AADIVAVRAM - Others

నిరంతరం వెలగండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టీ ఫెన్ హాకింగ్స్ గురించి మనందరికీ తెలుసు. కానీ డాక్టర్ శరత్‌కుమార్ దీక్షిత్ గురించి మనలో చాలా కొద్దిమందికే తెలుసు. ఆపరేషన్ థియేటర్ నా క్యాష్ బ్యాంక్, రోగులే నా పాలిట లక్ష్మీ కటాక్షం, ఏ దేశమేగినా ధనార్జనే నా ధ్యేయం అనే వైద్యుల గురించి విన్నాం కానీ.. రోగులే నా దేవుళ్లు, ఆపరేషన్ థియేటర్ నా దేవాలయం అన్న గొప్ప డాక్టర్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరో కాదు- భారతదేశంలోనే పుట్టి, పెరిగి భారతావనిలో తన చదువు ముగించుకుని, మాతృభూమికి దూరమై, అమెరికాకు చేరువై, ప్రస్తుతం అమెరికాలోని అలస్కాలో ఫెయిర్ బ్యాంక్స్ అన్నచోట ప్లాస్టిక్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన పేరు డా.శరత్‌కుమార్ దీక్షిత్.
ఈ డాక్టర్‌లో పెద్ద విశేషం ఏముంటుంది లెండి? మహా అయితే బాగా డబ్బులు సంపాదించి, ఏవో సేవా కార్యక్రమాలు చేసి ఉంటాడు. ఈ మాత్రం దానికే ఈయనకూ స్టీఫెన్ హాకింగ్‌తో పోలికా? అని కూడా మీకు అనిపించి ఉండవచ్చు. కానీ నిజంగానే ఈయన గురించి చెప్పుకోదగిన విశేషాలే ఉన్నాయి.
1978వ సం. ఈయన జీవితాన్ని ఓ మలుపు తిప్పిన సంవత్సరం. ఓ కారు యాక్సిడెంట్‌లో ఘోర ప్రమాదానికి గురై కుడివైపు శరీర భాగాలన్నీ ఏ మాత్రం చలనం లేకుండా చలనాన్ని కోల్పోగా.. చెయిర్‌కు, వీల్ చెయిర్‌కు మాత్రమే అంకితమైన తన భవితవ్యం ఏమిటా అని తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో దెబ్బమీద దెబ్బలా.. మరో భయంకరమైన నిజం డా.దీక్షిత్‌ను మరింత కృంగదీసింది.
తాను లారింగ్స్ (స్వరపేటిక) కేన్సర్‌తో బాధపడుతున్నానన్న నిజం ఆయనకు అశనిపాతం అయింది. తన జీవితానికి చరమాంకం ఆసన్నమైంది అని తాను భావిస్తున్న తరుణంలో.. మరో ఆర్నెల్లకన్నా మీరు జీవించడం కష్టం అంటూ తోటి కేన్సర్ స్పెషలిస్టులు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.
తన నుదుటి రాతను మార్చడం ఎవరి తరం? తనకింత వరకే ప్రాప్తం అనుకున్న దీక్షిత్‌జీ... కీమోథెరపీని నిరాకరించి కేవలం రేడియేషన్ చికిత్స మాత్రమే తీసుకున్నారు. ఫలితంగా ఆయన స్వరపేటిక పూర్తిగా దెబ్బతింది. మాట్లాడే అవకాశమే ఆయనకు మృగ్యమై పోయింది.
1988లో అమెరికాలో ఉండగా తొలిసారి హార్ట్ అటాక్ వచ్చింది. దీన్నీ తట్టుకున్నారీ ధీశాలి. 1994లో మరోసారి యముని కాలపాశం ఆయన్ని కబళించే ప్రయత్నం చేసింది కానీ.. మూడు బైపాస్ సర్జరీలు చేసి ఆయన్ని మృత్యుకోరల్లోంచి బయటపడేశారు తోటి వైద్యులు.
తన ఆరోగ్యం ఇంతటి దుర్భరంగా ఉన్నా, తన వయసు 70లో పడినా.. ‘మానవ సేవే’ తన పరమావధిగా, బాధితుల కన్నీళ్లు తుడిచి వారికి ఊరట కల్గించటమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు డా.దీక్షిత్.
ఆర్థిక స్తోమత లేనివారికి.. కడు నిరుపేదలకు.. ఒక్కొక్కటి 20 వేల నుండి 50 వేల వరకూ ఖర్చయ్యే ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా చేయడానికి నిర్ణయించుకున్నారు.
ప్రతి సంవత్సరం ఓ అయిదు నెలలపాటు భారతదేశంలో పర్యటించి ఇలా ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తూన్న దీక్షిత్ చేసిన ఉచిత ఆపరేషన్ల సంఖ్య అక్షరాలా అరవై వేలు.
‘ఒక నిర్భాగ్య కుటుంబంలో, అంగవైకల్యం గల బిడ్డ జన్మిస్తే.. అది ఆ కుటుంబానికి ఎంతటి పెనుశాపమో నాకు తెల్సు. అందుకే ముఖ్యంగా నా సేవలు ఇలాంటి నిరుపేద కుటుంబాలకు, అవివాహిత ఆడపిల్లలకే పరిమితం చేసుకుంటున్నాను’ అంటున్నారు డా.దీక్షిత్.
జీవించడానికి ఇంతకన్నా గొప్ప పరమార్థం ఏముంటుంది? నలుగురి ముఖాలపై చిరునవ్వు, కళ్లల్లో సంతోషం.. దానికి కారణం మనమైతే జీవితానికి ఇంతకు మించి గొప్ప లక్ష్యాలు ఏముంటాయి? లక్ష్యం ఏదైనా పరమార్థం నలుగురి ఆనందం అయితే చరిత్రలో మన గురించి కాదు.. మనుషుల సంతోషంలో మన దరహాసాలుంటాయి!

-శృంగవరపు రచన 99591 81330