై ప్రేమాలయంగా మారేవి.
ఆమె పేరు ఏదైనా.. ఆమె నా నేత్ర ..
మమ్మల్ని గమనిస్తూన్న వాళ్ళ అమ్మగారు ఒకరోజు కిటికీ తలుపులు మూసివేసింది శాశ్వతంగా.. తలుపులు మూయగలిగింది కానీ మా తలపుల్ని మూయగలదా అనుకున్నా ఏమీ చేయలేని అశక్తతతో.. అంతే.. అదే ఆఖరిగా చూడటం తనని.. తపన కొద్దీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని వెతికాను మా కాంపౌండంతా.. క్కడా తన జాడ తెలియలేదు. తర్వాత తెలిసింది ఏమంటే.. ఆ రాత్రికి రాత్రే ఆమెను తాతగారింటికి తీసుకువెళ్ళి దింపి వచ్చారని, తన మేనమామతో పెళ్ళి నిశ్చయించారని.
కాలం ఎన్నో మార్పులు తెస్తుంది.. తన జ్ఞాపకాలు నాలో మాసిపోకపోయినా.. వలచిన మధురక్షణాల అనుభూతులు మరుగవకపోయినా.. వాస్తవంలోకి వస్తే ఆమె నాకు గతం.. నేను ఎం.బి.ఏ. పూర్తిచేశాను. మంచి ఉద్యోగం సంపాదించాను. ఊరూ మారింది. ఉనికీ మారింది. నా జీవితంలోకి సంధ్య ప్రవేశించింది. రెండేళ్ళకి రెండు ఫలాల్ని అందించింది. ఓ పాప, ఓ బాబు. జీవితం యాంత్రికంగా ముందుకెళ్తోంది. పిల్లల చదువులు, పెళ్ళి పేరంటాలు, పురుళ్ళు పుణాలు, గానుగెద్దు జీవితం.. సంధ్య, పిల్లల చుట్టూ తిరుగుతోంది. నాలో ఉదాశీనతకు కారణం సంధ్యకు తెలుసు. నేత్రతో నా మూగప్రేమ విషయం తనే అడిగి తెలుసుకుంది. ఆమెది గంభీరవదనం.. అర్థం చేసుకోగలిగింది నా నిజాయితీని. మా వైవాహిక జీవితానికి నలభై సంవత్సరాలు నిండాయి. ఉద్యోగ విరమణతో యింటికే పూర్తిగా అంకితమయిపోయాను. యిక మిగిలింది నేను, సంధ్య.
అరకొరగా సాగుతున్న నా దినచర్యలో ఒకరోజు తెలిసింది నాలో కాన్సర్ అడ్వాన్స్ అయిందని.. అది వైద్యానికి లొంగదని. నా మటుకు నాకు ఏ దిగులూ లేదు. వెరపూ లేదు. ఎందుచేతంటే ఆ రెండూ నాలో ఎప్పుడో ప్రవేశించాయి ప్రేమవైఫల్యంతోనే. సంధ్యతో వున్నాను.. అస్తమించటానికి యింక జంకెందుకు.. కానీ యిక్కడ ఒక్క విషయం చెప్పక తప్పదు.. నేత్ర నాలో ఉదయించిన సూర్యకిరణమైతే.. సంధ్య నన్నలరించే సంధ్యా కాంతి.. ఎప్పుడూ ననే్న విషయంలోనూ యిబ్బంది పెట్టలేదు సరికదా.. నన్నర్థం చేసుకుని ప్రవర్తించేది.. నాకెంతో అనుకూలవతి నాకా భగవంతులు జతకూర్చిన నా సతి. సంధ్య, పిల్లలు వైద్యం చేయిస్తున్నారు వాళ్ళ మనశ్శాంతికి, నా ఉపశమనానికి.
సాయంసంధ్యలో, హాస్పిటల్ లాన్‌లో బెంచీల మీద కూర్చున్నాము నేను, సంధ్య. నా ముందు ఒకతను చేత్తో పట్టుకు తీసుకెళ్తున్నది బహుశా తన తల్లిని కామోసు. ఆమె చేతులతో తడుముకుంటూ వెళ్ళి మా ఎదురుగా వున్న బెంచీపై కూర్చుంది. ఆమెనే తేరిపార చూస్తున్నాను..
గతంలో తనపై తొలిచూపుల్లో రాసిన కవిత హృదయపు లోతుల్లో మోగింది శతకోటి వీణలై..
ఆమె నన్ను కన్నులతో కొలిచినప్పుడు
నన్నామె మూగమనసు వలచినప్పుడు
కడలి కెరటానికి ఎందుకో యింత సంబరం
ఎగసి చుంబించే ఆ నింగి నీలాంబరం
ఆమె మేని పసిడి రంగు చాయలో
ఆ కాంత ఏకాంత సాయంత వేళలో
కురులలో మల్లినై మెరవాలని
పెదవులపై లాస్యమై మురవాలని
నాలో కలుగుతున్న పరిణామాలను పసికట్టిన సంధ్య తనని నేత్రగా గుర్తించింది. గుర్తించిందే తడవుగా ఉద్యుక్తురాలయింది. ఆమెను.. నన్ను.. మృదువుగా సంధ్యను వారించాను.. నేత్రని తేరిపార చూస్తున్న నా నేత్రాలు జలజల వర్షిస్తున్నాయి ఆనందాశ్రువులతో.. కాని యిదంతా గమనించే స్థితిలో లేదు నేత్ర.. కారణం నేత్రకు చూపుపోయి ఆరు వసంతాలయిందట.
ఆరోగ్యమైన నేత్రాలు ఎవరివైనా అమరిస్తే నేత్ర మళ్ళీ చూడగలదట ఈ లోకాన్ని.. వాళ్ళబ్బాయి మురళీధర్ కదిపితే 3సంధ్య2 కథలా చెప్పేశాడతను కళ్ళకి కట్టినట్లుగా గతాన్ని, దాపరికం లేకుండా. రోజుల్లోకి వచ్చిన నాలో ఓ ఆశ మెరిసింది. నేత హీనగా నా నేత్ర ని ఊహించలేను. నా నేత్రాలతో నా నేత్ర ఈ లోకాన్ని చూడగలగాలి. అంతే సంధ్యను తీసుకుని డాక్టర్‌ని సంప్రదించాను. నా మనసెరిగిన సంధ్య నన్నుసరించింది. నన్ననునయించింది. ఆదర్శ గృహిణి నా సంధ్య.. సంధ్య నుంచి ప్రోత్సాహమే కానీ ఎలాంటి అడ్డంకి లేదు. కొంత సంధ్య స్వార్థమూ లేకపోలేదు. అలాగైనా నా ప్రకాశించే నేత్రాలను నేత్రలో చూడగలదని చిన్న ఆశ తనది.
సంధ్యే అన్ని విషయాలు డాక్టర్‌గారికి వివరించింది. వైద్యుల కళ్ళ పరీక్షల్లో మా ఆశయం నెగ్గింది. నా నేత్రాలు ఆరోగ్యంగానే వున్నాయి. ఓడిపోని నా ప్రేమసాక్షిగా.. ననే్న ఆరాధించిన నా నేత్ర సాక్షిగా.. నన్ననుసరించిన సహనశీలి నా భార్య సంధ్య ప్రేరణతో నేత్ర ఈ లోకాన్ని చూడగలుగుతోంది.
నా జీవనయాత్ర నేత్రతో సాగకపోయినా.. నా నేత్రాలే ఆమెకు నేత్రాలై తనని చూపరిని చేశాయి. సంధ్యని నేత్రకి కాపరిని చేశాయి.
సంధ్యతో వున్న నన్ను వెతుక్కుంటూ వచ్చిన నేత్ర ప్రేమపూర్వకంగా నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది డాక్టర్ల సలహా మేరకు.
*

-ఆచార్య క్రిష్ణోదయ