Others

అందం.. అభినయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్టు, బొట్టూలోనే స్ర్తి అందం.. అభినయం! చీరకట్టు, గుండ్రని బొట్టు, కళ్ళకు కాటుక, వాలుజడ, మోచేతుల వరకు జాకెట్టు, సన్నని నిలువుబొట్టు, రెండు చేతులు నిండా మట్టిగాజులతో స్ర్తి నిండు అలంకరణతో మంత్రముగ్ధున్ని చేస్తుంది. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏర్పడిన మొదటి రోజుల్లో ఆధ్యాత్మిక, పౌరాణిక చిత్రాల్లో ఒళ్ళు కనిపించకుండా నిండార పాదాలవరకు మెరుపుమెరుపుల చీరలతో గోచీ మాదిరిగా చీరకట్టు ఉండేది. అలా గోచీతో, ఒంటి నిండా బంగారు నగలతో, మధ్య పాపిటతో ఎంతో అందంగా చూపించడం అలనాటి దర్శకులకే చెల్లింది. ఆ తర్వాత పౌరాణిక చిత్రాల్లో మోకాళ్ళపైకి గోచీ కట్టుకొని, ఒంటి నిండా బంగారు నగలతో ప్రేక్షకుల్ని తమ అభినయానికి అభిమానుల్ని చేసుకున్నారు. నాడు కూడా అంటే నాల్గు దశాబ్దాల క్రితం కూడా స్ర్తిల శరీరం కనబడేటటువంటి చీరకట్లు, డ్రెస్సులు ఉన్నాయి. కానీ మరీ ఇప్పటి సినిమాల్లో అంటే గత దశాబ్దకాలంలో మాదిరిగా బికినీలు హీరోయిన్లకు వేయించలేదు. కానీ బికినీల్లో కంటే ఇంకా అద్భుతంగా చూపించిన దర్శకులున్నారు. బికినీల్లోనే ఆడదాని (హీరోయిన్) అందాన్ని చూపలేం. మంచి చీరకట్టులో అంతకంటే ఎక్కువ అందాన్ని ఆస్వాదించవచ్చు. గత దశాబ్దం క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎక్కువగా క్లబ్ డాన్సులు ఉండేవి. అంతకంటే ముందు 1980, 1999 సం.ల కాలంలో క్లబ్ డ్యాన్సర్‌గా, క్లబ్‌లో, పబ్‌లో సిల్క్‌స్మిత తన అందంతో, డాన్స్‌తో, ఓరచూపులతో యువతను ఆకట్టుకొని ఒక ఊపుఊపిందని చెప్పవచ్చు. 1970, 1980 సం.ల కాలంలో జ్యోతిలక్ష్మి క్లబ్ డాన్సర్‌గా దుమ్మురేపింది. ఈమధ్యకాలంలో క్లబ్ డాన్సులు చాలా తక్కువయ్యాయి. జ్యోతిలక్ష్మిని, సిల్క్‌స్మితను సగం సగం బట్టలతో చూపించిన దానికంటే ఎక్కువ అందాన్ని ఒకప్పటి అందాల తారల చీరకట్టు ఎక్కువగా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అలనాటి మహానటి సావిత్రి అందాన్ని, ఆమెను చీరకట్టుతోనే చూసి తన చిత్రాలను ఆదరించిన అభిమానులున్నారు. సావిత్రి చీరలో కొన్ని చిత్రాల్లో గుండ్రని పెద్ద బొట్టుతో, కొన్ని చిత్రాల్లో సన్నని నిలువుబొట్టుతో, రెండు చేతుల నిండా మట్టిగాజులతో, కళ్ళకు నల్లని కాటుకతో, మోచేతుల దాకా జాకెట్టుతో పెద్దపెద్ద హీరోలయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్ర నటులతో తీసిన చిత్రాలన్నీ సూపర్ హిట్టే! అంతదాకెందుకు ‘మహానటి’లో సావిత్రి బయోపిక్‌లో కూడా సావిత్రిని చూసినట్లే ప్రేక్షకులు అభిమానించి ఆదరించారు. అంతటి అందమయిన రూపం ‘మహానటి’ సావిత్రిది.
ఎక్కువగా మన తెలుగు చిత్రసీమలోని దర్శకులు హీరోయిన్‌ని తెలుపు, నలుపు చీరలలో, పెద్ద అంచు చీరలతో, సిగనిండా పూలతో చూపించి నటీమణులు ఎక్కువగా అభిమానుల్ని సంపాదించుకునేలా చేసేవారు. ఇదంతా గత మూడు, నాల్గుదశాబ్దాల క్రితంనాటి మాట. ఏది ఏమయినా చీరకట్టు అందమే వేరు. ఎంత వర్ణించినా తనివి తీరదు. మహానటి సావిత్రి తరువాత, శారద, సరిత, శ్రీదేవి, వాణిశ్రీ, జయసుధ, ప్రభ, సుహాసిని, జయప్రద, రాధిక, రాధ, వాణీవిశ్వనాథ్, విజయశాంతి లాంటివారు తమ చీరకట్టుతో మధ్యతరగతి ప్రేక్షకుల మనస్సును దోచుకున్నారు. వీరిలో సావిత్రి, సరిత, వాణిశ్రీ, ప్రభలు కేవలం చీరకట్టులోనే కనిపించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు. ఆ తరువాత కొంతమంది జయసుధ, సుహాసిని, శారద, విజయశాంతి, వాణీవిశ్వనాథ్, శ్రీదేవిలు చీరలతోపాటు పోలీస్ యూనిఫాంలోకూడా నటించి అభిమానుల ఆదరణ పొందారు. శ్రీదేవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’లాంటి పౌరాణిక పాత్రలో మెగాస్టార్ చిరంజీవితో అద్భుతమయిన, అమాయకపు దేవకన్య పాత్రలో జీవించారు. అలాగే ‘గోవిందా-గోవిందా’ చిత్రంలో నాగార్జునతో తన అభినయాన్ని చూపించారు. ‘రాఖీ’ సినిమాలో సుహాసిని పోలీస్ ఆఫీసర్‌గా అదిరిపోయే పాత్రలో నటించారు. విజయశాంతి గురించి చెప్పుకున్నట్లయితే చీరకట్టు కట్టుకున్నా, కర్తవ్యంలో పోలీస్ అధికారిగా నటించినా, ‘‘ఒసేయ్... రాములమ్మ’’ చిత్రంలో నక్సలైట్‌గా నటించినా, ‘‘మొండి మొగుడు- పెంకి పెళ్ళాం’’లో సుమన్‌తో అమాయకంగా నటించినా ఏ పాత్రలోనయినా విజయశాంతి జీవించిందని చెప్పటంలో అతిశయోక్తిలేదు. శోభన్‌బాబు, వాణిశ్రీ, శారదలు కలిసి నటించిన ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’లో శోభన్‌బాబు పంచెకట్టుతో, వాణిశ్రీ, శారదలు అచ్చతెలుగు వారిలా సంప్రదాయబద్ధంగా కట్టు, బొట్టుతో మధ్యతరగతి వారిని బాగా అలరించిందని చెప్పవచ్చు. ‘నోము’చిత్రంలో రామకృష్ణ సరసన, చంద్రకళ చీరకట్టు, బొట్టుతో ఎంతో అత్యద్భుతంగా నటించింది. గృహప్రవేశంలో మోహన్‌బాబు సరసన జయసుధ గడసరి భార్యగా మధ్యతరగతి కుటుంబంనుండి ఇల్లాలిగా ఆ పాత్రకుతగ్గ న్యాయం చేసిందని చెప్పవచ్చు. వీరంతా ఒకప్పుడు వెండి తెరమీద వెలిగిపోయిన నటీమణులే. వీరిలో కొంతమంది హీరోయిన్‌లుగానే నటించి నిష్క్రమించిన వారున్నారు. అలాకాకుండా శారద, వాణిశ్రీ, జయసుధ, సుహాసిని, జయప్రదలు అక్కలుగా, తల్లులుగా, అత్తలుగా కూడా ఇప్పటికీ నటిస్తున్నారు. నడి వయస్సులో కూడా ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు. హీరోయిన్లుగానే నటిస్తున్నారు. అలాకాకుండా అవకాశాల్నిబట్టి కొంతమంది హీరోయిన్లు నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలు, తల్లి పాత్రలు, అత్త పాత్రలు చేస్తున్నారు. శారద, వాణిశ్రీ, లక్ష్మిలు ఎక్కువగా తల్లి పాత్రలు, అత్తల పాత్రలు, నాయనమ్మలు, అమ్మమ్మల పాత్రల్లో నటిస్తున్నారు. వీరంతా హీరోయిన్లుగా చేసినప్పుడు కూడా నటించిన చిత్రాలు మధ్యతరగతి కుటుంబాల్లోని పాత్రలేనని చెప్పవచ్చు. వీరి అందం, అభినయం, పాత్రలో జీవించిన తీరుకూడా మధ్యతరగతివారి జీవితాలను ప్రతిబింబిస్తాయి. అంతటి గొప్పతనం వీరి నటనలో చూడవచ్చు. మధ్యతరగతివారి జీవితాలకు సంబంధించిన చిత్రాల్లోనే కట్లుబొట్లు, కట్టుబాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను మన తెలుగువారి జీవన విధివిధానాలను ప్రతిబింబింపజేస్తాయని చెప్పవచ్చు.
మధ్యతరగతి వారి జీవితాల్లో ఖరీదయిన చీరలు, మెరిసేటటువంటి జాకెట్లు, నగలు లేకపోయినప్పటికీ అతి తక్కువ ధర చీరలు, జాకెట్లు, కేవలం ఒక్క పసుపుతాడులోనే వారిని ఎంతో అందంగా, సాదాసీదాగా చూపించటం పరిపాటి. సావిత్రి, జయసుధ, శారద, వాణిశ్రీల తరువాత అంతటి అభినయాన్ని ప్రదర్శించి వీరికంటే ఎక్కువ అభిమానులను తన వశం చేసుకున్న అందాల నటి కీ.శే.సౌందర్య. గత రెండు దశాబ్దాలుగా సౌందర్య తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. వెంకటేష్‌తో ‘ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’లో బిడ్డలులేని ఇల్లాలుగా అమాయకురాలి పాత్రలో నటించినా, ‘ప్రియరాగాలు’ చిత్రంలో జగపతిబాబుతో నటించినా, ‘నాగప్రతిష్ఠ’ చిత్రంలో దేవతగా కనిపించినా, ‘దొంగాట’ సినిమాలో సురేష్‌కు మరదలుగా, జగపతిబాబు సహాయంతో తన జీవితాన్ని కాపాడుకున్న అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించినా, ‘కలిసి నడుద్దాం’ చిత్రంలో శ్రీకాంత్ సరసన భార్యాభర్తలిద్దరూ దాంపత్య జీవితంలో సమానమేననే పాత్రలో నటించినా, ‘‘పోస్ట్‌మేన్’’ చిత్రంలో మోహన్‌బాబు సరసన నటించి క్యాన్సర్ రోగంతో చనిపోయే పాత్రలో నటించినా, ‘పెదరాయుడు’లో మోహన్‌బాబుతో కలిసి నటించింది. ‘పెదరాయుడు’ సినిమాలో మొదట్లో సౌందర్య పాత్రకు కాస్తగర్వం ఉన్నప్పటికీ, తరువాత నెమ్మది నెమ్మదిగా మారిపోయి మామూలు మనిషిగా అయి కుటుంబంలో ఒకరిగా కలిసిపోతుంది. సౌందర్య ఎక్కువగా జగపతిబాబు, మోహన్‌బాబులతోనే నటించింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అన్నయ్య’ చిత్రంలో నటించింది. ఇన్ని చిత్రాల్లోకూడా సౌందర్య చీరకట్టుతో, నిండయిన తెలుగుదనంతోనే కనిపించి అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకుంది. సౌందర్య భౌతికంగా మన కళ్ళముందు లేకపోయినప్పటికినీ ఆమె రూపం ప్రతీ తెలుగు ప్రేక్షకుడి మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.
ఇక ఆ తరువాత నదియా మధ్య వయస్కురాలయిన నటి అయినప్పటికీ వయస్సుతో సంబంధం లేకుండా ‘మిర్చి’చిత్రంలో హీరో ప్రభాస్‌కు తల్లిగా, ‘దృశ్యం’లో తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా, ‘అ ఆ’ చిత్రంలో హీరోయిన్ సమంతకు తల్లిగా, ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో హీరో పవన్‌కళ్యాణ్‌కు మేనత్తగా, ప్రస్తుతం వచ్చిన కొత్త చిత్రం ‘నాపేరు సూర్య- నాఇల్లు ఇండియా’ చిత్రంలో హీరో అల్లు అర్జున్‌కు తల్లిగా నటించిన నటి నదియా నటన అత్యద్భుతం. ఈ సినిమాలన్నింటిలో నదియా చీరకట్టుతో ప్రేక్షకులను అలరించింది. మిడ్డీలు, బికినీలు, స్విమ్మింగ్ షూట్‌లు, సగం సగం బట్టలలోనే మగువ అందం కనబడదు. అచ్చ తెలుగువారిలో చీరలు, కట్టు, బొట్టు, నగలు అలంకరించుకొన్న హీరోయిన్లలోనే ఎక్కువ అందాన్ని ఆస్వాదించవచ్చు. డ్రెస్‌లు వేస్తే హీరోయిన్లను చూసే రోజులు పోయి నిండయిన అందంతో, చీరకట్టుతో కన్పిస్తేనే ప్రేక్షకులు ఇప్పుడు ఆదరించే రోజులు మళ్ళీ తిరిగొచ్చాయని చెప్పవచ్చు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌లలో కూడా చీరకట్టును ఎంతో అద్భుతంగా చూపిస్తున్నారు. ఇంతటి గొప్పతనం చీరకట్టుకుంది.

- శ్రీనివాస్ పర్వతాల