Others

అరణ్య రోదనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షఋతువు మొదలుకావడంతో మొక్కలు నాటడం మన దేశంలో అనాది సంప్రదాయం. ప్రకృతి పరిణామ క్రమంలో ముడివడిన ఈ సంప్రదాయం సహజ సిద్ధం. అందువల్ల దీన్ని ఎవ్వరూ మార్చలేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ పరిరక్షణ, అటవీ విస్తరణ కార్యక్రమాలను అమలు జరుపుతుండడం కూడ ఈ ప్రాకృతిక పరిణామ క్రమంతో ముడివడి ఉంది. భూమి వర్షధారలతో ‘ఆర్ద్రం’ కావడం- తడిసిపోవడం- ‘ఆర్ద్ర’ కార్తె లక్షణం. ‘ఆర్ద్ర’ వచ్చింది, వెళ్లింది. ప్రస్తుతం పునర్వసు కార్తె నడుస్తోంది. పునర్వసు, పుష్యమి కార్తులలో గుంటలు తవ్వి మామిడి, చింత, వేప, నేరేడు, రాగి వంటి మొక్కలను నాటడం వ్యవసాయదారులకు అనాదిగా తెలిసిన విద్య. ప్రస్తుతం ప్రభుత్వాలు కూడ విస్తృతంగా మొక్కలను నాటడానికి ఈ ‘కార్తెల’ సమయాన్ని ఎంచుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వారు ‘జయశంకర్ భూపాలపల్లి జిల్లా’ నుంచి ఈఏడు ‘హరిత హారం’-మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆరంభించనున్నారట. ఆంధ్రప్రదేశ్‌లోను, మధ్యప్రదేశ్‌లోను, ఛత్తీస్‌గఢ్‌లోను, ఝార్‌ఖండ్‌లోను కూడ మొక్కలు నాటడం ఈ కార్తెలలో ఆరంభం అవుతున్నదన్నది జరుగుతున్న ప్రచారం. అనాదిగా జరుగుతున్న ఈ ‘హరిత అంకురార్పణ’ కార్యక్రమంలో కర్షకులు, ప్రజలు ప్రధానంగా భాగస్వాములయ్యేవారు. ప్రస్తుతం ప్రభుత్వాలు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల పేరుతో చెలామణి అవుతున్నవారు, రాజకీయవేత్తలు అత్యంత ఆర్భాటంగా మొక్కలు నాటుతున్నారు. ఇదీ తేడా. గతంలో మొక్కలు నాటిన వారు అవి ఎదిగి ‘చెట్లు’గా మారేవరకు సహజంగా శ్రద్ధ వహించేవారు. మొక్క మొక్కనూ గుర్తుంచుకునేవారు! ఇప్పుడు ప్రభుత్వాలకు, సంస్థలకు, వేత్తలకు, ఉద్యోగులకు ‘కార్యక్రమం’ గుర్తు ఉంటోంది. మొక్కలు గుర్తు ఉండడం లేదు. గతంలో అంకురించిన ప్రతి మొక్క పల్లవించి పుష్పించేది, పరిమళించేది.. ఫలించేది. ఇప్పుడు ‘నాటే’ కార్యక్రమాలు మాత్రం విజయవంతం అవుతున్నాయి. నాటిన మొక్కలలో ఎన్ని బతికి బట్టకడుతున్నాయన్నది అభిప్రాయ వైరుధ్యాలకు సంబంధించిన అంశం. వర్షఋతువు సమీపిస్తుండడంతో ఈ వైరుధ్య భావప్రకటనలు మళ్లీ పెద్దఎత్తున ఆవిష్కృతం అవుతున్నాయి. ‘దక్షిణాయనం’ ప్రారంభం వర్ష ఋతువు ప్రారంభం ఒకేసారి జరగడం ఖగోళ వాస్తవం. ఇది సౌరమాన- సూర్యునితో ముడివడిన- కాలగణనం. మీన మేష మాసములు వసంత ఋతువు. వృషభ, మిథున మాసములు గ్రీష్మ ఋతువు. కర్కాటక సింహ మాసములు వర్ష ఋతువు! చాంద్రమాన- చంద్రునితో ముడివడిన- కాలగణన ప్రకారం రానున్న ఆషాఢ శుక్ల పంచమి- జూలై 17-నాడు ‘కర్కాటక సంక్రాంతి’, ‘దక్షిణాయనం’ సంభవిస్తున్నాయి. ప్రాకృతికంగా అదీ వర్షఋతువు ఆరంభం..
గత వర్షఋతువులో నాటిన మొక్కలు ఏ మేరకు ఎదిగాయన్న సమీక్షకు ఇది సమయం. అన్ని ప్రాంతాలలోను ‘హరిత హారాలు’ ఏర్పడినట్టయితే భరతమాత ఆకుపచ్చని అందాలను మళ్లీ సంతరించుకోగలదు. ఒక్క మొక్కను, ఒక్క చెట్టును నరికి వేసినట్టయితే బదులుగా పది మొక్కలను నాటాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న అటవీ విధానం. ఈ విధానం అమలు జరిగినట్టయితే దేశం మొత్తం విస్తీర్ణంలో కనీసం ముప్పయి మూడు శాతం భూమి ‘అడవి’గా మారడానికి ఎంతో కాలం పట్టదు. ప్రభుత్వ అటవీ విభాగాల వారు ఏర్పాటు చేస్తున్న ‘వృక్ష ప్రాంగణాల’- ప్లాంటేషన్స్- వల్ల అడవుల పునరుద్ధరణ జరగడం లేదన్నది కేంద్ర ప్రభుత్వం వారి ‘అంతర్జాల హరిత వ్యవస్థ’.. ‘ఈ- గ్రీన్ వాచ్ వెబ్‌సైట్’- ద్వారా ఇటీవల ధ్రువపడిన వాస్తవం. సహజంగా పెరిగిన అడవులను వివిధ ‘కృత్రిమ ప్రగతి పథకాల’ పేరుతో ధ్వంసం చేస్తున్నారు. మళ్లీ ‘ప్లాంటేషన్ల’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘ప్లాంటేషన్ల’ పెంపకం కోసం వ్యవసాయ భూమిని రైతుల నుంచి సేకరిస్తున్నారట! కానీ కొనే్నళ్ల తరువాత అక్కడ ‘వనాలు’ అదృశ్యమైపోయి రైతులు యథాపూర్వకంగా ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న దృశ్యాలు ‘ఈ గ్రీన్ వాచ్ వెబ్‌సైట్’లో ఆవిష్కృతం అయ్యాయట! దేశమంతటా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలో ఈ వైపరీత్యాలు పునరావృత్తం అవుతున్నాయట. ఒక్క మొక్కను నాటడానికి దాదాపు నూట ఇరవై ఐదు రూపాయలు సగటున ప్రభుత్వాలు ఖర్చుచేస్తున్నట్టు అధ్యయన వేత్తలు నిర్ధారించారు. కానీ 2000వ సంవత్సరం నుండి ఒకే స్థలంలో ఒకే ప్రాంగణంలో అనేక ఎకరాల భూమిలో ప్రభుత్వాలు మూడుసార్లు నాటించిన ‘వనాలు’ వాడిపోయినట్టు అధ్యయనాలలో వెల్లడైంది. ఇలా పదమూడు ఏళ్లలో ఒకేచోట మూడు, నాలుగుసార్లు మొక్కలు నాటారు. కానీ 2013 నాటికి ఈ ‘ప్లాంటేషన్’ల అవశేషాలు కూడ లేవు. ఆ భూములను రైతులు మామూలు వ్యవసాయం కోసం వినియోగించుకుంటున్నారు...
ఇలా మొక్కలు నాటడానికి, వాటిని పెంచడానికి కోట్ల రూపాయలు ఖర్చయిపోతున్నాయి. అడవుల విస్తరణ మాత్రం జరగడం లేదు. భూమిని సేకరించి ‘హరిత ప్రాంగణం’గా ప్రకటించి చుట్టూ కంచె వేసినట్టయితే ఆ ప్రాంగణంలో మొక్కలు సహజంగా ఎదుగుతాయి. మూడు నాలుగేళ్లలో పొదలు, చెట్లు పెరుగుతాయి. పది ఏళ్లలో అదంతా సహజమైన అడవిగాను, పదిహేను ఏళ్లలో దట్టమైన అడవిగాను రూపొందడం ఖాయం. ఈ సహజ పద్ధతిలో అడవులను పెంచడానికి ఖర్చు తక్కువ. మొక్కలు నాటనక్కరలేదు, నీరు పోయనక్కరలేదు. ఒకటి రెండు చదరపు కిలోమీటర్ల నుంచి ఐదారు చదరపు కిలోమీటర్ల మేర ఇలాంటి భూమిని గుర్తించి సేకరించి ప్రాంగణాలుగా ఏర్పాటు చేస్తే చాలు. ఈ ప్రాంగణాలలోకి పశువులు, నేరస్థులు చొరబడకుండా కాపలాకాస్తే చాలు, ఇతర ఖర్చులు లేకుండానే అడవులు పెరుగుతాయి. కాపలా కాయడానికి మాత్రమే ప్రభుత్వ నిధులు ఖర్చుచేయాలి. కానీ ఈ సహజ ప్రక్రియ దశాబ్దుల తరబడి ప్రభుత్వాలకు స్ఫురించడం లేదు. అందువల్ల ప్రభుత్వాలు నాటుతున్న మొక్కలు ప్రబలి అడవులుగా మారడం లేదు. ఈ మొక్కలలో అధికాధికం పిచ్చిమొక్కలు, చేదు మొక్కలు, పుష్పించని ఫలించని ఆకుపచ్చని విచిత్ర రూపాలు! అందువల్ల ఈ ప్రభుత్వపు మొక్కలు, విదేశాల నుంచి దిగుమతి అయిన విషపు మొక్కలు కేవలం భూగర్భ జలాలను తాగేయడానికి పనికి వస్తున్నాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా వంటి చోట్ల పెరిగిన కొన్ని రకాల మొక్కల విత్తనాలు మన దేశపు అడవులలోకి వ్యాపించాయి. దశాబ్దుల తరబడి ఈ విదేశీయ ‘వృక్ష జాలం’ వ్యాపించింది. కేరళలోని అడవులలో ఈ మొక్కలు, చెట్లు వ్యాపించినంత మేర ఇతర రకాల చెట్లుకాని, మొక్కలు కాని, తీగలు కాని చివరికి గడ్డి కాని పెరగడం లేదట! ఈ ఆకుపచ్చని ‘విదేశీయ’ విష రూపాలు అడవుల విస్తరణకు కాక స్వదేశీయ వృక్షజాలాన్ని- సహస్రాబ్దులుగా పెరిగిన చెట్లను- ధ్వంసం చేయడానికి దోహదం చేస్తున్నాయి..
ఇలాంటి విషపు చెట్లను, పండ్లు, పువ్వులు లేని చేదు చెట్లను పక్షులు కాని ఉడతలు కాని ఆశ్రయించడం లేదు. ఇలాంటి చెట్లు జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేశాయి, చేస్తున్నాయి. జంతుజాలం, వృక్షజాలం కలసినది అడవి, ప్రకృతి, జీవవైవిధ్యం.. పక్షులకు, జంతువులకు ‘మిత్రులు’ కాని ‘సర్కారీ’ చెట్లవల్ల ‘ప్రాకృతిక సమతుల్య స్థితి’ గాయపడుతోంది. అందువల్ల మన దేశంలో అనాదిగా పెరిగిన వేప, మామిడి, నేరేడు, మఱ్ఱి వంటి చెట్లను మాత్రమే ప్రభుత్వాలు పెంచాలి. ‘‘మ.మా.మే.రా.జు’’ అన్నవి భారతీయుల పంచ పల్లవీయులు. అవి- మఱ్ఱి, మామిడి, మేడి, రాగి, జువ్వి చెట్లు. వీటిని విరివిగా పెంచాలి. ‘గణపతి’ పూజకు పనికివచ్చే ఇరవై ఒక్క రకాల మొక్కలు విస్తరించాలి..