Others

మూస ధోరణితో ముప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాత హీరో. తండ్రి హీరో. మనవడు హీరోగా సినిమా రిచ్‌గా తయారైంది. ఆడియో ఫంక్షన్‌కి సీనియర్ హీరో ముఖ్య అతిథి.
‘‘సినిమా నేను చూశాను. హీరో తండ్రి, తాతలను మించిపోయిన నటన ప్రదర్శించాడు. డ్యూయట్లలో భలే స్టెప్పులు వేశాడు. హీరోయిన్ ఫాలో కాలేకపోయింది. అంత ఈజ్, స్పీడ్ వుంది మనవాడిలో. ఫారిన్ లొకేషన్స్ అదుర్స్, ఇటువంటి స్టోరీ ఈమధ్య రాలేదు. అంత వెరైటీ వుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్.’’
సీనియర్ హీరో మాటలకు ఆడిటోరియం కేకలు, ఈలలతో మారుమోగుతుంది.
సినిమా విడుదలవుతుంది. సూపర్ ఫ్లాప్ అవుతుంది. సీనియర్ హీరో అంచనాలు తల్లకిందులవుతాయి. ఇలా ఎన్నోసార్లు జరుగుతూ వుంటుంది. సభకు అతిథులుగా వచ్చిన వీఐపీలు మొహమాటానికి పొగుడుతారో ఏమో తెలీదు.
పాత రోజుల్లో కొందరు సినీ పెద్దలు మొహమాటం లేకుండా విమర్శించేవాళ్లు. తాము అనుకున్నది వెల్లడించేవారు. ఎవరేమనుకుంటారో అనుకునేవాళ్లు కాదు. వాళ్ల అంచనాలు ఎన్నో తప్పయిపోయేవి. అది వేరే సంగతి.
భరణీవారు లైలా ‘మజ్నూ’ మొదలు పెట్టినప్పుడు చాలామంది విమర్శించారు. అప్పటి వరకు పొడుగాటి కత్తి తిప్పుకుంటూ రాజకుమారుడిగా జానపదాలలో నటించిన నాగేశ్వరరావు ప్రేమికుడిగా ఏం నటిస్తాడు? హావభావాలు ప్రకటించడం సాధ్యమా? అన్నారు. డైరెక్టర్ రామకృష్ణ విమర్శలకు వెరవలేదు. లైలామజ్నూ సూపర్ హిట్టయింది. భరణీవారికి కాసుల వర్షం కురిపించింది.
డి.ఎల్.నారాయణ దేవదాసు మొదలుపెట్టినప్పుడూ అంతే. హిందీలో మహానటులు సైగల్, బారువా వంటివారు పోషించిన దేవదాసు పాత్రను నటనలో బచ్చా అక్కినేని నటించి మెప్పించగలడా? పైగా డైరెక్టర్ డ్యాన్స్‌మాస్టర్, జానపద చిత్రాలకు పనిచేసిన వేదాంతం రాఘవయ్య.
దేవదాసు తెలుగులో సూపర్‌హిట్ అయితే తమిళంలో డబుల్ సూపర్‌హిట్. సంవత్సరం పాటు తమిళులను అలరించింది. తాగుబోతు పాత్ర వుంటే ‘జగమేమాయ’ని పాడడం ఎన్నో తమిళ సినిమాల్లో వుండేది. మధురై చింతామణి థియేటర్‌లో 66 వారాలు ఏకధాటిగా ఆడింది. ఆమధ్య ఒక మేథావి ‘దేవదాసు’ కొత్త ప్రింట్లు తీయించి పేరు మార్చి ‘1953 ఏ లవ్ స్టోరీ’ అని తమిళ దేవదాసునే విడుదల చేసి సొమ్ము చేసుకున్నాడు. అదీ ‘దేవదాసు’ క్రేజ్.
‘గుండమ్మ కథ’ కథ విన్న లెజెండ్ డైరెక్టర్ కె.వి.రెడ్డి ఇదేం కథ? ఈ సినిమా ఆడదు పొమ్మన్నాడు. తెలుగులో తొలిసారిగా కౌబాయ్ టైప్ సినిమా ‘మోసగాళ్లకు మోసగాడు’ మొదలుపెట్టాడు హీరో కృష్ణ. ‘తెలుగులో హాలీవుడ్ టైపు సినిమాలు ఆడవయ్యా బాబూ! డబ్బులు పోతాయి’ అని హెచ్చరించాడు చక్రపాణి. ‘తులాభారం’ మలయాళంలో సూపర్ హిట్టయింది. అన్ని భాషలలో రీమేక్ చేయడానికి జెమినీవారు హక్కులు కొన్నారు. ముందు తమిళంలో రీమేక్ చేసారు. పరాజయం పాలైంది. తెలుగులో వి.మధుసూదనరావు స్క్రిప్టులో మార్పులు చేసారు. మలయాళంలో హీరోయిన్ ఒక కార్మిక నాయకుడి భార్య. యాజమాన్యం కుట్రతో మర్డర్ చేయిస్తే వీధిన పడుతుంది. పిల్లల్ని బావిలోకి తోసి తానూ చావాలనుకుంటుంది. తెలుగులో హీరోయిన్ పెద్ద పారిశ్రామికవేత్త కూతురు. గొప్పగా పెరుగుతుంది. తండ్రిని పార్టనర్స్ మోసం చేస్తారు. ఆయన గుండెపోటుతో మరణించాడు. ఆయన కూతురు వీధినపడి ఒక కార్మికుడిని పెళ్లి చేసుకుని దరిద్రం అనుభవించడం, కష్టాల కడలిలో మునగడంతో తెలుగు ప్రేక్షకులు సానుభూతి చూపించి సినిమాను సూపర్‌హిట్ చేసారు. అదే ‘మనుషులు మారాలి’. మనుషులు మారాలి ప్రివ్యూ చూసిన ఆనాటి నైజామ్ డిస్ట్రిబ్యూటర్లు పెదవి విరిచారు. ఏభైవేలు అడ్వాన్స్ ఇచ్చి విడుదల చెయ్యమంటే ఎవరూ ముందుకు రాలేదు. చివరకు జెమినీవారే సికింద్రాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసి రిలీజ్ చేసుకున్నారు.
1967 నాటికి నైజామ్ మాస్ ఏరియా. ఎన్టీఆర్ సినిమాలే ఐదారు ప్రింట్లతో విడుదల చేసేవారు. అటువంటి నైజాంలో క్లాస్ సినిమా ఆడుతుందా? అని డిస్ట్రిబ్యూటర్లు సందేహించారు. వారి అంచనాలన్నీ తలకిందులు చేస్తూ ‘మనుషులు మారాలి’ విజయ విహారం చేసింది. అభిరుచి కలిగిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ‘శంకరాభరణం’ నిర్మించడానికి పూనుకున్నపుడు మిత్రులు హితోపదేశం చేసారు. ‘ముసలి పంతులు హీరో’ ‘్భగం పిల్ల హీరోయినా?’ సినిమా అసలు విడుదలవుతుందా? అన్నారు. పాండీబజార్ కబుర్లు వింటున్న విశ్వనాథ్ కూడా పాటల రికార్డింగ్ అయ్యాక కూడా ‘ఎందుకొచ్చిన సినిమా? అడాప్ అవుదాం’ అన్నారు. ఏడిద నాగేశ్వరరావు మొండిగా ముందుకు దూకారు. ఫస్ట్ కాపీ వచ్చింది. మద్రాస్‌లో ‘శంకరాభరణం’ ప్రివ్యూ వెయ్యని ప్రివ్యూ థియేటర్ లేదు. ‘విడుదల కాకుండానే శతదినోత్సవం చేసుకున్న శంకరాభరణం’ అని కొందరు ఎగతాళిగా మాట్లాడేవారు. తర్వాత రాజశ్రీవారు విడుదల చేయడం ‘శంకరాభరణం’ చరిత్ర సృష్టించడం తెలిసిందే. మూవీ మొగల్ రామానాయుడు ‘మనీ’ సినిమా చూసి ఈ సినిమా ఫ్లాప్ అన్నారు. హైదరాబాద్ క్రాస్‌రోడ్స్‌లో సంధ్యలో ‘మెకానిక్ అల్లుడు’, సుదర్శన్‌లో ‘మేజర్ చంద్రకాంత్’ ప్రదర్శిస్తున్నప్పుడు ‘మనీ’ ఓడియన్‌లో విడుదలైంది. థియేటర్ కిటకిటలాడేది. ప్రతి ఆటకూ టికెట్లు దొరక్క జనం తిరిగి వెళ్లిపోతుండేవాళ్లు. మనీ సంచలన విజయం సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
సినిమా జయాపజయాలను అంచనా వేయగల సినీ పండితులు ఎవరూ లేరు. సినిమా టాకీలు మొదలైనప్పుడు జనాభాలో 50 శాతం చదువుకున్న వాళ్లుండేవాళ్లు. ఇప్పుడు 75 శాతం చదువుకున్నవాళ్లే. ముందు ముందు అది 100 శాతం అవుతుంది. కాలం గడిచేకొద్దీ ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వస్తుంది. అది గ్రహించి కాలంతోపాటు పరిగెత్తగల నిర్మాత, దర్శకులు కొత్తదనాన్ని అందించగలిగినపుడే విజయం సాధిస్తారు. లేకపోతే వెనుకబడిపోతారు. మూస ధోరణి ముప్పు తెస్తుంది. సినిమా జాతకాన్ని చెప్పే జ్యోతిష్కులు ఎవరూ లేరు.

--వాణిశ్రీ