AADIVAVRAM - Others

సర్వ దేవతల నిలయం శ్రీచక్ర ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలు వెలిశాయి.. పురాణాలు పుట్టాయి.. ఉపనిషత్తులు ఉద్భవించాయి.. ఇతిహాసాలు విలసిల్లాయి.. యుగాలు గడిచాయి.. కోట్ల సంవత్సరాల ఈ భూ మండల చరిత్రలో ఎందరెందరో దేవ దానవుల ఆదర్శవంతమైన జీవితాలు తెరకెక్కి స్థిరస్థాయిగా నిలిచాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలు ధార్మిక సందేశాలకు నిలయమై దుష్ట శిక్షణ, శిష్ట రక్షణతో ధర్మం నాలుగు పాదాలపై నడిచాయి. కలియుగం ఆరంభమయ్యాక రాజులతో కూడిన రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రపంచానికి జ్ఞానాన్ని సముపార్జింపజేసిన ఘనత భారత గడ్డకు స్వంతం. సనాతన ధర్మాన్ని తెలియజెప్పిన భారత గడ్డపై ఆధ్యాత్మికతకు ఎలాంటి కొదువ లేదు. 33 కోట్ల దేవతలకు నిలయంగా ఎన్నో దివ్య సుందరమైన మందిరాలు 29 రాష్ట్రాల్లో కనిపిస్తాయి. సముద్ర తీరాలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో సుప్రసిద్దమైన ఆలయాలు ఎన్నో నేటికి అలరారుతూ భక్తుల విశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్నాయి. సృష్టి ఆవిర్భావం తరువాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిలోకాధిపతులుగా వెలుగొందుతున్న త్రిమూర్తుల ఆలయాలు, శక్తి స్వరూపిణీ భవ్య మందిరాలు కోటానుకోట్లుగా నిర్మితమయ్యాయి. దేహమే దేవాలయం, జీవమే పరమాత్మ అంటూ శ్రీ చక్రం ద్వారా స్పష్టమవుతోంది. అలాంటి విశిష్టత కలిగిన శ్రీచక్ర ఆలయం భువిపై ఎక్కడ కూడా ఇప్పటి వరకు నిర్మించ లేదు. నిర్మించాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. దేహానికి పరమాత్మకు ఉండే బేధం ఒకటేనంటూ తెలియజెప్పే శ్రీ చక్ర మందిర నిర్మాణానికి తెలంగాణలోని సంగారెడ్డి మండలం పసల్‌వాది గ్రామ శివారులో అంకురార్పణ అయ్యింది. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు, సిద్ధాంత బాస్కర బిరుదాంఖితులైన మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో శ్రీ కైలాస ప్రస్తార మహామేరు ఉమామహేశ్వర ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం, ఉపనిషత్తుల్లోని బింధూపనిషత్, నాధబింధూపనిషత్, దేవి అదర్వణ శీర్షోపనిషత్‌ల నుండి సంగ్రహించి మహామేరు నిర్మాణానికి రూపకల్పన చేసారు. మూడు రకాల శ్రీ చక్రాల్లో భూ ప్రస్తం, మేరు ప్రస్తం, యంత్రం. మేరు ప్రస్తంలో రెండు రకాలు, కైలాస ప్రస్తారం, మేరు ప్రస్తారం. ఇందులో మొదటిదైన కైలాస ప్రస్తార శ్రీ చక్ర పద్దతిలో దేవాలయాన్ని నిర్మింపజేస్తున్నారు. శ్రీ చక్రాలలో తొమ్మిది చక్రాలుంటాయి. ఇందులో ఐదు దేవి చక్రాలు, నాలుగు శివ చక్రాలు. కానీ కైలాస ప్రస్తారంలో ఐదు శివ చక్రాలు, నాలుగు దేవి చక్రాలు. నిర్మించబోయే ఆలయాన్ని కాశ్యప శిల్ప శాస్త్రానికి అనుగుణంగా శిల్ప కళలతో తీర్చిదిద్దనుండగా, రూప ధ్యాన రత్నావళి గ్రంథం ఆధారంగా దేవతల విగ్రహాలను ప్రతిష్టంచనున్నారు.
ఆలయ నిర్మాణ శైలి
128 రేకులతో కూడిన పద్మాకారంలో దేవాలయ పీఠం. ఇది బ్రహ్మ స్వరూపానికి సంకేతం. ఈ పద్మాకారం మధ్యలో జలం. ఈ జలం మధ్యన సృష్టికి లయకారుడు శంకరుడు వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాల మందిరాలు. ద్వాదశ జ్యోతిర్లింగాల మందిరాలు ఏ విధంగా నిర్మించారో అదే తరహాలో ఇక్కడ నిర్మించనుండటం విశేషం. జలంలో కూర్మాకారంలో హాసనం. ఇది విష్ణు స్వరూపం, సద్బుద్ధికి నిలయం. ఆపైన ఎనిమిది ఏనుగులు, అష్ట సౌభాగ్యాలు, అష్ట సిద్దులకు సంకేతం. తరువాత అష్ట సర్పాలు కామాదివికారాలకు చిహ్నాలు. వీటన్నింటి మద్యలో గర్భాలయం. ఈ ఆలయానికి చతుర్ద్వారాలు. గర్భాలయం మధ్యన దివ్యశోభితమైన పంచముఖ ఉమామహేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు. గర్భాలయంపైన చతుర్వేద శిఖరాలు. చతుర్వేద శిఖరాల మధ్యన కైలాస ప్రస్తార మహామేరు శ్రీ చక్ర గోపురం. కమలం నుండి శ్రీ చక్ర బిందు పర్యంతం వరకు ఆలయ నిర్మాణానికి చక్కని ప్రణాళికలు రూపొందాయి.

ప్రాచీన పద్ధతిలో ఆలయ నిర్మాణం
భవిష్యోత్తర పురాణాన్ని పరిగణనలోకి తీసుకుని సిమెంటు, ఇనుమును ఉపయోగించకుండా అష్ట్ధాతు పదార్థాల సమ్మేళనంతో మహామేరు ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గనులలో తవ్విన సున్నం, గూడం (బెల్లం), సైకతం (ఇసుక), జనుము, మారేడురసం, కరక్కాయలు, మైనం, మకరందం (తేనె) ఈ పదార్థాలనే అష్ట్ధాతువులుగా పిలుస్తారు. ఆలయాన్ని నిర్మిస్తున్న ప్రదేశంలో ముందుగా భూ పరీక్షలు నిర్వహించి, నియమ నిష్టలతో భూ పూజ చేసి, పునాదుల తవ్వకాలు మొదలు పెట్టారు. 6 అడుగుల లోతు పునాది తవ్విన అనంతరం 3 ఫీట్ల ఎతె్తైన శంఖంతో శంకుస్థాపన ప్రారంభించారు. శంఖం మునిగే వరకు ఇసుకతో పూడ్చి వేసారు. దీన్ని సైకత బంధనం అంటారు. సైకత బంధనం వల్ల భూకంపం వచ్చినా మందిరం చెక్కుచెదరకుండా కాపాడే సామర్థ్యం ఉంటుంది. దేవాలయ గర్భాన్ని శ్రీ బంధనాన్ని అనుసరించి నిర్మిస్తున్నారు. 3 వరుసల్లో సవ్య, అపసవ్య పద్ధతిలో రాళ్లను పేరుస్తూ నిర్మిస్తున్నారు. 30 వేల బండలతో గర్భం నుండి 28 పీట్ల ఎత్తు వరకు పునాదిని నిర్మిస్తున్నారు. పునాది నిర్మాణానికి త్రిబంధనం సున్నం, ఇసుక, బెల్లం మూడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు. 26.5 అడుగల ఎత్తులో వృత్త మంటపం, 25 అడుగుల ఎత్తులో అష్టకోణ మంటపం, 23.5 చతుర్ద్వార మంటపాలు నిర్మాణం కాబోతున్నాయి. ఆపైన నాలుగు ఆవరణాలను నిర్మించనున్నారు. వీటినే శక్తి బంధనం, శ్రేణి బంధనం, విష్ణు బంధనం, చక్ర బంధనంగా పిలుస్తారు.

ఉపయోగించే శిలలు
గర్భం నుండి 28 అడుగుల ఎత్తు వరకు నిర్మించే పునాదికి సాబాద నాపరాళ్లను 30 వేలు ఉపయోగిస్తున్నారు. పునాది పై నుండి నిర్మించే వివిధ రకాల ప్రాకారాలకు తమిళనాడులోని కాంచీపురం నుండి కృష్ణ శిలలు (నలుపు రాళ్లు)ను 18 వేల టన్నులు ఉపయోగించనున్నారు. పద్మాకార నిర్మాణానికి మొత్తం శే్వత శిలలు (తెల్లనిరాయి) వాడనున్నారు. 2 వేల టన్నుల శే్వత శిలలను బెంగుళూర్ నుండి తీసుకురానున్నారు. యంత్రాకార నిర్మాణానికి రక్త శిలలు (ఎరుపు రాయి)ని వాడనున్నారు. 2 వేల టన్నుల ఎరుపు రాయిని తెప్పించనున్నారు.
ఆలయంలో దర్శనమిచ్చే దేవతలు
రామాయణ, మహాభారత, భాగవత విశిష్టతను తెలిపే కథలను నిర్మాణానికి ఉపయోగించే శిలలపై చెక్కించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావ చరిత్రలను, 108 మంది శివ భక్తుల (నల్వారులు) విజయగాథలు, శ్రీ చక్రంలోని 1600 దేవతల ప్రతిరూపాలు, ఈశ్వరుని 64 చతుషష్టి అవతారాలు, విష్ణువు దశావతారాలు, 200 పైచీలుకు శాక్తేయ ముద్రలు, పత్ర, సింహ, మకర, హంస తోరాణాలు, అకారాది క్షకారాంత దేవతలు, కేశవాది దేవతలు, 32 గణపతుల విగ్రహాలు, శోడష మాత్రుకలు మొత్తంగా 12 వేల దేవతల విగ్రహాలు ఈ ఆలయంలో ఏకకాలంలో దర్శనం చేసుకునే విధంగా రూప సౌందర్యంగా నిర్మించనున్నారు.
239 ప్రత్యేకతలతో
భారతీయ శిల్ప సంపదలో ఉన్న విభిన్నత్వాన్ని ఉపయోగించి 239 ప్రత్యేకతలతో మహామేరు ఆలయం రూపుదిద్దుకోనుంది. ఆర్యులు, వౌర్యులు, చాణిక్యులు, గుప్తులు, కాకతీయులు, కృష్ణ దేవరాయలు తదితరుల కాలంలో ఉపయోగించిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించడం విశేషం. గర్భాలయానికి ఉపయోగించే ఉప పీఠం, అధిష్టానం, స్తంబవర్గు, ప్రస్తారంలో ఉండే బేధాలన్నింటిని కలిపి ఇక్కడ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 158 అడుగుల వృత్తాకారం, 80 అడుగుల వ్యాసార్థంలో ఆలయం అలరారనుంది. శాస్త్రంలోని 16 రకాల స్తంభాలు, 172 అడుగుల పొడవు ఆమ్నాయులు (మెట్లు), ఒక ద్వారానికి 3 చొప్పున మొత్తం 12 శిల్ప కళలు, యంత్ర ప్రాకార విణివేశంతో కూడిన శిల్ప సంపద ఉట్టి పడనుంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శ్రీనివాసాచార్యులు శిల్పాలను మలచనుండగా, కర్నూలుకు చెందిన సుబ్రమణ్యం (స్తపతి) పర్యవేక్షణలో నిర్మిస్తున్నారు. సాంకేతిక నిపుణులు మంగారావు, సీ.వీ. రావు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. విద్యుత్ విభాగంలో కొరియాలో శిక్షణ పొందిన వీఎస్‌ఏ జైరాం నేతృత్వంలో ఆలయానికి దీపకాంతులను దేదీప్యమానంగా ఆధునిక పద్ధతుల్లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్-నాందేడ్-అకోలా జాతీయ రహదారికి ప్రక్కన ఉన్న కోటి రూపాయలకుపై విలువ చేసే ఎకరం స్థలాన్ని పదవీ విరమణ పొందిన తహశీల్దార్ సుజనమ్మ విద్యాపీఠానికి కానుకగా సమర్పించారు. అర్చకత్వం ద్వారా సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన 200 గజాల ప్లాటును విక్రయిస్తే వచ్చిన 35 లక్షల రూపాయలను విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆలయ నిర్మాణానికి విరాళంగా సమర్పించి తన ఉదారతను చాటుకున్నారు. ఎంతో మంది భక్తులు స్వచ్చందంగా ముందుకు వస్తూ మందిర నిర్మాణంలో తమవంతు సహకారాలు అందిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని శ్రీ చక్ర ప్రాకారంలో శ్రీ కైలాస ప్రస్తార మహామేరు ఉమామహేశ్వర స్వామి దేవాలయం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుండటం విశేషం.

-తమ్మలి మురళీధర్ 99895 07333