AADIVAVRAM - Others

ఓడిపోని ‘యుద్ధకళ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాతవేళ ప్రభాకరుని లేలేత కిరణాలు అవనీతలాన్ని తాకకముందే- అక్కడ అంతా ఒంటికాలిపై నిలబడి ఊపిరి బిగపట్టి ఏకాగ్రతతో సాధన చేస్తుంటారు.. వైవిధ్య భరితమైన ఆ యుద్ధకళలో మెళకువలను నేర్చుకుంటారు.. మన దేశంలో అతి ప్రాచీనమైన ‘కలరి’ (కలరిపయత్తు) యుద్ధ విన్యాసాలకు ఇప్పుడు నగరాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఒకప్పుడు పల్లెసీమలకే పరిమితమైన ఈ యుద్ధకళ కేరళను దాటి నోయిడా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరించింది. శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచే అరుదైన ‘కలరి’ యుద్ధ విన్యాసాలను అభ్యసించేందుకు అన్ని వయసుల వారూ ఆసక్తి చూపుతున్నారు. అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆరాటపడేవారు దీన్ని నేర్చుకొనేందుకు సుముఖత చూపుతున్నారు. నిత్యం ఈ యుద్ధవిన్యాసాలను చేస్తే శారీరకంగా మంచి నిగారింపుతో పాటు కండరాలు రాటుదేలుతాయని, మానసిక వికాసానికీ ఇది దోహదపడుతుందని ఎంతోమంది నమ్ముతున్నారు. ఆత్మరక్షణ దృష్ట్యా విలక్షణమైన యుద్ధ విన్యాసాలను నేర్చుకొనేందుకు యువతులు మొగ్గు చూపుతున్నారు.
1973 ప్రాంతంలో సైనికులను యుద్ధరంగంలో తీర్చిదిద్దేందుకు అప్పటి బ్రిటిష్ పాలకులు ‘కలరి’ని ఎంతగానో ప్రోత్సహించారు. కేరళకు చెందిన ‘కలరి’ యుద్ధకళలో కాలానుగుణంగా కొన్ని మార్పులు సైతం చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు పురుషులకే పరిమితమైన ఈ విన్యాసాలను ఇప్పుడు బాలికలు, యువతులు, గృహిణులు నేర్చుకుంటున్నారు. నాట్యం, అభినయం ఇందులో మిళితం కావడంతో ఈ విన్యాసాలు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందాయి. యుద్ధకళగానే కాదు.. నృత్యాభినయాలకు అవకాశం ఉండడంతో ముఖ్యంగా యువతులు ఇందులో శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మణిపూర్‌లో ‘్థంగ్ తా’, పంజాబ్‌లో ‘గట్కా’ యుద్ధవిద్యలకు ఉన్నట్లే కేరళలో ఆవిర్భవించిన ‘కలరి’కి ఎంతో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది.
కత్తులు, కర్రలు, ఇతర ఆయుధాలను చేతబట్టి గాలిలో ఎగురుతూ సాధకులు చేసే విన్యాసాలు వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. ఈ కళను ఆధారంగా చేసుకొని పలు దేశీయ, విదేశీయ చలన చిత్రాల్లో యుద్ధదృశ్యాలకు రూపకల్పన చేస్తుంటారు. ‘కలరి’లో ప్రధానంగా రెండు పద్ధతులు ఉంటాయి. అందులో ఒకటి- ఖాళీ చేతులతో, పలురకాల ఆయుధాలతో ప్రత్యర్థిపై దాడి చేయడం. రెండవది- శారీరక, మానసిక దృఢత్వాలను పెంచుకోవడం. ఈ రెండు పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కండరాల పటుత్వం, మానసిక వికాసం అలవడతాయి. వివిధ రకాల జంతువులు దాడిచేసే ఎనిమిది రకాల భంగిమలను ‘కలరి’లో ప్రధానంగా నేర్పుతారు. ఏనుగు, పులి, సింహం, శునకం, పిల్లి వంటి జంతువులతో పాటు పాములు, నెమళ్ల భంగిమల ఆధారంగా విన్యాసాలు ఉంటాయి. వైవిధ్య భరితమైన ఈ విన్యాసాలను నేర్చుకునేందుకు సాధకులు అమితంగా ఇష్టపడతారు. పలు రకాల యోగాసనాలు కూడా ‘కలరి’లో అంతర్లీనంగా ఉంటాయి. యోగాలో ఆసనాలకు ప్రాధాన్యం ఉన్నట్టే, ఇందులో ఖాళీ చేతులతో, ఆయుధాలతో చేసే విన్యాసాలు ఉంటాయి. ఆయుధాలు లేనపుడు ప్రత్యర్థిని ఖాళీ చేతులతో ఎదిరించే నైపుణ్యాలను నేర్పుతారు. శారీరక బలంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడే ‘కలరి’ యుద్ధవిద్యపై నేటి తరంలో రానురానూ ఆసక్తి పెరుగుతోంది. ఉత్తర కేరళలోని వడకర పట్టణంలో మీనాక్షి గురుక్కల్ ‘కలరిపయత్తు’ యుద్ధవిద్యను గత 66 ఏళ్లుగా ఉచితంగా నేర్పుతున్నారు. 75 ఏళ్ల ముదిమి వయసులోనూ సంప్రదాయ యుద్ధకళను అన్ని వయసుల వారికీ నేర్పుతున్న ఆమెను భారత ప్రభుత్వం గత ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. లింగ వివక్ష లేకుండా అన్ని వయసుల వారూ యుద్ధ విన్యాసాలను అభ్యసిస్తే మానసిక, శారీరక సమస్యలు దరిచేరవని మీనాక్షి భరోసా ఇస్తున్నారు.

-ఎస్‌ఆర్