Others

మాయాబజార్ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రఖ్యాత దర్శకుడు జంధ్యాల వివాహభోజనంబు (1988) చిత్ర ఆరంభంలో తన చిత్రానికి మూలమైన మాయాబజార్‌ను సంభోదిస్తూ ఏం విశేషణం వాడాలో అర్థంకాక విజయావారి అద్భుతం అని ఊరుకున్నాడు.
అద్భుతం, అపూర్వం, అనన్యసామాన్యం వంటి పదాలెన్ని కుప్పబోసినా మాయాబజార్ విషయంలో తెలుగు ప్రేక్షకుడికి అసంతృప్తిగానే ఉంటుందన్నది అక్షరసత్యం. వయసు, పరిణితి పెరిగేకొద్దీ మరిన్ని కొత్త అందాలు, అర్థాలు గోచరించే అతికొద్ది భారతీయ చిత్రాలలో అగ్రస్థానాన్ని నిలిచే చిత్రం మాయాబజార్.
జానపద గాథలలో మాత్రమే వ్యాప్తిలో ఉన్న శశిరేఖాపరిణయం కెవిరెడ్డి దర్శక సారథ్యంలో చక్రపాణి, నాగిరెడ్డిల ఆర్థిక సహకారంతో, పింగళి ఘంటసాల బార్క్‌ట్లే సాలూరిల సమన్వయంతో... మాయాబజార్‌గా సరికొత్త రూపుదాల్చి తెలుగువారి ముందుకొచ్చింది.
నిర్మాణంలో ఉన్ననాళ్ళు ఈ చిత్రం శశిరేఖా పరిణయం అన్న పేరుతోనే రూపవాణి వంటి సమకాలీన పత్రికలలో దర్శనమిచ్చింది. అయితే గత చిత్రం మాయాబజార్ (1936) పేర విజయవంతమై ఉండటం, విరివిగా ప్రదర్శింపబడుతున్న సురభివారి నాటకం కూడ అదే పేరుతో ఉండటం వంటి కారణాలవల్ల మాయాబజార్ అన్న పేరే చివరకు ఖరారుఅయ్యింది. బజార్ అన్న ఆంగ్ల పదం చిత్రంలో ఎక్కడ వినబడకుండా జాగ్రత్తపడటం కూడా జరిగింది.
ఆర్థిక సంబంధాల కారణంగా అయినవారితో బంధాలు అతలాకుతలం కారాదన్న ప్రధాన అంశంతో రూపొందించిన మాయాబజార్ 27-03-1957న విడుదలై కాసు మరియు క్లాసు పరంగా విజయబావుటా ఎగురవేసింది. పదిహేను కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకొని రెండు దశాబ్దాల ముందు విడుదలైన పాత మాయాబజార్‌కు దీటుగా నిల్చింది.
తొలిసారిగా పూర్తిస్థాయిలో శ్రీకృష్ణ పాత్ర పోషించిన రామారావు, వృద్ధ పాత్రలో ఒదిగిపోయిన ముప్పది రెండేళ్ళ గుమ్మడి, స్ర్తిపురుష పాత్రలలో సమాన ప్రతిభ చూపిన మహానటి సావిత్రి నటించారని అనటంకన్నా జీవించారు అనటం సమంజసంగా ఉంటుంది.
అనుభవ శాలురైన ఋష్యేంద్రమణి, రంగారావు, ఛాయాదేవి, అక్కినేని, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి, సియస్‌ఆర్, ముక్కామల, ఒక్కొక్కరి నటన ఒక్కొక్క గ్రంథానికి సరిపోయేంత సత్తా, సరంజామా కలది.
తెలుగు తమిళ భాషల్లో నటిగా రాణించి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జయలలిత యొక్క మాతృమూర్తి సంధ్య ఇందులో రుక్మిణిగా నటించటం ఓ విశేషం. హిందీ నటి రేఖ తమ్ముడు బాబ్జీ ‘విన్నావటమ్మా ఓ యశోదా...’ గీతంలో మరియు నాటి ప్రసిద్ధ గాయకుడు మాధవపెద్ది సత్యం ‘్భళిభళి దేవా బాగున్నదయా నీ మాయ...’ గీతంలో కన్పించి అలరించటం దీనికి మరో కొసమెరుపు.
రామారావు చేతిమీది కృష్ణుడి పచ్చబొట్టు ప్రేక్షకుడి కంటబడకుండా చాకచక్యంగా కెమెరా నడిపిన మార్కస్‌బాట్లే తన ఛాయాగ్రహణంతో వనె్నలను చిత్రంలోనే కాదు, ప్రేక్షకుల హృదయాలలోనూ కురిపించారు.
‘‘ఈ మాత్రం దానికి రుక్మిణి ఏం అనుకోదులే చూడవయ్యా కృష్ణయ్యా’’అన్న రేవతి చమత్కారాలు, ‘‘ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’’అన్న సూక్తుల సృష్టికర్త. నేరుగా తెలుగు నిఘంటువులలోకి చేరిపోయిన ‘‘తసమదీయులు’’వంటి పదాల యజమాని, మాటల మాంత్రికుడు పింగళి గూర్చి ఏం మాట్లాడతాం మనస్ఫూర్తిగా జేజేలు పల్కటం తప్ప.
రాజేశ్వరరావు, ఘంటసాల సంయుక్త బాణీలు ప్రేక్షకుల్ని సమ్మోహన పరుస్తాయి. వివాహభోజనంబు అంటూ రంగారావులో పరగళ ప్రవేశం చేసి చూపరులకు నోరూరించిన మాధవపెద్ది, ప్రేమ విరహ విషాద గీతాలకు పెట్టింది పేరైన ఘంటసాల మరియు తదితరుల ప్రతిభాపాటవాలు చిత్రానికి ప్రాణప్రతిష్టగా నిల్చాయి.
చిన్న శశిరేఖ జన్మదిన గీతంలో పాత్రలన్నీ ఒకొటొకటిగా పరిచయంకావటం, చిత్రంలో ఒక పాత్ర ప్రస్తావన వచ్చిన మరుక్షణం ఆ పాత్ర ప్రవేశింపబడటం వంటి టెక్నిక్‌లు కె.వి.రెడ్డికి కొట్టిన పిండి. కాగా ‘అదే మన తక్షణ కర్తవ్యం’అన్న ఒకే ఒక వాక్యంతో ఒక పాత్ర మొత్తాన్ని నడపటం బహుశా కెవిరెడ్డికి తప్ప మరొకరికి సాధ్యంకాదేమో!
జన్మదిన వేడుకలలో గుమ్మడి, రామారావులను ఒకే వరుసలో చూపించటం దేనికన్న ప్రశ్నకు, ఇద్దరికున్న కోటేరు ముక్కుతో వారిద్దరు అన్నదమ్ములన్న విషయం చెప్పకుండా తెలుస్తుంది అనే జవాబుతో తలపండిన దర్శకులను సైతం తలలూపేలా చేసే నిశిత దృష్టి కెవిరెడ్డి అనబడే కదిరి వెంకటరెడ్డిది.
బీదరికంవల్ల పిల్లనివ్వని మేనమామని ఎదిరించి అభిమన్యుడు శశిరేఖను చేపట్టటం యువతను విశేషంగా అలరిస్తుంది. ఘటోత్కచుని చేతిలో వియ్యాలవారి అగచాట్లు పిల్లల్ని కేరింతలు కొట్టిస్తాయి. శకుని ఎత్తులు కృష్ణుని పై ఎత్తులు పెద్దలను మేధావులను అబ్బురపరుస్తాయి. వెరసి అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించటం అన్న పదానికి నిలువెత్తు నమూనాగా, నిర్వచనంగా మాయాబజార్ సినీ చరిత్రలో అలా నిలిచిపోతుంది.
శాకాంబరిదేవి వరప్రసాదం గోంగూరలా అరవది ఏళ్ల పైబడి తెలుగువాడి చేత లొట్టలువేయిస్తున్న ఈ మాయాబజార్ మరో అరవై వత్సరాలు.... కాదు కాదు... అరవై తరాల పాటు అలా లొట్టలు వేయిస్తునే ఉంటుంది తృప్తితీరా వివాహ భోజనాన్ని వడ్డిస్తూనే ఉంటుంది.

-ఆర్.వి.రాఘవరావు, అద్దంకి