Others

ఇలవేలుపు (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నృత్యం: విజె శర్మ
కళ: తోట
కూర్పు: అక్కినేని సంజీవి
కెమెరా: కెయస్ ప్రసాద్
పాటలు: వడ్డాది, శ్రీశ్రీ,
కొసరాజు, అనిశెట్టి
నిర్మాత: అక్కినేని ఆనంద్.
చిత్ర పర్యవేక్షణ: యల్‌వి ప్రసాద్.
దర్శకత్వం: యోగానంద్

ఒకసారి అనారోగ్యం కారణంగా ఎల్‌వి ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకృతి చికిత్సా కేంద్రంలో స్వస్థత పొందారు. ఆ ఆశ్రమం నేపథ్యంగా చిత్రం నిర్మించాలని సంకల్పించారు. 1954లో వచ్చిన తమిళ చిత్రం ‘ఎదిల్ పారాదదు’ (శివాజీగణేశన్, పద్మిని)లోని కథాంశం తన ఆలోచనలకు దగ్గరగా ఉందని గ్రహించి, ఆ చిత్ర కథకుడు సివి శ్రీ్ధర్ వద్ద హక్కులు కొన్నారు. రచయిత వెంపటి సదాశివ బ్రహ్మంతో దానిని మరింత మెరుగుపర్చి ప్రేమ, త్యాగం, మానవత వంటి అంశాలను జోడించి కథను సిద్ధం చేయించారు. ఈ కథకు ప్రముఖ నాటక రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి, సదాశివ బ్రహ్మంకు సహకారం అందించటమే కాక, సంభాషణలూ వ్రాశారు.

స్వయంకృషితో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా వాసి గడించిన విశిష్ట వ్యక్తి ఎల్‌వి ప్రసాద్ (అక్కినేని లక్ష్మీవర ప్రసాద్‌రావు). తమ కుమారుడు ఆనంద్ నిర్మాతగా లక్ష్మీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై 1956లో నిర్మించిన చిత్రం ‘ఇలవేలుపు’. 1956 జూలై 21న విడుదలైన ఈ చిత్రానికి 60ఏళ్లు నిండాయి.
సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించటమేకాక రేలంగికి ప్లేబాక్ పాడటం విశేషం. ఒరియా గాయకుడు రఘునాథ ప్రాణిగ్రాహిని తెలుగు చిత్రసీమకు ఈ చిత్రం ద్వారా దక్షిణామూర్తి పరిచయం చేసి అక్కినేనికి ప్లేబాక్ పాడించారు. యల్‌వి ప్రసాద్ శిష్యులు యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
శేఖర్ (ఏఎన్నార్) కుమార్తె తులసీ పూజ చేయటం, ఆమె భక్తిని వారింటి ఇలవేలుపును గురించి అక్కడ చేరినవారు అడిగిన ప్రశ్నకు శేఖర్ గతం వివరించటంతో చిత్రం ప్రారంభమవుతుంది.
భూస్వామి కాంతారావు (గుమ్మడి)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కొడుకు శేఖర్ బిఏ చదివాడు. వీరి రైతు చంద్రయ్య (ఎఎల్ నారాయణ). అతని కుమార్తె శారద (అంజలీదేవి) నాన్నగారు (ఆర్.నాగేశ్వరరావు) నిర్వహించే ప్రకృతి ఆశ్రమంలో వైద్యసేవలు చేస్తూంటుంది. శేఖర్ ఒకరోజు జబ్బుపడిన తన స్నేహితుడు మోహన్ (చలం)ను ఆశ్రమానికి తీసుకువస్తాడు. అక్కడ శారదతో పరిచయం పెరిగి, ఒకరినొకరు అభిమానించుకుంటారు.
శేఖర్ చైనా దేశ పర్యటనకై వెళ్ళవలసి రావటంతో తిరిగి వచ్చాక శారదను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. శేఖర్ మేనమామ ముకుందరావు (డాక్టర్ శివరామకృష్ణయ్య), శేషమ్మ (సూర్యాకాంతం)ల కుమార్తె తరళ (జమున), కుమారుడు గణపతి (రేలంగి). బావ శేఖర్‌ను తరళ ప్రేమిస్తుంది. శేఖర్ ప్రయాణిస్తున్న విమానం అస్సాం అడవుల్లో కూలిపోతుంది. శేఖర్ మరణించాడని శారద, కాంతారావు తల్లడిల్లిపోతారు. మనోవ్యధతోవున్న కాంతారావు కుటుంబాన్ని ఆదుకోవాలని చంద్రయ్య తన కూతురు శారదను తెచ్చి వారింట ఉంచుతాడు. పిల్లల కష్టసుఖాలు చూడటానికి మేనేజర్ (అల్లు రామలింగయ్య)తో కలిసి కాంతారావును ఒప్పించి శారదకు, కాంతారావుకు వివాహం జరిపిస్తాడు.
విమాన ప్రమాదం నుంచి బ్రతికి వచ్చిన శేఖర్ ఆశ్రమంలో శారదను కలుసుకొని ఆమెకు పెళ్ళయిందని నిందించి వెళ్తాడు. ఇంటికి వచ్చిన శేఖర్, శారద తన సవతి తల్లి అని తెలిసికొని బాధతో మనశ్శాంతి కోసం తాగుడుకు అలవాటుపడతాడు. అతన్ని బాగుచేయటం కోసం తరళతో శేఖర్‌కు వివాహం జరిపిస్తారు. కొన్ని రోజులకు తరళ గర్భవతి అవుతుంది. మోహన్ చెల్లెలి ద్వారా శారద, శేఖర్‌ల గతం గురించి తెలుసుకున్న తరళ శేఖర్‌ను అనుమానంతో హింసిస్తుంది. శేఖర్ బాధతో ఇల్లువిడిచి వెళ్తాడు. శారద భర్తతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఒక గుడివద్ద అపస్మారక స్థితిలోవున్న శేఖర్‌ను ఇంటికి తెస్తారు. అతనికి సేవ చేయబోయిన శారదపై తరళ ఆంక్షలు విధించటంతో శారద శేఖర్ ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తూ దైవధ్యానంలో ఉంటుంది శేఖర్ పరిస్థితి మరింత విషమించే స్థితిలో తన స్నేహితురాలి ద్వారా తరళ నిజం తెలుసుకుని, భర్తతోసహా శారద వద్దకు వస్తుంది. శారద శేఖర్‌కేమీ కాదని తరళకు అభయమిచ్చి దైవధ్యానంతో మరణిస్తుంది. శేఖర్ కోలుకుంటాడు. ఆత్మత్యాగం చేసిన శారద వారింట ఇలవేలుపు అవుతుంది. శేఖర్ కుమార్తె శారదలా భక్తిపరురాలు కావటం, అందరూ ఆనందించటంతో చిత్రం ముగుస్తుంది.
రేలంగికి జంటగా కృష్ణకుమారి, ఆమె తండ్రిగా రమణారెడ్డి నటించారు. గణపతి నాటకాలు వ్రాయటం, వాటి ప్రదర్శన, తల్లి పోరు పడలేక ఇంటినుంచి పారిపోవటం లాంటి పలు సన్నివేశాలు హాస్యంతో రంగరించి, సెంటిమెంటుతో కూడిన చిత్రానికి రిలీఫ్ ఇచ్చేలా రూపొందించారు. సవతి తల్లిని చూడడానికి మేడ ఎక్కబోతూ పైమెట్టుమీద శారదను చూసి శేఖర్ రియాక్షన్, అంతకుముందు గదిలో శేఖర్ ఫొటో చూసిన శారద రియాక్షన్, ఆమెచేత భగవద్గీత పుస్తకం, శారద పాత్రలో నిశ్చలత్వం, శేఖర్ పాత్రలో అలజడి లాంటి సన్నివేశాలను దర్శకులు యోగానంద్ ఎంతో సమర్ధవంతంగా తీర్చిదిద్దారు. అంతవరకూ ప్రేయసి ప్రియురాలుగా హిట్ పెయిర్‌గా ప్రసిద్ధి చెందిన అక్కినేని, అంజలిదేవి, ఈ చిత్రంలో తల్లీ కొడుకులుగా నటించారు. యాంటి సెంటిమెంట్‌గల ఈ పాత్రలకు వారిరువురూ పరిపూర్ణమైన నటనతో న్యాయం చేకూర్చారు. ‘ఇలవేలుపు’ చిత్రంలోని హిట్ సాంగ్ -చల్లనిరాజా ఓ చందమామా. అంజలిదేవిపై ఆశ్రమంలో, అక్కినేనిపై ఆకాశంలో విమానంలో, జమునపై ఇంటి తోటలో.. ముగ్గురిపైనా ఆహ్లాదకరంగా చిత్రీకరించారు. (వడ్డాది- లీల, రఘునాథపాణిగ్రాహి, సుశీల). అంజలిదేవిపై గీతం -ఏలో దేవశ్య కేశవా, జనగణ మంగళ దాయక రామం (వడ్డాది- లీల బృందం). ఈ పాటను ‘శారద’ (హిందీ) చిత్రంలో యధాతథంగా ఉపయోగించారు. రేలంగి, కృష్ణకుమారిలపై -చల్లని పున్నమి వెనె్నలలోనే (వడ్డాది- దక్షిణామూర్తి, సుశీల). జమున, రేలంగి గీతం -అన్నా అన్నా విన్నావా’ (వడ్డాది- జిక్కి). ‘ఇలవేలుపు’ చిత్రం విజయం సాధించింది. శత దినోత్సవాలు జరుపుకుంది. కాకినాడ మెజిస్టిక్ థియేటర్‌లో 22 వారాలు ప్రదర్శింపబడిన ఈ చిత్రంలోని గీతాలు నేటికీ వీనులవిందు కలిగిస్తుండటం హర్షణీయం. ‘ఇలవేలుపు’ చిత్రాన్ని యల్‌వి ప్రసాద్ ‘శారద’ పేరిట హిందీలో నిర్మించారు. శేఖర్ పాత్రకు మొదట దిలీప్‌కుమార్‌ను, తరువాత దేవానంద్‌ను సంప్రదించారు. కాని వారిరువురూ నిరాకరించటంతో రాజ్‌కపూర్‌ను సంప్రదించగా పృథ్వీరాజ్‌కపూర్‌కు, యల్‌వి ప్రసాద్‌కు గల పరిచయం, స్నేహం, ఈ పాత్ర పట్ల రాజ్‌కపూర్‌కు గల మక్కువతో వారు అంగీకరించటం జరిగింది. తొలిసారి మీనాకుమారి, రాజ్‌కపూర్ కాంబినేషన్‌లో రూపొందించిన ఈ శారద (హిందీ) చిత్రం అఖండ విజయం సాధించింది. సి రామచంద్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్.

-సివిఆర్ మాణిక్యేశ్వరి