Others

మా దైవం వేంకటేశ్వర స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా కులదైవం, మా ఇష్టదైవం కలియుగ వేంకటేశ్వరుడు. ఆ వేంకటేశ్వరుని దయామృతాన్ని గ్రోలడానికి అనునిత్యం మా దంపతులం వేంకటేశ్వరుని పూజిస్తుంటాం. ఆ వేంకటేశ్వరుని కొలవడానికి చిన్న పూజాగదిని కూడా మేము మా ఇంట్లోనే నిర్మించుకున్నాం. ఆ వివరాలను చూడండి.
మేము వేంకటేశ్వరుని భక్తులమైనా భగవంతుడు ఒక్కడే అయినా తన భక్తులను బ్రోచడానికి ఆయన సృజించుకున్న రూపాలన్నీ భగవంతునివే కనుక మేము కూడా వివిధ యుగాల్లో వివిధరూపాలతో, వివిధనామాలతో ఉన్న స్వామిని మేము కొలుస్తుంటాం. మా ఇంట్లో మా ఇల్లాలు దేవునిగది అదే పూజాగదిని నిర్మలంగా, స్వచ్ఛంగా దేవుని చిత్రాలను అమర్చి ఆ చిత్రాలకు వివిధ పూలను సమర్పిస్తూ ప్రతిరోజు నిత్య పూజలు చేస్తుంది. ఆమె నా బిడ్డలను, నన్ను సంతోషంగా ఉండేలా చేయుమని ఆ దేవదేవుని నిత్యం తనకొచ్చిన కన్నడ, తెలుగు భాషల్లోని గీతాలతో స్తుతిస్తుంటుంది.
నా ఇంటి ఇల్లాలు సునంద. ఆ సునంద తన ఇంటి పనులతో పాటుగా దైవాన్ని అహర్నిశమూ కొలుస్తూ ఉంటుంది. ఆమె తన కన్నబిడ్డలను, వారు కన్నబిడ్డలను కూడా చల్లగా చూడమని పదేపదే ఆ దేవదేవుని కోరుకుంటూ ఉంటుంది.
నేను శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుల జీవిత చరిత్రలను చదివిన వాడను. ‘ఓమ్’కారం నాకిష్టం. కనుక నేను ఈ దేవునిగదిలో కూర్చుని పూజ చేస్తాను. కాని ఎక్కువగా‘ఓమ్’ అనే చిత్రపటం ముందే కూర్చుని ఏకాగ్రతతో ధ్యానం చేస్తాను. సునంద మాత్రం ఆ పూజాగదిలో దీపపుస్థంభాలను పెట్టి అందులో వత్తులు, ఆవునెయ్యి వేసి ఆ ఒత్తులను పొద్దున, సాయంత్రం వెలిగిస్తుంది. మంచి సువాసన గల అగరుబత్తీలను కూడా వెలిగించి దేవునికి ధూపాన్ని, దీపం సమర్పిస్తుంది. ఆ అగరుబత్తీల వాసనతో మా ఇల్లంతా సుమధుర పరిమళం అలదుకొని దేవుని చల్లనినీడలో మేము నివసిస్తున్నట్టు మాకు అనుభూతిని కలిగిస్తుంది. మా దేవుని గదిలో ఆంజనేయస్వామి, దశావతారాలల్లో ఉన్న విష్ణు భగవానుడు, శ్రీకృష్ణుడు లాంటి వ్యక్తరూపాల్లో ఉన్న భగవంతుని చిత్ర పటాలు మమ్ములను ఆ భగవంతునిపై విశ్వాసాన్ని పెంచుకొనేట్టుగా చేస్తాయి.
నేనూ ఆ దేవుని గదిలో కూడా కూర్చుని భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలను చదువుతుంటాను. సునంద తన ఇల్లే స్వర్గంగా ఆ దేవుని గదే వైకుంఠంగా భావించి వివిధ రకాల నివేదనలను తయారు చేసి ఆ దేవునికి సమర్పిస్తుంది. ఆ భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని మేమంతా భక్తితో సేవిస్తుంటాం. ఇక పండుగలు వస్తే సునందకు పరమానందం కలుగుతుంది. పండుగ విశేషాన్ని బట్టి ఆయా దేవుళ్లకు ఆయా నివేదనలు, పూజలు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే వినాయక చతుర్ది వచ్చిందనుకోండి. ఆ రోజు మట్టితో చేసిన గణపయ్య ప్రతిమను తీసుకొని వచ్చి మా పూజాగదిలోనే ఒక ప్రత్యేక స్థానంలో అమరుస్తుంది. ఇక ఆ ఆదిదేవునికి పత్రం, పుష్పం ఆ రోజు చేయవలసిన విధి విధానాలన్నింటినీ తాను చేస్తూ మా చేత కూడా చేయిస్తుంది. ఇంటి గుమ్మాలకు మామిడి, బంతి తోరణాలు కట్టడం, ద్వారాలకు పసుపు బొట్లు పెట్టడం లాంటివి కూడా చేస్తుంది. నా బిడ్డలందరూ కూడా ఈ పూజలో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అట్లానే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారిని అర్చించి పూజించి పేరంటాళ్లను పిలిచి పండు తాంబూలాతో వారిని సంతోషింప చేస్తుంది. ఇలా మేమంతా ప్రతి పండుగలను మా ఇంట్లోని పూజాగదినే దేవాలయంగా భావించి పూజించుకుంటూ ఉంటాము.
అంతే కాదు మా ఇంటికి వచ్చిన బంధువులెవరైనా సరే పూజచేసుకోవాలనే సంకల్పం వారికుంటే వారికోసం సునంద ప్రత్యేమైన పీట, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, ఇష్ట దైవారాధన గ్రంథము, రుద్రాక్ష మాల, గంట, శంఖు వీటితో పాటు పూజకు అవసరమైన పంచపాత్ర, పళ్లెం నీళ్లు ఇలాంటి వన్నీ అందుబాటులో ఆ గదిలోనే లభించేట్టు ఏర్పాటు చేసి ఉంటుంది.
ప్రతిరోజు పూజాగదిలో కాసేపు కూర్చుని ఏ చింతనలు లేకుండా కేవలం భగవంతుని నామస్మరణలో నేను , నా భార్య సునంద గడపడే వీలును కలిగించిన ఆ భగవంతునికి శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. నా తల్లిదండ్రులను, నాతోబుట్టువులను, నా ఇల్లాలిని, నా బిడ్డలను , నా బంధువులందరినీ నాకు ఇచ్చిన ఆ భగవంతుని కృపావాత్సల్యానికి నేనుకృతజ్ఞతలు తెల్పడానికి ప్రతిరోజు శతకోటి వందనాలు చేస్తూ లోకాసమస్తా సుఖినోభవన్తు సర్వప్రాణికోటికి సర్వావస్థల్లోను ఆ దివ్యమంగళ స్వరూపుడైన ఆ కలియుగ వేంకటేశ్వరుని కృపారసం లభించాలని నా ఆంకాక్ష.

- రాచమడుగు శ్రీనివాసులు 9492748758