Others

శ్రమ - ప్రేమల పతాకచ్ఛాయలలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత జయంతి వత్సర సందర్భంగా...

నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టు అగ్రనాయకుడిగానూ, కార్మిక సంఘాల వ్యవస్థాపకుడిగానూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగానూ, ఉత్తమాభిరుచికి పట్టం కట్టిన గొప్ప సాహిత్య విమర్శకుడిగానూ, ఉర్దూకు ‘మైనారిటీ భాష’గా ముద్రకొట్టి, నిలువులోతు పాతరేయాలని చేసిన కుట్ర యత్నాలకు ఎదురొడ్డి, నిలువెత్తున రెపరెపలాడిన ఆత్మగౌరవ పతాకంగానూ, డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ సుప్రసిద్ధులు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయిన వాళ్లు వందల్లో కాకపోయినా డజన్లలో వుంటారీ దేశంలో. కానీ, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు తనకి లభించిన వేతనాన్ని మొత్తంగా అభ్యుదయ రచయితల సంఘానికి - అంజుమన్ తరక్ఖీ ఎ పసంద్‌కు - విరాళంగా ఇచ్చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్. ఇప్పుడు తెలంగాణ రాష్టమ్రంతటా ఆయన శతజయంతి సంబరాలు సంరంభంగా జరుగుతున్నాయి. ఆ సంబరాల్లో పాలుపంచుకోవాలన్న ఒకేఒక్క కోరిక తప్ప, రాజ్ బహదూర్ గౌర్ గురించి రాయడానికి మరే అర్హతా లేనివాణ్ణి నేను.
దేశం స్వతంత్రం కావడానికి ముందూ - వెనుకా హైదరాబాద్ కేంద్రంగా సాగిన అభ్యుదయ సాహిత్యోద్యమ ఉరవడిలో, మఖ్‌దూం మొహియుద్దీన్‌తో పాటుగా అగ్రపీఠిన నిలబడిన నిబద్ధ విమర్శకుడు డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్. ఉర్దూ సాహిత్యాన్ని - ముఖ్యంగా ఉర్దూ కవితను - బంగారు పంజరాల్లో బందీ కాకుండా చెయ్యడానికి అహరహం కృషి చేసిన సాహిత్య సేనాని ఆయన. అమీర్ ఖుస్రూ - గాలిబ్ - మీర్ - బహదూర్ షా జఫర్ మొదలుకుని ఫైజ్ - కైఫ్ - మఖ్‌దూం - సయ్యద్ జాఫ్రీ వరకూ ఏ కవిని గురించయినా, ఎప్పుడయినా, ఎక్కడయినా సందర్భోచితంగా మాట్లాడగల మహావక్త ఆయన. డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ విద్వత్తు ఉర్దూ భాషా సాహిత్యాలకే పరిమితం కాదు. షేక్‌స్పియర్ నుంచి షెల్లీ వరకూ - వేమన నుంచి వీరేశలింగం వరకూ - నిల్చున్నపాటునే ప్రసంగించగల ప్రజ్ఞ రాజ్ బహదూర్ గౌర్ సొంతం. శ్రీశ్రీ - రాంభట్ల కృష్ణమూర్తి - గజ్జెల మల్లారెడ్డి ఆయన ప్రియమిత్రులు. దాశరథి - సినారె - కౌముది ఆయన జాన్ జిగిరీ దోస్తులు! హైదరాబాద్ ఉర్దూ సాహిత్య ప్రియులు ఆయన్ని, ప్రేమగా ‘రాజ్’ అని పిల్చుకునేవారు. గలగల నవ్వుతూ, నవ్విస్తూ, కుడిచేతా ఎడంచేతా కవితలను ‘కోట్’ చేసే రాజ్ సాబ్ చిక్కడ్‌పల్లి నుంచి హిమాయత్ నగర్ వరకూ సజీవ స్రవంతిలా ప్రవహిస్తూ వచ్చేవారు. ఎడం చేత్తో కళ్లజోడు తీసేసి, రెండు చేతులూ నడ్డి మీద పెట్టుకున్నారంటే, ఆయన ఏదో విషయం గురించి గంభీరోపన్యాసానికి సిద్ధమయ్యారని అర్థం.
మా నాన్నగారు యం.వి.యన్. కపర్దీతో రాజ్ సాబ్‌కి సన్నిహిత స్నేహం. రాజ్ సాబ్ ఏ.ఐ.టీ.యూ.సీ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మా నాన్నగారు దానికి ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. ఇద్దరూ రాష్ట్ర సిపిఐ సెక్రటేరియట్ సభ్యులుగా కూడా ఉండేవారు. మేం - 1975లో - సత్యనారాయణరెడ్డి భవన్ ప్రాంగణంలో ఉండే ఇంటికి మారిపోయిన తర్వాత ప్రతి హోలీ పండుగ రోజునా బ్రిజ్‌రాణీ పెద్దమ్మనూ, అవధేశ్ అక్కనూ, (రష్యా నుంచి వచ్చేసిన తర్వాత) తమారా - బాలాజీ దంపతుల్నీ, మంజుశ్రీనీ, యూసఫ్ - సలామ్ - నుస్రత్ లాంటి సైన్యాన్నీ వెంటపెట్టుకుని రాజ్ సాబ్ మా ఇంటి మీద దాడి చేసేవారు. మంచంపట్టి వుండిన మా బామ్మని తప్పించి అందర్నీ రంగుల్లో ముంచెత్తే దాకా వదిలేవారు కాదు. ఆయనా, మా నాన్నగారూ సాహిత్య చర్చ మొదలుపెట్టిన వేళ, కాళిదాసు ‘మేఘదూతం’ మొదలుకుని కల్హణుడి ‘రాజ తరంగిణి’ వరకూ సంస్కృత సాహిత్య తరంగిణి మా రేకుల ఇంటిని ముంచెత్తేది. వాళ్లతో వై.విజయ్‌కుమార్, రాంభట్ల, మల్లారెడ్డి తదితరులు కూడా కలిస్తే ఇక వాళ్ల సాహిత్య చర్చకి ముగింపే వుండేది కాదు.
రాజ్ సాబ్ గురించి, రాయడానికి ఏ అర్హతా లేనివాణ్ణని ముందే చెప్పాను. అయితే, కొన్ని విషయాలకి నేను ప్రత్యక్ష సాక్షిని కావడం చేత, వాటి గురించి చెప్పక తప్పడం లేదు మరి. నాకు పదిహేను పదహారేళ్ల వయసు వచ్చిందగ్గిర్నుంచీ రాజ్ సాబ్‌ను తరచు చూస్తూనే ఉన్నా. 1974లో, మా రెండో అన్నయ్య శ్రీపతి పెళ్లి రాజ్ సాబే చెయ్యించారు. వై.విజయకుమార్ గారూ, రాజ్ సాబ్ దంపతులు అప్పుడు మా వూరు - తాడేపల్లిగూడెం-లో నాలుగు రోజులు వున్నారు. విజయకుమార్ గారికి అప్పట్లో కళ్లలో క్యాటరాక్ట్ ఏర్పడి చూపు తగ్గిపోయింది. నేను రోజూ ఆయనకి ‘హిందూ’ పేపర్ చదివి వినిపించేవాణ్ణి. నేను పేపర్ చదువుతున్నంత సేపూ రాజ్ సాబ్ రనింగ్ కామెంటరీ చెప్తూండేవారు. కాసేపటికి కుమార్ గారికి చిర్రెత్తి కేకలేసేవారు. కథ అక్కడిదాకా వచ్చిన తర్వాత, నవ్వుకుంటూ రాజ్ సాబ్ గదిలోంచి నిష్క్రమించేవారు. డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ నాకన్నా నలభయ్యేళ్లు మాత్రమే పెద్ద. కానీ, రాజ్ సాబ్‌లో ఓ కొంటె కుర్రాడు దాంకుని ఉండేవాడు - ఇలాంటి సందర్భాల్లో అతగాడు బయటకి దూకి పారిపోయేవాడు!
ఒకసారి సిపిఐ జాతీయ నాయకుడు ఎం.ఎన్.గోవిందన్ నాయర్ హైదరాబాద్ వచ్చారు. నారాయణగూడ వైఎంసిఏ హాల్లో ఆయనతో ఓ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి శ్రోతగా వచ్చిన చెన్నమనేని రాజేశ్వరరావు గారిని (అప్పట్లో రాజేశ్వరరావు గారు సిపిఐ; తర్వాత టీడీపీ అటు తర్వాత టీఆరెస్ పార్టీల్లోకి మారారు!) రాజ్ సాబ్ అనువాదకుడిగా వేదిక మీదికి పిలిచేశారు. వద్దువద్దన్నా వినలేదు! దానికి తోడు, గోవిందన్ నాయర్ మంచి వక్త కారు. దాంతో రాజేశ్వరరావు అనువాదం ఎంతో ‘సృజనాత్మకంగా’ సాగింది. అనువాదకుడి సౌలభ్యం కోసం గోవిందన్ నాయర్ ఆగినప్పుడు రాజ్ సాబ్ జోక్యం చేసుకుని ‘అయ్యా నాయర్‌గారూ, మీ ధోరణిలో మీరు మాట్లాడుతూ పొండి - మా అనువాదకుడు ఆయనకి తోచింది ఆయన చెప్తూ పోతాడు!!’ అంటూ హితవు పలికారు. అప్పటిదాకా జోగుతూ ఉండిన సభాస్థలి ఉలిక్కిపడి పగలబడి నవ్వింది. డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ సాన్నిధ్యం అంత విద్యుజ్ఞనితంగా ఉంటుంది!!
డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ సాహిత్యానికీ, సమాజానికీ చేసిన సేవల గురించి రాయడానికి ఎందరో మహానుభావులున్నారు. ఆయన వ్యక్తిత్వంలోని ఓ విశిష్టాంశ గురించి చెప్పి వూరుకోవడమే నా ఉద్దేశం. ఆంధ్రా వాళ్లు ‘స్వచ్ఛమయిన’ తెలుగు మాట్లాడతారని ఎవరయినా అన్నప్పుడు రాజ్ సాబ్ వంకరగా నవ్వి ఇలా అనేవారు. ‘యర్లీ మాణింగ్ ఎక్స్‌ప్రెస్‌కి మా బ్రదరిన్లా వచ్చిండు అంట. స్వచ్ఛమయిన తెలుగులో మాట్లాడుడు మా తెలంగానోల్లకి రాదు బయ్’!! మరి సెలవు!!

--మందలపర్తి కిషోర్ 8179691822