Others

పాటల పూదోటలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన కలంలో గళం విప్పి ఎగిరేంత బలం వుంటుంది.. ఆయన పదాలలో ఎవ్వరినైనా కట్టిపడేసే పదునుంటుంది.. నిత్యం పెదాలపై చిరునవ్వుంటుంది.. ఎప్పుడైనా.. ఎక్కడైనా, ఏదైనా.. ఎలాగైనా రాయగల సామర్థ్యం ఉంటుంది. గుండెల నిండా పొంగిపొర్లే ధైర్యం ఉంటుంది. అది విప్లవమైనా, జానపదమైనా, దేశభక్తి, మెలోడీ, సెంటిమెంట్ ఇలా.. ఏదైనా ఆయన రాస్తే.. ఆ పాట శిఖరం చేరాల్సిందే. జేజేలు కొట్టాల్సిందే.. అబ్బో అదుర్స్..అనాల్సిందే.. ఆయనే గీత రచయిత వీరేంద్ర కాపర్తి. ఒకటా.. రెండా దాదాపు ఇరవై సినిమాల్లో ఎన్నో పాటలు రాసి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రైవేట్ ఆల్బమ్‌లు, జన చైతన్య గీతాలు సైతం విశేష ప్రాచుర్యాన్ని పొంది శ్రోతలను అలరించి.. ఆనందడోలికల్లో ముంచెత్తాయి. సినీ గేయరచయిత, సీనియర్ జర్నలిస్టు అయిన వీరేంద్రది పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ గ్రామం. తన పాట పల్లెనుంచి పట్టణానికి పరుగులు పెట్టాలన్న లక్ష్యం, కసి, ఉద్వేగం అతడిని పొలిమేరలు దాటించింది. ఆ కసి, పట్టుదలే చిత్రసీమలో గేయ రచయితగా నిలదొక్కుకోవడానికి మార్గం చూపి.. సరైన బాటలు వేసింది. వివిధ చిత్రాల్లో తాజాగా ఆయన రాసిన మరెన్నో పాటలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. కృషి, పట్టుదల ఉంటే
సాధించలేనిది ఏదీ ఉండదంటూ అదే మార్గంలో పయనిస్తున్న వీరేంద్ర ఆంధ్రభూమి ‘వెన్న్లల’తో తన కెరీర్ విశేషాలు, సరదా సంగతులు ఎన్నో పంచుకున్నారు.

* మీ గురించి చెప్పండి?
- మాది మరిపెడ గ్రామం. బాల్యమంతా అక్కడే గడిచింది. ఎం.ఏ తెలుగులో పట్టాపుచ్చుకున్న నేను బాల్యంలో చక్కగా హరికథలు, బుర్రకథలు చెప్పడం.. సురభి నాటకాల ద్వారా చక్కగా పద్యాలు పాడడం జరిగింది. చిన్నప్పుడు మా అమ్మ ఈశ్వరమ్మ ద్వారా రామాయణ, మహాభారతాల్లోని ముఖ్య ఘట్టాలను రాగ యుక్తంగా గానం చేయడం నేర్చుకున్నాను. అమ్మే నా పాటలకు ప్రేరణ.. ప్రాణం కూడా. అలా క్రమంగా పాటలు రాయ డం వచ్చిందనుకుంటాను.
* మీ తొలిపాట గురించి వివరిస్తారా?
- ‘్భరతదేశమా.. భాగ్యదేశమా..’ అనే పాట నేను తొలిసారిగా రాసింది. ఇది తదనంతర కాలంలో పులి అమృత్ ‘లెనిన్’ అనే సినిమాలో తీసుకోవడం జరిగింది. ఈ పాట నేను పదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే రాశాను. దీని వెనుక కూడా ఓ అద్భుతమైన అనుభవం దాగివుంది. చిన్నప్పుడు మా ఊళ్లో తిరిగిన తంగేడు వనాలు, నల్ల చెరువు, మామిడి తోటలు, మోట బావులు, బీడు భూములు నేను పెరిగిన వాతావరణం.. తెలంగాణ గ్రామీణ జీవితం.. నాలో ఇంకా సజీవంగా ఆవరించి వుంది. నేను ఈరోజు ఫోక్ పాటలు రాయడానికి కూడా ఆ నేపథ్యమే కారణం.
* ప్రజానాట్యమండలి నేపథ్యం...?
- అదో గొప్ప అనుభవం. ఆ సమయంలోనే వందలాది పాటలు రాయడం జరిగింది. డొక్కమాడి నోళ్లు.. సుందరయ్యగీతం.. తూరుపు కొండల్లో.. గట్టుమీద కనె్నలేడి.. ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. ఇలా ఒకటా.. రెండా లెక్కకు మించే వున్నాయి. ఇలాంటి పాటలు ఎందరెందరో మనసుల్ని కదిలించాయి. ఉత్తేజితుల్ని చేశాయి.
* మీ మొదటి సినిమా అనుభవం...?
- అల్లాణి శ్రీ్ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సాహం’తో నా పాటల ప్రయాణం మొదలయింది. ఆ చిత్రం కోసం నేను రాసిన ‘వట్టి చేపల బుట్ట.. నెత్తిన పెట్టుక వచ్చేర గొల్కొండ బెస్తదిరా..’ అనే పాటను చక్రి గానం చేయగా, అనురాగ్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ పాటను రాఖీసావంత్‌పై చిత్రీకరించారు. అలా.. నా మొదటి పాట అనుభవం మరపురాని తీపి గుర్తును మిగిల్చింది. ఆ పాట రాయడానికి నాకు అవకాశమిచ్చి ప్రోత్సహించిన దర్శక, రచయిత అల్లాణి శ్రీ్ధర్, నిర్మాత పొద్దుటూరి మురళిగారిని ఎన్నటికీ మరచిపోలేను. అలా నా పాటకు వాళ్లే సరైన మార్గాన్ని చూపి వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ అవకాశమే తలుపుతట్టకపోతే అడుగులు కదిలేవి కావేమో! అందుకే అల్లాణిగారికి ఆస్థాన రచయితనైపోయా. నాకు బ్యాక్‌బోన్ ఆయనే. అటు తర్వాత వరుసగా చదలవాడ శ్రీనివాసరావు, పి.సి.రెడ్డి, సదానంద్ శారద, ఈనాడు రామోజీరావుల ప్రోత్సాహాన్ని అందుకుని పాటల పూదోటలో ఎంతో హాయిగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. అలాగే సంగీత దర్శకులు అనూప్, శశిప్రీతమ్, శంభు ప్రసాద్, అనురాగ్, ఏ.ఆర్.కె రాజు, సాబు వర్గీస్, ముక్కెర రమేశ్ ఇలా ఎంతోమంది నా ప్రయాణానికి తోడ్పాటును అందించారు. నా పాటలు ప్రజల్లోకి వెళ్లేలా ప్రాణం పోశారు. ముఖ్యంగా ‘నిన్న ఎవరో ఒకరం.. నేడు కలిసిన ఇద్దరం..’, ‘కదిలింది పాదం.. వెలిగింది నామా..’ బాగా పేరు తెచ్చిన పాటలు. జర్నలిస్టుగా ఉదయం, ఆంధ్రప్రభలో పనిచేశాను. మంజులా నాయుడు, బల్లమల సుధాకర్ గార్ల ప్రోత్సాహంతో సీరియల్స్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది. అలా.. ఆగమనం, సద్యోగం, హలాహలం, చౌరస్తా, వీరబ్రహ్మేంద్రస్వామి, పున్నమినాగు, పాతాళభైరవి, ఐశ్వర్య కలశం, కొత్త బంగారు లోకం, ఉయ్యాల-జంపాల, రంభ-రాంబాబు తదితర ఎన్నో సీరియల్స్‌లో పాటలు, మాటలు రాశాను.
* రాబోయే సినిమాలు..?
గుప్పెడంత గుండెలో, నేనే సరోజ, శరం ఇంకా రెండు- మూడు పేరుపెట్టని చిత్రాలు. వీటితో పాటు పలు డాక్యుమెంటరీ
పాటలు, యాడ్ ఫిల్మ్‌లు, ప్రభుత్వ పథకాల పాటలు, రక్తదానం- ప్రాణ దానం.. రక్తమిచ్చే ప్రతి మనిషి దైవసమానం.. ఎయిడ్స్ మీద పాటలతో పాటు ఆరోగ్య సమస్యలపై దాదాపు ఐదు వందల ఎపిసోడ్లు రాశాను. ముఖ్యంగా కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ పథకాలకు అల్లాణి సమర్పణలో జన చైతన్యగీతాలు రాశాను.
* ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాశారు?
- ఇన్ని.. అని ఎలా చెప్పను? లెక్కకు మించే వున్నాయి. వాటిలో డివోషనల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్, జన చైతన్యగీతాలు.. సినిమా పాటలు.. ఇలా వేటికవే ప్రత్యేక గీతాలుగా ప్రజల్లో నాటుకుపోయాయి.
* విప్లవ భావాలున్న పాటలంటే మీకు ఇష్టమని చెబుతుంటారు?
- అభ్యుదయ భావాలున్న తల్లిదండ్రులు ఈశ్వరమ్మ-షణ్ముఖాచారి పెంపకంలో పెరగడం వల్ల.. నా చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం నాపైన ఉండటంతో అలాంటి పేరువచ్చి ఉంటుంది. అయతే అభ్యుదయ భావాలకు నాలో పునాది వేసింది మాత్రం తిరుపతి ఈనాడు ఎడిషన్ ఇన్‌చార్జి కీ.శే. రామచంద్రచారిగారు. ప్రస్తుతం అన్ని జోనర్లలో పాట రాయాలన్నది నా సంకల్పం. విప్లవ పాటలే రాస్తానని నేనేమీ గిరిగీసుకోలేదు. సినిమా కవి అనగానే అన్ని రకాల పాటలు రాయాలి. ‘మోగించిన విప్లవ కంఠం.. వేయి గొంతుకల విప్లవ శంఖం’ అని రాసిన శ్రీశ్రీ గారు.. ‘రాననుకున్నావేమో! నే రాననుకున్నావేమో..’ అని కూడా రాశారు. అలాంటి దారే నేనూ ఎంచుకున్నాను. ఆ దారి నాకు రహదారే అనుకుంటాను. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను.
* ఎలాంటి పాటలు రాయాలనుకుంటున్నారు?
-కచ్చితంగా ఇదీ.. అని ఎలా చెప్పను? అన్ని రకాలుగా దర్శకులు మెచ్చే విధంగా పాటలు రాయాలన్నదే తపన. ‘‘సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత దర్శక-నిర్మాతలు ఏం చెబితే అది చేయాలి తప్ప.. మేము అనుకున్నదే చేస్తామంటే ఇక్కడ నిలదొక్కుకోలేం’’ అని వేటూరి లాంటి మహామహులెందరో అంటుండేవారు. ఏ చిత్రానికైనా పాట రాసేటప్పుడు ఆ పాత్రధారుల బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. నా పాటల్లో ఎక్కువ ఫోక్ కనపడుతుందంటారు. ఏదైనా అది దర్శకుడిని బట్టే ఉంటుంది. ‘ఈ పాటలో కాస్త జానపదం కావాలి’ అని అడుగుతుంటారు. అప్పుడు వారి సూచనల ప్రకారం చేయాలి కదా! ఏదైనా మనం రాసే పాట యువత రక్తాన్ని లావాలా పొంగేలా కదిలించాలి. వారిలో చైతన్యం తేవాలి. ఆ పాట పరవళ్లు తొక్కాలి.
* ప్రోత్సహిస్తూ ప్రేరణ కలిగించిన వ్యక్తులు?
- నాకు పాటల పూదోటలో ప్రవేశానికి మొదట అక్షర శ్రీకారం చుట్టింది జె.సీతా రాములు టీచర్. హైదరాబాద్‌లో ప్రోత్స హించింది కాలం రామ్‌రెడ్డి, వై. రామారావు గార్లు. అలాగే నాకు అడుగడునా ప్రోత్సాహాన్నిస్తూ.. ప్రేరణ కలిగిస్తున్నది మిత్రుడు, సీనియర్ న్యూస్ రీడర్, దర్శకుడు మహమ్మద్ షరీష్. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అంబేద్కర్ ఆల్బల్‌లో ‘ఎపుడో ఎక్కడో పుడతాడొకడు..’ అనే గీతం నాకు ఎనలేని ప్రాచుర్యాన్ని తెచ్చింది. అంబేద్కర్ ఆలోచనాపటిమను ఎలుగెత్తిచాటింది. అలాంటి పాటను రాసే అవకాశాన్నిచ్చిన షరీఫ్‌కు ఎప్పటికీ రుణపడే వుంటా.
* మీకు కథలపై కూడా పట్టుందని విన్నాం..?
- అవును.. కథలపై కూడా కసరత్తు చేస్తుంటా. దాదాపు డజన్ సినిమాలకు సరిపడా కథలు నా వద్ద రెడీగా వున్నాయి. సినిమాలకే కాదు, సీరియల్స్‌కు కథలు, చక్కని ప్రేమ పాటలు సిద్ధంగా రాసిపెట్టుకున్నాను. అవి వెలుగులోకి రావడమే తరువాయి..
* మీ అభిమాన రచయితలు?
- పింగళి, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, వేటూరి, సిరివెనె్నల, చంద్రబోస్.. అందర్నీ అభిమానిస్తాను. వీళ్ల పాటల్లోని మాధుర్యాన్ని వింటూ ఆనందపడుతుంటాను.
* మీకు స్వతహాగా ఎలాంటి పాటలంటే ఇష్టం?
- సామాజిక స్పృహ కలిగినది ఏదైనా ఇష్టమే. పాటల్లో తాత్వికత, సామాజిక సందేశం వుండాలి. అప్పుడే పాట ప్రతి ఒక్కర్నీ కదిలిస్తుంది... ఆలోచింపజేస్తుంది.
* మిమ్మల్ని ప్రేరేపించే శక్తులు?
-కార్ల్ మార్క్స్, బి.ఆర్. అంబేద్కర్, పుచ్చలపల్లి సుందరయ్య. అభ్యుదయ కవిత్వంలో శ్రీశ్రీ, గద్దర్. ముఖ్యంగా పుచ్చలపల్లి సుందరయ్య మరణించినప్పుడు నేను రాసిన ‘రుద్రవీణపై మంటల గానం పలికిస్తున్నాం..’ అనే గీతం యువతను ఉత్తేజితుల్ని చేసింది. ఈ గీతం నాకు ఎంతో పేరుని తెచ్చిపెట్టింది. గేయ రచయితగా సంతృప్తిని కలిగించింది.
* పాటల ప్రయాణంలో
మిమ్మల్ని నడిపించే వ్యక్తులు?
- ఎప్పటికప్పుడు నా పాటలను, నా రచనలను విశే్లషిస్తూ.. విమర్శిస్తూ సూచనలు చేస్తూ.. ప్రోత్సహిస్తున్న నా సహచరి ప్రగతి, పిల్లలు సిద్ధార్థ-మైత్రేయి, కోడలు సింధూర, మనవడు ధృవ. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలు నా పాటకు ప్రేరణ, స్ఫూర్తి అయితే, తర్వాత భార్య, పిల్లలు చేదోడు వాదోడుగా నిలిచారు.
* ఇంతకీ చిత్రసీమలో సాధించాలనుకుంటున్నది?
- పెద్దగా ఆశలేమీ లేవు. ఉన్నంతలో మంచి పాటలు రాసి, ఆ పాటల ద్వారా ప్రజల్లో సామాజిక స్పృహ, చైతన్యం కలిగించి చక్కటి గీత రచయితగా చిత్రసీమలో పేరు తెచ్చుకుంటే చాలు. అదే నా సంకల్పం.. అదే నా తపన.. అదే నా ఆరాటం కూడా.

ఇంటర్‌వ్యూ: -ఎం.డి. అబ్దుల్