Others

భూవిలాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా -
*
పుడమి పేగుల రక్కి బుసకొట్టు ప్లాస్టిక్కు
వేయి కోరలు సాచి విషముగ్రక్కు
ఓజోను పొర చిట్లి తేజోవిహీనమై
చెడు రశ్మి కురిపించు సెగల ముంచు
గాలి కాలుష్యమ్ము కాలకూట విషమ్ము
ఆమ్ల వర్షమ్మయి హాని గొల్పు
ఫ్యాక్టరీ వ్యర్థాల పరగు ననర్థాలు
కల్మశమ్ములు పూయ కదులు నదులు
విశ్వకల్యాణ దీప్తులు వెలుగ జేయు
శ్రేష్ఠతమ శాస్త్ర సంపద సృష్టి చేసి
పురుడు పోసిన చేతనే నరుడు నేడు
పంచభూతములన్నింట పంచె విషము

సెల్‌ఫోను శృంగాలు చిమ్ము తరంగాలు
విచ్చుకత్తులు వూరపిచ్చుకలకు
కుప్పలు తెప్పలౌ కుళ్లిన చెత్తలు
చిత్రహింసలు మూగజీవములకు
పురవీధి నెల్లెడ పరచిన ‘కాంక్రీటు’
భూమి లోపలి నీటి పొరల కాటు
కడలిని కలచెడు చెడు రసాయనములు
పొంచిన ప్రళయ విస్ఫోటనములు
ఇలను వణికించు ఇన్ని కల్లోలములకు
మనిషి నిలువెత్తు స్వార్థమ్మె ఉనికి పట్టు
సృష్ట సమతౌల్యమును సదా నష్టపరచి
అల్పబుద్ధిని కొట్టుమిట్టాడు నరుడు

పిసికిరి ఏటి గొంతుకలు పేల్చిరి భూధరముల్ తటాకముల్
ఇసుకను కొల్లగొట్టి పడగెత్తిరి కోట్లకు శాసనాలకున్
ముసుగులు వేసి భోగముల మున్గిరి ‘కాంక్రీటు’ కాననమ్ములన్
వసుమతి గుండెలందు కరవాలము దించుట కాదె యిన్నియున్

భూసారమ్ములు మింగి పబ్బులెదిగెన్ ఫూత్కారముల్ సల్పు ఆ
వాసంబుల్ పడగెత్తె వాయు విషముల్ వ్యాపించె దుర్వారమై
కాసారమ్ములు లేవు తుమ్మెదల ఝంకారమ్ములా లేవిటన్
వాసంతమ్మిక ఏ లతాంతములపై వర్థిల్లునో చూడగన్

రొయ్యల చెరువులుగా వరి
కయ్యలు పంటల్ని మింగి కాసులు కురిసెన్
అయ్యల ధన దాహమ్మున
తియ్యని విషమెక్కి పల్లె దేహము పులిసెన్

చందన వృక్ష జాలమును చంపిరి కొందరు నిట్టనిల్వునన్
కొందరు పైరుపచ్చలను కోసిరి ‘కాంక్రీటు’ కత్తివాదరన్
కొందరు నందనమ్ములను గూల్చిరి నుజ్జుగ సెజ్జులంచువీ
రందరు నేలతల్లి తనువంతట తొల్చు పరాన్నభుక్కులే
కమలాకర సుందర జల
విమల సుగంధమ్ము పవన విచలితవల్లీ
ద్రుమ మార్దవమ్ము మింగుచు
క్రమముగ విస్తారమయ్యె కాలుష్యనిధుల్

వృషము చెడి కాంతి ఉర్విదుర్విషము చిమ్మి
వధ్యశిలయయ్యె జీవ వైవిధ్యమునకు
వనధి తీరమ్ము కుంచించి దిన దినమ్ము
పుడమి పొత్తిళ్ల పెనుముప్పు పొంచె నేడు

తలపు లందున మట్టిని దైవతముగ
యెంచి యత్నించి హరిత చేలాంచలమ్ము
నిండుగా కప్పవలయును నేలతల్లి
తనువు పులకాంకరమ్ముల తనరునటుల *

-టి.హెచ్.నటరాజారావు 8106243636