AADIVAVRAM - Others

ఓ రైలు డబ్బాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్లవలసిన శ్రీ్ధరరావు పొరపాటున కదులుతున్న బెజవాడ రైలు ఎక్కేశాడు.
ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ఒక్కొక్కప్పుడు సహజమే. దాంట్లో మన తప్పే వుంటుంది. అదే బస్సు అయితే తెలీగానే కంగారుపడి, గొంతెత్తి, తలుపు వద్దకు పరిగెత్తి ఆపండాపండి అంటూ గగ్గోలు పెట్టి దిగిపోవచ్చు. కానీ ఇది రైలు ఆయే. అరచినా వినే నాథుడు లేడు. ఆపే దిక్కూ లేదు. పోనీ గొలుసు లాగితే ఫైను వేస్తారేమో, అదీగాక తోటి ప్రయాణీకుల తిట్లు, పొడుస్తూ చూసే చూపులు, ఆ మాత్రం చూసుకుని ఎక్కక్కర్లే, బుద్ధి లేకపోతే సరి.. అని పుల్లవిరుపు మాటలు. అవస్థకు తోడు అవమానం వచ్చినట్లు. ఆపినా, పొలిమేరల్లో ఎక్కడో దిగి, మళ్లా వెనక్కు స్టేషన్‌కు వెళ్లటం కష్టమైన పనే. పైగా ఇప్పుడు టి.టి.ఐ వచ్చి ఎంత కట్టమంటాడో, అందులోనూ ఫైనుతోపాటు, టికెట్ లేనందుకు. అసలే బొంబాయి రైలు తప్పిపొయ్యి, ఆ టికెట్ పైసలు కొన్ని వెనక్కి వచ్చి, కొన్ని పోయి నష్టం వచ్చిందని ఏడుస్తుంటే.. ఛీ, అయినా వసుధను అనాలి. ‘ఎంచక్కా బస్సులో పోతానూ’ అంటే ‘కూర్చుని పోవాలి. రాత్రంతా నిద్దర లేక కష్టపడతారు. మీరు అసలే నిద్రకు తట్టుకోలేరు, హాయిగా రైలులో ఏసిలో వెళ్లండి’ అంటూ ఓ బోడి సలహా ఇచ్చి, అవును గదూ, అంటూ తన పుర్రెలో ఆలోచన మారేటట్లు చేసింది.
ఛీ, పాడు జీవితం, పాడు పెళ్లాం, పాడు రైళ్లు, పాడు ప్రయాణాలు, పాడు పనులు, అన్నీ పాడు పాడు పాడు అంటూ కాసేపు పాడుకున్నాడు. మరి పాటలు బావుంటే, నిద్ర వస్తుంది కదా, అదీ చీకటి పడ్డాక, పడుకున్నాడు కూచున్న చోటే. ఇంతలో రానే వచ్చాడు, టికెట్ చూపించమంటూ, టికెట్ ఎగ్జామినర్. ‘ఇంకో గంట ఆగి వస్తే, సొమ్మేమి పోయేదో వీడిది. నిద్ర చెడిపేశాడు’ అంటూ మళ్లా ‘పాడు, పాడు, పాడు’ అని పాడుకోబోయాడు. కానీ మొదటి ‘పాడు’ దగ్గరే ఆపాడు అతను.
‘ఏమిటండీ, టికెట్ చూపించమంటే, ‘పాడు’ అంటారు. అసలు మీరన్నది ‘పాడు’నా ‘పాడె’నా? ఎవరి పాడె, ఎక్కడి పాడె, ఇక్కడ ఇప్పుడు ఎందుకొచ్చిందీ ‘పాడె’ అన్నీ అశుభం పలికే మాటలు కాకపోతే, అదీ రోజుకో పట్టాలు తప్పటం, పూటకో పట్టాలు మారి ఇంకో రైలును ముద్దెట్టుకుంటున్న ఈ రోజుల్లో’ అని తగులుకున్నాడు. ఇంకొక్క మాట అంటే, ఇంకేమి పాడుతాడో, ఎవరి పాడె కడతాడో అన్న భయంతో, వున్న టికెట్ చూపించి, పొరపాటు జరిగిందని చెప్పి, అతను చెప్పిన డబ్బులు కట్టి, ఇహ విజయవాడ దాకా, ‘పాడు పాడు పాడు’ అనుకుంటూ సెటిల్ అయిపోయేడు చీదర్‌రావు, ఓ అదే.. సరీ, మన శ్రీ్ధరరావు.
చీదర్‌రావు అని అసలు పొరపాటుగా పడలేదు. అలవాటుగానే పడ్డది. అది ఎందుకు, అసలు విషయమేమిటీ అన, ‘వ్రాతుండు’ ఇట్లు చెప్పసాగె... బడిలో చేరిన కొత్తలో, మరి చిన్నపిల్లలు కదా, అల్లప్పుడు ఒక అమ్మాయికి నోరు పలకక చీదర్, చీదర్ అని ఓ రెండు రోజులు పిలిచింది. కొంచెం గట్టిగానే, అందరికీ వినిపించేటట్లే. అయితే అప్పటికే మన పుణ్యమూర్తికి, అదే, మన శ్రీ్ధరరావుకు, ఛీ అనే మాట విపరీతంగా నచ్చిపోయి, అలవాటు అయిపోయి, ఏరా, బిస్కెట్ తింటావా’ అని అడిగితే, ‘్ఛ బిస్కెటా..’ అంటూనే లాక్కుని మరీ తినేవాడు. మాటికి ఛీ అనే అలవాటు ఇతనికేమో గానీ, మెల్లిగా ఛీదర్‌రావు అనే అలవాటు తోటి పిల్లలకు అందరికీ అబ్బింది.
అయితే, ఆ తరగతిలో విధివశాత్తు ఇద్దరు శ్రీ్ధరరావులు వుండటంతో, ఓ బడిపంతులుగారు, ఇద్దరినీ
పిలవటంలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి, శ్రీ్ధరరావు, ఛీదర్‌రావు అంటూ మొదలెట్టారు. పొరపాటునో, ఇతని గ్రహపాటునో, అది మెలిమెల్లిగా బడి అందరికీ, ఇంట్లో, ఆఖరికి ఇతనికి ఉద్యోగం వచ్చినాక, సహోద్యోగులకీ పాకింది. నమ్మరు గానీ, ఒకోసారి, మీ పేరు అని ఎవరయినా అడిగితే, ఇతను కూడా చీదర్‌రావు అనే స్థితికి వచ్చాడు.
ఇచ్చటి నుండి ఈ పురాణం మీరే చదువుకోండి అని చెప్పి ‘వ్రాతుండు’ తన దారిన సాగిపోయె.
అయితే, పేరు సార్థకం చేసుకోవటానికి ఏమో గానీ, చీదర్‌కు ఛీ అనే అలవాటు, ప్రతి విషయంలోనూ చీదర పడటం, చికాకు పడటం, నరనరాన జీర్ణించుకుపోయాయి. పాడు, పాడు, పాడె, క్షమించాలి, పాడు అలవాట్లు.
సరే, సీట్లో కూర్చుని, ఇంతకు ముందు అంతరాయం కలిగిన నిద్రను మళ్లా మొదలుపెడదామని ఉపక్రమిస్తున్న మన రావుకు, తోటి ప్రయాణీకుల మాటలు చెవిన పడ్డాయి.
‘అదేమిటండీ, ఆ మాత్రం చూసుకోరూ. యే డబ్బా ఏ రైలు కనిపిస్తే దాంట్లో ఎక్కేయటమేనా, బొంబాయి ఎటూ, బెజవాడ ఎటూ, కనీసం ఇంజన్ల మూతులు అటూ ఇటూ వుంటాయి అని తెలీదా. ఆ మాత్రం చూసుకోరూ’
‘మళ్లా మొదలెట్టావూ, నీ చూసుకోరూ గొడవ. అది మొదలెడితే మొదలెట్టావు కానీ, ఈ అటు మూతి, ఇటు మూతి ఏమిటి, మన మూతులకు అలవాటు అయినట్లు?’ భర్తగారు.
‘అదా, బొంబాయికి ఆ వైపు, బెజవాడకు ఈ దిక్కున వెళ్తాయి కదండీ రైళ్లు. కాస్త చూసుకుని మాట్లాడండి. మన మూతుల గురించి. ఇది రైలు డబ్బా. ఆ మాత్రం చూసుకోరూ..’
ఇంతలో ఇంకో ఆయన కల్పించుకున్నాడు. ‘యేమి చూసుకున్నా ఏమి కనిపిస్తుందండీ చీకట్లో. ఆ బోర్డులు డబ్బాల మీద అక్షరాలు సరిగ్గా కనిపించవు. అదీ భాష మనది వుండకపోవచ్చు. రాత్రిళ్లు చీకటి. ఎంత దీపాలు వున్నా, సరిగ్గా కనిపించకపోతే, కష్టమే కదా. (ఆయనకు రేచీకటి లెండి)
అయినా బస్సు స్టాండ్‌లలో డ్రైవర్లు, కండక్టర్లు అరిచి చెప్తున్నట్లు, రైళ్ల దగ్గర నుంచుని కూడా అరుస్తుంటే సులువుగా ఉంటుంది కాదా, బొంబాయి బొంబాయి, బెంగుళూరు బెంగుళూరు అని. కనీసం చీకటిగా వున్నప్పుడు అయినా!’
చూసుకోరూ గారి భర్త, ‘ఆ, ఇప్పుడు ప్రైవేట్ బస్సుల వాళ్లు, సెవెన్ సీటర్లు, షేర్ ఆటో వాళ్లు ఎక్కడ అరుస్తున్నారండీ, ఏదో ప్రభుత్వ కంపెనీలు నష్టాల్లో వుండి మూతులు నాక్కుంటున్నారు కాబట్టి కానీ..’
‘చూసుకుని..’ మోచేత్తో పొడుస్తూ, వారి భార్య.
ఇంతలో ఇంకో ఆయన, ‘నేను ఢిల్లీ మెట్రోలో, బెంగుళూరు మెట్రోలో చూశానండి. ఎంచక్కా లోపల వైపు కూడా ఉంటుంది, ప్రతి తలుపు పైనా మొత్తం స్టేషన్లు, ఏ స్టేషన్ తరువాత యే స్టేషన్ అని. అదీ కాక స్టేషన్‌లో ఆగక ముందు అనౌన్స్‌మెంట్లూనూ, యే స్టేషన్ వస్తోంది, ఎటువైపు ప్లాట్‌ఫారం వచ్చేదీనూ.. మామూలు రైళ్లలోనూ రావాలి. వస్తుంది. కాకపోతే అభివృద్ధి కొంచం స్లో..’
వీరికి హైదరాబాద్ మెట్రో గుర్తుకు రాదు. ఎందుకూ అంటే మరి ఆయన ఢిల్లీ, బెంగుళూరు వెళ్లినట్లు మిగతా వారికి యెట్లా తెలుస్తుంది.
ఇంతలో ‘మూతులు’ ఆయనకు రెస్టురూంకు వెళ్లవలసిన అవసరం వచ్చింది కాబోలు, నుంచున్నాడు.
వెంటనే అతని భార్య, ‘కాస్త చూసుకుని, కాళ్లు తొక్కుతారు. అలాగే నీళ్లు వస్తున్నారుూ లేనిదీ చూసుకుని’ అని హెచ్చరించింది.
‘అబ్బ, చూసుకోకుండా వుంటానా, నీతో ఇంత అలవాటు అయినాక, అన్ని పన్లూ చూసుకునే చేస్తాగా ఎప్పుడూనూ. కాస్త నువ్వు మూతి కట్టేసుకో’ అన్నాడు విసుగ్గా.
మళ్లా మొదలెట్టేడు. ఢిల్లీ, బెంగుళూరు, ఆయన, ‘మరి, మన విమానాశ్రయాలలో ఉన్నట్లు, రైలు ఎక్కేముందు కూడా, ఎవరైనా, టికెట్టు పరిశీలించి లోపలికి పంపిస్తే బాగుంటుంది కదా. వస్తుంది. మెల్లిగా, అభివృద్ధి, కాకపోతే స్లో’ అన్నారు.
వెంటనే చూసుకోరుగారు,
‘ఇంతకీ స్విట్జర్లాండ్ వెళ్లారా మీరు’ అని అడిగారు.
స్లో అభివృద్ధి గారు, విననట్లే మొహం పక్కకు తిప్పుకొని, ఇంకొకరితో మాటలు కలపటానికి ప్రయత్నం చేస్తున్నారు.
రైలు మాత్రం, తన ప్రయాణం తను చేసుకుంటూ, విజయవాడ చేరింది.

-నండూరి రామచంద్రరావు.. 9949188444