Others

పతల్ ‘గడీ’ పాలనకు మావోల మద్దతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జార్ఖండ్‌లో ఇటీవల గిరిజనులు పతల్ ‘గడీ’ ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘జల్-జంగల్-జమీన్ మావే, ఇతరులెవరికీ ఇక్కడ అధికారం లేదు. రాష్టప్రతి, ప్రధానిని సైతం గుర్తించబోము..’ అన్నది ఆ ఉద్యమ సారాంశం. ఇటీవల నలుగురు జనాన్లను కిడ్నాప్ చేసి, వారి ఆయుధాలను అపహరించి, తమ ఉద్యమం గూర్చి ప్రపంచానికి వీరు తెలియజేశారు. గ్రామ సరిహద్దుల్లో తమ ఆకాంక్షలతో కూడిన ఫలకాల (పత్తర్ కడీ)ను ప్రతిష్ఠిస్తున్నారు. దీని వెనుక మావోయిస్టులున్నారని చాలామంది బలంగా విశ్వసిస్తున్నారు.
భారత సర్కారును గుర్తించకపోవడం, జల్- జంగల్- జమీన్ తమదేనని ప్రకటించుకోవడం, ఆర్థిక-న్యాయ, భద్రత తదితర అవసరాలకు ఒక సొంత వ్యవస్థను (జనతన సర్కారు మాదిరి) రూపొందించుకుని ఉద్యమించడం చూస్తే- ఆదివాసీల వెనకాల మావోల హస్తం ఉందని తెలుస్తోంది. వీరు సమాంతర ప్రభుత్వాన్ని నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు వంద గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థలు నెలకొల్పి ప్రజల్ని అటువైపు నడిపించేందుకు వ్యూహం పన్నారు. ఈ ఉద్యమం ఛత్తీస్‌గఢ్‌కు సైతం పాకింది. ఖుంటీ లోక్‌సభ సభ్యుడు కరియా ముండా ఇంటిపై ఆదివాసీలు ఇటీవల మూకుమ్మడిగా దాడిచేసి, అక్కడున్న నలుగురు జవాన్లను కిడ్నాప్ చేసి వారి ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఇది పూర్తిగా మావోల కార్యాచరణ తప్ప ఆదివాసుల అజెండా కాదు. గిరిజనులు స్వయంగా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని కార్యక్రమాలు చేపట్టడానికి, ఎంపీ ఇంటిపై దాడిచేసి, భద్రతా సిబ్బందిని అపహరించి ఆయుధాలతో ఉడాయించడానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మిలిటెన్సీ పెంచి, ఆ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకునే మావోల ఎత్తుగడగా కనిపిస్తోంది. గుమ్లాసింగ్ భూమ్ తదితర జిల్లాలకు ఈ ఉద్యమం విస్తరించింది. జనాభాలో 26 శాతమున్న గిరిజనులు తమదైన ‘రాజ్యం’ రావాలని ఉద్యమిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందిని బహిష్కరిస్తున్నారు. విల్లంబులు, కొడవళ్లు, కత్తులు, కర్రలు చేతబూని ఊరేగింపులు నిర్వహిస్తూ తమ శక్తిని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిలో జీన్ ప్యాంట్లు, జాకెట్లు, కళ్లద్దాలు ధరించే యువకులు సైతం కనిపిస్తున్నారు. తమ ప్రాంతాన్ని తామే పాలించుకుంటామన్న నినాదంతో ఈ పత్తల్‌గడీ ఉద్యమం కొనసాగుతోంది. ఈ 70 ఏళ్ళ స్వాతంత్య్రకాలంలో ఎప్పుడూ లేనిది తాజాగా ఈ ఉద్యమం రెక్కవిప్పిందంటే సహజంగానే చూపుడువేలు మావో వైపువెళుతుంది.
ఎస్టీలకు రాజ్యాంగంలో కల్పించిన రక్షణలను ఆసరాగా చేసుకుని వీరు రాజ్యసభ, విధానసభల కన్నా గ్రామసభ అత్యున్నతమైనదని ప్రకటించుకుని ప్రజల్ని ఉద్యమించేలా చేస్తున్నారు. సంప్రదాయ ఆయుధాలను చేతపట్టుకుని, నృత్యాలతో, తుడుం దెబ్బలతో ఆదివాసీలు చేస్తున్న ఉద్యమం ఫలితంగా గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. తమది ‘స్వరాజ్యం’ అని గిరిజన నాయకులు ప్రకటిస్తున్నారు. గిరిజనేతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఊరి వెలుపల ఆకుపచ్చ రంగు వేసిన పెద్ద రాతిని పాతి, దానే్న శిలా శాసనంగా ప్రకటిస్తున్నారు. దీనే్న పత్తర్ కడీ అంటున్నారు. గ్రామ సరిహద్దులను ఇతరులెవరైనా అతిక్రమిస్తే శిక్షార్హులని పేర్కొంటున్నారు.
కొన్ని తరాల క్రితం బ్రిటీష్ పాలనలో ఇలాంటి ఉద్యమమే జరిగిందని, దానే్న ఇపుడు పునరుద్ధరించామని కొంతమంది చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి ఉద్యమాన్ని దేశం ఎరగదు. కాని, మావోలు ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుతూ, రాజకీయాలు బోధిస్తున్న ఈ కాలంలో ‘అగ్గి’ రాజుకుంది. తమ గ్రామాల్లో చట్టాలు, ఐపిసి, రెవెన్యూ విభాగం ఏదీ పనిచేయదని ఆదివాసీలు చెబుతున్నారు. ఎవరైనా పోలీసులు వచ్చి ప్రశ్నిస్తే- ఇక్కడ ఏ చట్టం పనిచేయదంటున్నారు. జవాన్లను కిడ్నాప్ చేస్తున్నారు, వారి ఆయుధాలు ఎత్తుకెళుతున్నారు. పోలీసులు కేసులు పెడుతున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. తమపై ఝార్ఖండ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోజాలవని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తమ ‘గ్రామసభ’కు గల విశేష అధికారాలను, తరతరాలుగా వస్తున్న వంశ పారంపర్య హక్కులను ఉటంకిస్తున్నారు. ప్రభుత్వ బడులను బహిష్కరించి, తమదైన పాఠ్యాంశాలను పిల్లలకు బోధిస్తున్నారు. ‘ఖ’ అంటే ఖనిజ సంపద, ‘గ’అంటే గ్రామ సభ, ఆంగ్ల అక్షరం ‘ఎ’ అంటే ఆదివాసీ అని, ‘సి’అంటే చాచా నెహ్రూ చోరోఁకా ప్రధాన్ (దొంగల ముఠా నాయకుడు) అని చెట్లకింద పిల్లల్ని కూర్చోబెట్టి చెబుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామసభ తీర్మానాన్ని అనుసరించి ఆదివాసీ అనుకూల విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. ఆగస్టు 15న స్వాంత్య్రం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరిపే స్కూళ్లకు తమ పిల్లల్ని పంపించేది లేదని చెబుతున్నారు. త్వరలో తమ కోసం ప్రత్యేకంగా బ్యాంకును ఏర్పాటుచేస్తామని దానికి రిజర్వు బ్యాంకు అనుమతి అవసరం లేదని, తాము వారి పరిధిలోకి రామని, తాము స్వతంత్రులమని ఆదివాసీలు పేర్కొంటున్నారు. సొంత కరెన్సీ ఆలోచన సైతం చేస్తున్నారు.
అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల కోసం ప్రభుత్వం చేపట్టే భూసేకరణను వీరు బలంగా వ్యతిరేకిస్తున్నారు. తమ భూమిని లాక్కునే హక్కు, అధికారం ప్రభుత్వానికి లేదని, గ్రామసభ చెప్పిందే చట్టం అంటున్నారు. అపారమైన ఖనిజ సంపద ఉన్న తమ భూములను ఇతరులు గద్దల్లా తన్నుకుపోతుంటే సహించబోమని వారు సంప్రదాయ ఆయుధాలు ఎత్తిపెడుతున్నారు. గ్రామ ‘ప్రధానుల’ అభిమతం ప్రకారం పాలన సాగాలనేది వారి అభిప్రాయం. ఖనిజాలున్న భూమిని వ్యాపారవేత్తలకు ప్రభుత్వం లీజుకివ్వడమంటే తమ సంపదను దొంగలించడమే అని చెబుతున్నారు. ఆదివాసీలు ఇకపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోరని తెగేసి చెబుతున్నారు.
తమకు ఓటరు కార్డు గాని, ఆధార్ కార్డుగాని ఏ అధికారంతో ప్రభుత్వం జారీ చేస్తోంది? అని ఉద్యమ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వాహనాలకు తమ సొంత నెంబర్లు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటామని, స్వయం ప్రతిపత్తితో పాలించుకుంటామని గొంతెత్తి చాటుతున్నారు. పోలీసులు బందిపోట్లలా వ్యవహరించి కేసులు పెడుతున్నారని, దేశద్రోహం కేసులు బనాయిస్తున్నారని, వారి చట్టాలు చెల్లని చోట కేసులు ఎలా పెడతారని నిలదీస్తున్నారు. ‘పెసా’ చట్టం తమకు కల్పిస్తున్న సమస్త హక్కులను, అధికారాలను పాలకులు విస్మరిస్తున్నారని, రాజ్యాంగంలోని 5వ అధికరణలోని వివిధ అంశాలను పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. ఆంగ్లేయులు తమ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే పోరాడామని, ఇపుడు ఈ ప్రభుత్వాలు సైతం తోక ముడవాల్సిందే అని అంటున్నారు. బిర్సాముండా త్యాగం, వీరోచిత పోరాటం తమకు ఆదర్శమని కొందరు ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. ఈ ‘్ధక్కారం’, తిరుగుబాటు వెనుక క్రైస్తవ మిషనరీల, మావోల పాత్ర ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రకమైన వాదన, ఉద్యమం అస్సాంలో, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. అక్కడా మిషనరీల, తీవ్రవాదుల పాత్ర బలంగా కనిపిస్తోంది. ఇది నక్సలైట్ల నయా అవతారమని మరికొందరంటున్నారు.
భారత రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు, మార్పులు చేయాలంటే బ్రిటన్‌లోని ప్రిన్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలి.. పాలకులు అలా అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే తమకు ఆ పత్రం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గ్రామాల్లో పాతిన రాళ్ళను (పత్తర్‌ను) తొలగించడానికి వెళ్లిన పోలీసుల్లో 200 మందిని ఇటీవల గిరిజనులు తమ అధీనంలోకి తీసుకుని బందీలుగా చేశారు. ఇది దేశద్రోహం అని అధికారులు అంటున్నా ఆదివాసీలు, వారి నాయకులు చట్టాలకు తప్పుడు భాష్యాలు చెబుతున్నారని ఎదిరిస్తున్నా.. సరైన రాజకీయ మార్గదర్శనం లేదన్నది వాస్తవం. దాంతో అధికారులు మెతకగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అలుసుగా కొందరు భావిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని పరిస్థితులిప్పుడు మధ్యభారతంలో పునరావృతమవుతున్నాయి. స్థానికులు, స్థానికేతరులన్న సమస్య ఇక్కడ కొత్తగా తలెత్తుతోంది. ఈ ఆదివాసీ ముండా జాతి ఇపుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలను విశ్వసించడం లేదు. ఈ ఉద్యమం ఇపుడు ఛత్తీస్‌గడ్, ఒడిశా తదితర ఆదివాసీ ప్రాంతాలకు విస్తరిస్తోంది. మావోల ఉనికి ఉన్న చోట ఈ ఉద్యమం బలం పుంజుకుంటోంది. ఈ వ్యవహారం ఎక్కడికి దారిస్తుందో ఊహించలేని పరిస్థితి. దేశం ఇలా ముక్కలు కావలసిందేనా?అన్న ప్రశ్న సైతం చాలామందిని వేధిస్తోంది!

-వుప్పల నరసింహం 99857 81799