Others

నోట్లకు వోట్లేస్తే.. అవినీతికి లైసెనే్స!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో వోటుకు రెండు నుంచి మూడువేల రూపాయల వరకూ పంపిణీ చేసినట్లు వచ్చిన కథనాలు ప్రజాస్వామ్య ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ లెక్కన చూస్తే- వచ్చే ఏడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై కూడా ‘నగదు ప్రభావం’ భారీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం లక్ష మందికి రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే ఒక్కో అభ్యర్థి కనీసం రూ.20 కోట్లు ఖర్చుపెట్టక తప్పదేమో! వోట్ల జాతరలో నగదు పంపిణీకి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి నుండే సిద్ధపడుతున్నాయి. ప్రజాసేవ, పార్టీ పట్ల నిబద్ధత, నిజాయితీ వంటి అర్హతలకు బదులు కనీసం రూ.20 కోట్లు ఖర్చుపెట్టగల వారిని మాత్రమే అభ్యర్థులుగా నిలబెట్టేందుకు రాజకీయ పక్షాలు కసరత్తు చేస్తున్నాయి. ‘ఆర్థిక సామర్ధ్యం’ ఉన్నట్లు సాక్ష్యాలు చూపమని కూడా పార్టీలు పట్టుబడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఏ పార్టీ తరఫున పోటీ చేయాలన్నా ‘బయోడేటా’ను కాకుండా అభ్యర్థులు వారి ‘బ్యాలన్స్ షీట్’ను చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్రమంగా డబ్బు సంపాదించినవారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెగ ఆరాటపడుతున్నారు.
అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకులను లూటీ చేసిన పారిశ్రామికవేత్తలు, అడ్డంగా డబ్బు సంపాదించిన కాంట్రాక్టర్లు, స్థిరాస్తి వ్యాపారులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత పొందుతున్నారు. ఒకే వ్యక్తి వివిధ పార్టీల చుట్టూ తిరుగుతూ ఎవరు టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధపడటాన్ని మనం చూస్తున్నాము. రాజకీయ పార్టీలు కూడా ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టగలిగితే వారికే టిక్కెట్ అన్నట్లు ‘బహిరంగ వేలం’ నిర్వహిస్తున్నాయి. ఇంత డబ్బు ఖర్చుపెట్టి గెలుపొందాక- ఆ నేతలు నిజాయితీతో ప్రజాసేవ చేస్తారా? కనీసం తాము ఖర్చుపెట్టిన డబ్బునైనా రాబట్టుకొనే ప్రయత్నం చేయరా? మరుసటి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బును పోగుచేసుకొనే ప్రయత్నం చేయరా? నిజానికి- ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అంతడబ్బును తిరిగి ఎలా సంపాదిస్తారు? ప్రజాప్రతినిధిగా వచ్చే జీతభత్యాలు పరిగణనలోకి తీసుకున్నా నెలకు ఒకటి, రెండు లక్షల రూపాయలకు మించి ఆదాయం ఉండదు. అందుకనే ప్రజాప్రతినిధి హోదాలో ఏ పనిచేసినా- ఎంతో కొంత సంపాదించే ప్రయత్నం చేయక తప్పదు. అధికారుల బదిలీలు, పోస్టింగులు నుంచి, అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగే కాంట్రాక్టు పనులలో నిర్దేశిత కమీషన్ నేతల జేబుల్లోకి వెళ్లక తప్పడం లేదు. ఎంపీలకు రూ. 5కోట్లు, ఎమ్మెల్యేలకైతే ఏపీలో ఒక కోటి, తెలంగాణలో రూ.3 కోట్లు చొప్పున ఏటా అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నారు. ఈ నిధులతో జరిగే పనుల్లో చాలామంది నేతలు నిర్దేశిత కమీషన్ తీసుకోవడం బహిరంగ రహస్యమే గదా.
2014కు ముందు ఐదేళ్ల కాలంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చు దేశవ్యాప్తంగా రూ.1.5 లక్షల కోట్లకు మించి పోయినట్లు ఒక అధ్యయనం తెలిపింది. ఈ మొత్తంలో సగానికిపైగా డబ్బు ‘లెక్కకురాని వనరుల’ ద్వారా అంటే- నల్లధనం రూపేణా లభించినట్లు పేర్కొనడం గమనార్హం. గత ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు రూ.3,500 కోట్లు ఖర్చుపెట్టగా, అందులో సుమారు రూ.1,000 కోట్లను ఓటర్లకు పంపిణీ చేసినట్టు మరో అధ్యయనం తెలిపింది. ఆమధ్య చెన్నైలోని ఆర్.కె.నగర్ ఉప ఎన్నికలో ఒక్కో వోటుకు 8 వేల నుండి 10 వేల రూపాయల వరకు పంపిణీ చేస్తుండగా భారీగా నగదును అధికారులు పట్టుకోవడం తెలిసిందే.
వోట్ల కోసం నోట్లు పంపిణీ చేసే నేతలు నిజాయితీగా ప్రజాసేవ చేస్తారని భావించడం పొరపాటే అవుతుంది. పూర్వం రాజరిక వ్యవస్థలో రాజులు ఏవిధంగా ఉంటే ప్రజలు అలాగే ఉండేవారు. కానీ ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఏ రీతిన ఆలోచిస్తే ఆ విధంగానే తమ నేతలను ఎన్నుకుంటారు. తమ కులం వారనో, మతం వారనో, ప్రాంతం వారనో, నోట్లు ఇచ్చారనో ఓట్లు వేస్తున్నంతకాలం మెరుగైన పాలనను ఆశించలేం. అవినీతి లేని వ్యవస్థను ఊహించలేం. అందుకనే మార్పు అనేది ప్రజల నుండే ప్రారంభం కావాలని, అధికార పీఠంపై పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదని ‘లోక్‌నాయక్’ జయప్రకాశ్ నారాయణ్ ఏనాడో చెప్పారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులలో, ఏటిఎంలలో నగదు లభించడం లేదంటే వచ్చే ఎన్నికల కోసం రూ.2వేల నోట్లన్నింటినీ రాజకీయ నాయకులు రహస్య స్థావరాలకు తరలించారని, అందుకనే నగదు లభ్యత లేదని కేంద్ర మంత్రి ఒకరు చెప్పారంటే నిస్సిగ్గుగా, బహిరంగంగానే ఈ ‘రాజకీయ వ్యభిచారం’ జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. డబ్బులు వెదజల్లి గెలుపొందిన నేతలు ఎంతటి ద్రోహులో, ప్రలోభాలకు లొంగిపోయి వోట్లను అమ్ముకొనే వారు కూడా అంతే ద్రోహులు. నోట్లు తీసుకుని ఓట్లు వేయడం అంటే అవినీతికి లైసెన్సు ఇచ్చినట్లే. మన సమ్మతితోనే మన నేతలు మనల్ని దోచుకొంటున్నారని గ్రహించాలి. నేడు ప్రభుత్వాలు కూడా తమకు కమీషన్లు లభించే పనులకే ప్రాధాన్యత ఇవ్వడం, అభివృద్ధి పనులకు అంచనా వ్యయాలను పెంచి అవినీతికి పాల్పడడం చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో అధికార, విపక్ష సభ్యులు కూడబలుక్కుని అవినీతిలో వాటాలు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకప్పుడు ఎమ్మెల్యేలలో చాలామందికి సొంతకార్లు ఉండేవి కావు. కొందరైతే ఆర్‌టిసి బస్సులలో ప్రయాణం చేస్తుండేవారు. సాధారణ హోటళ్ళలో, ప్రభుత్వ అతిథి గృహాలలో బస చేస్తూ ఉండేవారు. ఇపుడు అటువంటివారు మనకు కనిపిస్తారా? ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎంతమంది అందుబాటులో ఉంటున్నారు? ముడుపులు చెల్లించనిదే ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనులు జరుగుతున్నాయా?
నోటుకు ఆశపడి వోటు వేస్తే- వంద రెట్లు తాము నష్టపోతున్నామని ప్రజలు గ్రహించాలి. ఇక కొందరు నేతలు- ‘ఎన్నికల్లో ఇతర పార్టీలిచ్చే నోట్లు తీసుకోండి.. వోట్లు మాత్రం మాకే వెయ్యండి’ అంటూ సలహా ఇస్తున్నారు. నోట్లు ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా నేరమే అన్న విషయాన్ని వారు విస్మరిస్తున్నారు. ‘ఓట్ల కోసం డబ్బు ఖర్చుపెట్టేవారిని ఓడిస్తాం’ అంటూ ప్రజానీకం ధైర్యంగా ప్రకటించాలి. తమ వద్దకు నోట్లతో వచ్చేవారిని పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించాలి. ఇలాంటి చైతన్యం ప్రజలలో వచ్చినపుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫలవంతం కాగలదు, పేదలకు మేలు చేసే పాలనను పొందగలం.
రాజకీయ పార్టీలు అవినీతిపరుల నుండి వసూలు చేసిన విరాళాల నుండే ప్రజలకు డబ్బు పంపిణీ చేస్తున్నాయి. 2016-17 సంవత్సరానికి సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఏడు జాతీయ పార్టీలు సమర్పించిన జమాఖర్చులలో తమకు రూ.20వేలకు మించి వచ్చిన విరాళాలు రూ.15995.17 కోట్లుగా పేర్కొన్నాయి. అందులో రూ.589.38 కోట్లు (37.8 శాతం) మేరకు లెక్కకురాని వనరుల నుండి వచ్చిన విరాళాలు అని పేర్కొనడం గమనార్హం. అంటే నల్లడబ్బును విరాళంగా రాజకీయ పక్షాలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం వరకు పేదలకు మద్యం సరఫరా చేసి, వారి ఓట్లు పొందేందుకు అభ్యర్థులు ప్రయత్నించేవారు. కానీ నేడు విద్యావంతులు, ఎంతోకొంత ఆర్థిక స్థోమత ఉన్నవారు కూడా నగదు ఇవ్వనిదే వోటు వేసేది లేదని మొండికేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ వేసే ఉద్యోగులు సైతం వెయ్యి నుంచి రెండు వేల రూపాయలిస్తేనే వోటు వేస్తామని బేరమాడుతున్నారు. టీచర్ల, పట్ట్భద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగే ఎన్నికల్లో ధనప్రభావం గతంలో ఉండేది కాదు. ఇపుడు మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఇస్తే తప్ప విద్యావంతులు ‘మండలి’ ఎన్నికల్లో ఓటు వేయడం లేదు. న్యాయవాదులకు నిర్వహించే బార్ కౌన్సిల్ ఎన్నికల్లోనూ డబ్బు ప్రభావం తప్పడం లేదు.
అవినీతిని అంతమొందిస్తామనే నినాదంతో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రాలేదు. కానీ, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఆయన అందిస్తున్నారా? గత నాలుగేళ్లలో అవినీతి బాగా పెరిగినట్లు ఓ సర్వేలో 65 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులపై దాడులు చేయడం గురించి విన్నామా?
గతంలో విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను అలవరచుకున్నవారే రాజకీయాల్లో ప్రవేశించేవారు. సిద్ధాంతాలు, నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవ వంటి లక్షణాలు వారిలో కొంతవరకైనా ఉండేవి. అయితే గత మూడు దశాబ్దాలుగా విద్యార్థి సంఘ ఎన్నికలనే జరపడం లేదు. కళాశాలల్లో ఎన్నికలు జరిపితే హింసకు చోటిచ్చినట్లు అవుతుందని పాలకులు సాకుగా చెబుతున్నారు. ఈమధ్యనే పశ్చిమ బెంగాల్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాకాండ చెలరేగి పలువురు మృతి చెందారు. అంతమాత్రాన స్థానిక సంస్థలకు ఎన్నికలను రద్దుచేయగలరా?
ధన రాజకీయాలకు వ్యతిరేకంగా పౌర సంఘాలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ శక్తులు రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను సొంతం చేసుకొనే ప్రమాదం లేకపోలేదు. వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసినపుడు ప్రజాసేవకు అవకాశం ఉండదు. ప్రజాసేవకు అత్యున్నత మార్గంగా కాకుండా, రాజకీయాలను లాభదాయక వ్యాపారానికి ఎన్నుకోవడం దురదృష్టకరం.

-- కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ