Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదులోని గోలకొండ కోట వంటి కోటలు శబ్దతరంగ ప్రసార విజ్ఞానాన్ని వినియోగించుకుని, ఆనాటి రాజభవన నిర్మాణాన్ని వారెలా నిర్వహించారో ఇప్పటికీ మనకు కనిపిస్తూనే వుంది. కొండ కింద చప్పట్లు కొడితే, కొండమీద రాజభవనంలో ఆ చప్పట్లు ప్రతిధ్వనించటం ఈనాటికీ మనకు కనిపిస్తోంది. వౌలికంగా దాని పేరు గోపాలకొండ అనీ, కొందరు యాదవరాజులు దాన్ని నిర్మించుకున్నారనీ, తరువాత అది తురుష్కరాజుల పాలై గోల్‌కొండగా మారిందనీ, చారిత్రికులు చెపుతున్నారు.
ఒక గ్రామంలో వుండే ఆలయ శిఖరాలకు మించిన ఎత్తుగల నివాస భవనాలను నిర్మించరాదనే సూత్రాన్ని ఆనాటి హిందూ ధర్మశాస్త్రాలు నిర్దేశించటంవల్ల, ధనవంతులు పోటీపడి పైపై అంతస్తుల ఇళ్ళు నిర్మించుకుని, భూగర్భానికి చేటుచేసే ప్రమాదం తప్పింది. అలాటి సూత్రాలను ఈనాడు మనం పాటించకపోవటంవల్ల ప్రతి చిన్న నగరంలోనూ బహుళ అంతస్తుల భవనాలు పెరిగిపోయి, నీటి ఎద్దడికీ, పర్యావరణ కాలుష్యానికీ కేంద్ర బిందువులుగా తయారవుతున్నాయి. ఇలా అన్నంతమాత్రంచేత పురాతన భారతీయులు కనీసం రెండు మూడంతస్తుల యిళ్ళుకూడా కట్టుకోలేదని మనం అనుకోరాదు. కాళిదాసాది మహాకవుల రచనల్లో(బి.సి.1వ శతాబ్దం) సౌధాలూ, ప్రాసాదాలూ వంటి అనేక అంతస్తుల భవనాల ప్రస్తావనలేకాక, స్నానాలకు యంత్ర ధారాగృహాల ప్రస్తావన కూడా వుంది. (్ధరాగృహాలు అంటే, షవర్ బాత్ ఏర్పాట్లువున్న స్నానాల గదులు).
‘‘తతత్రావశ్యం వలయ కులి శోద్ఘట్టనో ద్గీర్ణతోయం
నేష్యంతి త్వాం సురయువతయో యంత్రధారాగృహత్వమ్
(ఓ మేఘమా! ఆ కైలాస నగరంలో వుండే దేవయువతులు తమ చేతి బంగారు గాజుల అంచులనే వజ్రాలతో నిన్నుకొట్టి, నీలోని నీటిని ధారలు కట్టించి, నిన్ను కృత్రిమమైన యంత్రధారాగృహం చేసుకోగలరు) ఇక్కడ యంత్రాలతో నిర్మాణం అవుతాయనీ, అవి స్నానానికి ఉపయోగపడతాయనీ, సుస్పష్టంగా ప్రస్తావించబడటాన్ని మనం గమనించవచ్చు. అలాగే మేఘాలకు లోహద్రవ్యాలు తగిలితే మేఘాలలోని జలబిందువులు ధారలు కడతాయనే వైజ్ఞానికాంశం కూడా దీనిలో దాగి వుందని మనం గుర్తించవచ్చు.
దాన్ని మించిన విశేషం హంపీలో ఈనాటికీ మనకు కనిపిస్తోంది. హంపీ విజయనగరంలో చిన్న చిన్న కొండలమీదనుంచి తుంగభద్రానది ప్రవహిస్తోంది. ఆ కొండల మధ్యలో పొడుగాటి ఉలులతో భూమి కిందే తూములు తొలిచి, ఆ తూములలోకి తుంగభద్ర నీరు ప్రవహించేటట్లు చేశారు.
ఆ తూములు రాజ భవనాలలోనుంచీ, సన్యాసుల మఠాలలోనుంచీ ప్రయాణం చేస్తాయి. ఒక్కొక్క భవనంలోనూ, ఆ తూము వున్నచోట చిన్న తొట్టిలాగా నేలను తొలిచి వుంచారు. అక్కడ కొంచెం గుంట కూడా చేశారు. దానివల్ల కుండ నీళ్ళలోకి దిగే వసతి ఏర్పడుతోంది. నీటి ప్రవాహంలో వచ్చే మట్టి కూడా అక్కడ కిందికి దిగుతుంది. నీటి ప్రవాహం ముందుకు సాగిపోతుంది. ఇలా ఒక భవన పంక్తిని దాటుకుని, ఆ నీటి ప్రవాహం మరొక మలుపు తిరిగి, మళ్లీ తుంగభద్రలోకే చేరుకుంటుంది. ఈ నిర్మాణాలన్నీ 14 లేక 15 శతాబ్దాలలో జరిగాయి. ఈ రకంగా కొండలను లోలోపే తొలిచేందుకు, నీటి ప్రవాహపు మట్టాన్ని సరిచూసుకునేందుకు, ఎంతటి విస్తృతమైన సాంకేతిక విజ్ఞానం వుండలా మనం ఊహించుకోవచ్చు.
ఇక సొరంగపు నిర్మాణ విజ్ఞానం దగ్గరకు వస్తే, దాంట్లో వుండే కష్టనష్టాలు ఏమిటో ఈనాటి ఇంజనీర్లకు బాగా తెలుసు. కానీ అయిదువేల సంవత్సరాలనాటి మహాభారతంలో లాక్ష గృహదహన సందర్భంలో సొరంగపు నిర్మాణం విస్తారంగా ప్రస్తావింపబడింది. ఊళ్లో వుండే బావుల నీళ్ళు దెబ్బతినకుండా, ఇళ్లు బీటలు పారకుండా, ఊరి కింద నుంచి సూరంగం వెళ్లి లాక్షగృహంలో కలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి 15వ శతాబ్దం నాటి (లేదా 16వ శతాబ్దపు పూర్వార్థం నాటి) దక్షిణ దేశపు నాయక రాజులు కూడా, తమ శత్రువుల కారాగృహాల్లోకి జొరబడి, బందీలను విడిపించుకుపోయిన సన్నివేశాలు మన చరిత్రలో కనిపిస్తున్నాయి. అంటే బి.సి 3000 నాటినుంచీ ఎ.డి 15వ శతాబ్ది దాకా వచ్చిన విజ్ఞాన పరంపర, ఈ అయిదారు వందల ఏళ్ళలోనూ అంతరించిపోయిందన్నమాట! అలాంటి సొరంగాల నిర్మాణం ఈనాటి మన విజ్ఞానానికి కూడా పరిశోధించాల్సిన అంశమే. అనాదిగా మన దేశంలో కోటల చుట్టూ అగడ్తలు నిర్మించేవారు. ఈ అగడ్తలలోకి నీరు రావటం, నీరు పోవటం, వాటిమీది వంతెనలు, మొదలైనవన్నీ ఆనాటి ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని తెలిపే నిర్మాణాలే!క్రీ.పూ.4వ శతాబ్దం నాటి అర్థశాస్త్రంలో అగడ్తల నిర్మాణం గురించిన వివరాలున్నాయి. దీనిని బట్టి కరకట్టలు, ఆనకట్టలు కూడా అప్పటికే విస్తృతంగా వాడుకలో వుండేవని నిర్ణయించారు. క్రీ.శ. 2వ శతాబ్దంలో చోళరాజు కరికాలచోళుడు తమిళనాడులో కావేరీ నది మీద ‘కళ్లానై’ అనే చోట నిర్మించిన రాతి డామ్ ప్రపంచంలోని డామ్‌లన్నింటికన్నా పురాతనమైనదే కాక, ఇప్పటికీ నిలిచి వున్నది. దీనిని 1902లో పునరుద్ధరించి ‘స్లూయిస్ గేట్లను’ ఏర్పాటుచేశారు.
ఇవిగాక రామప్పగుడి (వరంగల్)లో నీళ్ళలో తేలే ఇటుకలూ, ఎ.డి.150 ప్రాంతాల దాకా సుస్థిరంగా నిలిచిన నదులమీది ఆనకట్టలు, ఆ ప్రాంతాలలోనే విదేశీయులకు సన్నని వస్త్రాలను సరఫరా చేసిన మగ్గాలూ, సముద్ర ప్రయాణంలో తుఫాను సమయాలలో ఓడ పగిలిపోయినపుడు ఏ ముక్కకా ముక్క చిన్న చిన్న పడవలుగా రూపొందే సాంకేతికత, నీటి గడియారాలూ, ఇసుక గడియారాలు, సుప్రసిద్ధ డెమాస్కస్ కత్తి వంటి ఆయుధాల నిర్మాణాలు (దీనిలో నానో టెక్నాలజీ అంతర్లీనమై వుందంటున్నారు), రకరకాల యుద్ధావసరాలకు అనువైన కవచాలు, యుద్ధ పరికరాల వంటి అనేక రంగాలకు సంబంధించిన ఇంజనీరింగ్ సామర్థ్యాలు ఈనాడు కథలుగా మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి!
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి