AADIVAVRAM - Others

మరచిపోయిన మరొక సంస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈస్టిండియా కంపెనీ వారు స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటూ వచ్చారు. 1857 విక్టోరియా రాణి భారతదేశాన్ని స్వాధీనం చేసుకున్నది. ఈ దశలో రాజకీయాలల్లో అస్తిత్వం కోల్పోయిన పాలకులు ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. సైనిక సహకార పద్ధతి ద్వారా చాలా రాజ్యాలు బ్రిటీషు భారతంలో కలిసిపోయాయి.
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు గాంధీగారి జాతీయోద్యం ఉధృతం అయ్యేవరకు స్థానిక రాజన్యులు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడలేదు. అట్లని స్వదేశ వేషభాష పోషణ వదలలేదు. నేటి సీమాంధ్రలో విజయనగరం, కాకినాడ, పెద్దాపురం, వెంకటగిరి, చల్లపల్లి, చేబ్రోలు, మీర్జాపురం వంటి ఎనె్నన్నో పేర్లు చెప్పుకోవచ్చు. వెంకటగిరి రాజా వారికి సామంతులుగా ఉన్న వారిలో కరవది ప్రభువుల గురించి చెప్పుకోవాలి. వీరి చరిత్ర ఇప్పుడు దాదాపుగా విస్తృతమయిపోయింది. మొన్న ‘ప్రభాతగీతం’ నవల కోసం విషయ సేకరణ మొదలుపెడితే తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.
కరవాఁక = సముద్రపు గట్టు నోర నుండెడి బురద నేల (దేశ్యము - శబ్దరత్నాకరము)
కరవడి = సముద్రపు ఉప్పునీరు వెనుకకు తనే్న ప్రదేశం అని బ్రౌను నిఘంటువు. కరాకు - కరవాకు అవే రూపాలూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైన ఒంగోలుకు ఉత్తరంగా ఇరవై నిమిషాల బస్సు ప్రయాణం దూరంలో కరవది ఉంది. ఒకప్పుడిది బ్రాహ్మణ అగ్రహారం. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నాటి శిలాశాసనం మనకు స్థానిక గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం లభ్యమయింది. శాసనప్రతి - పాఠం చివర ఇస్తున్నాను. కాకతీయ సామ్రాజ్యం ఉత్తరాన ఔరంగాబాద్, దేవగిరి దక్షిణాన కంచి వరకు వ్యాపించింది. రామేశ్వరం కూడా వెళ్లిన ఆధారం దొరికింది కానీ అది జయయాత్రయో, తీర్థయాత్రలో ఇంకా నేను నిర్ధారించుకోలేదు. నేటి నూతన రాజధాని మందడ వద్ద కాకతీయ శాసనాలున్నాయి. త్రిపురాంతకంలో సరేసరి. కరవదిని ఖరవధా క్షేత్రం అని సంస్కృతీకరించారు. శ్రీరామచంద్రుడు దండకారణ్య సంచారం చేస్తున్నప్పుడు ఖరాసురుణ్ణి వధించిన ప్రదేశమే కరవది అయిందని ఒక ఐతిహ్యం కల్పించారు. దీనికి చారిత్రక ప్రామాణ్యము మృగ్యము. శూర్పణఖకు అరణంగా ఇవ్వబడిన ప్రదేశం ఇదేనని మరొక జనశ్రుతి. ఈతముక్కల అంటే ఇంతిముక్కు కోసిన గ్రామం కథ సృష్టించారు.
కరవది బ్రాహ్మణులు గొప్ప భోక్తలు. ఇక్కడ ఖగోళ విజ్ఞానం వికసించింది. పిసపాటి వారి పంచాంగాలు నేటికీ ప్రసిద్ధములే. (పిసుపాటి పీసుపాటి పీసపాటి పిశుపాటి ఇలా చాలా శబ్ద రూపాలు కన్పడుతున్నాయి)
ఆలయములు
కరవదిలో కొన్ని ప్రధానాలయాలున్నాయి. చెరువు ప్రక్కన రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయము, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయము, భద్రాచల రామాలయము పోలికలో ఉన్న దేవాలయము, అభయ ఆంజనేయ దేవాలయము (అర్వాచీనము) సాయిబాబా గుడి, అంకాలమ్మ గుడి, నాగేంద్రుని పుట్ట రేణుకా ఎల్లమ్మ గుడి వంటివి ఉన్నాయి. ఒక కోతి వచ్చి తోకతో వర్తులాకారంగా గీచిన చోట భక్తులు అభయాంజనేయ స్వామి గుడి నిర్మించారు.
బ్రాహ్మణులలో శాఖాభేదాలుండేవి. వైదికులు వైదికులతోను నియోగులు, నియోగులలోను వైవాహిక సంబంధ బాంధవ్యాలు కుదుర్చుకొనేవారు. పురాణం, పిశుపాటి, కురుగంటి, మొక్కపాటి, నేలభొట్ల, కప్పగంతుల ఇవన్నీ వైదిక కుటుంబాలే.
వేణుగోపాలస్వామి విగ్రహం కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ట చేసినట్లు జనశ్రుతి. అక్కరాజు కుటుంబీకులు ప్రోత్సాహాన్ని అందించారు. ఇక రాజా పిశుపాటి వెంకట రంగయ్యగారు 1890 ప్రాంతం నుండి చైత్ర శుద్ధ నవమి నాడే కళ్యాణోత్సవాలు అన్ని దేవాలయాలలో జరిగించే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తున్నది. వీరే రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీ వీరభద్ర స్వామి వారి విగ్రహములను ప్రతిష్ఠింపజేశారు.
పిసు(శు)పాటి బంగరుభొట్ల అనువంశిక ట్రస్టీగా వ్యవహరించారు. నారాయణం కృష్ణమాత్యులు వారి కుమారుడు నారాయణం వేంకటశేష రఘుప్రదీప్, హనుమాచార్యులు అర్చకులుగా వ్యవహరిస్తున్నారు.
పిసుపాటి పూర్ణయ్య సిద్ధాంతి, సత్యనారాయణ సిద్ధాంతి పంచాంగకర్తలు.
పిసుపాటి చిదంబర శాస్ర్తీ గద్వాల సంస్థాన ఆస్థాన పండితులు. వీరు పద్మపురాణం రచించారు. వీరు ఆశుకవి.
పిసుపాటి వెంకట్రామశాస్ర్తీ, వెంకటేశ్వర ఘనాపాఠీలు వేదంలో దిట్టలు. నేలభట్ల రంగనాయక శర్మ గాత్ర విద్వాంసుడు. కప్పగంతుల రంగకవి బహునాటక కర్త. కరవది రంగారావు మాయల ఫకీర్ ఫేం - మొక్కపాటి కృష్ణమోహన్ సాంఘిక నటుడు. మేళ్లచెరువు జగన్నాథ శాస్ర్తీ గొప్ప పౌరాణికుడు.
1942 దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహ వీరులకు కరవదియే వేదిక. ఆహార విహారాలు కల్పించారు. చలనచిత్ర తార కాంచన కరవది గ్రామానికి చెందినవారే. వీరు శ్రీమతి విద్యుత్ వల్లీ తాయారుగారి కుమార్తె. మద్రాసులో బి.ఏ. చదివి ఎయిర్‌హోస్టెస్‌గా కొద్దికాలం పనిచేసి తర్వాత చిత్రరంగంలో నటిగా రాణించారు. పద్మశ్రీ బిరుదాంకితులు షేక్ చినవౌలానా సాహెబ్ ప్రముఖ నాదస్వర విద్వాంసుడు ఇక్కడివారే.
1830లో ఏనుగుల వీరస్వామయ్య ఈ ప్రాంతం నుండి పయనించినట్లు వారి కాశీయాత్ర గ్రంథంలో ఉంది. ఒంగోలులోని ప్రసిద్ధ పౌరాణికులు మంత్ర శాస్తవ్రేత్త కొంపల్లి జ్వాలయారాధ్యుల వారి ధర్మపత్ని సీతారామమ్మగారి పుట్టిల్లు కరవది. కరవది రామకృష్ణయ్య - భార్య రామమ్మగారు నియోగి కుటుంబీకులు. వీరు కరవది కరణంగా పని చేసినట్లున్నది (సర్వేయర్ (?) సీతారామమ్మ జ్వాలయారాధ్యుల దౌహిత్రుడే ఈ వ్యాస రచయిత.
పిశుపాటి వారి చరిత్ర
వీరి వంశచరిత్ర ముత్తంభట్టు దగ్గరి నుండి లభ్యమవుతున్నది. ముత్తయ్య శబ్దము మృత్యుంజయ శబ్ద్భవము. భట్టు భట్టారక శబ్ద వికృతి. తర్వాతి తరములో బంగరుభట్ల (్భట్టు) పేరు కన్పడుతున్నది. పెద్దల పేర్లు పిల్లలకు పెట్టుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి వీరి వంశంలో రంగయ్య, బంగరుభట్టు పేర్లు పునరావృతం కావడం గమనార్హం. బంగారుభట్టు పేరు నాలుగుసార్లు వచ్చింది.
బంగారుభొట్ల గారికి చిన్న వెంకట్రాయశర్మ, లక్ష్మమ్మ, లక్ష్మీనారాయణ అని ముగ్గురు సంతానం. చివరి వాడైన లక్ష్మీనారాయణ నిస్సంతు.
చిన లక్ష్మీనారాయణ పెద్ద కుమారుడు బంగారుభొట్లు-2. ఈయన భార్య వెంకట లక్ష్మమ్మ. బంగారుభట్ల గారు దత్తతకు వచ్చినట్లు తెలుస్తున్నది. వీరి కుమారుడు పిశుపాటి వెంకట రంగయ్య రాజా (కాలం 1870) వీరి ధర్మపత్ని సుందరమ్మ. వీరికి నలుగురు సంతానం. 1.బంగారుభొట్ల (్భర్య బుచ్చమ్మ), రెండవ కుమారుడు వెంకట్రాయశర్మ (్భర్య శేషమ్మ), మూడవ కుమారుడు లక్ష్మీనారాయణ (్భర్య సుబ్బమ్మ), నాల్గవవారు వెంకట సుబ్బమ్మ.
బంగారు భట్టు-3 గారి పెద్ద కుమార్తె మీనాక్షమ్మ.
రెండవ కుమార్తె లక్ష్మమ్మ, మూడవవాడు సుబ్రహ్మణ్యం
మీనాక్షమ్మ కుమారుడు సత్యనారాయణ.
పిశుపాటి వెంకట్రాయశర్మ గారి పెద్ద కొడుకు వెంకట రమణయ్య - భార్య కాశీ అన్నపూర్ణ, వెంకట్రాయ శర్మగారి కుమార్తెలు కోమలవల్లి తాయారు, విద్యుత్‌వల్లీ తాయారు, అన్నపూర్ణమ్మ (చివుకుల) శివరామకృష్ణ. వీరిలో విద్యుత్‌వల్లీ తాయారు భర్త పురాణం రామకృష్ణ శాస్ర్తీ, ఇంజనీర్. వీరి కుమార్తెలు వసుంధరాదేవి, గిరిజాకుమారి. వసుంధరాదేవియే కాంచన సినీతార. ఇక అన్నపూర్ణమ్మగారి భర్త కురుగంటి సదాశివశర్మ వారి కుమారుడు ఆనంద తీర్థ లాయరు ఒంగోలులో ఉన్నారు (జననం 28.5.1938)
ఒంగోలు పి.వి.ఆర్. హైస్కూలు నిర్వహణలో కురుగంటి సదాశివశర్మ గారు ప్రముఖ పాత్ర పోషించారు. పిశుపాటి వెంకట రంగయ్యగారి పెద్ద కుమారుడు బంగారుభట్టు రెండవ కుమారుడైన వెంకట్రాయ శర్మ గారి పెద్ద కుమారుడు వెంకటరమణయ్య. బంగారుభొట్ల గారికి దత్తుగా వెళ్లాడు.
ఆనందతీర్థ గారి అన్న చెంచురామ శేషశర్మ. వీరి కుమారుడు కిశోర్. కోమలవల్లి తాయారుగారికి దత్తుడు.
నాల్గవ బంగారుభొట్టు - బుచ్చమ్మల కుమార్తె కామాక్షమ్మ. వీరి కుమారుడు మొక్కపాటి కృష్ణమోహన్. నటుడు, సాంఘిక నాటక రచయిత. ప్రస్తుతం తెనాలిలో ఉన్నారు.
కరవది చెరువుకు సమీపంలో రాజా వెంకట రంగయ్యగారి మహల్ ఉండేది. విశాలమైన ప్రాంగణంలో పూలతోట మధ్యలో కోటగోడల మధ్య భవనం. గోడలకు తైలవర్ణ చిత్రాలు, రెండు గుర్రాలు పూన్చిన బగ్గీ, పల్లకీ, జర్మనీ (టాప్‌లెస్) మోటారుకారు.. చుట్టూ భటులు, అంగరక్షకులుగా ఉండేవారు. ఇంకా ఒక బ్రిటిషు ఏజెంటు వెంకటగిరి రాజాగారి ఏజెంటు కూడా ఉండేవారు. పూజామందిరంలో మరకత శివలింగం, రత్నాలు పొదిగిన నాగాభరణం ఇంకా శ్రీచక్రం ఉండేవి. గణేశ నవరాత్రులు, శరన్నవరాత్రాలు, శ్రీరామ నవమి ఉత్సవాలు యజ్ఞాలు జరుగుతూ ఉండేవి. ఆత్మరక్షణకై పిస్టల్ ఉండేది. పిడికత్తి (కర్రలో కత్తి) ఉండేది.
వేద పాఠశాలలు నడిచాయి. చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళి, ములుకుట్ల సదాశివ శాస్ర్తీ వంటి కళాకారులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేవారు. చదవలవాడ నుండి నగరాజకుమారి నృత్యానికి వచ్చేది. కూచిపూడి నుండి భాగవతులు వచ్చి ఉష ప్రహ్లాద నాటకాలు, యక్షగానములు ప్రదర్శించేవారు. ఇంకా రోషనారా వంటి చారిత్రక నాటకాలు పోషింపబడ్డాయి.
మూడు దేవాలయాలకు కలిపి ఒకే వాహనశాల ఉండేది. అందులో రావణ, ఆంజనేయ, నంది, పొన్నమాను, గరుడ వాహనాదులు ఉండేవి. నేలభట్ల ఆదినారాయణగారి నేతృత్వంలో పండిత సభలు జరిగేవి. కుందుర్తి చలపతిరావు కార్యదర్శిగా సాహితీ సాంస్కృతిక సభలు నిర్వహించి, పండిత సత్కారాలు చేసేవారు. నాట్యావధాని ధారా రామనాథశాస్ర్తీ, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి కాశీ కృష్ణమాచార్యులు వంటి వారు వీరి సత్కారాలు అందుకున్నారు.
ఐ.వి.సుబ్బారావు అనే ఆస్థాన చిత్రకారుడు ఉండేవాడు. వెంకట్రాయ శర్మగారు స్వయంగా కవి పండితుడు. రాజతరంగిణి, గాడ్ అండ్ కాస్మోస్, నారాయణ తీర్థుల కృష్ణలీలా తరంగిణి వ్యాఖ్యానాలు రచించారు. నేడు ఇవి అలభ్యములు. బెర్లిన్ నుండి శర్మగారు ధర్మరంజన డాక్టర్ పండిత బిరుదు పొందారు. వానప్రస్థాశ్రమంలో తోటలో ఉండేవారు. వేణుగోపాలస్వామివారి దేవాలయంలో మూలవిరాట్ పాదాలపైన మాఘ మాసంలో సూర్యకిరణాలు పడటం విశేషం. గ్రామంలో మసీదులు లేవు కాని చర్చిలు ఉన్నాయి. ఇటుక బట్టీల పరిశ్రమ ఇక్కడ ప్రముఖమైనది. గ్రామీణ వృత్తులు నశించాక ఇక్కడి ప్రజలు ఒంగోలు, హైదరాబాద్ వంటి పట్టణాలకు ఉద్యోగార్థం వెళ్లిపోయారు. సికిందరాబాద్‌లోని గంజాం కృష్ణప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని హిస్టరీ ప్రొఫెసర్ వి.ఎస్.ఆర్. కరవదివారే.
వారి పూర్తి పేరు పిశుపాటి శ్రీరామశర్మ.
పిశుపాటి వారి సంస్థానం వెంకట్రాయశర్మ గారి తర్వాత కోర్టు కేసులలో చిక్కుకొని బలహీనపడిపోయింది. ప్రస్తుతం కరవదిలో వీరి ఆస్తులు లేవు. కొందరు అస్తమించారు. మరి కొందరు ఆయా నగరాలలో స్థిరపడ్డారు.
1942 దేవరంపాడు సత్యాగ్రహం
మద్రాసులో బ్రిటిషువారి తుపాకీలకు రొమ్ము చూపిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు దేవరంపాడులో చాలాకాలం ఉన్నారు. కరవదికి ఆనుకొని దేవరంపాడు ఉంది. అక్కడికి సమీపంలో గుండాయపాలెం వద్ద సముద్రం ఉంది. మహాత్మాగాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం జరిగాయి. అందులో స్థానికులు పాల్గొన్నారు. అమ్మనబ్రోలు కరవది వంటి గ్రామ ప్రజలు తరలి వచ్చారు. ఉద్యమంలో సాగి వంశస్థులైన సాగి విజయరామరాజు, సాగి కృష్ణంరాజు, చేబ్రోలు ఆంజనేయులు, సాయిన ఆదెమ్మ, పోలవరపు వెంకటకృష్ణయ్య వంటి వారెందరో పాల్గొన్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కొండా వెంకటప్పయ్య పంతులు వంటి వారు ఉద్యమ నాయకత్వం వహించారు. ప్రస్తుతం సాగి విజయ రామరాజు గారి శిలావిగ్రహం అక్కడ ఉంది. వీరు స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్లు కూడా తిరస్కరించారు. అలాగే టంగుటూరి ప్రకాశంపంతులు గారు నివసించిన తోట ఉంది. ఇక్కడ ఒక స్తూపం నిర్మించారు. దానిపై గాంధీ చిత్రం ఉంది. ఉద్యమంలో పాల్గొన్నవారికి భోజనం, మజ్జిగ, ఆశ్రయం కరవది కల్పించింది. కొందరు వేణుగోపాలస్వామి సువిశాల ప్రాంగణం లోపల ఉన్నారు. కరవది - దేవరంపాడు, గుండాయపాలెంలో జరిగిన స్వాతంత్య్రోద్యమం చరిత్ర ముందు తరాల వారికి అందకుండా పోయింది.
పెళ్లూరు కోటతో కరవది సంస్థానం వారికి సంబంధాలుండేవి.
ప్రస్తుతం కరవదిలో ఆనాటి రాజమహల్ రంగుటద్దాల మేడ లేదు. దానిని నెల్లూరు నుండి వచ్చిన డాక్టర్‌గారు 60వేలకు కొని హాస్పిటల్ కట్టుకున్నారు. చివుకుల, పిసుపాటి, కారుగంటి, నేలభొట్ల, మొక్కపాటి వంశస్థుల జాడలు కూడా కన్పడటంలేదు. విరిగిపోయిన గుర్రపు మగ్గీ చువ్వలు, షహనాయిలు, నౌబత్ (నగారా) ఆనవాళ్లు కథావశిష్టమైనాయి.

చిత్రాలు..రావుబహద్దర్ డాక్టర్ పండిట్ ధర్మరంజన్ పిశుపాటి వెంకటరాయశర్మ (క్రీ.శ.1900-1984)
వీరు రాజా పిశుపాటి వెంకట రంగయ్యగారి రెండవ కుమారులు.
కరవది సంస్థాన వారసులు. వీరి మనుమడు శ్రీ ఆనంద తీర్థ - ఒంగోలులో ఉన్నారు.
*
కరవది రామలింగేశ్వర స్వామి దేవాలయంలోని శిలాశాసనం
క్రీ.శ.1300 - కాకతీయాంధ్ర చక్రవర్తి రెండవ ప్రతాప రుద్రుని గూర్చి ఇందులో ఉంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246